Thursday, September 12, 2013

వినాయకచవితి పర్వదినం గురించి

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టి తోడి ముఖంగలవాడూ అయినవానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదం తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాదనం

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతన పూజా విధానంలో వినాయకుని పూజ కూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు) .

మనం మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభంలాంటి దేహం, బాన కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.

భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉంది కానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.

వినాయక పూజలో ఉన్న విశిష్టతల విశేషాలు. ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి అంటే 21 రకాలు. వీటి వివరాలు - అవి ఆరోగ్యానికి ఉపయోగపడే విధానం:

1.బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది

2.మాచి పత్రం (ధవనం):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.

3.బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.

4.దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.

5.దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.

6.బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.

7.తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.

8.అపామార్గ పత్రం(ఉత్తరేణి): -దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.

9.చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.

10.జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.

11.గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.

12.అశ్వత పత్రం(రావి ఆకు):-చాల ఓషధగుణాలు ఉన్నాయి.

13.అర్జున పత్రం(మద్ది ఆకు):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.

14.అర్క పత్రం(జిల్లేడు ఆకు) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.

15.విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు ఆకు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.

16.దాడిమ పత్రం(దానిమ్మ ఆకు):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.

17.దేవదారు(దేవదారు ఆకు):-శరీర వేడిని తగ్గిస్తుంది.

18.మరువాకం(మరువం ఆకు):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

19.సింధువార పత్రం(వావిలాకు):-కీల్లనోప్పులకు మంచి మందు.

20.శమీ పత్రం(జామ్మీ చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

21.కరవీర పత్రం(గన్నేరు ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.

పాలవెల్లి :

వాస్తవానికి పాలవెల్లి అంటే పాలపుంత అని అర్థం. దీనిని ఇంగ్లీషులో 'ది మిల్కీ వే' అంటారు. ఇది ఖగోళశాస్త్రానికి సంబంధించిన పదం. అంటే మన భూమి, సూర్యడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, తోక చుక్కలు, అస్టరాయిళ్లు ఇలా మన సౌరకుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంది . ఈ పాలవెల్లిలో మన సౌరకుంటుంబంలాంటివి మిక్కిలి సంఖ్యలో వుంటాయి.

వినాయక చవితి రోజున ఈ పాలవెల్లిని ప్రతిబింబింపజేస్తూ వినాయకుని విగ్రహం పైన వెదురు దబ్బలతో పందిరిలాంటిది వేలాడదీస్తారు.

వినాయకుని పాలవెల్లి తయారు:

ఇది దీర్ఘచతురస్రాకార చట్రం. పాలవెల్లిలోని నక్షత్రాలను ప్రతిబింబిచేలా రకరకాల పూలతో ఈ చట్రాన్ని అలంకరిస్తారు. బ్రహ్మాండ రూపుడైన ఆ సర్వేశ్వరుని తనయునికి సువిశాల పాలవెల్లిని పందిరిగా వేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకే ఈ పాలవెల్లి తయారీకి విశిష్టత మారింది. పాలవెల్లి లేకూండా వినాయకుని పూజ సరికాదన్నది పెద్దల మాట. దీనిని చాలా సులభంగా చేసుకోవచ్చు.

కావాల్సిన పరికరాలు :

వెదురు దబ్బలు. పసుపు. మావిడాకులు. వివిధ రకాల పూలు, గరక, మొక్కజొన్న కంకులు, చెరకు కుచ్చులు.

తయారు చేసే విధానం :

ముందుగా వెదురు దబ్బలను చాలా దళసరిగా దబ్బలు..దబ్బలుగా చీల్చాలి. వీటికి పసుపు రాయాలి. చతురస్రాకారంలో వీలైతే వృత్తం లేదా దీర్ఘవృత్తాకారంలో ఈ దబ్బలను వేకులుతో కొట్టి ఛట్రాన్ని తయారు చేయాలి. ఈ చట్రానికి నలుమూలాల ధృడమైన దారాన్ని కట్టి, దానిని వినాయకుని బొమ్మకు మనకు అందుబాటులో ఉన్నంత ఎత్తులో వేలాడదీస్తూ, దారాన్ని అధారంగా కట్టాలి. ఛట్రానికి నలుదిశలా మావిడాకుల తోరణాలు కట్టాలి. మూలల్లో మొక్కజొన్న కంకులు, చెరుకు కుచ్చులు (కొస భాగం) వేలాడదీయాలి. మధ్యలో ప్రత్యేకంగా కలువ పువ్వు, రకరకాల పూలను అలంకరించాలి. అంతే పాలవెల్లి సిద్ధం.

నిమజ్జనం చేసే విధానం

దసరా పండుగలా వినాయకచవితికి కూడా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత దేవాతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. నిమజ్జనాన్ని పండుగ రోజుగానీ, లేదా 3, 5, 7, 9వ రోజు గానీ నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య విన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్ధ ప్రసాదాలను అందరూ తిని, ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. గణనాధుడిని నీటిలోకి విడిచే ముందు "శ్రీ గణేశం ఉద్వాసయామి.....శోభనార్ధం పునరాగమనాయచ"అని పఠించడం సంప్రదాయం.

గణేష నిమజ్జనం అత్యంత భక్తితో కూడుకున్నదైనా, భక్తులు ప్లాస్టర్-ఆఫ్-పారిస్ వాడడం వలన నీటి నవరులకు యెంతో కాలుష్యం. దీని వలన నీటి ఆమ్లగుణం పెరిగి, నీరు కలుషితమై, జలచరాలకే ప్రాణాంతకం కాకుండా, వాటిని వాడిన మనిషికి కూడా యెంతో కీడు. పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ భక్తునిపైనా ఉంది. ప్రభుత్వ - ప్రభుత్వేతర సంస్థలు అనేకం దీని కోసం ఈ సూచనలను ఇస్తున్నాయి:

మన అమ్మానాన్నలు వాడినట్లు మట్టితో చేసి, పెయింట్ లేని గణపయ్య మూర్తులను పూజకు వాడడం

ఇంట్లోనే ఒక బకెట్టు నీటిలో నిమజ్జనం చేసి, ఆ నీటిని పచ్చటి మొక్కలకు పొయ్యడం

రాతితోనో లేక రాగితోనో చేసిన గణపయ్య మూర్తిని ప్రతీ సంవత్సరం వాడి, దానికి నిమజ్జన క్రియను చేయడం - పర్యావరణం కోసం భగవంతుడు మాత్రం మనసులో ఉన్న భక్తిని అర్ధం చేసుకోడా?

ప్లాస్టర్-ఆఫ్-పారిస్ మూర్తుల వాడకం తగ్గించడం.

ప్లాస్టర్-ఆఫ్-పారిస్ మూర్తులను సరసులు, నదులు, సముద్రాలలో నిమజ్జనానికి నిషేధించడం.

ఎకో- గణపతి

ఈ సంవత్సరం, అంతటా ఎకో- గణపతి ప్రచారం ఊపందుకుంటోంది. పర్యావరణం కాలుష్య బారినపడకుండా మట్టితో రూపొందించే విగ్రహాలను ఉపయోగించాలంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారు. కెమికల్ పదార్థాలతో తయారైన విగ్రహాలను వినియోగించొద్దంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయడంతోపాటు విగ్రహాల తయారీకి శిక్షణనిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా జరిగే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతికి నష్టం కలిగించే పదార్థాలతో కాకుండా మట్టితో తయారు చేసే విగ్రహాలను వినియోగించేందుకు ముందుకొస్తున్నారు. కెమికల్ పదార్థాలతో తయారైన విగ్రహాలు ఉపయోగించడం వల్ల జరిగే నష్టంపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రకృతికి నష్టం వాటిల్లకుండా వినాయక చవితిని నిర్వహించేందుకు పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. మట్టితోనే కాకుండా కూరగాయలు, ఆకులు, కాగితాలతోనూ వినాయకుని ప్రతిమలు రూపొందించారు. మరోవైపు విద్యార్థులతోపాటు మహిళలు కూడా మట్టి వినాయకుడిని రూపొందించేందుకు శిక్షణతీసుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. దీనికోసం అందరం కలిసికట్టుగా పోరాడి మట్టి విగ్రహాలను వినియోగిద్దామన్నదే వీరి తపన.

ఈ మంచి పనికి సంపుటి "అవిఘ్నమస్తు" అని జైకారం కడుతోంది.

No comments:

Post a Comment