Tuesday, May 20, 2014

బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?


అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు
 మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.

కృతయుగం——-17,28,000
త్రేతాయుగం—– 12,96,000
ద్వాపరయుగం— 8,64,000
కలియుగం——- 4,32,000
_____________________
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
_____________________
మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట. 2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.

ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం. ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు

In Detail 
మన్వంతరము:-

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.

భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లు

1. స్వాయంభువ మన్వంతరము
2. స్వారోచిష మన్వంతరము
3. ఉత్తమ మన్వంతరము
4. తామస మన్వంతరము
5. రైవత మన్వంతరము
6. చాక్షుష మన్వంతరము
7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
8. సూర్యసావర్ణి మన్వంతరము
9. దక్షసావర్ణి మన్వంతరము
10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
11. ధర్మసావర్ణి మన్వంతరము
12. భద్రసావర్ణి మన్వంతరము
13. దేవసావర్ణి మన్వంతరము
14. ఇంద్రసావర్ణి మన్వంతరము

ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

• కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
• త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
• ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
• కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
• మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :-

స్వాయంభువ మన్వంతరము:-

• మనువు – స్వాయంభువు.
• భగవంతుని అవతారాలు – కపిలుడు, యజ్ఞుడు – దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది వడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.
• మనుపుత్రులు – ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు
• సప్తర్షులు – మరీచి ప్రముఖులు
• ఇంద్రుడు – యజ్ఞుడు
• సురలు – యామాదులు
• ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము

స్వారోచిష మన్వంతరము:-

• మనువు – అగ్ని కొడుకు స్వారోచిషుడు.
• మనువు పుత్రులు – ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు
• భగవంతుని అవతారాలు – విభువు – వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
• సప్తర్షులు – ఊర్జస్తంభాదులు
• ఇంద్రుడు – రోచనుడు
• సురలు – తుషితాదులు
• సురత చక్రవర్తి వృత్తాంతము

ఉత్తమ మన్వంతరము:-

• మనువు – ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
• మనువు పుత్రులు – భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
• భగవంతుని అవతారాలు – సత్య సేనుడు – ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
• సప్తర్షులు – ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
• ఇంద్రుడు – సత్యజితుడు
• సురలు – సత్యదేవ శృతభద్రులు

తామస మన్వంతరము:-

• మనువు – ఉత్తముని సోదరుడు తామసుడు.
• మనువు పుత్రులు – వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
• భగవంతుని అవతారాలు – హరి – హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
• సప్తర్షులు – జ్యోతిర్వ్యోమాదులు
• ఇంద్రుడు – త్రిశిఖుడు
• సురలు – విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)

రైవత మన్వంతరము:-

• మనువు – తామసుని సోదరుడు రైవతుడు
• మనువు పుత్రులు – అర్జున ప్రతినింద్యాదులు
• భగవంతుని అవతారాలు – వైకుంఠుడు – శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
• సప్తర్షులు – హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
• ఇంద్రుడు – విభుడు
• సురలు – భూత దయాదులు

చాక్షుష మన్వంతరము:-

• మనువు – చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
• మనువు పుత్రులు – పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
• భగవంతుని అవతారాలు – అజితుడు, కూర్మావతారం – వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
• సప్తర్షులు – హవిష్మ దీరకాదులు
• ఇంద్రుడు – మంత్రద్యుమ్నుడు
• సురలు – ఆప్యాదులు

వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:-

ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
• మనువు – వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
• మనువు పుత్రులు – ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
• భగవంతుని అవతారాలు – కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
• సప్తర్షులు – కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
• ఇంద్రుడు – పురందరుడు
• సురలు – వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు

(సూర్య) సావర్ణి మన్వంతరము:-

రాబోయే మన్వంతరము
• మనువు – సావర్ణి – విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
• మనువు పుత్రులు – నిర్మోహ విరజస్కాదులు
• భగవంతుని అవతారాలు – సార్వభౌముడు – వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
• సప్తర్షులు – గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
• ఇంద్రుడు – విరోచన సుతుడైన బలి
• సురలు – సుతపసులు, విజులు, అమృత ప్రభులు

దక్షసావర్ణి మన్వంతరము:-

• మనువు – వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
• మనువు పుత్రులు – ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
• భగవంతుని అవతారాలు – (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
• సప్తర్షులు – ద్యుతిమంతాదులు
• ఇంద్రుడు – అద్భుతుడు
• సురలు – పరమరీచి గర్గాదులు

బ్రహ్మసావర్ణి మన్వంతరము:-

• మనువు – ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
• మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
• భగవంతుని అవతారాలు – భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
• సప్తర్షులు – హవిష్మంతుడు మున్నగువారు
• ఇంద్రుడు – శంభుడు
• సురలు – విభుదాదులు

ధర్మసావర్ణి మన్వంతరము:-

• మనువు – ధర్మసావర్ణి
• మనువు పుత్రులు – సత్య ధర్మాదులు పదిమంది.
• భగవంతుని అవతారాలు – సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
• సప్తర్షులు – అరుణాదులు
• ఇంద్రుడు – వైధృతుడు
• సురలు – విహంగమాదులు

భద్రసావర్ణి మన్వంతరము:- 

• మనువు – భద్ర సావర్ణి
• మనువు పుత్రులు – దేవసుతాదులు
• భగవంతుని అవతారాలు – సత్య తాపసుడు – సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
• సప్తర్షులు – తపోమూర్త్యాదులు
• ఇంద్రుడు – ఋతధాముడు
• సురలు – పరితారులు

దేవసావర్ణి మన్వంతరము:-

• మనువు – దేవసావర్ణి
• మనువు పుత్రులు – విచిత్ర సేనాదులు
• భగవంతుని అవతారాలు – దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
• సప్తర్షులు – నిర్మోహ తత్వదర్శనాదులు
• ఇంద్రుడు – దివస్పతి
• సురలు – సుకర్మాదులు

ఇంద్రసావర్ణి మన్వంతరము:-

• మనువు – ఇంద్ర సావర్ణి
• మనువు పుత్రులు – గంభీరాదులు
• భగవంతుని అవతారాలు – సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
• సప్తర్షులు – అగ్నిబాహ్యాదులు
• ఇంద్రుడు – శుచి
• సురలు – పవిత్రాదులు

యుగాల మధ్య జరిగిన ఒక కథ:-

భాగవతం ఏకాదశ స్కందము నుండి : ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో – సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, “నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)

కల్పము:-

కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కల్పముల పేర్లు
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో “శ్వేతవరాహ కల్పం” నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:
1. శ్వేత కల్పము
2. నీలలోహిత కల్పము
3. వామదేవ కల్పము
4. రత్నాంతర కల్పము
5. రౌరవ కల్పము
6. దేవ కల్పము
7. బృహత్ కల్పము
8. కందర్ప కల్పము
9. సద్యః కల్పము
10. ఈశాన కల్పము
11. తమో కల్పము
12. సారస్వత కల్పము
13. ఉదాన కల్పము
14. గరుడ కల్పము
15. కౌర కల్పము
16. నారసింహ కల్పము
17. సమాన కల్పము
18. ఆగ్నేయ కల్పము
19. సోమ కల్పము
20. మానవ కల్పము
21. తత్పుమాన కల్పము
22. వైకుంఠ కల్పము
23. లక్ష్మీ కల్పము
24. సావిత్రీ కల్పము
25. అఘోర కల్పము
26. వరాహ కల్పము
27. వైరాజ కల్పము
28. గౌరీ కల్పము
29. మహేశ్వర కల్పము
30. పితృ కల్పము

No comments:

Post a Comment