Friday, May 23, 2014

వినాయకుడు ఏక దంతుడు ఎలా అయ్యాడు

శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే... 

ఆది దేవుడిని పూజించుకుంటూ విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం..

కార్తవీర్యుని వధించిన అనంతరం పరుశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. "పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి" అంటూ పరుశురాముడు ధిక్కరించాడు.

మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పైకిఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరుశురాముడు తన చేతిలోని గ్రండ గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరము నుంచి బయటికి వచ్చారు.
నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని "ఏకదంతుడి"గా పేరు పొందాడు

No comments:

Post a Comment