Thursday, September 19, 2013

పార్వతి ప్రియ పుత్రుడు, సేవకుడు గణపతి


పార్వతీదేవికి ఇద్దరు చెలికత్తెలు. వాళ్ళ పేర్లు జయ, విజయ. ఒకసారి వాళ్ళు పార్వతీదేవితో ముచ్చటిస్తూ ఉండగా వారి సంభాషణ ఇలా సాగింది...

''మహాశివుని దగ్గర లెక్కలేనన్ని గణాలు ఉన్నాయి. అయితే, వారిలో మనవాడు అనుకోదగిన వారు ఒక్కరు కూడా లేరు. వాళ్ళంతా శివుని ఆజ్ఞా పాలకులే మన మాటలు వినేవారు కారు. అలాంటప్పుడు మనకు ఆత్మీయం అనుకునే వ్యక్తి, మనకు విధేయుడిగా ఉండేటటువంటి వ్యక్తిని ఒకరిని సృష్టించకూడదా అమ్మా?!" అని అడిగారు.

చెలికత్తెలు అన్న మాటలు పార్వతీదేవిపై ప్రభావం చూపాయి. దేవికి ప్రేరణ కలిగింది కానీ, అప్పటికి మాత్రం మౌనంగా ఊరుకుంది.

యధాప్రకారం కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పార్వతీదేవి, నందీశ్వరుని ద్వారపాలకునిగా నియమించి అభ్యంగన స్నానం ఆచరించేందుకు వెళ్ళింది. ఆవిడ స్నానం పూర్తికాకుండానే మహాశివుడు వచ్చాడు. నందీశ్వరుని పక్కకు జరగమని తిన్నగా లోనికి వచ్చాడు. దాంతో పార్వతీదేవికి సిగ్గుగా అనిపించింది. చెప్పొద్దూ.. శివుని మీద కోపం కూడా కలిగింది.

ఆ సమయంలో పార్వతీదేవికి మునుపు చెలికత్తెలు తనతో అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. వారన్న మాటలో ఎంతో ఔచిత్యం ఉంది. తనవాడు అయిన వ్యక్తిని కనుక ద్వారం వద్ద కాపలాగా ఉంచినట్లయితే మహాశివుడు ఈవిధంగా నెట్టుకుని, అక్రమంగా లోనికి రాగలిగేవాడు కాదు కదా... తాను ఇలా సిగ్గుతో కుంచించుకు పోవలసిన అగత్యం ఉండేది కాదు కదా... అని ఆలోచించింది.

తనవాడు అనిపించే వ్యక్తి తనకు సదా అందుబాటులో ఉండాలనే ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదయింది. కొన్నిరోజులకు ఆ ఆలోచన కార్యరూపం ధరించింది. ఒకరోజు పార్వతీదేవి తన మేనుకు పట్టించిన నలుగుపిండితో ఒక బాలుని ఆకృతిగా తీర్చిదిద్దింది. ఆ బాలుని రూపొందిస్తున్నంతసేపూ ''ఈ బాలకుడు శుభకరుడు, అపూర్వ బలశాలి, సకల సద్గుణుడు, సర్వ లక్షణ సంపన్నుడు, అద్వితీయ తేజోవంతుడు, మహా సుందరుడు కావాలి. ఈ అపురూపమైన బాలుడు నా సేవకుడిగా ఉండాలి. నేను ఏది చెప్తే దాన్ని ఆజ్ఞగా తీసుకోవాలి. తక్షణం అక్షరాలా అమలుపరచాలి...'' అంటూ మధురమైన ఊహల్లో తేలింది.

పార్వతీదేవి తాను స్వహస్తాలతో రూపొందించిన బాలునికి ఊపిరి పోసింది. ముచ్చట కలిగించే వస్త్రాలు తొడిగింది. అనేక అమూల్యమైన ఆభరణాలతో అలంకరించింది. ఆ బాలుని చూస్తే అపురూపంగా, గర్వంగా అనిపించింది. ప్రేమగా స్పృశించి, ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని, ''బాలకా! నాకు సంతానం లేదు. ఈ క్షణం నుంచీ నువ్వే నా పుత్రుడివి. నేను ఎలా చెప్తే, అలా వినాలి. నా మాటలు తూచా తప్పకుండా పాటించాలి. ..

''బాలకా, ఇప్పుడు నేను అభ్యంగన స్నానం చేసేందుకు వెళ్తున్నాను.. ఎవర్నీ, ఎట్టి పరిస్థితిలో లోనికి రానీయకు..'' అని చెప్పడమే కాకుండా చేతిలో ఒక కర్ర కూడా ఉంచి మరీ వెళ్ళింది.

పార్వతీదేవి స్నానానికి వెళ్ళిన కొద్దిసేపటికి మహాశివుడు వచ్చాడు. ద్వారం దగ్గర నిలబడిన బాలుని చూసి ఆశ్చర్యపోయి, తప్పుకోమన్నాడు. పార్వతీదేవి స్వయంగా రూపొందించి, నియమించిన బాలుడు కదా, వీల్లేదన్నాడు.

కోపోద్రిక్తుడైన మహాశివుడు, తన గణాలను రప్పించి, కాపలాగా నిలిచిన బాలుని తరిమేయమన్నాడు. దేవగణాలు మూకుమ్మడిగా వచ్చి బాలకునితో యుద్ధం చేశాయి. ఆ యుద్ధాన్ని చూసిన పార్వతీదేవి తల్లడిల్లింది. తన కొడుకును ఒక్కడిని చేసి, ఇంతమంది ఘోరంగా పోరాడుతున్నారే.. ఇదేమైనా న్యాయమా అనుకుంది. దేవి, తన పుత్రునికి సాయపడేందుకు ఇద్దరు శక్తి దేవతలను సృష్టించింది. కానీ ఫలించలేదు.

మహావిష్ణువుతో సహా దేవ గణాలు అందరూ ఏకమై గణపతితో యుద్ధం చేశారు. చివరికి మహాశివుడు, పార్వతీ నందనుని తలను త్రిశూలంతో ఛేదించాడు.

No comments:

Post a Comment