Tuesday, September 3, 2013

దాశరథీ శతకమ్

రచన: రామదాసు

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. || 1 ||

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ. || 2 ||

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 3 ||

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ. || 4 ||

శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 5 ||

ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ. || 6 ||

మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 7 ||

శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 8 ||

దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 9 ||

కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. || 10 ||

శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 11 ||

గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ. || 12 ||

తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ. || 13 ||

దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. || 14 ||

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ. || 15 ||

ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ. || 16 ||

పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ. || 17 ||

అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 18 ||

పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ. || 19 ||

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. || 20 ||

కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ. || 21 ||

హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ. || 22 ||

కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కంగొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ. || 23 ||

రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 24 ||

చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. || 25 ||

’రా’ కలుషంబులెల్ల బయలంబడద్రోచిన ’మా’క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ. || 26 ||

రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ. || 27 ||

చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. || 28 ||

అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ. || 29 ||

చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 30 ||

సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. || 31 ||

హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ. || 32 ||

జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ. || 33 ||

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 34 ||

అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ. || 35 ||

ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ. || 36 ||

జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ. || 37 ||

ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. || 38 ||

విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ. || 39 ||

పెంపునఁదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. || 40 ||

కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 41 ||

గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబుఁజెందు పె
న్నిద్దవు గండుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ. || 42 ||

కలియుగ మర్త్యకోటినిను గంగొన రానివిధంబో భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో
బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ. || 43 ||

జనవర మీక థాలి వినసైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ. || 44 ||

పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరథీ కరుణాపయోనిధి. || 45 ||

అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాంపవే
తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ. || 46 ||

నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్
దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 47 ||

పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీఁదనగు మోసమెఱుంగదు మానసంబు
స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. || 48 ||

చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 49 ||

పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ. || 50 ||

సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ. || 51 ||

పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొందెగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ. || 52 ||

మామక పాతక వజ్రము మ్రాంపనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. || 53 ||

దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ. || 54 ||

దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. || 55 ||

నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ. || 56 ||

వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ. || 57 ||

తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. || 58 ||

ఇతడు దురాత్ముడంచుజను లెన్నఁగ నాఱడిఁగొంటినేనెపో
పతితుఁడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేఁడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 59 ||

అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ
లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై
దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ. || 60 ||

జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం
పలరఁగ జేసెనాతిగఁబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ. || 61 ||

కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ. || 62 ||

భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ. || 63 ||

నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ. || 64 ||

చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ. || 65 ||

దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 66 ||

వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ. || 67 ||

సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగులే రకట దాశరథీ కరుణాపయోనిధీ. || 68 ||

వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ. || 69 ||

కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో
ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 70 ||

ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ. || 71 ||

పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 72 ||

పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే
లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 73 ||

ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 74 ||

దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 75 ||

అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. || 76 ||

సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. || 77 ||

సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. || 78 ||

మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ. || 79 ||

ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ. || 80 ||

దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ. || 81 ||

హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. || 82 ||

వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ. || 83 ||

కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ. || 84 ||

చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ. || 85 ||

భానుడు తూర్పునందుగను పుట్టినఁ బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ. || 86 ||

నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ. || 87 ||

నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ. || 88 ||

కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ. || 89 ||

నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ. || 90 ||

వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ. || 91 ||

ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ. || 92 ||

దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ. || 93 ||

సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ. || 94 ||

జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ. || 95 ||

సరసునిమానసంబు సర సఙ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహించువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ. || 96 ||

నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. || 97 ||

శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమందఁగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ. || 98 ||

ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. || 99 ||

బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం
గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా
తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ. || 100 ||

భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ. || 101 ||

తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ. || 102 ||

పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుండ్రముల్
వెట్టితిమంత్రరాజ మొడి బెట్టితి నయ్యమకింక రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కంజలందుఁ దలంపుపెట్టి బో
దట్టితిఁ బాపపుంజముల దాశరథీ కరుణాపయోనిధీ. || 103 ||

అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ. || 104 ||

No comments:

Post a Comment