Sunday, June 17, 2012

స్వామియే శరణం అయ్యప్ప


మహిష సంహారంకోసం హరిహరసుతుడు మణి కంఠునిగా ఈ భూలోకంలో అవతరించి, పంబాతీరంలో పసిబాలునిగా అడవిలో వేటకి వచ్చిన పందళరాజు కంటపడి, పిల్లలులేనిరాజు అగస్త్యమహర్షి ఆదేశంపై ఆ బాలుని పందళం తీసుకొని వెళ్ళి పెంచినట్లు ఒక కథ ఉంది. పిల్లలులేని రాజుకి మణికంఠుడు పందళం చేరాక సంతానము కలగడం, దేశం సస్యశ్యామలంగామారి పంటలు పడటం, మణికంఠునే రాజు,రాణి ప్రజలంతా అయ్య – అప్ప అంటూ పిలిచి, చివరకు అయ్యప్పగా పేరు స్థిరపడినట్లు మనకి తెలుస్తోంది. అయ్యప్ప అవతారంలోనే రాణికి వచ్చిన మయదారి వ్యాధిని నయం చేయడానికి వైద్యులు సలహమేరకు పులిపాలకోసం ఓంటరిగా అడవులకి వెళ్ళి, మహిషసంహారం చేసాడని, మహిష సంహారంతో దేవతలు దిగి వచ్చి, పొన్నంబలమేడువద్ద స్వర్ణాలయం నిర్మించి అయ్యప్పని పూజించారని కూడ చెబుతారు. తరువాత అయ్యప్ప పులిపాల కోసం అడవులకు వచ్చి నట్లు చెప్ప్డంతో దేవేంద్రుడు ఆడపులిగా, మిగతా దేవతలు పులిమందగా మారడంతో అయ్యప్ప పులివాహనం ఎక్కి పందళం రావడం చూసిన దేశప్రజలు, రాజు, రాణి అంతా భయభ్రాంతులై పులులమందను ముందు అడవికి తిరిగి పంపమని ప్రార్థిస్తారు.

అయ్యప్ప కరుణించి పులిమందను వెనక్కి పంపి, తన అవతారలక్ష్యం నెరవేరడం వలన అవతారం చాలిస్తున్నాని చెప్పి, బాణమో, కత్తో విసిరి, అది పడినచోట దేవాలయం కట్టమని, అక్కడ స్వామికొలువు తీరి ఉంటానని చెప్పడంతో, శబరిమల వెలుగులోకి వచ్చింది. రామావతారంలో శ్రీరాముడు వనవాసం చేసి, సీతాన్వేషణ చేస్తున్న తరుణంలో భక్తురాలు శబరి శ్రీరామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చి, కొలిచిన కొండవడం వలన ఈ కొండకు శబరిమల అని పేరు వచ్చింది. శబరి ఆ కొండపై నివసించడం మూలంగా ఆ కొండకు పవిత్రత వచ్చింది. అయ్యప్పస్వామి విసిరిన బాణం లేక చురిక శబరిమలలో పడడం వలన్ స్వామి కోరికమేరకు పరశురామునిచే పదునెనిమిదిమెట్లు (పదునెట్టాంబడి), చిన్ముద్ర, అభ్యహస్తం, పట్టబందాసనంలో కూర్చున్న అయ్యప్ప శిలావిగ్రహాన్ని పరశురాముడే ప్రతిష్టించగా, పందళరాజు దేవాలయాన్ని నిర్మించినట్లు భూతనాదోపాఖ్యానీయం వలన, కేరళలో ప్రచారంలోనున్న జాంపదగీతాల వనల తెలుస్తోంది. పందళరాజు కోరికపై సంవత్సరానికొకసారి మకరసక్రాంతిరోజు సాయంత్రవేళ జ్యోతిరూపంలో దర్శనమిస్తానని అయ్యప్పస్వామి మాట ఇచ్చినందునే ఏతికె జ్యోతిదర్శనం అవుతోంది.

హరిహరులకు పుత్రుడు, విష్ణువు మోహినీ వతారం దాల్చి సోయాగలతో శివుని మురిపించినట్లు, మొహెనీ అందచందాలకు శివుడు పారవశ్యంచెంది, ఆమెను కౌగిలించుకోగా, ధర్మశాస్తా అవతరించినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆ ధర్మశాస్తావే మణికంటునిగా అవతరించి తరువాత అయ్యప్పగా ప్రచారం పొందాడు.
అయ్యప్పగా అవతరించిన దర్శశాస్తా విగ్రహరూపాన లీనమై అంతర్థానమయినట్లు, తన దర్శనానికి శబరిమల వచ్చేవారు నియమనిష్ఠలు పాటించి రావాలని, బ్రహ్మచర్యం అంటే తనకు ఇష్టం కాబట్టి, కనీసం మండలకాలం కఠినబ్రహ్మచర్యం పాటించి రావాలని ఆదేశించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటినుండి శబరిమలకి మరలా భక్తులు జ్యోతి దర్శనానికి మాత్రమే శబరిమల వెళ్ళేవారు.ఎరుమేలిమార్గం ఒక్కటె ఆ రోజులలో శబరిమల వెళ్ళడానికి మార్గం. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి మార్గమే వెళ్ళివచ్చేవారు.పూర్వం కాశీకి వెళ్ళినవారు కాటికి వెళ్ళిన వారితో సమానమే అన్న నానుడిల శబరిమలయాత్రకి వెళ్ళినవారిని అలాగే అనుకునేవారు. అందుకే శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులో ఉన్నట్లు తెలుస్తోంది. వంద సంవత్సరాలుగ అంటె 1920 సంవత్సరం తరువాత శబరిమల వెళ్ళే వారి సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1970-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి ఆవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.
ఈసారి శిలా విగ్రహానికి బదులు, అ
య్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు నవంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడాం ప్రారంభించారు.
శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు. దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేఅపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.
శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. 1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, గొల్లపూడి (విజయవాడ) మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు. మన ఆంధ్రరాష్ట్రంలోనే వెయ్యికి మించి అయ్యప్పదేవాలయాలు నిర్మించి నట్లు తెలిసింది. అమెరికా, సింగపూరు, సిలోన్, జర్మనీ, ఇంగ్లండు మున్నుగు దేశాలలో కోట్లరూపాయలు వెచ్చించి అయ్యప్ప దేవాలయాలు నిర్మించినట్లు తెలుస్తోంది. నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.
శమరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కాక్క క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు. కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.
1985 నుండే దేవస్థానంవారి ప్రకటనతో అనేకమంది భక్తులు ఆకర్షితులై విరివిగా విరాళాలు అందజేసి, శబరిమల సన్నిధానంలో స్వాములు ఉండడానికి వసతి సౌకర్యాలకోసం బహుళ అంతస్తుల కాంక్రీటు భవనాలు నిర్మించడానికి పూనుకొనడంతో పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరుపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.
2000 సంవత్సరం వచ్చేసరికి శబరిమలలో సౌకర్యాలు పెరగడంతోపాటు యాత్రికుల సంఖ్య ఐదుకోట్లకు చేరినట్లు, ఆదాయం కూడా ముప్పైకోట్లువరకు పెరిగినట్లు చెబుతారు. సంవత్సరం, సంవత్సరం శబరిమలయాత్ర చేసేవారి సంఖ్య పెరుగుతూ, దేవాలయ ఆదాయం పెరుగుతోంది. తిరుమలలోవలె శబరిమాలో కూడా కాటెజీలు, యాత్రా సెంటర్లు, హోటళ్ళు అన్నీ రావడాంతో శబరిమల స్వరూపం పూర్తిగా మారిపోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్లు సంఖ్య పెరగడంతో భక్తి సన్నగిల్లుతోంది. సుఖాలకు, సౌకర్యాలకు, అలవాటుపడి మండలదీక్ష, 7రోజులకు, 15 రోజులకు, 21 రోజులకు పరిమితమవుతోంది. ఒకనాడు స్వామి నామాలు, శరణుఘోషతప్ప వేరేమాటలు శబరిమల సన్నిధానంలో వినిపించేవి కావు. నేడు సెల్ ఫోన్లు, టెలిఫోన్ల మోతలు, రకరకాల మాటలు వినిపించడం బాధాకరంగా ఉంటోంది.
శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూఆరిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.
స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. ఎక్కవచ్చు. మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.
అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.
ఓం స్వామ్యే శరణమయ్యప్ప!!

No comments:

Post a Comment