స్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో తమలపాకులు సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం.
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మవారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటినిండా సింధూరం పూసుకొన్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు.
హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి.
హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.
No comments:
Post a Comment