Sunday, June 17, 2012

అన్ని సుగుణాలలో మహోన్నతమైన దేది?


మన ప్రాచీనులు మనం అలవరుచుకోవలసిన అనేక సుగుణాలను ప్రతిపాదించారు. ప్రతీయొక్క సుగుణంలో ఎంతో పరమార్థం దాగి వుంది.  అయితే ఈ సుగుణాలలో “ఓర్పు” (సహన శక్తి) అత్యోన్నత మైనదిగా చెప్పబడింది. ఒక మనిషి యొక్క ఓర్పు గుణం జీవితములోని అనేక ఓడిదుడుకులను మరియు కష్టనష్టాలను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కునేలా తోడ్పడుతుంది. అలాగే ఇతరులు తన యెడల చేసిన పొరపాట్లను క్షమించగలిగే మహోన్నతమైన గుణాన్ని ప్రసాదిస్తుంది. శిక్షించగలిగి శిక్షించక పోవడాన్నే క్షమాగుణం అని అంటారు. లేదా చేసిన తప్పుకు శిక్షించి తప్పు చేసిన వాడి యెడల కక్షను లేదా శత్రుత్వ భావనను కలిగి వుండక పోవడము సైతం క్షమాగుణమే అవుతుంది.

దేవతలందరికీ క్షమాగుణం అలంకారమై యున్నది. ఇలా ‘ఓర్పు” అనేక ఇతర సుగుణాలను సాధించడానికి సహకారిగా ఉంది.

జీవితంలో విజయము పొందుటకు ఒక వ్యక్తికి శ్రద్ధ మరియు ఓర్పు ఎంతగానో అవసరమై ఉన్నాయి. మనిషి బ్రతికి ఉన్నంత కాలం ఎవరో ఒకరు ఎదో విధంగా నిందిస్తూ, అవమానిస్తూ, విమర్శిస్తూ మరియు పుకార్లు లేపుతూ ఇలా అనేక విధాలుగా ప్రవర్తిస్తూనే వుంటారు. వీటన్నింటిని మనం మన “ఓర్పు”  అనే విగ్రహాన్ని తీర్చిదిద్దడానికి మనపై పడుతున్న ఉలి దెబ్బలని భావించగలిగితే మన వ్యక్తిత్వం దివ్యంగా మారుతుంది. మనల్ని ఎవరైన విమర్శించినప్పుడు ఆ విమర్శలో ఎంతవరకు వాస్తవముందో గ్రహించి, అలాంటి లోపం నిజంగా మనలో ఉంటే దాన్ని తొలగించుకోవాలి.

ఓర్పు విషయంలో మనం భూమాతను ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు. నిరంతరంగా మానవులు తనకూ, తన ప్రకృతికి ఎంతో బాధ కలిగించినా సహనంతో మసలుతూ, నిరంతరం క్షమిస్తూ విజేతయై నిత్యం పూజింపబడుతోంది. “సత్యమేవ జయతే” అన్నట్లు సత్యస్వరూపమైన ఓర్పు ఓ మనిషిని మహాత్ముడిని  చెస్తుంది.

No comments:

Post a Comment