ఒక ఊరి చివర విశాలమైన ప్రాంగణములో ఇల్లు వుండేది. ఆ ఇంటి యజమానికి
కోళ్ళను పెంచడం చాలా ఇష్టం. ఎప్పుడూ గుడ్లు పెట్టే కోళ్ళు, చిన్న
పిల్లలను పొదిగిన కోళ్ళు ఉండేవి. యజమాని కుమారుడు చాలా అల్లరివాడు. ఆ
అబ్బాయి ఒక రోజు ఆడుకోవడానికి దగ్గరలో ఉన్న కొండల్లోకి వెళ్ళాడు. అక్కడ ఆ
అబ్బాయికి గ్రద్ద గుడ్లు ఉన్న గూడు కనిపించింది. అక్కడ గ్రద్ద ఉందేమోనని
చుట్టు ప్రక్కల చూశాడు. కాని ఎక్కడా కనిపించక పోవడముతో ధైర్యంగా గూట్లో
నుంచి ఒక గ్రుడ్డు తీసుకున్నాడు. అది పగిలి పోకుండా జాగ్రత్తగా చిన్న
సంచిలో దాచి పెట్టి దానిని ఇంటికి వెళ్లి కోడి గుడ్ల మధ్యలో ఉంచాడు. కోడి
తన గుడ్లతో పాటు ఆ గుడ్డును కూడా పొదిగింది. కోడి గుడ్లు కోడి
పిల్లలయ్యాయి. వీటితో పాటు గ్రద్ద గుడ్డు కూడా పిల్ల అయింది. కోడి
పిల్లలతో గ్రద్ద పిల్ల కూడా కలిసి తిరుగుతూ వుండేది. తానూ కోడిపిల్లను
కాను, గ్రద్ద పిల్లననే సంగతి దానికి తెలియదు. కోడి పిల్లలు ఏది చేస్తే
అది కూడా అలాగే చేసేది.
గాలిలో ఎగురుతున్న పక్షులను చూసి "నేను వాటిలాగా ఎగరగలిగితే ఎంత
బావుంటుందో. నేను కోడి పిల్లను కాబట్టి వాటిలాగా గాలిలో ఎగరలేను"
అనుకునేది. ఒక రోజు పైన ఎగురుతున్న ఒక గ్రద్ద, కోడి పిల్లలతో పాటు
తిరుగుతున్న గ్రద్ద పిల్లను చూసింది. అది తమ జాతికి చెందినదని
గుర్తించింది. వెంటనే గ్రద్ద పిల్ల దగ్గరకు వెళ్లి వాలింది. గ్రద్దను
చూసి భయపడి కోడి పిల్లలన్నీ పారిపోయాయి. గ్రద్ద పిల్ల కూడా పారిపోతుంటే
పట్టుకుని ఆపింది. గ్రద్ద పిల్ల భయంతో కళ్ళు మూసుకుంది.
అప్పుడు ఆ గ్రద్ద " భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు కోడి పిల్లవు
కాదు. వాటితో ఎందుకు తిరుగుతున్నవో తెలుసుకోవాలని వచ్చాను," అన్నది.
గ్రద్ద పిల్ల ఆశ్చర్య పోయింది. పిల్లకి దాని మాటలు నమ్మబుద్ది కాలేదు.
"నువ్వు అబద్ధం చెబుతున్నావు. నన్ను ఎత్తుకు పోవటానికే వచ్చావు" అంది.
"నేను నిన్ను ఎత్తుకు పోవటానికి వచ్చి వుంటే ఇంత సేపు నీతో మాట్లాడే
దాన్ని కాదు. వెంటనే ఎత్తుకేల్లిపోయే దాన్ని. నువ్వు ఎవరో, నీ శక్తి
ఏమిటో తెలియ చెప్పటానికే వచ్చాను " అని చెప్పింది.
"నేను గ్రద్ద పిల్లనైతే ఇతర పక్షుల మాదిరిగా గాలిలో ఎగిరే దాన్ని కదా"
అని ప్రశ్నించింది. ఇదంతా గమనిస్తున్న కోడి "నువ్వు కూడా వాటిలాగే
ఎగరగలవు. కనీ నువ్వు కోడిపిల్లవనే భావముతో ఉండటం వలన ఎగిరే ప్రయత్నం
ఎప్పుడూ చేసి ఉండవు" అని చెప్పింది.
"అయితే నేను ఎగరగలనా?" అని ఉత్సాహంగా గ్రద్ద పిల్ల అడిగింది. "అవును.
ఎగరగలవు. ఎలా ఎగరాలో నేర్పుతాను" అన్నది గ్రద్ద. పిల్లకు నెమ్మది నెమ్మది
గా ఎగరటం నేర్పింది. దానితో గ్రద్ద పిల్ల కూడా గాలిలో ఎగరడం
మొదలుపెట్టింది. తన కోరిక నెరవేరినందుకు గ్రద్ద పిల్ల చాలా సంతోషించింది.
తనకు ఎగిరే శక్తి ఉందని తెలియ చెప్పినందుకు గ్రద్దకు కృతజ్ఞతలు
తెలిపింది. గ్రద్ద పిల్లకు, కోడిపిల్లల స్వభావము పోయి గ్రద్దల సహజ
స్వభావము వచ్చేసింది.
ఓ నరుడా...
మన జీవితమును ఒక సారి పరిశీలిస్తే, మన పుట్టుక కూడా ఆ గ్రద్ద
పిల్ల లాంటిదే. ఏలనగా జన్మ జన్మల ఋణానుబంధము వలన మనము మన తల్లి తండ్రులకు
జన్మిస్తాము. తల్లి గర్భములో ఉన్నప్పుడు జీవుడు నానా యాతన పడుచు మల్లీ
జన్మనేది లేకుండా చేయి ఓ బ్రహ్మ దేవా! అని మొర పెట్టుకుంటాడు మోక్షమును
ప్రసాదించు అని వేడుకుంటాడు. ఒక సారి భూమి మీద పడగానే మాయా మోహాలకు భంది
అయిపోతాడు.
No comments:
Post a Comment