Thursday, September 19, 2013

పరమళించిన మానవత్వం

అది కొండలపై వెలసిన దేవాలయం. దైవ దర్శనం కోసం వేలాది భక్తులు గుంపులు గుంపులుగా కాలినడకన మెట్లెక్కి దేవుని దర్శించి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుంటారు. ఒక భక్త బృందం మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ గుంపులో కాళ్ళులేని ఒక వికలాంగుడు మెట్లెక్కలేక ప్రయాసపడుతూ ప్రాకుతూ, చెమటలు కార్చుకుంటూ మెట్లెక్కుతున్నాడు. చకచకా ముందుకు సాగుతున్న భక్తులెవరూ ఈ వికలాంగుని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండగా ఒక భక్తుడు మాత్రం వికలాంగుని దీనావస్థ చూచి జాలిపడి అతనిని తన భుజాలపై నెక్కించుకొని యాత్రికుల గుంపు వెనుక మెట్లుక్కుతూ ముందుకు మెల్లమెల్లగా సాగుతున్నాడు.

ముందుగా వెళ్ళిన భక్తులు గుడికి చేరి దైవదర్శనానికి గుడిదగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడు మాయమైనందుకు అందరూ ఆశ్చర్యచకితులై ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా కొంతసేపటికి వికలాంగుని ప్రయాసతో మోసుకొని వస్తున్న భక్తుడు గుడిముందు అతనిని దించగానే వికలాంగుడు మాయమైనాడు. గర్భగుడిలో యధాస్థానంలో భగవుంతుడు ప్రత్యక్షమైనాడు. భక్తులంతా ఆశ్చర్యచకితులైనారు.

భగవంతుడు సర్వమానవాళికి తండ్రి. కోర్కెలు తీర్చుకోవడానికి దేవుని ప్రార్థించడం కన్నా సాటి మానవుని నిస్వార్థ ప్రేమతో సేవిస్తే భగవుంతుడు సంతసిస్తాడు. ప్రేమను గురించి పలుమార్లు ప్రవచనాలు చేయుదానికన్నా ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థప్రేమను ప్రదర్శించే భక్తుడు మిన్న.

No comments:

Post a Comment