Sunday, June 17, 2012

పరశురామావతారం


లోకంలో ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు నారాయణుడు ఆవిర్భవించిన దశావతారాల్లో  ఆరోది పరశురామావతారం. భూభారాన్ని హరించి, క్షత్రియుల గర్వాన్ని అణచి, శాంతిని నెలకొల్పడానికి సాక్షాత్ విష్ణువే సూర్యతేజస్సుతో మనుష్య రూపంలో పరశురాముడుగా అవతరించాడని ( రామో విష్ణుర్మానుష రూప ధృక్ ) విష్ణుధర్మోత్తర పురాణం (35-22), అగ్నిపురాణం (4-12) భాగవతం (9-16-27) వివరించాయి. బ్రాహ్మణుడైన జమదగ్నికి, క్షత్రియవంశానికి చెందిన రేణుకకు పుత్రుడుగా వైశాఖ శుక్ల తదియనాడు పరశురాముడు పుట్టాడు. భృగువంశంలో పుట్టడంవల్ల భార్గవరాముడని ఖ్యాతిపొందాడు. హిమాలయాలపై పరశురాముడు చేసిన తపస్సుకు శివుడు సంతసించి, అతనికి ఒక గండ్రగొడ్డలిని అనుగ్రహించాడు.  భారతం (శాం.ప. 49-33). శత్రువులను హింసించే ఈ గండ్రగొడ్డలిని ‘పరశు:’ (పరాన్ శ్రుణాతీతి పరశు:) అంటారు. కనుక అంతవరకు అతనికున్న రాముడనే పేరు పరశురాముడిగా మారి సార్థకమైంది.

కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని వద్ద ఉన్న కామధేనువును బలాత్కారంగా అపహరించాడు. దాన్ని విడిపించడానికి పరశురాముడు తన గొడ్డలితో కార్తవీర్యుడిని వేయి భుజాలను విరగగొట్టి, మస్తకాన్ని ఖండించి, ధేనువును తిరిగి తన తండ్రివద్ద చేర్చాడు. కార్తవీర్యుని కుమారులు ఆగ్రహించి, జమద్గని వధించారు. ఈ విషయం తెలిసిన పరశురాముడు తీవ్రశోకం చెంది, భూమిపై క్షత్రియులు లేకుండేట్లుగా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు – భారతం, (శాం.ప 49-52)  తండ్రి శవంపై పడి తల్లి 21 సార్లు గుండెలు బాదుకోవడం పరశురాముడు చూశాడు. అందుకే అతడు కార్తవీర్య కుమారుల్ని వధించడం తోపాటు – భూమిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ రహితంగా చేసి, చివరకు ఆ భూమిని కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడని (త్రి:  సప్తకృత్వ: పృథి వీం ని: క్షత్రా మకరోద్విభు:) అగ్నిపురాణం (4-19), భారతం (శాం.ప. 49-64), భాగ. (9-16-19 26, 27) వివరించాయి.

మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని (పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు. ఒకసారి రేణుక నదీజలాన్ని తేవడానికి వెళ్ళింది. అక్కడ అప్సరసలతో క్రీడించే గంధర్వరాజును చూసి, వానిపై రేణుకకు కొంచెం స్పృహ కలిగింది. ఆలస్యంగా వచ్చిన ఆమె మనసును జమదగ్ని గ్రహించి, ఆగ్రహించి, ఆమెను వధించమని తమ కుమారులను ఆజ్ఞాపించాడు.  అన్నలెవరూ తల్లిని వధించలేదు కనుక పరశురాముణ్ణీ వరం కోరుకోమ్మంటే – తల్లి, అన్నలపై ఎలాంటి ద్వేషం లేనందువల్ల వారిని తిరిగి బతికించమన్నాడు!  అందుకే వారు మళ్ళీ బతికారు – భాగ. (9-16-8)

పరశురాముడు అవతారపురుషుడైనా అతణ్ణి ఓడించిన సందర్భం ఒకటుంది. శివధనస్సు  విరిచి, వివాహితుడై సీతాదేవితో వచ్చే దశరథరాముణ్ణి ఎదిరించి పరశురాముడు భంగపడ్డాదు – రామాయణం (బా.కాం.76-21, 22). ఇందుకు కారణం లేకపోలేదు.  ‘పరశురామా! దశరథరాముడి సందర్శనం అయ్యాక, నీవు శస్త్రం పట్టవద్దు. ఎందుకంటే నీ వైష్ణవ తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అది సురకార్యం నిర్వహిస్తుంది. నీలో వైష్ణవ తేజస్సు ఉన్నంతకాలమే నీవు శత్రుగణాలను చెండాడగలవు (తవ తేజోహి వైష్ణవం రామం ప్రవేక్ష్యతి) అని శంకరుడు పరశురాముణ్ణి లోగడ హెచ్చరించడమే దీనికి కారణం – వి.ధ.పు (66-13,14). ఒక విష్ణు అవతారం మరో విష్ణు అవతారాని ఓడించిన సదర్భం ఇదొక్కటే!

No comments:

Post a Comment