Saturday, June 16, 2012

భక్త జయదేవ


ఆధ్యాత్మిక సంపాదకు, భక్తిశ్రద్ధలకు నిలయమైన దేశంలో పవిత్రమైన, దివ్యమైన క్షేత్రంగా పేరు గడించింది “పూరి". పూరికి దగ్గరలో ఒక కుగ్రామం వుంది. ఆ గ్రామం పేరు – ‘కిందుబల్వం’. దానినే బిందుబిల్వం అని కూడా పిలుస్తారు. ఆ గ్రామంలో నివసిస్తూవుండేవాడు ఒక నిరుపేద. ఆతను విద్య నేర్చినవాడు. పూరి జగన్నాథుడి పట్ల అమితమైన భక్తిగలవాడు. ఆయన పేరు “భోజదేవుడు" ఆయన సతీమణి రమాదేవి. ఆమెను అందరూ వామాదేవి అని కూడా పిలుస్తారు. ఆమె భర్తకుతగ్గ భార్య. దంపతులిద్దరూ దైవభక్తి పరాయణులుగా పేరు గడించారు. ఆ దంపతులంటే అందరికీ గౌరవభావం.

ఆ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. పిల్ల వాడికి “జయదేవుడు" అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా చూసుకోసాగారు. జయదేవుడు చిన్నతనంలోనే తండ్రి వద్ద భారత, రామాయణ, భాగవతాలను నేర్చుకున్నాడు. చిలిపికృష్ణుడి అల్లరిచేష్టలు తెలుసుకుని ఆనందించాడు. తమ లాగే తమ పుత్రుడు నిరుపేద కాకూడదను కున్నారు. అందుకే తాము కష్టపడ్డా లెక్కచేయక కుమారుడిని సకల విద్యలలోనూ పరిపూర్ణుడిని చేయడానికి కృషిచేశారు. తల్లిదండ్రుల ఆసక్తిని, కోరికను, వారు చూపిస్తున్న ప్రేమను, కనబరుస్తున్న ఆప్యాయతానురాగాలను తెలుసుకున్న జయదేవుడు, ఆ ప్రకారమే సకల విద్యాపారంగతుడుడయ్యాడు.

జయదేవుడు విద్యావంతుడైతే అయ్యాడుగానీ, దారిద్రం మాత్రం తీరలేదు. తపస్వాధ్యాయనాలలో కాలం గడపడం ప్రారంభించాడు. ఇలాంటి స్థితిలో ఒక రోజు దేవశర్మ అనే వ్యక్తీ జయదేవుడి దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రక్కనే యుక్త వయస్సులో వున్న అందమైన యువతి వుంది.

దేవశర్మ పూరికి చెందినవాడు. జగన్నాథుడి భక్తుడు. ఆయన భార్య విమలాంబ. ఆమె భర్తకు మించిన భక్తురాలు. ఆ దంపతులకు జగన్నాథుడే సర్వం. నిత్యం ఆ జగన్నాథునే స్మరిస్తూ కాలం గడుపుతున్నారు. అయితే వారికి వుండేలోటు ఒక్కటే…సంతానం లేక పోవడం. సంతానం కోసం ఎన్నో వ్రతాలు, పూజలు, నోములు నోచారు. చివరకు పిల్లలు పుడితే మొదటి సంతానాన్ని జగన్నాథుడికే సమర్పిస్తానని మొక్కుకున్నాడు. శరణన్న భక్తుల మొరలను ఆలకించి…వారిని కాపాడటమే ఆ జగన్నాథుడి చర్యకదా… అందుకే ఆ దంపతుల మొరను ఆలకించాడు. కొంత కాలానికి ఆ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది.

పద్మావతి ఆని నామకరణం చేశారు. దైవప్రసాదంగా భావించి పద్మావతిని అల్లారుముద్దుగా, గోముగా పెంచసాగారు. పద్మావతి పెరిగి పెద్దదై యుక్తవయస్సును చేరింది. దేవశర్మకు జగన్నాథుడికి ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చింది. ఒకరోజు పద్మావతిని తీసుకుని ఆలయానికి వెళ్లాడు.

జగన్నాథుడికి ప్రణమిల్లి, “స్వామి మా కోరికను మన్నించి, మాకు సంతానాన్ని ప్రసాదించావు. నా మొదటి సంతానం పద్మావతిని మీకు అర్పిస్తున్నాను స్వీకరించండి స్వామీ" అంటూ ప్రార్థించాడు. వేడుకున్నాడు. జగన్నాథుడు ఉలకలేదు…పలకలేదు… దేవశర్మ ఆలయం మూసేంతవరకూ నిరీక్షించి, చివరకు ఇలు చేరుకున్నాడు.

ఆరోజు రాత్రి నిద్రిస్తున్న దేవశర్మకు ఒక స్వప్నం వచ్చంది. జగన్నాథుడు ప్రత్యక్షమై. “భక్తా! పద్మావతిని జయదేవుడనే భక్తుడికి ఇచ్చి వివాహం చేయి. అదే నా కోరిక" అని ఆజ్ఞాపించాడు. అందుకే కూతురిని వెంటబెట్టుకుని దేవశర్మ, జయదేవుడి దగ్గరకు వచ్చారు. దేవశర్మ తన మనసులోని మాటను జయదేవుడికి చెప్పాడు.

“నేను నిరుపేదను…మీ అమ్మాయికి తగినవాడిని కాదు" అన్నాడు జయదేవుడు. “అలా అనకు నాయనా! ఇది జగన్నాథుడి ఆజ్ఞ. పద్మావతికి నీవే తగిన భర్తవు. ఇది ఆ దేవుడే నిర్ణయించాడు” అన్నాడు దేవశర్మ. కాదు అన్నట్లుగా తలఊపాడు జయదేవుడు.

“నా మాటకు అడ్డుచెప్పకు. మా అమ్మాయి పద్మావతిని నీ వద్దే వుంచి వెళతాను. తరువాత నీ ఇష్టం" అని జయదేవుడితో చెప్పి పద్మావతివైపు తిరిగి – “అమ్మా పద్మావతీ! ఈ జయదేవుడే నీ భర్త. ఆయన చెప్పినట్లుగా వింటూ – అయన అడుగుజాడలతో నడుచుకుంటూ కలకాలం కలిసి మెలసి వుండండి" అని చెప్పి పద్మావతిని అక్కడే వదిలి వేసి వెళ్లాడు దేవశర్మ.

జయదేవుడు నిల్చునివున్నాడు. ఎదురుగా నేలపై చూస్తూ పద్మావతి నిలబడివుంది. ఇద్దరూ ఎదురెదురుగా నిల్చున్నా, వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. నెల చూపులు చూస్తున్న పద్మావతిని నిశితంగా పరిశీలించాడు జయదేవుడు. అమాయకమైన ముఖంతో నిలబడి వున్న పద్మావతిని చూస్తే దయ, జాలి బయలుదేరాయి జయదేవుడిలో. “నీకు భయమా వేయడంలేదా?” అడిగాడు జయదేవుడు. “మీరున్నారు కదా? భయం ఎందుకు?!” ఎదురు ప్రశ్న వేసింది పద్మావతి. “ఈ నిరుపేద నిన్నెలా రక్షిస్తాడు? ఎలా పోషిస్తాడు…? మళ్ళీ అడిగాడు జయదేవుడు.

“నా దైవం మీరే. ఇది నా నిర్ణయం కాదు. సాక్షాత్తూ ఆ జగన్నాథుడి నిర్ణయం. ఆ జగన్నాథుడే మీ దగ్గరకు పంపిస్తే ఇక నాకెందుకు భయం? దైవ నిర్ణయానికి మించింది ఈ లోకంలో వుందా?” వేదాంతిలా పలికింది పద్మావతి. పద్మావతి మాటలు జయదేవుడికి నచ్చాయి. వారిద్దరి వివాహం జరిగింది. మరి జగన్నాథుడే గీత గీస్తే అది చెరిపివేయడం ఎవరికీ తరం? ఆ దంపతులిద్దరూ ఉన్నంతోనే హాయిగా, ఆనందంగా కాలం వెళ్ళబుచ్చ సాగారు. వారిది ఆదర్శదాంపత్యం.

సకల విద్యాపారంగతుడైన జయదేవుడిలోని భక్తి కీర్తనం వైపుకు మళ్ళింది. దేవుడిపైన కావ్యాల రచనను ప్రారంభించాడు. అలా దైవచింతనలో పాటలు, కీర్తనలు వ్రాసి దేవుడి సన్నిధిలో వాటిని గానం చేసి వాటని ఆ దేవునికే అంకితం ఇవ్వసాగాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పది చివరకు బెంగాల్ రాజు అయిన లక్ష్మణసేనుడి చెవిలో పడింది. లక్ష్మణసేనుడు సంగీత సాహిత్యప్రియుడు. పండితుడు, ప్రబంధరచనా పటిమగాలవాడు. స్వయంగా సాహిత్యప్రియుడు కదా. కవులన్నా, కళాకారులన్నా లక్ష్మణసేనుడు దేవుడితో సమానంగా చూసేవాడు. జయదేవుడిని గురించి తెలుసుకున్న లక్ష్మణ సేనుడు జయదేవుడిని ఆస్థానానికి పిలిపించుకున్నాడు. ఆస్థాన కవిని చేసి సత్కరించాడు.

జయ దేవుడి పేదరికం తొలగిపోయింది. లక్ష్మణ సేనుడి సాంగత్యంలో జయదేవుడు ఎన్నో రచనలు గావించాడు. ప్రజలు, ప్రభువులూ జయదేవుడిని కీర్తించసాగారు. మరో ప్రక్క లక్ష్మణసేనుడికి, జయదేవుడికి మధ్య రాజు కవి సంబంధమే కాదు, స్నేహ సంబంధమూ మొగతోడిగి పుష్పించింది.

లక్ష్మణసేనుడి ఆదరణతో రూపుదిద్దుకున్న కావ్యం గీతాగోవిందం. దీనినే జయదేవుడి అష్టపదులు అని కూడా పిలుస్తారు.

“రాధికా తన విరహే కేశవ…”

“ధీర సమీరే యమునా తీరే…”

“చందన చర్చిత నీల కళేబర…”

“సావిరహే తన ధీనా రాధా…”

“పశ్యతి దిశ దిశ రహసి భవతం…”

ఇలా గానం చేస్తూ వ్రాయడం మొదలుపెట్టాడు జయదేవుడు గీతా గోవిందంను. రాధామాధవుల ప్రణయం, విరహం, కలహం. ఇలా ఒక్కటేమిటి అన్నీ వర్ణించాడు. జయదేవుడు ఈ అష్టపదులను గానం చేస్తూ, వ్రాస్తూ వుంటే పద్మావతి అందుకు తగ్గట్టుగా నాట్యం చేస్తూంది. అలా ఆటపాటలలో జయదేవుడు రాధాకృష్ణుల ప్రణయాన్ని ఇతి వృత్తంగా చేసుకుని 12 సర్గలలో 24 అష్టపదులలో 72 శ్లోకాలతో గీతా గోవిందంను పూర్తిచేశాడు.

అంతటిలో ఆగాడా? లేదే…రతిమంజరి, చంద్రలోకం, కారకవాదము, తత్త్వచింతామణి వంటి రచనలు చేసాడు.

జయదేవుడు ఇటు రచించాడో లేదో…అటు ప్రజలనాలుకల మీద ఆ కావ్యములు నాట్యమాడడం ప్రారంభించాయి. ముఖ్యంగా ‘అష్టపదుల’ పట్ల ప్రజల్లో మక్కువ ఎక్కువైంది. ఏ ఉత్సవామైనా సరే… ఏ పూజ అయినా సరే… ఏ ఆలయమైనా సరే…ఇలా ఎక్కడ చూసినా జయ దేవుడి అష్టపదుల గానమే! తన ఆస్థాన కవి జయదేవుడు రచించిన “గీతా గోవిందం"కు అంట పేరు ప్రఖ్యాతులు రావడం లక్ష్మణసేనుడిని ఆనందపరించింది. అయితే ఏదో మారు మూల ఈర్ష్య కూయా చోటు చేసుకుంది.

ఈర్ష్యకు కారణం రాజు కూడా అలాంటి పాటలే రచించాడు. అవి జగన్నాథుని గుణగణాలను పొగుడుతూ వ్రాసినటువంటివే. అయితే ప్రజలు జయదేవుడి పాటలే పాడుతున్నారు కానీ, రాజుగారివి ఎవరూ పాడడం లేదు.

బాధపడ్డాడు. చివరకు ప్రజల అభిప్రాయాన్ని అడిగాడు. జయదేవుడి పాటలు నచ్చినంతగా రాజుగారి పాటలు నచ్చలేదని వారు తేల్చి చెప్పారు. జయదేవుడి పాటలు దేవుడికీ ఇష్టమన్నారు. పైకి అంగీకరించినా, లోపల మాత్రం బాధ తగ్గలేదు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన రాజు -

“నా , జయదేవుడి పాటలను స్వామివారి పాదాల దగ్గర వుంచుదాం. నచ్చిన పాటలను తన వద్ద ఉంచుకుంటాడు. నచ్చనివి దూరంగా వేస్తాడు. ఇది మీకు అంగీకారమేనా?” అని ప్రజలను అడిగాడు.

అందుకు వారు సిద్ధమయ్యారు.

జయదేవుడి అష్టపదులనూ, రాజు పాటలను ఆలయంలోని దేవుడి పాదాల వద్ద వుంచారు. ఆ రాత్రి ఆలయాన్ని మూశారు. అందరిలోనూ ఆతృత. దానికి సంబంధిచిన ఆలోచనలే. ముఖ్యంగా రాజులో అయితేమరీ ఎక్కువ.

తెల్లవారింది. ఆలయం తెరిచే సమయం అయింది. ఆశతో రాజు గుడి దగ్గరకు చేసుకున్నాడు. ప్రజలూ అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయ తలుపులు తెరిచారు.

ప్రజలు ఆనందంతో చిందులు వేసారు. జయదేవుడి గీతాగోవిందం ఆలయంలోని జగన్నాథుడి తలమీద వుంది. రాజుగారి పాటల పుస్తకం ఎక్కడో దూరంగా పడివుంది. రాజు సిగ్గు పడ్డాడు. బాధ పడ్డాడు. చివరకు దేవుడే మెచ్చిన జయదేవుడి పైన ఈర్ష్య పడడం తన మూర్ఖత్వం అనుకున్నాడు.

జయదేవుడి అష్టపదుల ప్రచారానికి కృషి చేయాలని భావించాడు. రాజు అనుకంటే దెబ్బలకు కరువా? ఇక దేశంలో ఎక్కడ చూసినా అష్టపదుల గానమే!

నేటికీ జయదేవుడి జన్మస్థలమైన “భిందుబిల్వం”లో జయదేవుడి ఆరాధనోత్సవాలు ‘ఘనంగా జరుగుతూ వుండగా పూరీలోని జగన్నాథస్వామీ ఆలయంలో ప్రతిరోజూ అష్టపదుల గానం సాగుతూ వుంది.

దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు దాటిన నేటికీ అష్టపదుల అలరిస్తూ వున్నాయంటే – అష్టపదుల సాహిత్య, సంగీత కీర్తి ప్రతిష్టలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

జయదేవుడు రచించిన గీతాగోవిందం నేటికీ నిత్యనూతనమై విరాజల్లుతూ అందరినీ అలరిస్తోంది.

No comments:

Post a Comment