Sunday, May 25, 2014

ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు

తరాలు మారినా అంతే నమ్మకంగా నమ్మటం వెనుక బలమైన కథనాలూ వుంటాయి. అలా స్త్రీలు మాత్రమే వెళ్ళి పూజలు చేసే ఓ ఆలయం ఉంది. పొరపాటున కూడా పురుషులు ఎవ్వరూ ఆ ఆలయంలోకి అడుగు పెట్టరు. పసుపు కుంకుమలతో తమని చల్లగా చూడమని స్త్రీలు పూజలు చేసే ఆ ఆలయం వెనుక, అక్కడి ఆచారం వెనుక ఓ కథ కూడా ఉంది. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో పూజలందుకునే దేవతా విగ్రహం అంటూ ఏదీ వుండదు. కాని రోజూ కొన్ని వందల మంది మహిళలు ఆ ఆలయంలో పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు చేసుకుంటారు.

1870 ప్రాంతంలో సాకాలేదిహ ప్రాంతాన్ని పాలించే రాజు అతని కుమారులు ఒకసారి శ్రీ పాదుడు అనే ఓ నిరుపేద బ్రహ్మణుడుని బంధిస్తారు. శ్రీపాదుడు ఆవులు పొరపాటున రాజుగారి పొలంలోకి ప్రవేశించటమే అతను చేసిన నేరం. పొరపాటు జరిగిందని, క్షమించమని వేడుకుంటాడు శ్రీపాదుడు. కాని అధికార గర్వంతో రాజు అతని మాటలని వినిపించుకోడు.... పైగా బ్రహ్మాణుడికి గోవులెందుకు అంటూ అవహేళన చేస్తాడు. కేవలం ఓ నిరుపేద బ్రహ్మాణుడి ఆవులు తమ పొలంలోకి వచ్చాయన్న ఒకే ఒక్క ఆరోపణతో అతనిని బంధించి కారాగారంలో పడేస్తాడు రాజు. శ్రీపాదుడుని చిత్రహింసలు పెడతారు భటులు. దాంతో ఎంతో మనస్తాపానికి గురయిన శ్రీపాదుడు అన్నపానియాలు మానేసి నిరాహారంగా కాలం గడుపుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రాకుమార్తెలు బ్రహ్మాణ ద్రోహం వంశానికే అరిష్టమని భావించి రహస్యంగా కారాగారంలోని శ్రీపాదుడుని కలుసుకుని తమ తండ్రి, సోదరులు చేసిన ద్రోహానికి క్షమించమని వేడుకుంటారు.

ఒకరోజు రాకుమార్తెలు తులసితీర్థాన్ని తెచ్చి అది తీసుకుని దీక్షని విరమించమని శ్రీపాదుడుని కోరతారు అయితే ఆ తులసి తీర్థం తీసుకున్న శ్రీపాదుడు ‘‘మీకెప్పుడూ మంచే జరుగుతుంది’’అని ఆ రాకుమార్తెలని దీవిస్తూ, కూర్చున్న చోటనే ప్రాణాలు విడుస్తాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు రథం లోయలో పడిన ప్రమాదంలో రాజు, రాజకుమారులు మరణించగా, ఆశీర్వాదం వలనే అలా తాము ప్రాణాలతో ఉన్నామని నమ్ముతారు రాకుమార్తెలు.
శ్రీపాదుడిని బంధించిన కారాగారాన్ని దేవాలయంగా మార్చి, శ్రీపాదుడు కుర్చున చోటుని దైవపీఠంగా భావించి పూజలు చేసేవారు ఆ రాకుమార్తెలు. కేవలం మహిళలకి మాత్రమే అందులో ప్రవేశమని, మగవారు రాకూడదని శాసించారు. ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు. అలా లోపలికి వెడితే చెడు జరుగుతుందని వారి నమ్మకం కేవలం స్త్రీలు మాత్రమే ఆలయంలోకి వెళ్ళి ఒకప్పుడు శ్రీపాదుడు కూర్చున్న ఎత్తైన అరుగుకి పసుపురాసి, నెయ్యి, పూలతో పూజలు చేస్తారు. మహిళల కోసం మహిళలే కట్టుకున్న ఆలయంగా ఇది ప్రసిద్ధి కెక్కింది.

No comments:

Post a Comment