Monday, September 9, 2013

రాముడు ప్రతిష్టించిన రామనాథేశ్వర స్వామిని దర్శించుకోండి


ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి రామనాథ స్వామి ఆలయం. తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లాలోని ఓ పట్టణమైన ఈ ప్రాంతాన్ని రామేశ్వరమని పిలుస్తారు. ఇతిహాసాల ప్రకారం రాముడే ఇక్కడే సేతువుని నిర్మించి రావణాసురుడిని హతం చేశాక తనకు అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కోసం రామేశ్వరములో రామనాథేశ్వర స్వామిని ప్రతిష్టించినాడు. తద్వారా రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర క్షేత్రముగా మారింది.

దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. రామేశ్వరంలో రామనాథస్వామి గుడి , కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి , విభిషనాలయం వంటివి చూడాల్సిన ప్రాంతాలు. అలాంటి మహిమాన్వితమైన ఈ రామేశ్వరంలోని రామనాథేశ్వర స్వామిని మహాశివరాత్రి రోజున దర్శించుకునే భక్తులకు పుణ్యఫలములు సిద్ధిస్తాయి.

ఆదిశంకరాచార్యులచే ప్రతిష్టించబడిన స్ఫటిక లింగం భక్తులు, యాత్రికులకు ఆకట్టుకుంటుంది. స్వామి వారిని రామనాథేశ్వరునిగానూ, అమ్మవారిని పర్వతవర్ధిని అని పిలుస్తారు. ఇంకా కాశీ నుంచి హనుమంతుడు తెచ్చిన లింగం ఇక్కడ కాశీవిశ్వనాథుని భక్తులకు దర్శనమిస్తోంది.

అందుచేత రాహుకేతు దోషమున్నవారు ఈ ఆలయంలోని నటరాజ స్వామి సన్నిధిలోని పతంజలి ముని జీవ సమాధి వద్ద నిరంతం వెలుగును పంచే దీపానికి నెయ్యి పోసి ప్రార్థిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే దోషాలు, పాపాలు తొలగిపోతాయి. 32 తీర్థాల్లో ముఖ్యంగా 14 తీర్థాలు ఆలయం లోపలే ఉండటం విశేషం. ఇందులో పతీవ్రతా శిరోమణి అయిన సీతాదేవిని శోధించిన పాపానికి అగ్నిదేవుడు స్నానమాచరించిన అగ్నితీర్థం సుప్రసిద్ధమైంది.

అందుచేత మహాశివరాత్రి నాడు రామేశ్వరంలోని రామనాథేశ్వర స్వామిని దర్శించుకునే వారికి దోషాలు, పాపాలు తొలగిపోయి సకలసంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment