Sunday, June 17, 2012

వరాహావతారం Dec27


భూభారాన్ని తగ్గించడానికీ,  దుష్టులైన దానవులను నశింపచేయడాంకి విష్ణువు ఎన్నో రూపాలను ధరిస్తాడని మత్స్యపురాణం (247-28), దేవీ భాగవతం (8-2-21)  మొదలైనవి ప్రకటించాయి. ఈ రెండు లక్ష్యాలను నెరవేరుస్తూ, జగత్సంస్థాపన కోసం దశావతారాల్లో మూడోదైన వరాహావతారాన్ని విష్ణువు ధరించాడని అన్ని పురాణాలు వివరించాయి.

బ్రహ్మ కుమారుడు స్వాయంభువు  మనువు. తాను చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించమని తండ్రిని మనువు అడుగుతాడు. తలిదండ్రులను చక్కగా సేవించడం, ప్రజాపాలనను ధర్మబద్ధంగా నిర్వర్తించడం గురించి బ్రహ్మ ఉపదేశించాడు – భాగవతం (3-13-10,11)  (ఇవి నేటి కాలానికి కూడా ఎంతో అవసరమైన సూచనలు) తండ్రి ఆజ్ఞలను తప్పక నెరవేరుస్తానని మనువు మాట ఇస్తూ, సర్వప్రాణులకి నివాసస్థానమైన భూమి నీటిలో మునిగి ఉన్నందున, దాన్ని పైకి తెమ్మని తండ్రిని ప్రార్థిస్తాడు.  ఏం చేయాలా అని బ్రహ్మ ఆలోచిస్తుండగానే, అకస్మాత్తుగా ఆయన ముక్కునుంచి ఒక వరాహ శిశువు బయటపడింది. ఆశ్చర్యపోతూ చూస్తుండగానే, ఆ బొటనవేలంత శిశువు ఏనుగంత పెరిగి, పర్వతమంతై గర్జిస్తోంది! ఆ వరాహాన్ని విష్ణుమూర్తిగా దేవతలు గుర్తించి, స్తుతించారు.  వరాహం గర్జిస్తూ సముద్రజలంలో ప్రవేశించి పశువులాగ వాసన ద్వారా పృథివిని అన్వేషించింది. పాతాళంలో కనిపించిన ధరణి వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు  అనే దైత్యరాజు ఆటంకపరచి, పోరాడాడు. అతణ్ణి వరాహమూర్తి సముద్రంలోనే సంహరించి, వసుంధరను నీటిపైకి తెచ్చి లోకహితం కోసం ఉద్ధరించాడని భాగవతం (3-13-33,34) చెబుతోంది. సముద్రంలోని జనులచే అసురులను మర్దించాడు కనుక జనార్ధుడనే పేరు వచ్చింది.

విష్ణువు వరాహ రూపాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? బ్రహ్మవరం చేత, తిర్యక్ (వంగి ఉన్న) రూపం గలవాడే హిరణ్యాక్షుణ్ణి వధించగలడని (సృవరాహో … తిర్యగ్రూపేణ చైవాహం ఘాత) ,వరాహావతరం ఐశ్వర్యానికి స్థానం కనుక తన కోర చివరగల ఐశ్వర్య బలంచే భూమిని ఉద్ధరించాడనీ విష్ణు ధర్మోత్తరపురాణం ( 53,74,79-1) చెబుతోంది. ‘ హిరణ్యం ‘ అంటే బంగారం; ‘ అక్షి ‘ అంటే కన్ను. హిరణ్యాక్షుడంటే   సంపదపై కన్ను వెసిన వాడనీ, ఎంత సంపాదించినా తృప్తిలేని మమకార స్వరూపుడనీ భావం. అందుకే అతడు భూమిని (సమస్త సంపదలతో సహా) చాపగా చుట్టి, ఎక్కడో పాతాళ లోకంలో దాచాడు.  ఇలాంటి లోభగుణాన్ని త్యాగమే జయించగలదని శాస్త్రాలు చెబుతున్నాయి. త్యాగం యజ్ఞ స్వరూపం కనుక యజ్ఞ స్వరూపుడైన వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి ఆటబొమ్మలాగ వధించాడు. ఇతరుల భూములను అన్యాయంగా అనుభవించే నేటి భూకబ్జాదారులందరూ నాటి హిరణ్యాక్షుని వారసులే! వారు ఎక్కడ దాక్కున్నా అదే అధోగతి పడుతుందనేది సందేశం. ‘ వర ‘ అంటే ఉత్కృష్టమైన, ‘ అహం ‘ అంటే నేను లేదా ఆత్మ అని వేదాంత పరిభాషలోని అర్థం. కనుక వరాహం  అంటే శ్రేష్ఠమైన ఆత్మ. సింహాచలం, తిరుమలలోని వరాహస్వామి ఆలయాలు సుప్రసిద్ధమైనవి. మహాబలిపురం, ఖజురహో మొదలైన ఇతర ప్రదేశాల్లో కూడా ఈస్వామి ఆలయాలు ప్రఖ్యాతి చెందాయి.
కేశవ! ధృత సూకరరూప! జయజగదీశహరే!

No comments:

Post a Comment