Friday, August 17, 2012

కేదారేశ్వర వ్రతకల్పము


ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి , అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి . పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు . పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమ తో బొట్టు పెట్టి , వరి పిండి , (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి . సాధారణం గా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి . ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి . ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి ,పిదప ఒక పళ్ళెంలో గాని ,క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము : దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడిది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను . దీపారాధనకు నువ్వులనూనె గాని ,కొబ్బరి నూనె గాని, ఆవు నెయ్యి గాని వాడ వచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు . పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను .

ఇంకను పూజకు కావలసిన ముఖ్య వస్తువులు :
పళ్ళు , కొబ్బరికాయలు, పువ్వులు, కేదారేశ్వర స్వామి యొక్క ప్రతిమ (బొమ్మ ) లేదా చిత్రపటము , ఒక పీట, ధాన్యము , కొత్త కుండ ,తోరములు (తోరమనగా తెల్లని దారము తీసుకుని పసుపు రాసుకొనవలెను. ముఖ్యముగా కేదారేశ్వర నోమునకు కావలసిన తోరములు 21 పోగులు , 21 ముళ్ళు కలిగి ఉండవలెను ), నవరత్నములు లేదా కొద్ది బంగారం ( శక్తి కొలది ) పట్టు వస్త్రము (పీట మీద రాశిగా పోసిన ధాన్యము దానిపై ) పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి . ఈ నామములు మొత్తం 24 కలవు 

   
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి
.
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం
        చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను.

సంకల్పము :

మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అధ్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలము నకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను.) ,కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను.) శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పు కొనవలెను .అనియు చెప్పు కొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ...............సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకొనవలెను ),...............ఆయనే .(సంవత్సరమునకు రెండు ఆయనములు -ఉత్తరాయణము , దక్షిణాయనము జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను ).............ఋతు: (వసంత, గ్రీష్మ , వర్ష, మొ || ఋతువులలో పూజ సమయంలో జరుగుతున్న ఋతువు పేరు ).............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు )............పక్షే (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగు చున్న సమయమున గల పక్షము పేరు ) తిదౌ ,(ఆరోజు తిది ) వాసరే (ఆరోజు ఏ వారమన్నది చెప్పుఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి బారకాః

యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య : ఓం భూ : - ఓం భువః ఓం సువః -ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓం సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దీయోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సకల్పము చెప్పుకొనవలెను. కొని )శుభ నక్షత్రే ,శుభయోగే , శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభాతిదౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీ మాన్ ..........గోత్రశ్య ..............నామధేయః ,శ్రీమత్యః ,గోత్రస్య , నామధేయస్య అనియు , స్త్రీ లైనచో శ్రీమతి ,గోత్రవతి , నామదేయవతి ,శ్రీమత్యాః ,గోత్రవత్యాః ,నామధేయ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము ,నామము చెప్పి ) నామధేయస్య :ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో ) మమ సహా కుటుంబస్య , క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిధ్యర్ధం ,శ్రీ వరసిద్ది వినాయక దేవతా ముద్దిశ్య వరసిద్ది వినాయక దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్భి రుపచారై : సంభావతాని యమేన సంభావతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో, నాకు తోచిన నియమములతో ,నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోప చార పూజాం కరిష్యే .తదంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనం చేయవలెను .


కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి , లేక కంచు గ్లాసులు (లేదా పంచపాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒకదానియందు ఉద్దరిణిని , రెండవ దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను. రెండవపాత్రకు బయటకు మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను.కుంకుమ అక్షతలు వగైరా బొటన , మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు , దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి ఉంచి , ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
  మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతా:
  ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
  అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే , గోదావరి , సరస్వతి ,నర్మదా సింధు
  కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.||
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ కేదారేశ్వర దేవతా (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పుకోనవలెను. ) పూజార్ధం మమ దురితక్షయ కారకః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశమందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆనీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి .

మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
                 యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి ||
అని పిదప కాసిని అక్షతలు , పసుపు , గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాధిపతయే నమః
ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తదాస్తు . తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
   ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే. ||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
లంబోదర శ్చ వికటో విఘ్న రాజో వినాయకః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామానియః పటేచ్చ్రుణు యాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే ||
పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములనగా ధ్యాన ,ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ,స్నానం , వస్త్రం , యజ్ఞోపవీతం ,గంధం , పుష్పం, ధూపం , దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కార ప్రదక్షిణములు మొదలగునవి .
షోడశోపచార పూజా ప్రారంభః
ధ్యానమ్ : శ్లో || శూలండ మరుకం చైవ దధానం హస్త యుగ్మకే ,
                    కేదార దేవ మీశానం ధ్యాయే త్రిపుర ఘాతినం
శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి అని కేదారేశ్వరుని మనస్సున ధ్యానించి నమస్క రించవలెను
ఆవాహనం : శ్లో || కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహిత ప్రభో,
                       ఆగచ్ఛ దేవ దేవేశ మద్భక్త్యా చంద్రశేఖర
శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి .ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం .అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.
ఆసనం : శ్లో || సురాసుర శిరో రత్న ప్రదీపిత పదాంబుజ
                 కేదార దేవ మద్దత్త మానసం ప్రతి గుహ్యతామ్
శ్రీ కేదారేశ్వరాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి .సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి . దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
పాద్యం ; శ్లో || గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ ,
                 మౌక్తి కాసన సంస్థాయ కేదారాయ నమోనమః
శ్రీ కేదారేశ్వరాయ నమః పాదౌ : పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.
అర్ఘ్యం : శ్లో || అర్ఘ్యం గృహాణ భగవన్భక్త్యా దత్తం మహేశ్వరః
               ప్రయచ్చమే మనస్తుష్టిం భక్తానా మిష్ట దాయకం .
శ్రీ కేదారేశ్వరాయ నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి . దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.
సూచన : అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలోనికి వదలవలెను. అరివేణంలో వదలరాదు .

మధుపర్కం : శ్లో || కేదార దేవ భగవన్ సర్వ లోకేశ్వర ప్రభో ,
                         మధుపర్కం ప్రదాస్యామి గృహాణత్వం శూభాననై
శ్రీ కేదారేశ్వరాయ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధు పర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు )
పంచామృత స్నానం : శ్లో || స్నానం పంచామృతై ర్దేవత తశ్శుద్దోదకై రపి
                                      గృహాణ గౌరీ రమణ తద్భక్తే న మయార్పితమ్
శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను
శుద్దోదక స్నానం : శ్లో || నదీజలం సమాయుక్తం మయాదత్త మనుత్తమం ,
                                స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే .
శ్రీ కేదారేశ్వరాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.
వస్త్ర యుగ్మం : శ్లో || వస్త్ర యుగ్మం సదా శుభ్రం మనోహర మిదం శుభం ,
                           దదామి దేవ దేవేశ భక్త్యేదం ప్రతి గృహ్యాతామ్ |
శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (ప్రత్తిని బొట్టు బిళ్ళ ఆకారములో గుండ్రముగా చేసుకొని కొద్దిగా తడి చేసి కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం : శ్లో || స్వర్ణ యజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం,
                           రుద్రాక్ష మాలయా యుక్తం దదామి స్వీకురు ప్రభో .
శ్రీ కేదారేశ్వరాయ నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య  నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను .
గంధం : శ్లో || సమస్త గంధ ద్రవ్యాణాం దేవత్వ మసి జన్మభూ :
                భక్త్యా సమర్పితం ప్రీత్యా మధు గంధాది గృహ్యాతాం
శ్రీ కేదారేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
అక్షతాన్ : శ్లో || అక్షతోసి స్వభావేన భక్తానా మక్షతం పదం,
                   దదాసి నాద మద్దత్తై రక్షతై : ప్రీయతాం భవాన్.
శ్రీ కేదారేశ్వరాయై నమః అక్షతాన్ సమర్పయామి ( అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకుని స్వామి వారి ప్రతిమపై చల్లవలెను .

పిమ్మట 21 ముళ్ళతో తయారు చేసుకున్న తోరమును తీసుకుని స్వామి వద్ద ఉంచి ఈ క్రింది మంత్రములు చడువుచూ పూజించవలెను.
అధ సూత్ర గ్రంధి పూజా
ఓం శివాయ నమః ప్రధమ గ్రంధిం పూజయామి
ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
ఓం మహాదేవాయ నమఃతృతీయ  గ్రంధిం పూజయామి
ఓం వృషభ ద్వజాయ నమః చతుర్ధ గ్రంధిం పూజయామి
ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంధిం పూజయామి
ఓం రుద్రాయ నమః షష్టమ గ్రంధిం పూజయామి
ఓం పశుపతయే నమః సప్తమ గ్రంధిం పూజయామి
ఓం భీమాయ నమః అష్టమ గ్రంధిం పూజయామి
ఓం త్ర్యంబకాయ నమః నవమ గ్రంధిం పూజయామి
ఓం నీల లోహితాయ నమః దశమ గ్రంధిం పూజయామి
ఓం హరాయ నమః ఏకాదశ గ్రంధిం పూజయామి
ఓం స్మర హరాయ నమః ద్వాదశ గ్రంధిం పూజయామి
ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంధిం పూజయామి
ఓం స్వయం భువే నమః చతుర్దశ గ్రంధిం పూజయామి
ఓం శర్వాయ నమః పంచదశ గ్రంధిం పూజయామి
ఓం సదాశివాయ నమః షోడశ గ్రంధిం పూజయామి
ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంధిం పూజయామి
ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంధిం పూజయామి
ఓం శ్రీ కంటాయ నమః ఏకోన వింశతి గ్రంధిం పూజయామి
ఓం నీల కంటాయ నమః వింశతి గ్రంధిం పూజయామి
ఓం కేదారేశ్వరాయ నమః ఏక వింశతి గ్రంధిం పూజయామి
శ్రీ కేదారేశ్వరాయ నమః

నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి .

పుష్ప పూజ : శ్లో ||కల్ప వృక్ష ప్రసూనైస్త్వం పూర్వి రభ్యర్చిత స్సురై :
                         కుంకుమై పార్దివై రేభి రిదానీ మర్చతాం మయా |
శ్రీ కేదారేశ్వరాయై నమః పుష్పాణి సమర్పయామి .స్వామివారికి పువ్వులతో అలంకారము చేసి , పుష్పములతో పూజించవలెను .

తతః ఇంద్రాది లోక పాలక పూజాం కుర్యాత్
శివస్య దక్షిణే భాగే బ్రహ్మణే నమః ఉత్తర భాగే విష్ణవే నమః ,
మధ్యే కేదారేశ్వరాయ నమః

పిదప అదాంగ పూజను చేయవలెను ఈ క్రింది అదాంగపూజలోని ఒక్కొక్క నామము చదువునపుడు పువ్వులుగాని , పసుపు లేదా కుంకుమ తోగాని పూజించవచ్చును.
                                                                                                                               అధ అంగ పూజా
ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి ; ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి ; ఓం కామరూపాయ నమః జానునీ పూజయామి ; ఓం హరాయనమః ఊరుం పూజయామి;
ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి ; ఓం భవాయ నమః కటిం పూజయామి ; ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి; ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి;
ఓం పశుపతయే నమః హృదయం పూజయామి ; ఓం పినాకినే నమః హస్తాన్ పూజయామి ; ఓం శివాయ నమః భుజౌ పూజయామి; ఓం శిథి కంటాయ నమః కంటం పూజయామి ;
ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి ; ఓం త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి ; ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి ; ఓం శర్వాయ నమః శిరః పూజయామి ;
ఓం చంద్ర మౌళయే నమః మౌళిం పూజయామి .

పశుపతయే నమః సర్వాంణ్యం పూజయామి

పిదప ఈ క్రింది 108 నామములతో కూడిన అష్టోత్తర శతనామావళి పూజను ఒక్కొక్క మంత్రమునకు పువ్వులుగాని ,పసుపుగాని, కుంకుమ గాని స్వామిపై వేయుచూ పూజించవలె

అధాఅష్టోత్తర శతనామ పూజ
ఓం శివాయ నమః ఓం కటోరాయ నమః ఓం జగద్వాపినే నమః ఓం మహేశ్వరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం జగద్గురువే నమః ఓం శంభవే నమః ఓం వృ షాంకాయ నమః
ఓం వ్యోమ వేశాయ నమః ఓం పినాకినే నమః ఓం వృషభా రూడాయ నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం శశి శేఖరాయ నమః ఓం భస్మోద్దూళిత విగ్రహాయ నమః ఓం చారు విక్రమాయ నమః
ఓం వామదేవాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం రుద్రాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం భూతపతయే నమః ఓం కపర్దినే నమః ఓం త్రయీ మూర్తయే నమః
ఓం స్థాణవే నమః ఓం నీలలోహితాయ నమః ఓం అనీశ్వరాయ నమః ఓం ఆహిర్బుద్నాయ నమః ఓం శంకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం శూల పాణినే నమః
ఓం పరమాత్మయ నమః ఓం అష్ట మూర్తయే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం సోమ సూర్యాగ్ని లోచనాయ నమః ఓం అనేకాత్మాయ నమః ఓం విష్ణు వల్లభాయ నమః ఓం హవిషే నమః ఓం సాత్వికాయ నమః
ఓం శిపి విష్టాయ నమః ఓం యజ్ఞ మయాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం అంబికా నాదాయ నమః ఓం సోమాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం శ్రీ కంటాయ నమః ఓం పంచ వక్త్రాయ నమః
ఓం ఖండ పరశవే నమః ఓం భక్త వత్సలాయ నమః ఓం సదాశివాయ నమః ఓం అజాయ నమః ఓం భవాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం శర్వాయ నమః
ఓం వీరభద్రాయ నమః ఓం మృడాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం గణ నాదాయ నమః ఓం పశుపతయే నమః ఓం శితి కంటాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం దేవాయ నమః
ఓం శివా ప్రియాయ నమః ఓం హిరణ్య రేతాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం దుర్గర్షాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం కపాలినే నమః ఓం గిరీశాయ నమః ఓం హరియే నమః
ఓం కామారినే నమః ఓం గిరీశాయ నమః ఓం పూష దంత భేత్రే నమః ఓం అంధకాసుర సూదనాయ నమః ఓం అనఘాయ నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం భుజంగ భూషనాయ నమః
ఓం దక్షా ద్వర హరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం భర్గాయ నమః ఓం హరాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం గిరిధ్వనినే నమః ఓం భగ నేత్ర భిదే నమః ఓం కృపా నిధయే నమః ఓం గిరిప్రియాయ నమః
ఓం అవ్యక్తాయ నమః ఓం భీమాయ నమః ఓం కృత్తి వాసాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం పరశు హస్తాయ నమః ఓం పురా రాతయే నమః ఓం సహస్రపాదవే నమః ఓం మృగ పాణినే నమః ఓం భగవతే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః ఓం జటాధరాయ నమః ఓం ప్రమదాదిపాయ నమః ఓం అనంతాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం మృత్యుం జయాయ నమః ఓం తారకాయ నమః ఓం కవచినే నమః
ఓం సూక్ష్మ తనవే నమః ఓం పరమేశ్వరాయ నమః  అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

పిదప అగరువత్తిని వెలిగించి .............
ధూపం : శ్లో || దశాంగ ధూప ముఖ్యంచ హ్యంగార వినివేశితం ,
                 ధూపం సుగంధై రుత్పన్నం త్వాం ప్రీణ యతు శంకర .

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః దూపమాఘ్రాపయామి . ధూపం సమర్పయామి .అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను .
దీపం : శ్లో || యోగినాం హృదయే నైవ జ్ఞాన దీపాం కురో హ్యాసీ ,
              బాహ్యదీ పోమయా దత్తః గృహ్యాతాం భక్త గౌర వాత్ .
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.
నైవేద్యం : శ్లో || త్రైలోక్య మపి నైవేద్యం నతే తృప్తి స్తధా బహి :
               నైవేద్యం భక్త వాత్గ ల్యాద్గ్రు హ్యతాం త్ర్యంబకం త్వయా .
ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి స్వామీ వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ఓం శ్రీ మహా గణాది పతయే నమః గుడ శకల నైవేద్యం సమర్పయామి .' ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయా స్వాహా , ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ' అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో ) స్వామికి నివేదనం చూపించాలి. పిదప ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచపాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి .పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం.............

తాంబూలం : శ్లో || నిత్యానంద స్వరూపస్త్వం యోగి హృత్క మలే స్థితః ,
                        గృహాణ భక్త్వా మద్దత్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .
అని చెబుతూ మూడు తమల పాకులు , రెండు పోక చెక్కలు వేసి స్వామీ వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , 'తాంబూల చరవణా నంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి పిమ్మట కర్పూరం వెలిగించి .........
పునరర్ఘ్యం : శ్లో || అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మహేశ్వర ,
                         ప్రయచ్చమే మన స్తుష్టిం భక్తానా మిష్ట దాయకం.
కేదారేశ్వరాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి. మరల దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
నీరాజనం : శ్లో || కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి స్సూర్య మివోదితం
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివ .
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ ,చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనా నంతరం శుద్దాచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకొవాలి.

తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకుని
ప్రదక్షిణం : శ్లో || భూతేశ భువనాదీశ సర్వ దేవాది పూజిత
                    ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు.
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ స్వామికి చేతిలో అక్షతలు, పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళ పై పడుకుని కుడికాలు ఎడమ కాలుపై వేసి ) తరువాత స్వామిపై చేతిలో నున్న అక్షతలు ,పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ......
నమస్కారాన్ : శ్లో || హరః శంభో మహాదేవ విశ్వే శామర వల్లభ ,
                           శివ శంకర సర్వాత్మన్ నీలకంట నమోస్తుతే
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నమస్కారాన్ సమర్పయామి అని మనస్పూర్తిగా స్వామికి నమస్కరించ వలెను.

ప్రార్ధన : శ్లో || అభీష్ట సిద్ధిం కరుమే శివావ్యయ మహేశ్వర ,
               భక్తానాం వరదానార్ధం మూర్తీ కృత కళేబర .
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ప్రార్ధయామి అని స్వామిని ప్రార్ధించ వలెను.

సూత్ర గ్రహణం : శ్లో || కేదార దేవ దేవేశ భగవన్నం బికాపతే
                           ఏకవింశ ద్దినే తస్మిన్ సూత్రం గృహ్ణా మ్యహం ప్రభో .
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః సూత్ర గ్రహణం కరిష్యే అని స్వామి వద్ద వుంచి పూజించిన తోరములను చేతిలోనికి తీసుకుని పై శ్లోకమును చదువు కొనవలెను .

తోర బంధన మంత్రం : శ్లో || ఆయుశ్చ విద్యాంచ తదా సుఖంచ
                                      సౌభాగ్య వృద్దిం కురు దేవ దేవ .
                                      సంసార ఘోరాంబు నిధౌ నిమగ్నం
                                      మాం రక్ష కేదార నమో నమస్తే .

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః తోర బంధనం కరిష్యే అని స్వామిని స్మరించి తోరమును దక్షిణ హస్తమున (కుడి చేతికి )కట్టు కొనవలెను .
వాయన దానం : శ్లో || కేదారః ప్రతి గృహ్ణాతు కేదారో వైద దాతిచ ,
                              కేదార స్తారకో భాభ్యాం కేదారాయ నమోనమః

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః వాయన దానం కరిష్యామి అని స్వామికి నైవేద్యము చేసిన పదార్ధములతో పాటు దక్షిణ తాంబూలములను బ్రాహ్మణునికి వాయన మివ్వవలెను.
ప్రతిమా దానం : శ్లో || కేదారః ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్య వర్దినీ,
                             తస్మా దస్యాః ప్రదానేన మాస్తు శ్రీ రచంచలా.
ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ప్రతిమా దానం కరిష్యామి అని పూజకు తీసుకున్న స్వామీ యొక్క ప్రతిమను (బొమ్మ ) దక్షిణ తాంబూలముతో బ్రాహ్మణునకు దానమీయవలెను .
ఇతి పూజా విధానం సంపూర్ణమ్

కేదారేశ్వర వ్రత కధా ప్రారంభం

సూత పౌరాణి కుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఈ విధముగా పలికెను. రుషి పుంగవులారా ! మానవులకు సర్వ సౌభాగ్యములను కలుగ చేయు నదియు పార్వతీ దేవి చే సాబశివుని శరీరార్ధము (శరీరములో సగము ) పొందినది యునగు కేదారేశ్వర వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రత విధానమును వివరించెదను వినండి . దీనిని బ్రాహ్మణ ,క్షత్రియ , వైశ్య , శూద్రులు అందరూ ఆచరించ వచ్చును. ఈ వ్రతమును ఇరువది యొక్క మారులాచరించువారు (ఇరవై యొక్క సార్లు ) సకల సంపద లనుభవించి పిదప శివ సాయుజ్యము (కైలాస ప్రాప్తి ) పొందుదురు.
ఓ ముని శ్రేష్టులారా ! ఈ వ్రత మహత్యమును (వ్రతము యొక్క గొప్ప తనమును ) వివరించెదను వినుము. భూలోకమునందు ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడి యున్న శరత్కాల మేఘములను పోలిన నిఖిల మణి విచిత్రం బైన శిఖరముల చేతను , అనేక రకములైన పువ్వుల తీగలతోను , అనేక రకములైన పుష్ప ఫలాదుల చేతను ,నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకములైన కొండ కాలువల చేతను భాసిల్లు నట్టి (ప్రకాశించు నట్టి ) ఉద్యాన వనముల చేత నిఖిల కళ్యాణ ప్రదంబై జనులందరిచేత కైలాసమని పిలువబడి న ఒక పర్వత శ్రేష్టము కలదు. అంత షడ్గు ణై శ్వర్య సంపన్నులును , మహానీయులగు యోగుల చేతను , సిద్ద గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి , మనోహరమై యున్న ఆ పర్వత శిఖరము నందు జగత్కర్తయైన పరమేశ్వరుడు ప్రమద గణములచే పరివేష్టించబడి (ప్రమద గణము లందరూ కొలువై యుండగా ) భవానీ సమేతుండై (పార్వతితో కలసి ) దేవముని బృందముల చేత నమస్కరింప బడుచు ప్రసన్నుడై కూర్చుండి ఒక సమయమున చతుర్ముఖాది దేవతల కందరికీ దర్శన మిచ్చెను.
అంత సూర్యుడు, అగ్ని, వాయుదేవుడు, నక్షత్రములతో కూడిన చంద్రుడును మరియు ఇంద్రుడు మొదలగు దేవతలు , వసిష్టుడు మొదలగు ఋషులు ,రంభ మొదలగు అప్సరసలు , గణపతియు,సేనానియు, నంది , బృంగి ,మొదలగు ప్రమద  గణములు కొలుచుచుండగా ఆ అద్భుతమైన సభయందు నారదుడు మొదలగు దేవ గాయకులు స్వామీ అనుజ్ఞ తో గానము చేశారు. అటువంటి అందమైన శ్రావ్యమైన గానము చేయుచుండగా మేనక మొదలైన వారు నృత్యము చేసిరి .అప్పుడు అందరిలో మిక్కిలి సొగసుతో కూడిన రంభ అందరి మనసులు సంతోష పడునట్లుగా నాట్యము చేసెను. అప్పుడు బృంగిరిటి అను భక్తుడు ఆ స్వామి సన్నిధి యందు నాట్యము చేయగా సకల దేవతలకు మిక్కిలి హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాసముల వలన పర్వత గుహలు నిండునట్లు కల కల ధ్వని కలిగెను .అప్పుడు శంకరుడు ఆ బృంగిరిటి నాట్యము చూచి ఆనందము చెంది ఆ భక్తుని అనుగ్రహించెను. అంతట బృంగిరిటి శివానుగ్రహము కలుగుట చేత మిక్కిలి ప్రీతి చెంది పార్వతిని వదలి పరమేశ్వరునికి మాత్రము ప్రదక్షణ మొనర్చెను. ఇదిచూచి పార్వతి ఓ స్వామీ ! ఈ బృంగిరిటి నన్ను వదలి మీకు మాత్రమే ప్రదక్షణము చేయుటకు కారణ మేమి అని ప్రశ్నించగా ఈశ్వరుడు ఓ దేవీ ! నీ వలన పరమార్ధ విదులగు యోగులకు ప్రయోజనము లేదని అతడు నాకు మాత్రమే నమస్కరించెనని చెప్పెను.
ఆ  మాటలకు పార్వతీ దేవి మిగుల కోపించి భర్త యందున్న తన శక్తిని ఆకర్షించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము కలవాడయ్యెను అంత ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము కలదిగా మారెను. పిదప ఆ దేవి కోపించి దేవతలచేత ఊరడింప బడిన దైనను కైలాసమును వదలి తపస్సు చేసుకొనుటకు అనేక రకములైన మృగములచే సేవింప బడునది , అనేక రకముల చెట్లు , మొక్కలతోనూ , ఋషి శ్రేష్టులతోను కూడిన గౌతమాశ్రమమును ప్రవేశించెను. అంత ఆ గౌతముడు ఆశ్రమమున ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతురాలై యున్న మహేశ్వరిని కనుగొని పూజ్యురాలైన ఓ భగవతీ ! నీవు ఇచ్చటకు వచ్చుటకు కారణ మేమి ? అని అడుగగా ఆ దేవి గౌతముని చూచి తన విషాదమునకు కారణమును చెప్పి నమస్కరించి ,ఓ మునీశ్వరా ! ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో , ఏ వ్రతము చేత శంకరుని దేహములో అర్ధము తిరిగి తనకు ప్రాప్తించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశింపుమని అడుగగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణాలలో ను ఇష్టముగా ఆచరించు నటువంటి దైన కేదారేశ్వర వ్రతమును ఆచరింపు మని ఉపదేశించగా ,ఆ దేవి ఆ వ్రతమును ఆచరించుటెట్లో సెలవీయ వలసినదిగా కోరెను.

అమ్మా ! భాద్ర పద శుక్లాష్టమి యందు శుద్ధ మనస్కురాలవై మంగళ కరములగు ఏక వింశతి తంతువుల చేత (21 వరుసల దారమును పసుపు రాసి తోరముగా తయారు చేసుకుని ) హస్తము నందు ధరించి ,పూజించి , ఆ దినమందు ఉపవాస మొనరించి , మరునాడు భోజనము చేయించి ,అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము నిట్లు చేయుచూ ప్రతి దినము శ్రీ కేదార దేవుని ఆరాదింప వలయును. ఇంటియందు శుబ్రమైన ఒక ప్రదేశమున ధాన్య రాశిలో పూర్ణ కుంభమును ఉంచి ,ఇరువది యొక్క సూత్రముల (దారముల ) చేత చుట్టి , పట్టు వస్త్రములచే కప్పి నవరత్నములు గాని , శక్తి కొలది బంగారం గాని ఉంచి గంధ పుష్పాక్షతలచే పూజించి ఇరువదియొక్క మంది బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములు ఆచరించి (కాళ్ళు చేతులు కడిగించి ) కూర్చొన బెట్టి అచ్చట ఆ కేదార దేవుని ఉంచి ,చందన (గంధం ), ధూప,కుంకుమ ,అన్ని రకాల పువ్వులతో పూజించి తాంబూల వస్త్రములుంచి ,21 రకముల పిండి వంటలతో ,పళ్ళు,కొబ్బరికాయ మొదలగువాటితో నైవేద్యం పెట్టి ,చక్కగా స్తోత్రము చేసి ,బ్రాహ్మణులకు యదా శక్తి దక్షణ లిచ్చి ఈశ్వరునికి మనస్సును సంతుష్టి చేసిన యెడల నీవు కోరిన వరములియ్యగలడు అని చెప్పగా ఆ కాత్యాయని అటులే ఆచరించెను. అంత పరమ శివుడు సంతుష్టుడై దేవగణములతో అచ్చటికి వచ్చి నా శరీరములో అర్ధ భాగము నీకు ఇచ్చెదనని ఇవ్వగా,పార్వతీ దేవి మిక్కిలి సంతోషించి ఈ వ్రతము ఆచరించు వారలకు సకల అభీష్టములు (అన్ని కోరికలు ) తీరునట్లు అనుగ్రహించినచో అందరును ఈ వ్రతమును ఆచరింతురని శంకరునికి చెప్పగా శివుడు అటులే యగుగాక అని అంగీకరించి అదృశ్య మయ్యెను కొంతకాలమునకు శివ భక్తి గల చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకుని మనుష్య లోకమునకు పోయి వారికి చెప్పవలెనను కోరికతో ఉజ్జయనీ పట్టణమును చేరి వజ్ర దంతుడను రాజునకు ఆ వ్రతమును ఉపదేశించగా అతడు ఆ వ్రతము యధావిధిగా ఆచరించి సార్వ భౌముడయ్యేను . మరి కొంత కాలమునకు ఆ పట్టణమున ఉన్న వైశ్యునకు పుణ్య వతియు , భాగ్యవతియు అను ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రత మాచ రించుటకు ఆనతీయుమని అడుగగా అతడు , అమ్మా ! నేను మిగుల దరిద్రుడను , మీరు ఆ ఆలోచనను మానుడు అనగా ఓ తండ్రీ ! నీ అనుజ్ఞయే (అంగీకారమే ) మాకు పరమ ధనము కావున ఆనతీయుమని అచ్చట నుండి ఒక వట వృక్షము (మర్రి చెట్టు ) వద్ద కూర్చుండి తోరము కట్టుకుని యధావిధిగా పూజింపగా వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పూజకు కావలసిన సామాగ్రి అచ్చట వారికి సమకూరునట్లుగా చేసెను. అంతట వారాలు చక్కగా వ్రతము చేసుకొనుట వలన ఆ మహా దేవుండు సంతుష్టుడై (గొప్ప సంతృప్తిని పొంది ) ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములు , దివ్య రూపములు ఇచ్చి అంతర్దాన మయ్యెను. ఆ వ్రతము యొక్క మహత్యము వలన వైశ్యుని కుమార్తెలను ఉజ్జయనీ పట్టణమును ఏలుచున్న (పాలించు చున్న ) రాజు పుణ్యవతియను కన్యను , చోళ భూపాలుడు భాగ్యవతి యను కన్యను పెండ్లి చేసుకొనిరి .అందు వలన ఆ వైశ్యుడు ధన సమృద్ది కలిగి సామ్రాజ్య సంపదలను , పుత్రులను పొంది సుఖముగా వుండిరి.
కొన్ని రోజుల తరువాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మద మొహితురాలై ( డబ్బు మీది ప్రేమతో ) కొంత కాలమునకు ఆ వ్రతమును విడిచెను . అందువలన దరిద్రురాలై పుత్రుని తోడను, భర్త తోడను అడవిలో తిరుగుతూ ఒక బోయవాని ఇల్లు చేరెను. అచ్చట తన కుమారునితో నా అక్క పుణ్యవతిని ఉజ్జయనీ రాజు వివాహమాడి యున్నాడు . నీవు అక్కడకు పోయి మన సంగతి తెలిపి బ్రతుకు తెరువునకై తగిన ధనము తీసికొని త్వరగా రమ్ము అనగా అతడు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లితో తమ కష్టమును తెలుపగా ఆ పుణ్య వతి అతని చేతికి ఎక్కువ డబ్బు ఇచ్చెను.

అంత అతడు ఆ ధనమును తీసికొని వచ్చు చుండగా , మార్గములో దేవుని మహిమచే ఆ డబ్బు దొంగిలించ బడగా అతడు మరల పెద్ద తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతిని తెలుపగా ఆమె మరి కొంత ధనమును ఇచ్చెను. ఆ ధనము కూడా దొంగిలించ బడగా దిక్కు తోచక నిలబడి యున్న ఆ కుమారునితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై ఓ చిన్నవాడా ! వ్రత బ్రష్టులకు ( వ్రతము నాచరించని వారికి ) ఈ ధనము చెందదని చెప్పగా అతడు మరల పెద్ద తల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి ఆ కుమారునిచే కేదారేశ్వర వ్రతమును ఆచరింప చేసి ,తన చెల్లెలు కూడా ఆ వ్రతమును ఆచరించునట్లు చెప్పవలసినదిగా చెప్పుమని అతనికి ధనమును ఇచ్చి పంపెను .అతడు బయలు దేరి వెళుతుండగా అనుకోని విధముగా ముందు పోయిన ధన మంతయు కూడా దొరికినందున అతి సంతోషముతో అతడు కాంచీ పట్టణము ప్రవేశించు చుండగా చతురంగ బలముతో అతని తండ్రి ఎదురు వచ్చి ఆ బాలునీ, అతని తల్లిని కూడా వెంట బెట్టుకుని తన పట్టణమునకు వెళ్ళెను .అంతట ఆ రాజ కుమారుడు తల్లి దండ్రులతో సుఖముగా ఉండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతియు ,తండ్రియగు చోళరాజును అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు సకల సంపదలనుభవించుచు సుఖముగా నుండిరి . ఎవరైనను యదా ప్రకారము భక్తితో ఈ వ్రతమును ఆచరిం చినచో వారు శ్రీ మహాదేవుని అనుగ్రహము వలన అనతమైన ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది సుఖముగా నుండి, శివ సాన్నిధ్యము పొందుదురని గౌతమ మహర్షిచే చెప్పా బడెనని సూతుడు శౌనకుడు మొదలగు మహర్షులకు చెప్పినట్లుగా శ్రీ వ్యాస భట్టారకుడు స్కాంద పురాణమున వర్ణించెను .

కేదారేశ్వర వ్రత కధ సమాప్తము.

పునః పూజ : ఓం .............నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని .పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి , అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను.

ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీజయామి ,నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి ,సమస్త రాజోపచార ,శక్త్యోపచార , భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను
.శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాదిషు
                     యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
ఏ తత్ఫలం శ్రీ ...........ర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీ ............ ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకొని స్వామి వద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై ఉంచవలెను . దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ ........... నమః యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.
శ్లో || యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజా క్రియాది షు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
  మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే , అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్సర్వాత్మక: శ్రీ .........దేవతా స్సుప్రీతో వరదో భవతు ,శ్రీ ..............ప్రసాదం శిరసా గృహ్ణామి .


No comments:

Post a Comment