Tuesday, May 20, 2014

మహాభారతం-ముఖ్యాంశాలు

మహాభారతం
మహాభారతం ఒక ఉద్గ్రంధం. ఇది ధర్మశాస్త్రం. అంతేకాక ఇది చారిత్రక గ్రంధం కూడా. కాబట్టే ఆనాటి సామాజిక, రాజకీయ లక్షణాలు ఈ గ్రంధంలో లిఖించబడ్డాయి. సర్వ లక్షణ సమన్వితమైన మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించినవారే. అందులోని పాత్రల స్వభావాలను ఆకళింపుచేసుకున్నవారే. ఆ ధర్మశాస్త్రాన్నీ అనుసరించేవారే. లౌకికములు, అలౌకికములు అగు విషయములెన్నో ఇందులో చెప్పబడ్డాయి. మహాభారతంలో మూల పురుషుడు, ఆ యుగ సంధికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే ఐ నడిపించిన శ్రీ కృష్ణ భగవానుడు అందరికీ ఆరాధనీయుడే. భగవద్గీత ద్వారా సృష్టి సిద్ధాంతాన్ని మనో వైజ్ఞానికంగా తెలియజేసి, భారతీయ సంప్రదాయానికి ప్రామాణిక వేదంగా దాన్ని మనకు అందించిన మాధవుని పాత్ర మహిమాన్వితం. ద్వాపర యుగానికీ, కలియుగానికీ సంధికాలంలో జరిగిన మహాభారత యుద్ధం ఎన్నో అనుభవాల సమాహారం. "ఇందు ఏది కలదో అదియే ఇతరత్రా కలదు. ఇందు లేనిది ఎందునూ లేదు" అన్న ప్రశస్తి భారతానికి కలిగింది. మహాభారతంలో 18 పర్వాలు, లక్ష శ్లోకాలు ఉన్నాయి.భారతంలో అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం భగవద్గీత. ఒక మహా గ్రంధంలో అంతర్భాగమైయుండి కూడా గీత స్వతంత్ర గ్రంధంగా విరాజిల్లడం అద్భుతం. ఉపనిషత్తుల సారమే గీత. భీష్మ పర్వమ్ములోని 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా రూపొందినవి. ఇందులో 700 శ్లోకాలున్నాయి. 

మహాభారత గ్రంధం ద్వారా మనకు పరిచయమైన పాత్రలు అనేకం. వాటిలో కొన్నిటిని మాత్రమే మనం నిత్యం చర్చిస్తుండడంవల్ల మిగిలిన పాత్రల గురించి సమగ్రమైన విజ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేసుకోలేకపోతున్నాం. ముఖ్య పాత్రలైనప్పటికీ, మూల కథకు ఆధారభూతమైనవైనప్పటికీ వాటిని తగినంత ప్రాధాన్యతను మనం సాధారణంగా ఇవ్వం. భారతం ఆమూలాగ్రం చదివి వాటిని గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాకపోవడం, వాటికోసం పదే పదే భారతాన్ని మొదట్నుంచీ మళ్ళీ మొదలుపెట్టడంకంటే కూడా ఆ పాత్రల్నీ, వాటితో ఆయా ఘట్టాలకున్న అనుబంధాలనూ క్విజ్ రూపంలో అందిస్తే "తెలుగుదనం" పాఠకులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తూ వాటిని ఈ క్రింద ఇవ్వడం జరిగింది. మీకీ విధానం ఘట్టాలనూ, పాత్రలనూ సులువుగా పరిచయం చేస్తుందని భావిస్తూ...

భారతం అనే పేరు ఎందుకు వచ్చింది?

విషయ భారము, వేద వివరణ భారముగలది గావున మహాభారతం అన్నారు.

మహాభారతం పురాణమా? ఇతిహాసమా? లేక కావ్యమా?

ఇతిహాసము.

ఇతిహాసము అంటే?

ఇతి + హ = ఇతిహాసం. అంటే ఈ విధంగా జరిగింది అని అర్ధము. అంటే చరిత్ర..

మహాభారతాన్ని రచించిన వ్యాసుని అసలు పేరు?

కృష్ణ ద్వైపాయనుడు.

మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?

క్రీ.పూ. 16వ శతాబ్దం.

వేదాలకు, భగవద్గీతకూ తేడా ఏమిటి?

వేదం మంత్ర భాగం. ఉపనిషత్తు అర్ధాన్ని సులభంగా శ్లోక రూపంగా చూపేది భగవద్గీత.

వ్యాసుడి తల్లి పేరు?

సత్యవతి.

వ్యాసుడి తండ్రి?

పరాశరుడు.

కురుక్షేత్రము అనగా?

కురురాజు దున్నిన ప్రాంతము.

భీష్ముడి తండ్రి?

హస్తినాపురాన్ని పరిపాలించే శంతన మహారాజు.

భీష్ముడి తల్లి?

గంగా దేవి.

భీష్ముడి అసలు పేరు?

దేవవ్రతుడు.

పాండురాజు, మాద్రి ఎక్కడ మరణించారు?

శతశృంగగిరిలో మరణించారు.

శల్యుడు ఎవరు?

మాద్రికి అన్న.

పాండవులు ఎక్కడ జన్మించారు?

శతశృంగగిరిలో.

శతశ్రంగగిరి ఎక్కడుంది?

టిబెట్‌లో

గాంధారి తండ్రి పేరు?

సుబలుడు.

కృష్ణుడు అనగా?

కృష్ అంటే సత్. ణ అంటే ఆనందం. కృష్ణ అంటే సదానందము, సచ్చిదానందము అని అర్ధం.

శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను ఏ చెట్టుపై దాచాడు?

పొన్నచెట్టుపై

శ్రీకృష్ణుని శంఖము పేరేమిటి?

పాంచజన్యం.

కంసుడి తండ్రి?

ఉగ్రసేనుడు.

కంసుని మామ ఎవరు?

జరాసంధుడు.

శిశుపాలుడి తల్లి?

సాత్వతి.

"నీవు కోరిన దేవత నుండి కోరిన బిడ్డను కనగలవు" అని కుంతీదేవికి వరమిచ్చిన ఋషి ఎవరు?

దూర్వాసుడు.

పాండవులు నివశిస్తున్న లక్క ఇంటిని తగులబెట్టేందుకు దుర్యోధనుడిచే నియమింపబడ్డ మంత్రి?

పురోచనుడు.

ద్రోణుడి తండ్రి పేరు?

భరద్వాజుడు.

ద్రుపదుడు ఎవరు?

పాంచాల దేశపు రాజు.

ద్రుపదుని బిడ్డలు ఎవరు?

దృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

దృష్టద్యుమ్నుడి గురువు ఎవరు?

ద్రోణుడు.

సుభద్ర ఎవరి కూతురు?

దేవకీ వసుదేవుల కూతురు, శ్రీ కృష్ణుని చెల్లెలు.

అర్జునుడు సుభద్రను పెళ్ళాడిన ప్రదేశం?

ద్వారక.

అర్జునుడు, సుభద్రలకు జన్మించినవాడు?

అభిమన్యుడు.

హస్తినాపురంలో మాయాజూదం జరుగుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు ఎక్కడున్నాడు?

ఆ సమయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని మిత్రుడు సాల్వుడు ద్వారకపై దండెత్తగా అతనితో యుద్ధం చేస్తూ ఉన్నాడు.

శ్రీ కృష్ణుడి కుమారులు?

ప్రద్యుమ్నుడు మరియు సాంబుడు.

శిశుపాలుడి కుమార్తె పేరు?

రేణుమతి.

రేణుమతిని పెండ్లాడినవాడు?

నకులుడు.

అభిమన్యుని భార్య పేరు ఏమిటి?

ఉత్తర.

సహదేవుడి భార్య పేరు?

విజయ.

శకుని కుమారుడి పేరు?

ఉలూకుడు.

అజ్ఞాతవాసంలో విరాటుని కొలువులో పాండవులు ఏయే పేర్లతో ఆశ్రయం పొందారు?

ధర్మరాజు విరాటరాజుకు పుణ్య కథలు చెప్పే కంకుభట్టు పేరుతోనూ, భీముడు వలలుడు అను పేరుతో వంటవానిగానూ, అర్జునుడు నపుంసకునిగా బృహన్నల పేరుతోనూ, నకులుడు దామగ్రంధి పేరుతో అశ్వ శిక్షకుడుగానూ, సహదేవుడు తంత్రీపాలుడు పేరుతో గోసంరక్షకునిగానూ, ద్రౌపది విరాట రాణి అయిన సుధేష్ణ పరిచారికగా సైరంధ్రి పేరుతోనూ చేరతారు.

శకుని మరియు ఉలూకుడు ఎవరి చేతిలో మరణించారు?

సహదేవుడు.

కర్ణుడి కొడుకులను చంపినవాడు.

నకులుడు.

సాత్యకి ఎవరు?

అర్జునుడి శిష్యుడు.

కురుక్షేత్ర యుద్ధం సమయంలో బలరాముడు ఎక్కడున్నాడు?

యుద్ధంలో పాల్గొనడం ఇష్టంలేని బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు.

శిఖండి ఎవరు?

కాశీరాజు కూతురు అంబయే శిఖండి.

పాండవులు-వారు పూరించిన శంఖాలు :

అర్జునుడు - దేవదత్తం 

ధర్మరాజు - అనంత విజయం 

భీముడు - పౌండ్రం 

నకులుడు - సుఘోష 

సహదేవుడు - మణిపుష్పక 

శ్రీ కృష్ణుడు - పాంచజన్యం

ఉత్తరుడు ఎవరి చేతిలో మరణించాడు?

శల్యుడు.

దుర్యోధనుని కొడుకు లక్ష్మణుని వధించినవాడు?

అభిమన్యుడు.

ద్రోణుడు ఎవరి చేతిలో మరణించాడు?

దృష్టద్యుమ్నుడు.

సైంధవుడు ఎవరు?

ఇతను సింధు చక్రవర్తి వృద్ధాక్షాత్రుడి పుత్రుడు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించడంతో అతనికి రక్షగ తోడు వెళ్ళబోయిన ధర్మరాజు వంటి పాండవ యోధులను లోనికి రాకుండా నిరోధించిన వాడు.

వికర్ణుడు ఎవరు?

కర్ణుడి కుమారుడు.

వికర్ణుడిని సంహరించినవాడు?

భీముడు.

శల్యుని సంహరించినవాడు?

ధర్మరాజు.

దుర్యోధనుడు యుద్ధరంగమునుండి పారిపోయి దాగిన మడుగు?

ద్వైపాయన మడుగు.

దృష్టద్యుమ్నుడినీ, శిఖండినీ, ఉపపాండవులను నిద్రిస్తుండగా వధించినవాడు?

అశ్వత్థామ.

No comments:

Post a Comment