బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, చేతి వేళ్ళ మధ్య ధర్భలు పట్టుకొని, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు. ఆయనకు రెండు పక్కలా శ్రీ దేవి, హ్రీదేవి, ముందు భూదేవి ఉన్నారు. ధనుర్భాణాలు పురుష రూపంతో ఆయన్ని అనుగమించినాయి. వేదాలు, గాయత్రి , ఓంకారవషట్కారాలు ఆ పురాణ పురుషుణ్ణి అనుసరించాయి. బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు ఆమర్యాద పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశు పక్ష్యాదులు కూడా రాముని వెంట పోగా అయోధ్య అంతా పాడుపడినట్టు ఖాళీ అయిపోయింది. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకొన్నాడు. అప్పటెకే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. అర్చకుల మంత్రోచ్చారణలు జరుపుతునారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు" మహావిష్ణూ ! నీకు శుభమగుగాక! నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ!సకల భువనాలకూ నువ్వే ఆధారం."
పితామహుడి మాటలు విని రాముడు వైష్ణవ రూపం స్వీకరించాడు. సోదరులుకూడా అలాగే చేసారు. కిన్నెరులు కింపురుషులు, యక్షులు, దేవతలు ఇలా సకల లోకాలకు చెందినవారంతా జయజయ ధ్వానాలు చేసి విష్ణువుకు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు. బ్రహ్మ రెండుచేతులా విష్ణువుకు మొక్కి"దేవా! నిన్ను నమ్మిన వారు ఆశ్రయించినవారు పశువులైన పక్షైనా సంతానకమనే దివ్యలోకం చేరతారు. ఇప్పుడు వీరినందరినీ ఆ లోకానికే చేరుస్తాను. వానరాదులు ఏ దేవతాంశం నుంచి జన్మించారో ఆ దేవతాంశం పొందుతారు. సుగ్రీవుడు సూర్యునిలో లేనమై పోతాడు" అన్నాడు. రాముడ్ని అనుసరించిన వారు " గో ప్రతారం " అనే తీర్ధంలో మునిగారు. వాళ్ళకి పూర్వ శరీరాలు పోయి దివ్యశరీరాలు వచ్చాయి.అప్పుడు వారు తమకు కేటాయించిన విమానాల్లో పుణ్యలోకాలు వెళ్ళిపోయారు.
No comments:
Post a Comment