Saturday, June 16, 2012

మీనాక్షీ కళ్యాణం


“ఆడపపిల్లలు గల తల్లిదండ్రులు అదృష్టవంతులని మన పెద్దవాళ్ళు అంటుంటారు.అలాగే తమకు దైవాంశసంభూతురాలైన ఆడపిల్ల కలగడం తమ అదృష్టమని భావించిన మలయధ్వజ-కాంచనమాల రాజదంపతులకు,తమ కూతురు మీనాక్షి పెళ్లి విషయంలో ఓ సమస్య ఎదురైంది.ఇంతకీ ఏమిటా సమస్య?!”

అన్నిభాగ్యలలోకెల్లా అత్యంతవిలువైన భాగ్యం సంతానభాగ్యం.ఆ భాగ్యం లేనప్పుడు ఎన్ని భాగ్యాల మధ్య తులతూగుతున్నప్పటికీ నిష్ప్రయోజనమే అన్నట్లుంటుంది.ఆ భాగ్యానికి నోచుకోలేనివారు,ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ తమకు ఆ భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.అటువంటి ప్రార్ధనలే చేయసాగారు నాటి పాండ్యదేశపు మలయధ్వజ-కాంచనమాల రాజదంపతులు.సంతానభాగ్యం కోసం ఆ రాజదంపతులు మొక్కని దైవం లేదు,దర్శించని పుణ్యక్షేత్రం లేదు అటువంటి సమయంలో ఒకసారి బృహస్పతి మహర్షి పాండ్యరాజ్యానికి వచ్చాడు. ఆయన రాజదంపతులు చేసిన అతిధి మర్యాదలను స్వీకరించి,ఆ రాజదంపతుల శోకానికి గల కారణాన్ని తెలుసుకొని, మలయధ్వజునితో, "రాజా!ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీవృధా ప్రయత్నాలే. లక్ష్యం ఒక దిశలో ఉంటే, నీ దృష్టి మరొకవైపు మరలుతోంది. పుత్రకామేష్టియాగం చేస్తే ఫలితం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పుత్రకామేష్టియాగాన్ని చేయగలవు”అని సలహా ఇచ్చాడు. సలహా చెప్పడమేకాక యాగవిధులను కూడా చెప్పి, మలయధ్వజుని భార్య కాంచనమాలను విడిగా కూర్చుని ఆదిపరాశక్తిని ప్రార్థించమన్నాడు.

వెంటనే కాంచనమాల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్మాతను వేడుకుంటూ కఠోర తపస్సును మొదలెట్టింది. ఆమె తన భర్తతో,” నాధా! నేను అమ్మవారిని శ్రద్ధగా కొలుచుకుంటున్నాను. ఆమె దయవుంటే,మనం చేయబోతున్న పుత్రకామేష్టియాగం సఫలమవడమేకాక, మన కోరికననుసరించి మన పేరును నిలబెట్టే బిడ్డ మనకు కలుగుతుంది” అని అన్నది. కాంచనమాల కఠోర తపస్సును  మెచ్చిన జగన్మాత ఆమె ముందు ప్రత్యక్షమై “ కాంచనమాల! ఇకపై మీ దంపతులు పుత్రకామేష్టియాగం చేయవచ్చు. ఆ యాగం ముగిసిన తదనంతరం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న శుభఘడియలు మీ ముందుకొస్తాయి” అని దీవించింది.

అప్పుడు కాంచనమాల దేవి పాదాలపై పడి, “మాతా! నాకు సంతానభాగ్యాన్ని అనుగ్రహించావు. అయితే నువ్వే నా కూతురుగా జన్మిస్తే, ఈ జన్మకు ఇది చాలనిపిస్తోంది తల్లి! ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తావా అమ్మా?!” అని వేడుకుంది. కాంచనమాల ప్రార్దన విన్న దేవి చిరునవ్వులు చిందిస్తూ అంతర్ధానమైంది.

అనంతరం ఆ రాజదంపతులు బృహస్పతి మహర్షి సూచనలమేరకు కఠిన నియమావళిని అనుసరిస్తూ, మంత్రి, సామంతులు, పరివారజన సమేతంగా పుత్రకామేష్టియాగాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. యాగ ఫలం దక్కినందుకు సూచనగా, ఆ యజ్ఞకుండం నుంచి ఓ దేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత చేతుల్లో కోటి సూర్య ప్రభలను తలదన్నే కాంతితో ఓ ఆడపిల్ల!

ఆ బిడ్డను చూసిన మరుక్షణమే ఆ రాజదంపతుల మనసులు ఆనంద భరితమయ్యాయి. కొన్ని సంవత్సరాల శోకం ఒక్కక్షణంలో మాయమైన అనుభూతి. ఆ దంపతులిద్దరూ భక్తితో ఆ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. కానీ ఇదేమి చిత్రం?!

ఆ చిన్నపిల్లకు సహజంగా ఉండాల్సిన రెండు స్తనాలతోపాటు మరో స్తనం అధికంగా ఉందే! మూడుస్తనాలతో ఈ బిడ్డ తమకు లభించడమేమిటి? ఇదేమి పరీక్ష?! దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? తమకు సంతానభాగ్యం కావాలని రోదించిన విషయం యదార్థమే. కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఈ బిడ్డ రూపు ఉండటమేమిటి? బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత తన రూపాన్ని చూసుకుని బాధపడితే ఎలా సర్దిచెప్పాలి? ఈ బిడ్డకు పెళ్లి చేయడం ఎలా? “ఈశ్వరా! మా చిరకాల కోరికను తీర్చావు. సరే కానీ,ఈ బిడ్డకు ఎందుకు ఇలాంటి లోపాన్ని పెట్టావు?” అంటూ మలయధ్వజ-కాంచనమాల దంపతులు కన్నీరు మున్నీరు అయ్యారు. సరిగ్గా అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది “ రాజ దంపతులారా! ఈ బిడ్డ దైవాంశసంభూతురాలన్న విషయాన్ని ఎందుకు మరచిపోతున్నారు? ఈ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత ఈమెను పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు వస్తాడు. ఈమెకు తగిన వరుని దృష్టి,ఈమె వైపుకు తిరిగినప్పుడు ఈమె యొక్క మూడవ స్తనం మాయమవు తుంది. కాబట్టి అతనికి నీ కూతురునిచ్చి పెళ్లి చేయ గలరు” రాజదంపతుల మనసులు ఒకరకంగా కుదుట పడ్డాయి. దైవదత్తమైన బిడ్డకు  తల్లి దండ్రులైనందుకు వారి మనసులు ఉప్పొంగాయి.

ఆ బిడ్డకు తటాదగై అనే పీరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అయితే తటాదగై కన్నులు మీనాలను(చేపలను) పోలిఉండడం వల్ల, అందరు ఆమెను మీనాక్షి అని పిలువసాగారు. చివరకు తటాదగైకు మీనాక్షి అనే పేరే స్థిరపడిపోయింది. మీనాక్షి కూడా చదువుల్లో అగ్రగామిగా నిలుస్తూ, మగపిల్లలకు ఏమాత్రం తీసిపోనివిధంగా యుద్ద విద్యలలో ఆరితేరింది. మలయధ్వజ-కాంచనమాల దంపతులకు తమ కూతురును యువరాణిగా చూసుకోవాలనే ఆశ. మీనాక్షికి పన్నెండేళ్ళ వయసురాగానే, ఆమెకు ముకుట ధారణ చేసి ,తమ రాజ్యానికి యువరాణిగా పట్టాభిషేకం చేసారు ఆమె తల్లిదండ్రులు. అలా హృదయం నిండా సంతోషాన్ని నింపుకున్న మకుటధ్వజుడు, కొన్నేళ్ళ తర్వాత దీర్ఘవ్యాధి బారిన పడ్డాడు. అయితే అతని మనసులో చిన్నపాటి విరక్తి, తన కూతురు పెళ్లి సంబరాన్నికళ్ళారా చూడకుండానే కన్ను మూయబోతున్నానన్నశోకం. అయితే తన కూతురు పెళ్ళి బాధ్యతను ఎవరో ఒకరికి అప్పగించాలనుకున్న మలయధ్వజుడు, మంత్రిణి సుమతికి ఆ పనిని అప్పగించి, తన కూతురు ఒక దైవానికే అర్థాంగి అవుతుందన్న గట్టినమ్మకంతో కీర్తిశేషుడయ్యాడు.

తండ్రి మరణం మీనాక్షిని తీవ్రసంక్షోబంలో ముంచేసింది. తమ రాణి నిత్యం శోకతప్తురలై  ఉండటం, మంత్రిణి సుమతిని ఆందోళన పరిచింది. వీలు చిక్కినప్పుడల్లా సుమతి తమ రాణి మీనాక్షికి ఉపసమన వాక్యాలను చెప్తుండేది. రాజ్యంలో ఎటువంటి సంక్షోభ పరిస్థితులు నెలకొనకుండా  సుమతి అన్నివిదాలైన జాగ్రత్తలను తీసుకుంటుండేది. మీనాక్షి పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లసాగారు. అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ మంత్రిణి సుమతి మనసులో ఓ ఆలోచన గిరికీలు కొడుతుండేది. ఎలాగైనసరే మీనాక్షికి పెళ్ళి చేయాలి. మీనాక్షికి పెళ్ళి చెయ్యాలంటే ఆమె మూడవ స్తనం అదృశ్యమవ్వాలన్న రహస్యాన్ని మలయద్వజుడు సుమతితో చెప్పాడు. ఇందుకుగాను సుమతి మనసులో ఒకే ఒక పరిష్కారం పొడసూపింది. మీనాక్షిని దిగ్విజయ యాత్ర చేయమని సుమతి పురమాయించింది. తద్వరా మీనాక్షికి తగిన వరుడు వెదకి పట్టుకోవచ్చన్నది ఆమె ఆలోచన. వెంటనే దిగ్విజయ యాత్ర మొదలైంది. మీనాక్షి దండెత్తిన రాజ్యాలన్నీ ఆమె పదాక్రాంతాలయ్యయే తప్ప, ఆమెకు తగిన వరుడు కనిపించలేదు. మీనాక్షికి మూడవ స్తనం మాయమైతేకద ఆమెకు తగిన వరుడు దొరికినట్లు!!

మంత్రిణి సుమతి  ఇలా  చటుక్కున ఆమె మదిలో ఓ ఆలోచన. అగ్నికుండం నుంచి ఉద్భవించిన మీనాక్షి దైవాంశసంభూతురాలు. ఆమెకు ఈ మానవ లోకం లో వరుని వెతికితే ఎలా దొరుకుతుతాడు? సమస్త భూప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న మీనాక్షికి ఖచ్చితంగా ఈ లోకంలో వరుడు దొరకడం కష్టమే. ఇకపై మీనాక్షికి భూలోకాన్ని వదలి మిగతా లోకాలపై దండెత్తమని చెప్పడమే సబబు అనుకున్న మంత్రిణి సుమతి, ఆ దిశగా మీనాక్షిని రెచ్చగొట్టింది.

సమస్త భూప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న మీనాక్షి, దేవలోకాలపై యుద్ధం అనగానే పెద్దగా ఆసక్తి చూపించలేదు. అప్పుడు సుమతి, “మహారాణి! ఈ భూలోకంతోపాటు సమస్త లోకాలను జయించినప్పుడే మీ దిగ్విజయయాత్ర పరిపూర్ణమైనట్లు లెక్క. కాబట్టి దిగ్విజయయాత్ర కొనసాగక తప్పదు” అని సలహా ఇచ్చింది. సుమతి మాటలు విన్న మీనాక్షి ఆ మరుక్షణమే మిగత లోకాలపైకి దండయాత్ర కు బయలుదేరింది.

అయితే ఆమెకు ఆ లోకాలలో ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైంది. భూలోకంలో తన దండయాత్ర చేసినప్పుడు, ఆయా రాజ్యాలకు చెందిన రాజులు తనను ఎదిరించి పోరాడారు. కానీ,స్వర్గంపై దండెత్తి వస్తే దేవేంద్రుడు ఏమిటి ఇలా చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి బదులు ఇలా  ఘనస్వాగతం పలుకుతున్నాడేమిటి? మీనాక్షి విస్మయురాలైంది. కానీ దేవేంద్రుని పరిస్థితి వేరు. స్వర్గలోకం పైకి దండెత్తి వచ్చిన మీనాక్షిని చూడగానే, అతనికి మీనాక్షి పార్వతీదేవి అంశమని తేలిపోయింది. మీనాక్షిని చూసిన దేవేంద్రుడు, “అమ్మ! మిమ్ములను ఎదిరించి నిలువగల శక్తి నాకు ఎక్కడిది? మేమంతా నీకు బానిసలమమ్మ!” అని చెప్పాడు. అంతలోపే తన శక్తిసామర్థ్యాల గురించి దేవలోకం అంతా పాకిందా?! మీనాక్షి విస్మయురాలైంది.

అనంతరం ఆమె సత్యలోకంపైకి దండెతింది.ఆమె రాక గురించి తెలియగానే చతుర్ముఖ బ్రహ్మ మేలతాళలతో ఎదురేగాడు. మీనాక్షి యుద్ధభేరి మోగిస్తే, బ్రహ్మ దేవుడు విందును ఏర్పాటు చేసాడు. ఆమెకు తన చేతులారా వివిధ రకాలైన ఆహార పదార్ధాలను వడ్డించాడు. రకరకాల స్తోత్రాలతో ఆమెను స్తుతించాడు. బ్రహ్మదేవుని స్వాగతసత్కారాలు  మీనాక్షికి సంతోషాన్ని కలిగించినప్పటికీ  ఆమె అంతరంగం లో ఒక చిన్న సంచలనం. ఎందుకిలా జరుగుతోంది? తను దండెత్తి వస్తే, వీళ్ళిలా స్వాగత సత్కారాలు చేయడమేమిటి?

ఈ స్వాగత సత్కారాలతో మనసు నిండిపోవడంతో మీనాక్షి రెట్టించిన ఉత్సాహంతో వైకుంఠం పైకి దండయాత్ర చేసింది. అక్కడ కూడా అదే తంతు. శ్రీమహావిష్ణువు, మీనాక్షిని  చూసిన వెంటనే, “రామ్మా,సొదరీ! నీ అన్నయ్య ఇచ్చే విందును ఆనందంగా స్వీకరించు” అని స్వాగతించాడు. “నేను మీతోయుద్దం చేయడానికి వచ్చాను” గొంతులో కఠినత్వాన్ని ప్రదర్శించేందుకు శతవిదలదాలా ప్రయత్నించింది.

“యుద్ధమా? అన్నయతో యుద్ధం ఎందుకమ్మా? ఈ క్షణమే నేను నీ చేతిలో ఓడిపోయాను. సరేనా?” అని విష్ణుమూర్తి చెప్పగానే, మీనాక్షికి ఏం చేయాలో పాలుపోలేదు. సరే. ఇకపై కైలాసం పై దండెత్తడమే తరువాయి. ఆ పరమ శివుని కుడా ఓడిస్తే, సకల లోకాలను తను కైవసం చేసుకున్నట్టే కదా! అని మీనాక్షి ఆలోచించింది. ఈ దండయాత్రలు ఇలావుంటే మంత్రిణి సుమతి మనసులో గుబులు మొదలైంది. దైవాంశసంభూతురాలైన మీనాక్షికి భూలోకంలో తగిన వరుడు లేడని తెలిసిన తర్వాత, దేవలోకాలలోనైనా దొరుకుతాడని ఆశ పడింది. కాని, ఆ ఆశ అడియాశే అయ్యేటట్లు ఉంది. మలయధ్వజ మహారాజు తనపై పెట్టిన బాధ్యతను తను సక్రమంగా నెరవేర్చగలదా? ఎవరిని చూసినప్పుడు మీనాక్షి మూడవ స్తనం మాయమవుతుంది? ఈ జన్మలో తను మీనాక్షికి పెళ్ళి చేయగలదా? ఇలా సుమతి పరిపరివిధాలుగా వాపోసాగింది.

మీనాక్షి ససైన్యంగా కైలాసంలో అడుగుపెట్టగానే, ఆమె లోపల ఒక వింత అనుభూతి. ఒళ్ళంతా గగుర్పొడిచినట్లు అనిపించింది. మనసు పరవశించింది. అయినప్పటికీ తనను ఎదిరించిన ప్రమద గణాలను ఓడించి ముందుకు సాగింది. అదుగో అక్కడ పరమ శివుడు!

అతడిని జయిస్తే,ఇక ఈ సమస్త లోకాలలో  తనకు ఎదురునిలచి నిలువగల వారెవ్వరూ లేరు. అయితే ఈశ్వరుని ముఖాముఖంగా ఎదుర్కొన్నప్పుడు, ఆమె మనసులో ఏదో సంచలనం. యుద్ధం చేసేందుకై పైకి ఎత్తిన కత్తి తనకు తెలియకుండానే కిందికి జారి పోయింది. ఒక్కసారిగా చక్కని చుక్క మీనాక్షి   సిగ్గుల మొగ్గ అయింది. ఆ మరుక్షణమే ఆమె మూడవ స్తనం మాయమైంది.

“అంటే! ఈయన నాకు కాబోయే భర్తా? ఈశ్వరుని పెళ్ళి చేసుకోబోయే భాగ్యం నాకు కలుగుతుందా?” అని అనుకున్న మీనాక్షి సంతోషానికి ఎల్లలు లేవు. అలాగే అక్కడున్న మంత్రిణి సుమతి సంతోషానికి కూడా అవధులు లేవు. ఒకరకంగా త్వరలో తనపై మలయధ్వజుడు పెట్టిన బాద్యతను, తను నేరవేర్చబోతునట్లే. “సర్వేశ్వరా! మీనాక్షికి పెళ్ళవుతుందా? రాజుగారు నాపై పెట్టిన బాద్యతను నేను నేరవేర్చగలనా? అని మధనపడ్డాను. నా మనసు ఇప్పుడు శాంతించింది దేవా. సుందరేశ్వర, మా యువరాణిని చేపట్టి, మమ్ము ధన్యులను చేయండి స్వామి” అని మంత్రిణి సుమతి వేడుకొంది.

అప్పుడు ఈశ్వరుడు మీనాక్షివైపు చూసి, “మీనాక్షి! భులోకంలోనున్న మీ అమ్మతో పెళ్ళి ఏర్పాట్లు చేయమని చెప్పగలవు. తగిన సమయంలో నేను భూలోకానికి వస్తాను. అప్పుడు మన పెళ్ళి జరుగుతుంది” అని చెప్పి పెళ్ళి పనులను చేయమని పురమాయించాడు. భూలోకానికి చేరుకున్న మీనాక్షి తన అనుభవాలను తల్లి కాంచనమాలకు వివరించింది. కైలసనాథుని చుసినవైనాన్ని చెప్పింది. ప్రక్కనేవున్న మంత్రిణి సుమతి ఆ కైలాసనాథుడే మీనాక్షికి భర్త అని, ఆయన చూడగానే మీనాక్షి మూడవ స్తనం అదృశ్యమైన అద్భుతాన్ని వివరించింది.

అన్ని వివరాలు విన్న కాంచనమాల సంతోషించింది. పరమేశ్వరుడు ఒకానొక శుభసమయంలో సుందరేశ్వర నామంతో భూలోకానికి రాగా మీనాక్షి – సుందరేశ్వరుల కళ్యాణం శ్రీమహావిష్ణువు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి విచ్చేసిన సకలలోక వాసులు  మీనాక్షి- సుందరేశ్వరులకు వందనలను సమర్పించి తమ తమ లోకాలకు తిరిగి చేరుకున్నారు. ఈ పెళ్ళి అందరికి సంతోషాన్ని పంచింది.

No comments:

Post a Comment