Sunday, June 17, 2012

మన పురాణాలలో ‘గుర్రం’


మన సంస్కృతిలో ప్రతీజీవికి ప్రాముఖ్యత ఉంది. ఇందుకు రాక్రణం ఆ సర్వేశ్వరుడు సకలజీవులలో ఉండటమే కాక, సమయం, సందర్భం వచ్చినపుడు ఆయా జీవుల రూపాలను ధరించి మనలను అనేక దుష్టశక్తుల బారినుండి కాపాడాడు. ఇతిహాసాలను పరికించినపుడు ప్రతిజీవి యొక్క నెపథ్యం మనకు అవగతమవుతుంటుంది. అటువంటి పురానప్రాముఖ్యం గల జీవులలో ‘గుర్రం’ ఒకటి. గుర్రం పుట్టుక గురించి అనేక కథనాలున్నాయి.
సాగరమథన సమయంలో ఉచ్చైశ్శ్రవమనే గుర్రం పుట్టిందనీ, ఇంకా గుర్రాల పుట్టుక గురించి ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది.
సామవేదం నాలుక నుంచి, బ్రహ్మదేవుడు హోమం చేస్తున్నప్పుడు ఆయన కన్నుల నుంచి, అగ్నినుంచి, అష్టదిక్పాలకులయందు గుర్రం ఉద్భవించిందని చెబుతుంటారు. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి శాపానికి గురైన బ్రహ్మదేవుడు ఒక విచిత్ర రూపాన్ని సంతరించుకుని, ఆ రూపం ఒక అండంగా (గుడ్డు) మారి, ఆ గుడ్డు నుంచి ఎనిమిది గుర్రాలు పుట్టాయట. ఈ గుర్రాల యొక్క లక్షణాలు కూడ పేర్కొనడం జరిగింది.
ఇక, ఆ సర్వేశ్వరుడే గుర్రం రూపం ధరించిన సంభవం కూడ మన ముందుంది. శ్రీమహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలో హయగ్రీవ అవతారం కూడ ఒకటి. పూర్వం హయశీర్షుడనే రాక్షసుడు దేవిని ప్రార్థించి తనకు మనిషి దేహం, గుర్రం తల రూపంగల వాని చేతుల్లోనే మరణం సంభవించాలని కోరుకుంటాడు. దేవి వరమీయడంతో వరగర్వితుడైన ఆ రాక్షసుడు, బ్రహ్మ దగ్గరున్న వేదాలను దొంగిలించాడు. సృష్టికర్త అయోమయంలో పడిపోగా, ఈ సంగతిని గమనించిన ఇంద్రుడు శ్రీహరి సాయం కోసం పరుగుపరుగున వైకుంఠానికి వెళ్ళాడు. అయితే అప్పటికే రాక్షసంహారంతో అలసిపోయిన విష్ణువు, తన చేతిలోని విల్లుపైనే తలవాల్చి, నిల్చున్న భంగిమలోనే నిద్రించసాగాడు. స్వామిని నిద్రలేపేందుకు ఇంద్రుడు భయపడుతుండగా, అక్కడకు వచ్చిన శివుడు, ధనస్సు నారిని తెపినట్లయితే, విల్లు కదిలి, విష్ణువుకు మెలకువ వస్తుందని చెబుతాడు.  శివుడు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చినప్పటికీ, ఆ విల్లును తెంపేదెవరు? అప్పుడు అక్కడే తచ్చాడుతున్న వ్రమి అనే కీటకం, యజ్ఞభాగాల్లో వాటా ఇచ్చినట్లయితే ఆ వింటినారిని కొరికి తెంపుతానని ఇంద్రునితో అంటుంది. అందుకు ఇంద్రుడు సరేననడంతో ఆ కీటకం వింటినారిని కొరుకుతుంది. ఫలితంగా గట్టిగా బిగించిన వింటి నారి తెగడంతో అది కత్తిలా శ్రీమహావిష్ణువు మెడను ఖండించింది. ఆ సంఘటనకు దేవతలు దు:ఖిస్తుండగా, అక్కడ ప్రత్యక్షమైన జగన్మాత, హయశీర్షుని చావు రహస్యాన్ని గురించి వాళ్ళకు చెప్పి, శ్రీహరి మొండేనికి గుర్రపు తల అతికించమని చెబుతుంది. జగన్మాత చెప్పినట్లు బ్రహ్మ చేయగా, నారాయణుడు హయగ్రీవుడై హయశీర్షుని సంహరించి వేదాలను ఉద్ధరించాడని కథ.
వేరొక కథ ప్రకారం, మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి పాతాళంలో దాక్కుంటారు. వారిని సమ్హరించేదుకై పాతాళానికెళ్ళిన శ్రీహరి, అక్కడ గుర్రపు తల, మనుష్యశరీరంగల రూపును ధరించి గుర్రంలా పెద్దగా సకిలిస్తాడు. ఆ ధ్వనికి భయపడిన రాక్షససోదరులు, ఆ ధ్వని ఎక్కడినుంచి వచ్చిందోనని తెలుసుకోడానికి తాము దాక్కున్న చోటు నుంచి బయటకు వస్తారు. సరిగ్గా అదే సమయంలో శ్రీహరి వారు దాచిన వేదాలను తిరిగి సంగ్రహించి, బ్రహ్మదేవునికి అందజేసి, తిరిగి మధుకైటభుల్లున్న ప్రాంతానికి వచ్చి వార్ని సంహరిస్తాడు.
శ్రీహరి సకిలింపును గురించి తలచుకున్నప్పుడు మనకు అశ్వత్థామ గుర్తుకొస్తాడు. కృపి, ద్రోణుల పుత్రుడైన అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్శ్రవంలా (గుర్రం) సకిలించాడట. అందుకే అతని అశ్శ్వత్థామ అనే పేరు స్థిరపడిందట.
అలాగే గరుత్మంతుని కథ కూడా ఆ ఉచ్చైశ్శ్రవమనే గుర్రంతో ముడిపడిందే. గరుత్మంతుని తల్లి వినిత, ధరణీ దక్షుల కూతురైన ఈమె కశ్యప ప్రజాపతి భార్య. ఈమె సవతులలో కద్రువ ఒకామె. ఒకసారి కద్రువ, వినతలు సాగరతీరాన విహరిస్తూ ఉచ్చైశ్శ్రవాన్ని చూసి, దాని తోక నలుపా తెలుపా అన్న విషయంలో పోటీ పెట్టుకుంటారు. పోటిలో ఓడిపోయినవారు, గెలిచినవారికి దాస్యం చేయాలనేది పందెం. ఇంద్రుని గుర్రమైన ఉచ్చైశ్శ్రవం తోక తెల్లగానే ఉంటుంది. అదే విషయాన్ని గరుత్మంతుని తల్లి వినత చెబుతుంది. కానీ సర్పాలకు తల్లియైన కద్రువ కావాలనే ఆ గుర్రం తోక నల్లగా ఉందని పందెం వేసి, ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి వెయ్యిమంది సర్పకుమారుల దగ్గరకెళ్ళి ఆ గుర్రం తోకకు వేలాడి, తోకను నల్లగా చేయమంటుంది. అందుకామె కొడుకులు ఒప్పుకోరు. దాంతో కోపోద్రిక్తురాలైన కద్రువ, తన కొడుకులను జనమేజయుడు చేసే యాగములొ నశించమంటూ శాపం పడుతుంది. ఆమె శాపానికి భయపడిన కర్కోటకుడనే కొడుకు, తల్లి మాట ప్రకారం గుర్రం తోక పట్టుకుని వేలాడి, ఆ గుర్రం తోక నల్లగా కనిపించేట్లు చేస్తాడు. ఫలితంగా గరుత్మంతుని తల్లి వినత, కద్రువకు దాసి అవుతుంది. గరుత్మంతుడు తల్లిని దాస్యవిముక్తురాలిని చేయడం వేరే కథ.
మహాభారత యుద్ధంలో రథాలకు అత్యంత ప్రాముఖ్యత కనిపిస్తుంది. అలాగే రథాలను లాగే గుర్రాలకు కూడా రథాన్ని బట్టి సైన్యంలోని శ్రేణులు ఏర్పడుతుండేవి. ఈ శ్రేణులు అర్థరథ, సమరథ, మహారథ, అతిరథలంటూ పిలువబడేవి. రథి, సారథుల మధ్య అన్యోన్యత ఉండేది. రథాన్ని, రథికుడిని రక్షించడానికి రథచక్ర రక్షలుండేవారు. ఎవరి రథాలకు వారి ప్రత్యేక ధ్వజాలుండేవి. ప్రతివారి ఆయుధాలకు, ధ్వజాలకు, శంఖాలకు పేరులండేవి. ద్రోణాచార్యుని గుర్రాల ఎరుపు రంగుతో మెరిసిపోతుండగా, ధర్మరాజు రథానికున్న గుర్రాలు మాత్రం తెల్లటి గుర్రాలు ఉండేవట. అర్జునుని రథపు గుర్రాలు కూడా తెలుపువే. పాండవులలో అశ్వికదళానికి నకులసహదేవులు నాయకత్వం వహించగా, కౌరవుల పక్షాన శకుని అశ్విక సైన్యానికి అథిపతిగా ఉండేవాడు.
ఈ విధంగా మహాభారత యుద్ధంలో అశ్విక సైన్యానికి ఎనలేని ప్రాముఖ్యత ఉండేది. వేగంగావెళ్ళే అశ్వికసైన్యం శత్రువుల మీదకు అలలు అలలుగా మీదపడుతుండెదట. శత్రుసైన్యాన్ని వెనుక నుంచి ముట్టడించటానికి అశ్వదళాన్ని ఉపయోగించేవారట. అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీకృష్ణునికి అశ్వహృదయ విద్య తెలుసునని, ఆ విద్యను సైంధవ వధనాడు ప్రదర్శించాడనీ, నకులునికి అశ్వశిక్షణ బాగా తెలుసునని మహాభారతం ద్వారా మనకు తెలుస్తోంది.

ఇక రామాయణంలో శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి వదిలిన గుర్రాన్ని శ్రీరామచంద్రమూర్తి కుమారులు కట్టివెయడం, వారితో లక్ష్మణాదులు తలపడటం తదితర కథ మనకు తెలిసిందే. ఇంతకీ కారణం ఒక యాగాశ్వమే! సూర్యభగవానుడు తన ఏడుగుర్రాల రథంపై వస్తుండటాన్ని చిత్రపటాల్లో చూస్తుంటాం. ఆ ఏడు గుర్రాల పేర్లు : గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి. ఒకానొకప్పుడు సూర్యుడు, సూర్యునిభార్య సంజ్ఞాదేవి గుర్రాల రూపాలను ధరిస్తారు. ఆ సమయంలో వారికి నాసత్యుడు, దశ్రుడు అనే కుమారులు కలుగుతారు. వారే అశ్వినీదేవతలు. ఇలా గుర్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు మన పురాణాలలో కనబడుతుంటాయి.

అంతేకాదు, గుర్రానికి ప్రాముఖ్యతగల ఒక తీర్థం కూడా కన్యాకుబ్జం సమీపంలో ఉంది. విశ్వామిత్రుని తండ్రి గాధి. ఆయనకు సత్యవతి అనే కూతురు కూడా ఉంది. ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయవలసిందిగా గాధిని రుచీక మహర్షి కోరుతాడు. అది విన్న గాధి తనకు ఒక చెవి నలుపుగా, శరీరమంతా తెలుపుగా ఉండే వెయ్యిగుర్రాలను తనకిస్తే పిల్లనిచ్చి పెళ్ళి చేస్తానంటాడు. ఏమీ పాలుపోని రుచికుడు వరుణదేవుని ప్రార్థించగా, ప్రత్యక్షమైన వరుణుడు రుచికునితో, ‘ నీకు తలచిన చోట, తలచినపుడు ఆ గుర్రాలు లభిస్తాయని ‘ చెబుతాడు. రుచికుడు తనకు గంగానది ఉత్తరాన వెయ్యుగుర్రాలు కావాలని కోరగా అవి అక్కడ ప్రత్యక్షమవుతాయి. అప్పట్నుంచి ఆ ప్రదేశం అశ్వతీర్థంగా పేరుగాంచింది.

అగ్ని పురాణంలో గుర్రానికి సంబంధించిన విషయాలను ధన్వంతరి వివరించాడు. గుర్రం మనసులో బ్రహ్మ, బలంలో విష్ణువు, పరాక్రమంలో గరుత్మంతుడు, రెండు పక్కలా రుద్రగణాలు, బుద్ధిలో బృహస్పతి, మర్మస్థానంలో విశ్వేదేవులు, నేత్రాలలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీకుమారులు, జఠరాగ్నిలో స్వధ, నాలుకపై సరస్వతీ, వేగంలో వాయుదేవుడు, వెనుక భాగంలో స్వర్గం, కాలిగిట్టలలో అన్ని పర్వతాలు, రోమకూపాలలో నక్షత్రగణాలు, హృదయంలో చంద్రకళ, తేజస్సులో అగ్ని, పిరుదులలో రతి, లలాటంలో జగత్పతి, వక్ష: స్థలంలో వాసుకి ఉంటారట.
అందుకే గుర్రాన్ని ఉపయోగించడానికి కొన్ని నియమాలను మన పూర్వులు ఏర్పరిచారు. గుర్రంలో దేవతలంతా ఉంటారని భావిస్తూ, గుర్రం కుడి చెవిలో మంత్రరూపంలో చెప్పి గుర్రాన్ని ఎక్కడం మంచిదట. తొలిసారిగా గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసేందుకు అశ్వని శ్రవణ హస్త, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, ఉత్తరఫల్గుణీ నక్షత్రాలు మంచివట. గుర్రపు స్వారీ చేయడానికి శిశిర, హేమంత, వసంత ఋతువులు తగినవట. గ్రీష్మ, శరత్, వర్ష ఋతువులు గుర్రపుస్వారీకి మంచిది కాదట. పండుగల సమయాలలో కూడా గుర్రాలకు ఉన్న ప్రాముక్యత అంతా ఇంతా కాదు.
కొయ్యగుర్రాల ఆట మనకు తిరునాళ్ళలో తప్పకుండా కనిపించే దృశ్యం. సాధారణంగా వైష్ణవాలయ వాహనోత్సవాలలో శేషవాహణం, సింహవాహనం తదితర వాహనాలతో పాటూ స్వామివార్లు అశ్వవాహనంపై ఊరేగింపుగా రావడాన్ని చూస్తుంటాం.

No comments:

Post a Comment