Saturday, June 16, 2012

దేవాలయ ప్రాశస్త్యం


దేహం దేవాలయం వంటిది. అందులో ప్రతిష్ఠమైన సనాతనుడైన జీవత్మాయే పరమాత్మా. విశ్వవ్యాప్తంగా వెలసియున్న దేవాలయాలన్నీ  మానవ కల్యాణానికై ఏర్పాటు చేయబడినవే. అవి జాతి మాత కులభేదాలకు అతీతంగా నిర్మించబడ్డాయి. అది దేవాలయం, చర్చి, మసీదు, జైన మందిరం, మఠం మరేదైనా కావచ్చు. వాటి లక్ష్యం ఒక్కటే. మానవ మస్తిష్కంలోని దుష్టబుద్ధిని  తొలగించి మానవత్వాన్ని పెంపొందిచడమే.

మానవుడంటే శారీరిక, మానసిక మహాశక్తులుగల వాడని నేటి శాస్త్ర విజ్ఞానం చెబుతోంది. కాని, తత్త్వం విచారిస్తూ చెప్పుకోవలసిన విషయం మరొక్కటుంది. దేవుడు సత్యం, శాంతం, దయ, జ్ఞానం, తృప్తి, త్యాగం మున్నగు మహానీయ గుణాలు గలవాడని అర్థం. వీటిని కలిగియున్న వాడే మహాత్ముడు. అట్టి సద్గుణ సంపత్తిని కలిగి ఉన్న కారణానే శ్రీషిరిడి సాయిబాబా, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీవివేకానంద మున్నగువారు మహాత్ములై భగవత్ గుణాలను కలిగి మానవులను ఆదర్శప్రాయులైయ్యారు.

పైన పేర్కొన్న గుణాలన్నీ మానవులలో కొరవడిన కారణం వల్లనే మానవులు దానవులై మారణహోమాన్ని సృస్తిస్తూ, మహోపద్రవకారకులుగా నేడు ప్రపంచాన్ని కుదిపెస్తున్నారు. పుట్టుక చేత మానవుడు మంచివాడే. పెరుగుదలలో క్రమంగా పరార్థాన్నివీడి స్వార్థాన్ని పెంచుకొని, సత్య, దయాశౌచాలకు తిలోదకాలిచ్చి, సాటి మానవులతో సహకరించిక నికృష్ట జీవితాన్ని గడుపుతున్నాడు. ఈవిధమైన మానవత్వ లేమి చేత ప్రపంచమంతా నేడు అశాంతికి గురౌతోంది.

దేవాలయాలు శాంతికి నిలయాలు కావాలి. అక్కడి ప్రశాంత వాతావరణం, ధర్మబోధ, మానవ మహోన్నతికి బీజం వేయాలి. వ్యక్తుల దురాలోచనలు వారి నుండి దూరం కావాలి. అవగుణాలను గురించి ఆలోచింపజేసి వాటి నిర్మూలనకు కృషి చేసేటట్లు చూడాలి. ఇట్టి ఆదర్శాలను చిత్తశుద్దితో దేవాలయాలు నిర్వహించగలిగినపుడు వాటి మనుగడ మహోన్నతమై ఉంటుంది. లేనినాడు వాటి ఉనికి నామమాత్రంగా మిగిలిపోతుంది.

నేటి దేవాలయాలు నిర్వాహణలో ఈ ప్రయత్నం ఏ మాత్రం సాగుతున్నదన్న విషయాన్ని ప్రతి దేవాలయ నిర్వాహకులు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరమెంతైనా వుంది.

దైవారాధనపూజ మానసికమైనదిగా మరియు ఆధ్యాత్మికమైనదిగా ఉంటోంది. వీటిని ఆర్భాటంగా నిర్వహించనక్కరలేదు. ఎవరో మనల్ని మెచ్చుకోవలేననిగాని, ఏంటో గొప్పగా నిర్వహింపబడిందని పేరు తెచ్చుకోవడానికి గాని చేయరాదు. అటువంటివి ప్రయోజన శూన్యాలు. భగవంతుడు అటువంటి డాంబిక, ఆరాధనా పూజాకార్యక్రమాలను ఆశీర్వదించడు అనడానికి తార్కాణమైనాకథా వృత్తాంతం గురువాయురులో జరిగిన కథ.

కేరళరాష్ట్రంలో నేటికీ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ పుణ్యక్షేత్రం గురువాయూరు. అక్కడ వాసుదేవుడను శ్రీకృష్ణ భక్తుడు గలడు. నిరంతరం శ్రీకృష్ణుని సేవిస్తూ పూజా పురస్కారాలను మిక్కిలి ఆటోపంగా నిర్వహిస్తూ శ్రీకృష్ణుని సందర్శనానికి కాంక్షించుతున్నాడు.

ఒకరోజున భగవంతుని ప్రార్థిస్తూ తన కోర్కెను మన్నించి దివ్యసందర్శన భాగ్యాన్ని కలుగాజేయుమని వేడుకొని నిద్రించాడు. పరమాత్మ వాసుదేవుని భక్తిని పరీక్షించి కరుణింపదలచాడు. అతనికి స్వప్నంలో నేను నిన్నుఅనుగ్రహించడానికి రేపు మధ్యాహ్నం రానున్నాను అనే మాటలు వినిపించాయి.భక్తుని హృదయం ఉప్పొంగిపోయింది. అతనికి నిద్రపట్టలేదు. ఎలాగో రాత్రి గడిచింది. ఉదయాన్నేలేచి శుచియై శ్రీకృష్ణ విగ్రహాన్ని సుగంధ ద్రవ్యాన్ని కలిపినా స్వచ్చమైన జలంతో అభిషేకించాడు. పట్టుపీతాంబరాలను కట్టబెట్టాడు. పరిమళాన్ని వెదజల్లు పుష్పాలతో అలంకరించాడు. మిక్కిలి కాంతివంతమగు దీపాలను వెలిగించాడు. అగరువత్తులను వెలిగించి ధూపం వేశాడు. చందన, కర్పూర సువాసనలను గుబాళింపచేశాడు. షడ్రుచులతో కూడిన ఆహారపదార్థాలను పంచభక్ష్య పరమాన్నాలను సిద్ధపరిచాడు.

మేళతాళాల రణగోణధ్వనులు ఉత్సవస్ఫూర్తినిస్తున్నాయి. పూజా పురస్కారాలను మిక్కిలి ఆడంబరంగా నిర్వహించాడు. కార్యక్రమమంతా పూర్తియైనది. ఇక భగవంతుని రాక నైవేద్య సమర్పణ మిగిలి ఉంది. శ్రీస్వామివారు చెప్పిన సమయమాసన్నమైనది. భక్తునిలో ఉత్కంట పెరిగింది. చుట్టూ చేరిన జనసందోహం మిక్కిలి ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

ఇంతలో అచ్చటికి ఒక వృద్ధుడు కర్రచేతపట్టుకొని, నడుంవంగిపోయి పొట్ట వెన్నమొక అంటుకొనియుండగా, కాళ్ళు తడబడుచుండగా, ఆకలితో ఆర్తనాదం చేయుచూ మెల్లగా నడిచి వచ్చి భిక్షాన్నమడిగాడు. తానూ ఎదురుచూచుచున్న శ్రీకృష్ణుడు రాకపోగా, ఈ ముదుసలి వచ్చి శ్రీక్రుష్ణునికై ఏర్పాటు చేయబడిన నైవేద్యాన్ని ఆహారంగా అడిగి వాతావరణాన్ని భంగపరిచాడని వాసుదేవ భక్తునికి అసహనమేర్పడింది. కోపంతో మంచి చెడ్డలాలోచించక శ్రీకృష్ణవిగ్రహం వద్ద నున్న దండాన్ని తీసికొని వృద్ధునిపై విసిరాడు. ఆ దండమతనికి నడుంకి గట్టిగా తగులటం వలన నడుం విరిగి కుప్పకూలిపోయాడు. జనసందోహం తన చుట్టుముట్టినంతలో అతడంతర్హిడయ్యారు. జరిగిన అపరాధానికి మిక్కిలి చింతిస్తూ వాసుదేవుడు శ్రీకృష్ణుని విగ్రహంచెంత తలవాల్చాడు. విగ్రహం నడుం కూడా విరిగి క్రింద బదియున్నది. ఎంత వింత దృశ్యం? ఆ దృశ్యం నుండి వినిపించిన పల్కులివి, “వాసుదేవా! ఎంతోకాలంనుండి నారాకకై ఎదురుచూస్తున్నావు. నేను రాగానే నిర్దయుడవై కర్ర విసిరి నాకు దూరమైతివి. దైవం మానవరూపం అన్న విషయం నీకు తెలియదా! అందరియందున్నభగవదాత్మ ఒక్కటేయని నేను భగవద్గీతలో ప్రవచించలేదా? విగ్రహారాధనకు ప్రాధాన్యమిచ్చి ప్రాణమున్న మనుష్యుని హింసించావు. దయగల హృదయమే భాగవన్నిలయం. ఇకమీదట మానవత్వ లక్షణాలను పెంపొందించుకొని దైవత్వంను పొందుమని ఆశీర్వదించాడు. వాసుదేవుడు తన తప్పిదాన్ని తెలుసుకొని మానవ సేవలో తన శేషజీవితాన్ని గడిపి శ్రీకృష్ణ సాయున్యమును పొందాడు. ఈ కథను తెలుసుకొన్న తరువాత ఆరాధనా పూజాకార్యక్రమాలు మానసికమై ఉంది సాటి మానవులపై కరుణాదృష్తి కల్గియుండవలెనని తెలుస్తోంది గదా!

దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం ఉంటుంది. భగవంతునిసేవలో కొంత సేదదీరుతాము. తాము చేస్తున్న పనులు సరియైనవా, కావా అని ఆత్మవిమర్శ చేసుకునే వీలవుతుంది. భగవదారాధన చేస్తూ అసత్య దోషాలను అసంబద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి మనసులో జంకుకల్గుతుంది. సాతివారితో మీలాగే తీరు చాల సవ్యంగా ఉంటుంది. తన కష్టాలను భగవంతునికి విన్నవించుకొని భక్తిభావమును పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కారణాల వలన ఉదాత్తమైన వ్యక్తిత్వము పెంపొందుతుంది.

భగవదారాధకులకు కష్టాలు రావా? వారంతా సుఖంగా ఉనారా? వీటికి సమాధానం బాహుళ్యమైనది. త్యాగయ్య, పోతన్న, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి, నందనారు, కబీరు మున్నగు వారంతా గొప్ప భక్తులు. వారు సైతం అనేక కష్టాలకు గురైయ్యారు. అయినప్పటికీ వారికి వచ్చిన ప్రమాదం లేదు. వారు భగవంతుని సేవలో కృతకృత్యులై అవ్యాజానందాన్ని పొంది మోక్షప్రాప్తిని పొందారు. కొన్ని సందర్భాలలో కష్టాలు వారి వారి సమార్త్యాలను, సాధారణంగా పురాకృత కర్మల వలన వస్తుంటాయి. సామర్థాన్ని పెంచుకొని సత్కర్మలను ఆచరించటం వలన కష్టాలను ఎదుర్కోడానికి శక్తి, నివారణానికిమార్గాలు లభిస్తాయి. భగవంతుని నమ్ముకుని సేవించువాడు తనకు ఎదురయ్యే ఆతుపోట్లును తట్టుకొని దైన్యాన్ని వీడి, ధైర్యమును తెచ్చుకొని, భగవదారాదనలో శాంతిని పొంది స్థిత ప్రజ్ఞుడవుతాడు.

ధరఖర్వాతుడోకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుడై

త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమచ్చాయత

చ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా

బోరిదైవోపహతుండు పోవుకడకున్ పోవుంగదా యాపదాల్.

“బట్టతలవాడొకడు ఎండ వేడిమికి తట్టుకొనలేక ఏ చెట్టూ లేని కారణాన, తాటిచెట్టు కన్పించగా, పరుగు పరుగున వెళ్ళి దాని క్రింద నీడకై నిలుచున్నాడు. అదే సమయంలో ఆ తాటిచెట్టు నుండి తాటిపండు అతని తలపై పడటం వలన తల పగిలింది. దైవానుగ్రహం లేని వానికే అలా ఆపదలు సంభవిస్తున్నాయి”  అని అన్నారు.

దీనినిబట్టి దైవోపహతుడెట్టి కార్యం చేయబోయినా ఫలించక ప్రమాదం సంభవిస్తుందనడం అనుభవైకవేద్యం. చాలామంది తాము భగవదారాధకులమని, తమ కష్టాలు తీరటంలేదని, తమ పూజలు ఫలించటం లేదని చెబుతుంటారు. ఈ అనుభవం కూడా సత్యమైనదే.

మన ప్రార్ధనలకు సమాధానం రాలేదు. కోర్కెలు సఫలము కాలేదు. మనశ్శాంతి కలగటం లేదు. కారణమేమిటి? ప్రార్ధనలో నిశ్చలత్వం అవసరం. అది సంసార బంధాల నుండి విముక్తి కొరకుగానుండుట సమంజసం. ప్రార్ధన లేదా పూజలో నా మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది? నిస్సంగత్వే నిశ్చలత్వత్త్వమని జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.

కోర్కెలు ఇహలోక సౌఖ్యాల కొరకు మాత్రం పరిమితం గాక జన్మ రాహిత్యాన్ని కోరునట్టివై ఉండటం కూడా ముఖ్యం. పరహితం లేని కోర్కెలు ఫలించవు. ధర్మాన్ని విడిచి ఏ పని జేసినా అది వ్యర్థమే. పరమధర్మాన్నే మహాభారతంలో వివరించిన తీరును గురించి తెలుసుకొందాం.

ఒరులేయవి యొనరించిన

నరవర అప్రియము తన మనంబున కగు తా

నొరులకవి యొనరించకునికి

పరాయణము పరమధర్మ పతమండ్రు జనుల్.

ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టముండదో అట్టి దానిని నీవు ఇతరులకు చేయకుండుటయే పరమధర్మమని భావం. ఇంతకన్నా మహోదాత్తమైన విషయమేమి ఉంటుంది? మానవత్వం ఈ పద్యంలో వెల్లివిరియటం లేదా దానిని ఆచరణలో పెట్టగలిగినవాడు మానవుడు ఇలలోనే మహానుభావుడవుతాడు కదా!

భౌతిక సంబంధమైన వాంఛలను విడనాడి, తనకు భగవంతుడిచ్చిన ఆయుర్దాయ కాలాన్ని సద్వినియోగం చేసికొంటూ, జాతస్య మరణం ధృవ మను సత్యాన్ని మరువక, మానవ విధులను సక్రమంగా నిర్వహించి వైరాగ్య భావంతో యోగాభ్యాసాన్ని అవలంబించి తద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేసిన అదే నిర్వాణపథం. జీవబ్రహ్మైక్య  రహస్యం కూడ. అప్పుడు మానసికస్థితి నిశ్చలముగ ఉండి మానవుడు ఋషితుల్యుడవుతాడు. జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం.

మనలో ధర్మభావమును నింపడానికి ప్రతిగ్రామంలో, ప్రతీ పట్టణంలో మన పెద్దలు దేవాలయాలను నిర్మించారు. వేదవిదులు, త్రికాలవేత్తలు అయిన మహాఋషులు, విశ్వశాంతికై, సర్వజన ఆత్మోద్ధరనకై, మహిమాన్వితాలైన దేవాలయాలను స్థాపించి, నిత్య సత్య జ్ఞానమర్గాన్ని విశ్వశాంతికి ప్రచారం చేయడానికి దోహదం చేసారు. నిత్యం దేవాలయదర్శనాన్ని చేసుకునేవారు, గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లు, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేనివాడై, వాటి పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు.

No comments:

Post a Comment