Saturday, June 16, 2012

పుణ్యాన్ని ప్రసాదించే ‘గంగ’


విశిష్టాద్వైతాన్ని దిగంతాలకు వ్యాప్తి చేసిన శ్రీమద్రామానుజాచార్యులు మంత్రం కన్నా సామాన్యమానవుడే మిన్న అని నిరూపించిన విశిష్ట ఆచార్యులు. ఆ రోజుల్లో తిరుమంత్రం అందరికీ లభ్యంకాదు. తిరుమంత్రం గురువు ద్వారానే ఉపదేశం పొందాలి. వేరేవిధంగా తిరుమంత్రాన్ని పొందలేము. పొందినప్పటికి అది అర్థరహితం. సృష్టి ప్రారంభం నుంచి ఉన్న ఈ మంత్రాన్ని నారదుడు, ధృవునికి ఉపదేశించగా, అది అలా అలా పరంపరంలుగా గూరూపదేశాల వల్ల వ్యాప్తిలో ఉంది. ఈ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తీ మరొకరికి ఉపదేశించకూడదు. ఒకవేళ అటువంటి పరిస్థితి తటస్థిస్తే, అందుకు కొన్ని కఠిన విధివిధానాలున్నాయి.

అంతటి పవిత్రమైన మంత్రాన్ని నేర్చుకుని, బయటకు చెబితే శౌరవనరకం లభిస్తుంది. రామానుజులవారికి ఆ మంత్రాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస. ఆ మంత్రం తిరు కొట్టియార్ నంబిని ఆశ్రయిస్తే లభిస్తుందని తెలుసుకున్న రామానుజులు కాలినడకన తిరుకొట్టియార్ కు చేరుకుని తిరుకోట్టియార్ నంబిని మంత్రోపదేశం కోసం వేడుకున్నాడు. రామానుజులవారిని చూసిన నంబి వెంటనే ‘సరే’ అని అనలేదు. అందుకని మంత్రోపదేశం కుదరదనీ చెప్పలేదు. రోజూ ఇంటికి రమ్మనేవారు, మరలా తిరిగి పోమ్మనేవారు. అలా పద్దెనిమిదిసార్లు జరిగింది. అయినా రామానుజునిలో సహనం ఏమాత్రం తగ్గలేదు. నిత్యం చిర్నగవుతో గురుదర్శనం చేసుకుంటుండేవాడు. అతడిని పందొమ్మిదవసారి పిలిచినా గురువు నంబి మనసులో కలకలం. తను అవసరానికి మించి రామానుజుని పరీక్షిస్తున్నట్లవుతోందా? అంటే, మంత్రోపదేశం చేయాలని నిర్ణయించుకున్న నంబి, స్నానాదులు ముగించుకుని, ఇద్దరు శుచులై ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. రామానుజులు గురువు పాదపద్మాలను పట్టుకున్నాడు. గురువు ఇద్దరి మీద కండువాకప్పి, రామానుజునిచెవిలో, అతనికి మాత్రమే వినిపించేట్లుగా మంత్రోపదేశం చేశారు.

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ

అంతే! రామనుజులకు తిరుమంత్రమనబడే ‘అష్టాక్షరీమంత్రోపదేశం’ లభించింది. గురువు దగ్గర సెలవు తీసుకుని ముందుకు కదలిన రామానుజుల మదిలో చటుక్కున ఓ ఆలోచన! ఈ మంత్రధ్యానం వనాల మోక్ష ప్రాప్తి కలుగుతున్నప్పుడు, ఎన్నో వేలమంది సామాన్య జనులకు ఈ మంత్రోపదేశం చేసి, వారికి మోక్షమార్గాన్ని సుగమం చేస్తే ఎలా వుంటుంది? నిత్యం కఠోర నియమాలను, కఠిన దీక్షలను, ఘోరతపస్సులను చేయలేని సామాన్యులకు ఈ మంత్రంద్వారా సులభంగా మోక్షప్రాప్తి కలిగితే, అంతకన్నా గొప్ప విషయమేముంటుంది?

కానీ అది గురుద్రోహమవుతుంది కదా! శౌరవనరకం ప్రాప్తిస్తుంది కదా!

అయితేనేమి? ఇంతమంది జనానికి మోక్షప్రాప్తి సులభతమైనప్పుడు, తనకు నరకం లభించినా తప్పేముంది? కాబట్టి జనులకు ఈ తిరుమంత్రాన్ని ఉపదేశించడమే సరి! వెంటనే తను తిరుమంత్రాన్ని అందరికీ ఉపదేశించబోతున్నట్లుగా రామానుజుడు ప్రకటించడంతో జనం తండోపతండాలుగా వచ్చారు. ఆలయంపైకి ఎక్కినా రామానుజులు, అందరినీ చేతులు జోడించి, కళ్ళు మూసుకుని స్వామిని తలచుకుంటూ తిరుమంత్రాన్ని ఉచ్ఛరించమన్నాడు.

‘ఓం నమో నారాయణాయ’

జనమంతా ఒక్కసారి ఆ తిరుమంత్రాన్ని ఉచ్ఛరించగా, ఆ వేదధ్వనికి దశదశలు పులకించి పోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నంబి ఆవేశంతో ఊగిపోయాడు. రామానుజుని పైత్యం ప్రకోపించిందా? కోరి కోరి ఎందుకు నరకాన్ని కొని తెచ్చుకుంటున్నాడు? ఇదే విషయాన్ని తన ఇంటి ముంగిటకు వచ్చిన రామానుజుని అడిగాడు నంబి. అందుకు రామానుజులు వినయవిధేయతలతో, “గురువర్యా! నా ఒక్కడికి లభించే నరకం ద్వారా ఇన్ని వేల మందికి మోక్షం కలుగుతుందంటే అంతకంటే నాకు కావలసిన దేముంది? ఆ నరకాన్నే నేను స్వర్గంగా భావిస్తాను”. శిష్యుని మాటలను విన్న గురువు మనసు ఆనందంతో ఉప్పొంగింది. “రామానుజా! నేను నీకు గురువును కాదు. నీవే నాకు గురువువు. నువ్వు నావంటి గురువులకే గురువ్వి” అంటూ తన సంతోషాన్ని ప్రకటించాడు. ఇలా ఆకాలంలోనే ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించిన అసామాన్యగురువు శ్రీమద్రామానుజులవారు.

No comments:

Post a Comment