Friday, September 6, 2013

హిందూ వివాహం

మన ధర్మం సనాతనము, సార్వ దేశికము, సార్వ కాలికము, సార్వ జనీనము, మహిమాన్వితము, సర్వోత్తమము, ఆచరణలో నిగ్గు తేలినది. ఈనాటికీ మనదేశం సంస్కృతి,ధర్మం, ఆధ్యాత్మికత, నీతి మొదలగు విషయాలలో ప్రపంచానికి గురు స్థానం లోనే ఉన్నది. శాంతి, సౌభ్రాతృత్వముల కొరకు ప్రపంచం భారత దేశం వైపు చూస్తున్నది. విజ్ఞానంలో కూడా గొప్పదే. అనేక మంది విదేశీయులు మన ప్రాచీన విశ్వ విద్యాలయాలలో శిక్షణ పొందారు. కానీ నేటి మన స్థితి ఏమిటి ? పరాయి పాలనలో మన జాతి ఆత్మ విస్మృతి చెందినaది. తన గొప్పతనాన్ని, తన వారసత్వాన్ని మరచి పోయింది. పరాయి వాళ్లు రాసిన రాతలను నమ్మి తన అస్థిత్వాన్నే కోల్పోవు చున్నది. మన ఆచారాలు మూఢాచారాలని, మనవి గుడ్డి నమ్మకాలనీ, మనము అనాగరికులమనీ విదేశీయులు మనకు అన్నీ నేర్పారని పాఠ్య పుస్తకాలలో రాసి మన పిల్లల చేత చదివించుచున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మనలో చైతన్యం కనిపించుట లేదు. విదేశీయులు మన ఆచారాలను అధ్యయనం చేసి వాటి లోని గొప్పదనాన్ని వారు మనకు చెపితే గాని నమ్మలేని స్థితిలో ఉన్నాము. వారు చెపితే అది మనకు వేదం. ఆత్మవిస్మృతి లో నున్న జాతిని జాగృతం చేయాలి. ఆత్మ ప్రబోధం కలిగించాలి. మన ఆచారాలలోని అంతరార్ధాన్ని తెలియజేయాలి.

మనం పెళ్ళిళ్లు చేస్తున్నాం ఆడంబరంగా. డబ్బు ఖర్చు పెడుతున్నాం విరివిగా. అప్పుల పాలవుతున్నాం తరచుగా. కట్నాలు, మర్యాదలు, లాంఛనాలు కావాలంటున్నాం అధికంగా. వాటి కొరకు అలకలు, తగాదాలు, వేధింపులు చూస్తున్నాం ఎక్కువగా. ఎందుకీ మంత్రాలు ? ఏమిటి వీటి అర్ధాలు ? అని తెలుసు కుందామనే కోరిక ఉంది తక్కువగా. ప్రయత్నం, కృషి జరగటల్లేదు బొత్తిగా. అందుకే మన ఆవేదన ఇంతగా.

వివాహ మహోత్సవ ఆహ్వానం అని అందరికీ పంపుతాం. కానీ వివాహం ఉత్సవం కాదు. అది మానవుని వికాసానికి ఏర్పరచిన షోడశ సంస్కారాలలో ప్రధాన మైనదని మనకు తెలియదు.సాన పెట్టుట వలన వజ్రం ప్రకాశించి నట్లు సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహం లోని మంత్రాల అర్థం పరమార్థం తెలియక, ఏదో విధంగా త్వరగా పూర్తి చేయండని పురోహితుని తొందర పెడుతూ ఉంటాం. దాని వల్ల మనమే నష్ట పోతామని గ్రహించం. ఫోటోలు, వీడియోలు, విందులకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమైన సంస్కారాన్ని విడిచిపెడుతున్నాం. ఫలితం బాగా లేదని బాధపదుతున్నాం.

మన ప్రాచీనమైన ఆచారాలలోని అంతరార్థాన్ని తెలియజెప్పి, అధునాతన శాస్త్ర విజ్ఞానంతో సమన్వయించి, వాటిని సరియైన పద్ధతిలో చక్కగా ఆచరింప జేయాలనే మా తపన.

వివాహ శబ్దార్ధం

శ్లో|| ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన|
వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||

శ్రీమద్రామాయణంలో జనక మహారాజు అంటారు. ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ చారిణిగా ఈమెను అర్పించుచున్నాను. ఈమె చేతిని పట్టుకొని ఈమెను స్వీకరింపుము. నీకు శుభమగు గాక!

పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |
ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||

పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితము. ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ దంపతులకు నమస్కారములు.

వివాహ శబ్దార్ధం:

సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే ఉపసర్గను 'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ = వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష ప్రావణం అనగా విశేషమైన (ప్రత్యేకమైన) సమర్పణం. ఈ పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, దారకర్మ, దారక్రియ మొదలైనవి.

వివాహ భేదములు:

మనువు వివాహ పద్ధతులను 8గా విభజించాడు.

బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||

1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం, 5. అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం అని వివాహాలు ఎనిమిది రకాలు.

1. బ్రాహ్మం: అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే బ్రాహ్మ వివాహమౌతుంది. (ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం)

2. దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి - దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహమౌతుంది.

3. ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకొని కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది ఋషులలో ఎక్కువగా వుండేది గనుక ఆర్షం అయింది.

4. ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం ప్రాజాపత్యం అవుతుంది. (సీతారాములు)

5. అసురం: వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ దశరథులు)

6. గాంధర్వం: పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా) చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: శకుంతలా దుష్యంతులు)

7. రాక్షసం: యుద్ధం చేసి, కన్యను అపహరించి, ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకొనే వివాహం రాక్షసం అంటారు. (ఉదా: మండోదరి రావణులు)

8. పైశాచం: కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకున్నది పైశాచం. వీటిలో బ్రాహ్మం శ్రేష్ఠం, ప్రాజాపత్యం ధర్మబద్ధం, రాక్షసం, పైశాచం నిషిద్దం.

వివాహమెందుకు?:

ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.

1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.

ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.

1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.

2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.


3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు.

No comments:

Post a Comment