Saturday, September 7, 2013

అర్ధనారీశ్వరుడు


పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట.

లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి. లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది.

పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది.

బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది.

 బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.

No comments:

Post a Comment