Sunday, December 8, 2013

ప్రాచీన శివక్షేత్రాలు – చరిత్ర

శివరాత్రికి రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్షేత్రాలన్నీ ఏదో ఒక నది పక్కనే ఉండడం విశేషం. శ్రీశైలంలోని మల్లికార్జునుడు, అమరావతిలోని అమరేశ్వరుడు కృష్ణానది ఒడ్డున, ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు గోదావరి ఒడ్డున. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు సువర్ణముఖినదీ తీరాన, అలంపూర్‌లోని శైవక్షేత్రం తుంగభద్రానదీ తీరాన వెలిశాయి. లింగాకారంలో దర్శనమిస్తాడు శివుడు. ఈ ఆలయాలలో కొన్నిటికీ క్రీస్తుపూర్వపు చరిత్ర కూడా ఉంది. పల్లవులు, చోళులు మొదలుకుని శ్రీకృష్ణదేవరాయలు వరకు ఎందరో రాజులు ఈ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టి, అందులో శిల్ప సంపదల్ని అభివృద్ధి చేశారు. నిజానికి తెలుగునాడు శైవంతో గట్టిగా ముడివడి ఉంది.

అమరావతి అమరేశ్వరస్వామి

గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలో అమరేశ్వరస్వామి ఆలయం ఉంది. పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరాలయం పేరు మీదుగా అమరావతి ప్రసిద్ధిగాంచింది. ఇది చాలా ప్రాచీన క్షేత్రం. అమరావతి ఆలయంలో లింగం చాలా పొడవుగా ఉంటుంది. ఈ లింగం మూడు అడుగుల చుట్టుకొలతతో 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ శివుని సతీమణి బాలఛాముండిక. చుట్టూ నాలుగు గోపురాలు ఉన్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పురావస్తుశాఖ పేర్కొంటోంది.
 
ప్రస్తుతం పై అంతస్తులోని శివలింగ భాగాన్ని మాత్రమే ప్రజలు దర్శించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఈ గుడి దగ్గర కృష్ణానది కొద్ది దూరం వాయువ్యదిశగా ప్రవహించడం చెప్పుకోదగిన అంశం. మిగతా నది అంతా పశ్చిమం నుండి తూర్పుదిశగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.
 
అయితే ఇక్కడ లభించిన శాసనాల్లో ధరణికోట, ధాన్యకటకం అన్న పేర్లే కానీ అమరావతి అన్న పేరు కన్పించదు. ఈ శాసనాల్లో మొదటిది అశోకుని కాలం నాటిది. దీన్ని ప్రదర్శించిన వారిలో క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందిన హాయున్‌త్సాంగ్‌ అను చైనా యాత్రికుడు ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని మాండలికులుగా పాలించిన కోట రాజులు (12వ శతాబ్దం) అమరేశ్వర భక్తులుగా తమను తాము వర్ణించుకున్నారు. కొండవీటి రాజయిన అన వేమారెడ్డి 1361లో అమరేశ్వరుని పునఃప్రతిష్ట చేనినట్లు ఒక శాసనం తెలుపుతోంది. 1626లో జుజ్జూరు గ్రామానికి చెందిన పెద్దప్ప అమరేశ్వరుని పునఃప్రతిష్ఠ జరిపినట్లు శాసనంలో తెలిపాడు. పునఃప్రతిష్ఠ ఎందుకు జరిపిందీ ఇద్దరూ తెలపలేదు. 
 
1796లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక్కడ ఒక నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆయన అమరేశ్వరాలయాన్ని పునరుద్ధరించాడు. బహుశా అమరావతి అన్న పేరు ఆయనే పెట్టి ఉండొచ్చని ఒక ఊహ ఉంది. బౌద్ధక్షేత్రం ధ్వంసం చేసి శివాలయం కట్టారని చరిత్ర చెబుతోంది. అమరావతిలో ప్రాచీన బౌద్ధ అవశేషాలు చాలా లభించాయి.

శ్రీశైలం మల్లికార్జునుడు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున మహాలింగం శ్రీశైలం మహాక్షేత్రంలో పూజలందుకుంటోంది. దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు. అష్టాదశ మహాశక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠం రెండవది.
 
శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయలు తదితర రాజులు ఎంతోమంది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. దేవాలయం నాలుగు దిక్కుల ఎత్తైన గోపురాలు, చుట్టూ అతిపెద్ద ఖాళీస్థలం, లెక్కలేనన్ని ఆలయాలతో అలరారుతోంది. దేవాలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న నంది కొమ్ముల మధ్యలో నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నాకే భక్తులు తిరుగు ప్రయాణమవుతారు.
 
శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మనమీదపడి చిన్నా చితక అనారోగ్యాలు మటుమాయమైపోతాయని విశ్వసిస్తారు. పచ్చటి పరిసరాలమధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది.
 
ఈ దేవాలయం చాలా పెద్దది. దేవాలయం చుట్టూ ఎన్నో శివలింగాలు ఉన్నాయి. బయట వృద్ధ మల్లికార్జునుడు, గర్భగుడి వెనుక పాండవుల చేత ప్రతిష్టించబడినవని చెప్పబడే శివలింగాలున్నాయి. మిగతా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా తడిసి మోపెడు ఖర్చవుతుందనే భక్తులు శ్రీశైలం వెళ్తే మాత్రం తక్కువ ఖర్చుతో తిరిగి రావచ్చంటారు.

ద్రాక్షారామం

ద్రాక్షారామం గోదావరి ఒడ్డున ఉంది. దీన్ని పంచారామాల్లో మొదటిదిగా, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగా చెప్తుంటారు. ద్రాక్షారామం శివాలయం, విష్ణాలయం తోపాటు శక్తిపీఠం కూడా ఉన్న క్షేత్రం. భీమేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ లింగాకారం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. అందుకే ఆలయం రెండు అంతస్థులుగా కట్టారు. పై అంతస్థులోకి వెళ్లి పూజలు జరపాలి. చీకటిగా ఉండే మొదటి అంతస్థులో భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. లింగాకారం సగం నలుపు, సగం తెలుపు రంగుల్లో ఉంటుంది. అర్థనారీశ్వరుడు అనటానికి ఇది నిదర్శనమంటారు.
 
దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందని పురాణ ప్రతీతి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో సూర్యకిరణాలు నేరుగా భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి.
 
స్థల పురాణం ప్రకారం… వ్యాసమహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికీ, ఆయన శిష్యులకు కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో ఆగ్రహించిన వ్యాసుడు కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి వచ్చి వ్యాసుడికి, ఆయన శిష్యులకు భిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధపడిన వ్యాసుడిపై కోపం వచ్చిన శివుడు ‘కాశీలో బోగులకు స్థానం లేదని, ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లాలని వ్యాసుణ్ణి ఆదేశించాడు. దాంతో బాధపడుతున్న వ్యాసుణ్ణి అన్నపూర్ణాదేవి ‘ద్రాక్షారామం వెళ్లి అక్కడి భీమేశ్వరుడ్ని సేవించమని’ చెప్పిందట. ఇలా ఈ ప్రదేశానికి దక్షిణ కాశీ అని పేరొచ్చిందని చెప్తారు.
 
ఇక్కడ గల వినాయకుడి తొండం కుడి చేతిమీదుగా ఉంటుంది. కాశీలోని విశ్వేశ్వరాలయంలో వినాయకుడికి కూడా అలాగే ఉంటుంది. క్రీ.శ. 9వ శతాబ్దంలో తూర్పు చాళక్య రాజైన చాళుక్య భీముడు892-922 మధ్య కాలంలోనే నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తుంది.
 
అలాగే భీమేశ్వరాలయం తూర్పు భాగంలో ఉన్న సప్తగోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది. ఈ ఆలయ ప్రాంతంలోనే సప్త మహర్హులు తపస్సు చేశారని, అందుకే ఇక్కడి గోదావరి ఏడు పాయలుగా చీలిందని స్థానికుల కథనం. ఆ రుషుల పేర్లతోనే ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్త గోదావరి పుష్కరిణిగా వెలసిందట.

శ్రీకాళహస్తి

ఆంధ్రరాష్ట్రంలో ఏకైక పంచభూత లింగక్షేత్రంగా శ్రీకాళహస్తి చరిత్ర సంతరించుకుంది. శ్రీ సాలీడు (శ్రీ), పాము (కాళము), ఏనుగు (హస్తి) ఇక్కడి సర్వేశ్వరుని పూజించి ముక్తి పొందడంతో వాటి పేరుమీదుగానే ఈ క్షేత్రం ఖ్యాతిగడించింది. ఈ క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, శాతవాహనులు, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. సువర్ణముఖి నదీ తీరాన కొలువు తీరిన ఈ ఆలయ శిల్ప కళా సౌందర్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇక్కడి శివలింగంపై సాలెపురుగు, పాము, ఏనుగు చిహ్నాలు కూడా ఉంటాయి. ఈ క్షేత్రాన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయంలోని శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. ఈ దేవాలయానికి దగ్గర్లోనే ఉన్న కొండమీద భక్త కన్నప్పకి కూడా చిన్న ఆలయం నిర్మించారు.
 
ఆలయానికున్న కొండ రాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలు ఉన్నాయి. తర్వాతి కాలం పదకొండవ శతాబ్దంలో చోళులు పాత దేవాలయాలను మెరుగుపరిచారు. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు మిగిలిన ఆలయాల్ని నిర్మించాడు. క్రీ.శ. 12వ శతాబ్దంలో వీరనరసింహ దేవరాయ ఇప్పుడున్న ప్రకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. 1516లో శ్రీకృష్ణదేవారాయలు గజపతులపై విజయానికి గుర్తుగా ఎత్తైన గాలిగోపురాన్ని నిర్మించాడు. ఈ గాలి గోపురమే 2010 మే 26న కూలిపోయింది.

అలంపురం క్షేత్రం

అలంపూర్‌ క్షేత్ర చరిత్ర చాలా పురాతనమైనది. ఇక్కడి ఇతిహాసాలు, అవశేషాలు మనం ఎన్నో పరిశీలించవచ్చు. 6 నుండి 12 శతాబ్దాల వరకు భారతీయ వాస్తు శిల్పాలతో కలిగిన పరిణామాలను తెలియజేసే అనేక ఆలయాలున్నాయి. ఇవన్నీ 7వ శతాబ్దానికి చెందినవని చెప్తారు. 7 వ శతాబ్ది నుండి 17 వ శతాబ్ది వరకు దక్ష్షిణాపథం పాలించిన రాజవంశీయుల శాసనాలున్నాయి.
 
తుంగభద్రనదీ తీరాన ఉన్న ఈ గ్రామం పేరు హలంపుర, హతంపురంగా ఉండగా కాలక్రమంలో అలంపూర్‌గా పేరొచ్చింది. ఈ స్థలంలో అనేక ప్రాచీన అవశేషాలు ఉన్నాయి. ఇటీవల దేవాలయం తోటను ఆనుకుని ఉన్న గదిలో ప్రభుత్వం వారు తవ్వకాలు జరిపినప్పుడు శాతవాహనుల కాలం నాటి నాణెములు, పూసలు, శంఖులతో తయారైన పాత్రలు, పాత ఇటుకలు బయల్పడ్డాయి. ఈ ప్రాంతాన్ని బాదామి చాళుక్యుల కాలంలో శ్రీశైలం నుండి పాలించారు. రెండవ పులకేశి మహాసామ్రాజ్యం స్థాపించి దివ్యమైన ఆలయాలు, విద్యాపీఠాలు, శైవమఠాలు నిర్మించారు. బాదామి చాళుక్యుల హయాంలోనే అలంపూర్‌ లోని నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది.
 
అనంతరం రాష్ట్రకూటుల యుగంలో మహాద్వారం చేయించి గోడలపై చెక్కించారు. తర్వాత వచ్చిన కళఅయాణి చాళుక్యుల యుగంలో నరసింహాలయ, సూర్యనారాయణాలయాలు నదీతీరంలో ఘట్టాలు ఈ కాలం నాటివే.
అనంతరం స్వర్ణయుగంగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడి దేవాలయాలకు కొన్ని దానాలు చేశారు. అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవది అలంపూర్‌ శ్రీజోగుళాంబ ఆలయం. వాస్తవానికి ఇది ప్రధానంగా మాతృస్వామిక యుగానికి ప్రాతినిధ్యం వహించే ఆలయం. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ నవబ్రహ్మ ఆలయాలన్నీ శిధిలావస్థలో ఉన్నాయి. వరాహాలకు నిలయంగా మారాయి. శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన దేవాలయాల్ని రక్షించవలసి బాధ్యత ఎంతైనా ఉంది.

అతిపెద్ద శివుడు! కోటిలింగేశ్వరుడు!

దేశంలోకెల్లా అతిపెద్ద శివుడి విగ్రహం కర్ణాటకలోని హోనావర్‌ పట్టణం దగ్గర్లో మురుదేశ్వరాలయంలో ఉంది. 123 అడుగుల ఎత్తు ఉంటుంది. నేపాల్‌లోని భక్తాపూర్‌లోని 144 అడుగుల శివుడి విగ్రహం తర్వాత ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం ఇదే. దీని నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. మూడు వైపులా సముద్రం మధ్యలో పెద్ద కొండ… దానిమీద వేల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం.పూర్వం ఈ ప్రాంతాన్ని కందుకగిరి అని పిలిచేవాళ్లు. ఒకప్పుడు ఈ ప్రాంతం విజయనగర రాజుల పాలనలో ఉండేది. ఇక్కడి ఆలయాలన్నీ వాళ్లే నిర్మించారు.
 
రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడనే కథ మనందరికీ తెలుసు. దాన్ని భూమిమీద పెట్టకూడదనే షరతుమీద రావణుడికి ఇస్తాడు శివుడు. మద్యలో సంధ్యావందనం ఇవ్వాల్సి రావడంతో రావణుడు అక్కడ కనిపించిన బాలుడిని (వినాయకుడు) పిలిచి ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా పట్టుకోమని కోరతాడు. అయితే కావాలనే వినాయకుడు కింద పెట్టేస్తాడు. సంధ్యావందనం పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన రావణుడు ఆ లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నించినప్పుడు అందులోని ఒక ముక్క దూరంగా పడిందని, ఆ ప్రాంతమే మురుదేశ్వరాలయమని పురాణం చెప్తోంది.
 
ఆలయం వెనుక ఉన్న పురాతన కోటను విజయనగర రాజులు నిర్మించారు. దీనికి టిప్పు సుల్తాన్‌ పాలన కాలంలో మెరుగులు దిద్దారు. మురుదేశ్వర్‌ దగ్గర సూర్యాస్తమయ దృశ్యం మరో ఆకర్షణ.
పది అంతస్తుల భవనమంత ఎత్తుండే శివలింగాన్ని చూడాలన్నా కర్ణాటకలోనే సాధ్యం. అక్కడ కమ్మసంద్ర గ్రామంలోని 108 అడుగుల భారీ శివలింగం ప్రపంచంలోనే అతి ఎత్తైనదిగా పేరు పొందింది. ఏటా శివరాత్రికి ఇక్కడికి 2 లక్షల మంది భక్తులు వస్తారు. దీనికి అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించారు. 13 ఎకరాల సువిశాల ఆలయ ప్రాంగణంలో ఈ భారీ విగ్రహంతో పాటు 35 అడుగుల నందికేశ్వరుడు, చిన్న చిన్న లింగాలు మొత్తం 90 లక్షల వరకు ప్రతిష్టించారు. మొత్తం కోటి లింగాలు ప్రతిష్టించాలనే సంకల్పంతో 1980లో ఈ మహాలింగాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని కోటిలింగేశ్వరాలయంగా పిలుస్తారు.

గుడిమల్లం దేవుడు

ఈ గుడి ఏనాదో ఖచ్ఛితంగా చెప్పడానికి తగిన శాసనాలు లేవు. కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం ఇది క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నాటిదని చెప్తారు. అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారో మాత్రం తెలియదు.
 
ఈ ఆలయంలోని శివలింగం ఆకారం అచ్చంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దాని మీద రాక్షసుడి భుజాలపై నిల్చున్న శివమూర్తి ఉంటాడు. మంగోలులని పోలిన ఈ రూపం ఖజురహోలా కూడా కనిపించడం విశేషం. ఇక శివుడి కుడిచేతిలో జింక, ఎడమ చేతిలో భిక్షపాత్ర, ముంజేతికి కడియం, చెవులకి కుండలాలు, భుజం మీద గండ్ర గొడ్డలి, తలకు తాటికాయల కిరీటం, మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి.
 
ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మితమైంది. గర్భాలయంపై కప్పు గజపృష్టాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ”తిరువిప్పరంబేడు” అని పిలిచినట్లు తెలుస్తోంది. అంటే తెలుగులో ‘శ్రీ విప్రపీఠం’ అంటారు. పల్లవుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడిపల్లం అయింది. కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది.
 
ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిందంటూ ఒక లింగాన్ని భద్రపరిచారు. అక్కడ ఉన్న లింగానికి ఈ గుడిమల్లం ఆలయంలో ఉన్న శివలింగానికీ బాగా దగ్గరి పోలికలు ఉంటాయి.
 
అలాగే ఉజ్జయినిలో జరిగిన తవ్వకాల్లో క్రీ.పూ. మూడవ శతాబ్దానికి చెందినవిగా భావించే కొన్ని రాగి నాణేలు దొరికాయి. వాటిపై ఉన్న చిత్రం అచ్చు గుడిమల్లపు శివలింగం మాదిరి ఉండడం విశేషం. దీన్ని బట్టి ఈ దేవాలయం లింగ ప్రాచీనత్వం, ఉత్తర భారత దేశంలో కూడా ఇది తెలియబడి ఉండడం అర్థం అవుతున్నాయి.

No comments:

Post a Comment