Tuesday, May 20, 2014

చతుర్వేదాలు

హిందూధర్మమునకు వేదములే మూలము. వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటె ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపబడినవి.

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండ యనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాది కర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది.

ఒక్క పరబ్రహ్మమును తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపమును నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు.

మంత్రదష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలుకారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పబడినవి.

వేదవ్యాసుడు ఈ వేదములను నాలుగుగా విభజించెను.
ఋగ్వేదము

ఋగ్వేద దేవత తెల్లని రంగు గలది. దీనికి రెండు చేతులుండును. దీని ముఖము గాడిద ముఖము. అక్షరమాలను ధరించి సౌమ్య ముఖముతో, ప్రీతిని ప్రకటించుచు, వ్యాఖ్యానము చేయు యత్నములో నుండును. దీనిలో 21 శాఖలు ఉన్నవి. ఇది మంత్రములతో కూడుకొన్నది. ఇందులోని మంత్రములు ఇంద్రాది దేవతలను (స్తుతించుట జరిగినది) స్తుతించినవి.
యజుర్వేదము

యజుర్వేద దేవత మేక ముఖము కలదై పసుపుపచ్చని రంగుతో, జపమాలను ధరించి, ఎడమ చేతితో వజ్రాయుధమును ధరించి, ఐశ్వర్యమును, శుభమును ప్రసాదించుచుండును. దీనిలో 101 శాఖలు ఉన్నవి. గద్యము లన్నింటిని సేకరించినవి ఇందులోని శ్లోకములు (మంత్రములు)
సామవేదము

సామవేద దేవత నల్లకలువరేకువలే నిగనిగలాడుతూ, నీలశరీరముతో గుర్రము ముఖముతో, కుడిచేతితో అక్షరమాలను, ఎడమచేతితో కుండను (పూర్ణ కుంభమును) ధరించియుండును. దీనిలో 1009 శాఖలు ఉన్నవి. గేయ రూపములోనున్న మంత్రములు సంగీతమునకు సంబంధించినవి.
అధర్వవేదము

అధర్వవేదదేవత తెల్లని రంగుతో, కోతిముఖముతో, ఎడమచేతిలో జపమాలతో, కుడిచేతిలో (పూర్ణ కుంభము) కుండతో విలసిల్లుచుండును. దీనిలో 9 శాఖలు ఉన్నవి. మిగిలినవన్ని ఇందులో చెప్పబడినవి.
ఉపవేదాలు

ప్రతి యొక్క వేదానికి ఉపవేదాలు ఉన్నాయి.
ఋగ్వేదమునకు ఉపవేదం ఆయుర్వేదము.
యజుర్వేదమునకు ఉపవేదం ధనుర్వేదము.
సామవేదమునకు ఉపవేదం గాంధర్వ వేదము.
అధర్వణవేదమునకు ఉపవేదం స్థాపత్య శాస్త్ర వేదము.

No comments:

Post a Comment