Saturday, June 16, 2012

తులసి మహిమ


విత్రతకు చిహ్నంగా చెప్పుకునే ‘తులసి’ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది. స్వామివారికి కూడా తులసి అంటే చాలా అభిమానం. కృష్ణావతారంలో తులాభార సమయంలో తులసిది ప్రముఖపాత్ర. భక్తి నిదర్శనంగా నిలచిన తులసి కథను తెలుసుకుందాం.
తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళుకు మహాభక్తురాలు. స్వామిపై ఈమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రపత్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందింది. స్వామి ప్రత్యక్షమై “నీకేమి కావాలో కోరుకొమ్మని" అడుగగా “ఎల్లప్పుడూ నీ సేవ చేసుకుంటూ ఉండాలన్నదే నా కోరిక" అని కోరింది. అంతట పెరుమాళ్ళు “నిన్ను భూలోకంలో మొక్కగ అవతరింపజేసి నిన్ను తరింపజేస్తాను" అని అన్నారు. తులసి భగవత్కటాక్షము చేత శ్రీవిల్లిపుత్తూరనే దివ్యప్రాంత్రంలో భాగవతోత్తముల ఇండ్ల ‘తులసిమోక్కగా’ అవతరించింది.
అప్పుడు పెరుమాళ్ళు భాగవతోత్తములందరికి స్వప్నంలో సాక్షాత్కరించి  “మీ పెరటిలో తులసిమొక్క ఉన్నది. అది చల్లదనం, మార్థవం, పరిమళం అనే గుణాలతో నిండి ఉంటుంది. మీరందరూ ప్రతిరోజూ వాటి దళాలతో నాకు పాదపూజ చేయండని" ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు భాగవతోత్తములందరు శ్రీవిల్లిపుత్తూరు నందు కలసి అందరికి ఒకే మాదిరిగా కలిగిన స్వప్న వృత్తాంతాన్ని చెప్పుకుంటూ, భాగవతోత్తముల పెరటిలో చూడగా పెరుమాళ్ళు ఆజ్ఞ ఇచ్చిన విధంగా చల్లదనం, మార్థవం, పరిమళం అనే మూడు గుణాలతో ప్రకాశిస్తున్న తులసిని చూచి ఆశ్చర్యచకితులై భగవంతుడు ఆజ్ఞ ఇచ్చిన రోజూ తులసీదళాలతో పూజించసాగారు.
భక్తురాలైన తులసి తన కోరిక నెరవేరినందుకు చాల ఆనందంతో, నిత్యయవ్వనంతో పెరుమాళ్ళు పాదాలను ఆశ్రయించింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సర్వేశ్వరుని వక్ష: స్థలమునందున్న లక్ష్మీదేవి తనకంటె దిగువనున్న తులసిని పరిహసించింది. ఆ అవమానభారంతో తులసి వాడిపోయి, నిత్య యవ్వనం పోయి ఎండిపోయినట్లు తయారైంది. పరాత్పరుడైన సర్వేశ్వరుడు తులసి పరిస్థితికి కారణమేమిటని విచారించి, లక్ష్మీదేవి వలన తులసికి జరిగిన పరాభవాన్ని గ్రహించారు.
స్వామివారికి భక్తురాలియందు గల వాత్సల్యం చేత మరలా తమ ప్రియభక్తులైన భాగవతోత్తము లందరికి స్వామికి పాదాలయందు దళాలను సమర్పించవలదని తులసిని మాలలుగా కట్టి తమ కిరిటమందు అలంకరించమని ఆజ్ఞ ఇచ్చారు.
స్వామివారి అజ్ఞానుసారం భాగవతోత్తములందరు తులసి దళాలను మాలలుగా కట్టి, కిరీట మందు అలంకరించారు. ఇలా జరుగుతుండగా కొంతకాలం తర్వాత తులసి లక్ష్మీదేవితో “ ఓ లక్ష్మీ! నీవు వక్ష:స్థలమునందువున్నావు. నేను శిరోభాగమందున్నాను. కనుక నేను నీకన్నా అధికురాలను అని లక్ష్మీదేవిని పరిహసించింది. లక్ష్మీదేవి తను చేసిన పనికి సిగ్గుపడి సర్వేశ్వరుడు ఏకాంతంగా వున్న సమయంలో స్వామివారిని “మీకు ఎటువంటి సేవ చేస్తే ఈ దాసురాలి యందు ప్రేమ కలుగుతుందో ఆ కైంకర్యం గురించి చెప్పి నన్ను కటాక్షించ వలసిందిగా ప్రార్థిస్తున్నాను” అని అడుగగా, పెరుమాళ్ళు మందహాసం చేస్తూ, “భూలోకంలో పుష్పకైంకర్యం చేస్తున్న వారంటే నాకు చాలా ప్రియం. నా భక్తుడైన విష్ణుచిత్తునితో గూడి నీవునూ నాకు పుష్పకైంకర్యం చేసినట్లయితే నాకు చాల ప్రియము” అని స్వామి చెప్పారు.
దీని వల్ల పెరుమాళ్ళుకు భక్తులపై గల అభిమానాన్ని మనం తెలుసుకోవచ్చు. అందువల్లే తన భక్తురాలైన తులసిని కతాక్షించి శిరసుపై ధరించాడు. లక్ష్మియందు గల ప్రేమతో ఆమెను భూలోకంలో తులసివనంలో చిన్నపాపగా అవతరింపజేశాడు. విష్ణుచిత్తుడు స్వామివారి పూజకు తులసిని కోయటానికి వనానికి వచ్చి, ఈ పసిపాపను చూచి వటపత్రశాయి సన్నిధికి తీసుకొనిపోయి ఈ సంగాతివారితో విన్నవించగా, వటపత్రశాయి ఆమెకు ‘గోదాదేవి’ అని నామకరణం చేసి విష్ణుచిత్తుణ్ణి పెంచుకొమ్మని ఆజ్ఞ ఇచ్చారు. వారామెను పెంచుకుంటూ; ఆమెతో కూడా స్వామి వారి కైంకర్యాలు చేయించేవారు.
చూశారా! ఏ తులసిని లక్ష్మీదేవి పరిహసించిందో ఆ తులసినే చేతులారా పెరుమాళ్ళుకు సమర్పించింది. తులసిని పెరుమాళ్ళుకు సమర్పించడం వల్లే స్వామివారి కటాక్షాన్ని పొందింది.. అంతేకాక లక్ష్మిగర్వం కూడా తులసి వల్లే పూర్తిగా పోయింది. అంతేకాకుండా సత్యభామా గర్వభంగం కూడా ఈ తులసీదళం వల్లే అయింది. కాబట్టి ఈ తులసీదళ మహిమ అద్భుతమైనది, పరమపవిత్రమైనదని చెప్పబడింది.

No comments:

Post a Comment