Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 9


సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులూ, చెక్కిళ్ళూ కొరికి ఒక్క గెంతుతో రాముడి వద్దకు వెళ్ళిపోయాక కుంభకర్ణుడు దేహమంతారక్త ధారలు కారుతూ, ఒక్క క్షణం పాటు కొండ లాగా నిలబడిపోయి, తిరిగి యుద్ధ భూమికే బయలుదేరాడు. తన చేతిలో ఆయుధం లేదని జ్ఞాపకం వచ్చి అతనొక భయంకరమైన ముద్గరాన్ని దారిలోనే ఎత్తుకుని యుద్ధరంగానికి వెళ్ళాడు. అక్కడ అతను కోపావేశంతో కనిపించిన ప్రాణులన్నిటినీ పట్టుకుని తినసాగాడు.

ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి ఎదిరించి, అతనిపై బాణాలు వేశాడు. కాని ఆ బాణాలను కుంభకర్ణుడేమాత్రమూ లక్ష్య పెట్టలేదు. అతను అందిన వానరులను పట్టుకుని తింటూ రాముడికేసి పోసాగాడు. రాముడొక భయంకరమైన అస్త్రాన్ని వేసి కుంభకర్ణుడి రొమ్ములో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడి నోట జ్వాలలు వెలువడ్డాయి. అతను అక్కడే పడిపోయాడు.

కుంభకర్ణుడు మళ్ళీ లేవకుండా అతనిపై ఎక్కి నుంచోమని లక్ష్మణుడు వానరులతో చెప్పాడు. అయితే కుంభకర్ణుడు తనపైకి ఎక్కిన వానరులను చీమలను దులిపినట్టు దులిపేశాడు. అది చూసి రాముడు కుంభకర్ణుణ్ణి సమీపించి తన వింటి నారిని మోగించాడు. కుంభకర్ణుడు లేచి నిలబడి పెద్ద పర్వతంలాగా రాముడికెదురు వచ్చాడు.
రాముడతన్ని చూసి, ‘‘కుంభకర్ణా, భయపడకు! రా! ఇంద్రుణ్ణి జయించావు కాబోలు. నేను ఇంద్రుణ్ణి కాదు, రాముణ్ణి! నిన్నిప్పుడే ఒక్క క్షణంలో చంపబోతున్నాను,’’ అన్నాడు.


 ‘‘నేను కూడా విరాధుణ్ణీ కాను; కబంధుణ్ణీ, ఖరుణ్ణీ, వాలినీ, మారీచుణ్ణీ కూడా కాను; కుంభకర్ణుణ్ణి! వచ్చాను! నీ ప్రతాపమేమిటో నాకు చూపించు, ఆ తరవాత నిన్ను తినేస్తాను,’’ అన్నాడు కుంభకర్ణుడు. రాముడు వేసిన మామూలు బాణాలు కుంభకర్ణుణ్ణి ఏమీ చెయ్యలేక పోయాయి.

అప్పుడు రాముడు కుంభకర్ణుడి పైన వాయువ్యాస్త్రం ప్రయోగించాడు. అది ముద్గరం పట్టి ఉన్న కుంభకర్ణుడి చేతిని ఖండించేసింది. కుంభకర్ణుడు పెద్దగా అరిచాడు.

కుంభకర్ణుడు ఒక చెయ్యి పోగొట్టుకుని, రెండో చేత్తో ఒక మహావృక్షాన్ని పెరికి రాముడి పైకి వచ్చాడు. రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా, చెట్టుతో సహా, నరికేశాడు. తరవాత అతను రెండు అర్ధచంద్ర బాణాలతో కుంభకర్ణుడి పాదాలు నరికేశాడు. కుంభకర్ణుడు పర్వతంలాగా విరుచుకుపడిపోయి, గుహ లాంటి నోరు తెరిచి గర్జిస్తుంటే, రాముడా నోటి నిండా బాణాలు కొట్టాడు. కుంభకర్ణుడు మూర్ఛపోయి ఉన్న స్థితిలో రాముడొక దివ్యాస్త్రంతో కుంభకర్ణుడి తల నరికేశాడు.

కుంభకర్ణుడు రాముడి చేత చచ్చాడన్న వార్త వింటూనే రావణుడు మూర్ఛపోయి తరవాత తమ్ముడి కోసం దుఃఖించాడు. తమ్ముడి కోసం దుఃఖిస్తున్న రావణుణ్ణి ఓదార్చి, త్రిశిరుడూ, అతికాయుడూ, దేవాంతకుడూ, నరాంతకుడూ, మహోదరుడూ, మహాపార్శ్వుడూ అనే ఆరుగురు రాక్షస యోధులు యుద్ధానికి బయలుదేరారు.
తిరిగి రాక్షస వానర సేనల మధ్య దొమ్మి యుద్ధం ఆరంభమయింది. నరాంతకుడు వానర సేన మధ్యకు జొరబడి, తన ఈటెతో వానరులను వందల సంఖ్యలో చంపసాగాడు. అప్పుడు సుగ్రీవుడు అంగదుణ్ణి అతనిపైకి పంపాడు.

అంగదుడు నరాంతకుడికి ఎదురు వెళ్ళి, ‘‘ఆ ఈటెను సాధారణ వానరుల పైన ఎందుకు ప్రయోగిస్తావు? దానితో నన్ను కొట్టు,’’ అన్నాడు. నరాంతకుడు తన ఈటెను బలంగా అంగదుడి రొమ్ము మీద కొట్టాడు. అది కాస్తా విరిగి పడిపోయింది. అంగదుడు నరాంతకుడెక్కి ఉన్న గుర్రాన్ని నెత్తిమీద అరచేత్తో చరిచే సరికి అది తల పగిలి చచ్చిపోయింది. నరాంతకుడు తన పిడికిలి బిగించి గట్టిగా మొట్టేసరికి అంగదుడి తల పగిలి రక్తం కారసాగింది.


 ‘‘వీడి కింత బలం ఉందా?’’ అని ఆశ్చర్యపడి అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుడి రొమ్ములో గట్టిగా పొడిచేసరికి నరాంతకుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు.

అది చూసి మహోదరుడూ, దేవాంతకుడూ, త్రిశిరుడూ అంగదుడిపైకి వచ్చారు. ఆ ముగ్గురితోనూ ఒంటరిగా పోరాడుతూన్న అంగదుడికి హనుమంతుడూ, నీలుడూ తోడు వచ్చారు. వారి మధ్య జరిగిన యుద్ధంలో హనుమంతుడు దేవాంతకుణ్ణి తల పగలగొట్టి చంపేశాడు. అలాగే నీలుడి చేతిలో మహోదరుడు చచ్చాడు. మళ్ళీ హనుమంతుడే త్రిశిరుడితో చాలా సేపు యుద్ధం చేసి అతని కత్తితోనే అతని కంఠం నరికేశాడు.

ఈ లోపల రాక్షస వీరులలో ఒకడైన మహాపార్శ్వుడు భయంకరమైన గద ఒకటి తీసుకుని వానరుల పైకి పోయేసరికి, ఋషభుడనే వానరవీరుడు అతనితో తలపడి, అతని గదాఘాతానికి గురై కూడా, ఆ గదతోనే మహాపార్శ్వుడి తల పగలగొట్టేశాడు. మహాపార్శ్వుడు కూడా చావగానే రాక్షసులు ఆయుధాలు పారేసి పారిపోయారు.
అలా పారిపోయే రాక్షసులను చూసి, అతికాయుడు చాలా కోపంచెంది, రెండో కుంభకర్ణుడి లాగా వానరసేనపై పడ్డాడు.

‘‘ఇతను రావణుడికి ధాన్యమాలిని యందు పుట్టిన కొడుకు, అతికాయుడు. లంకకు ఇతను కూడా పెట్టనికోట లాంటివాడే. బ్రహ్మ నారాధించి దివ్యాస్త్రాలు పొందినవాడు. ఇతని సంగతి వెంటనే తేల్చకపోతే వానరసేనను బాణాలతో నాశనం చేయగలడు,’’ అని విభీషణుడు రాముడికి చెప్పాడు. ఈ లోపల అతికాయుడు సింహనాదం చేస్తూ వానరసేనలో ప్రవేశించాడు. కుముదుడూ, ద్వివిదుడూ, మైందుడూ, నీలుడూ, శరభుడూ ఏకమై అతన్నెదిరించారు. అతను వారందరినీ ఉక్కుబాణాలతో కొట్టి బాధించాడు. తరవాత అతను రాముడున్న చోటికి వచ్చి, ‘‘నేను అల్పులతో యుద్ధం చెయ్యను, సమర్థుడెవడన్నా ఉంటే నాతో యుద్ధానికి రావచ్చు,’’ అన్నాడు.


 ఆ మాట విని లక్ష్మణుడు రోషంతో అతని ముందుకు వచ్చి తన వింటినారిని మోగించి సవాలు చేశాడు. ‘‘లక్ష్మణా, నువ్వు అర్భకుడివి, నాతో యుద్ధం చేసి, నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకు,’’ అన్నాడు అతికాయుడు. ‘‘నీ ప్రతాపం ఉత్తమాటలలో గాక, చేతలలో చూపించు,’’ అన్నాడు లక్ష్మణుడు.

ఇద్దరూ బాణాలతో యుద్ధం ప్రారంభించారు. ఒకరినొకరు బాణాలతో నొప్పించారు. ఒకరి బాణాల నొకరు పడగొట్టారు. అతికాయుడు అభేద్యమైన కవచం ధరించి ఉండటం చేత లక్ష్మణుడి బాణాలు అతన్ని ఏమీ చెయ్యలేకపోయాయి. ఈ సంగతి గ్రహించి, లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతికాయుడి తల నరికేశాడు.

ఆరుగురు మహాయోధులైన రాక్షస వీరులూ చచ్చారని వినగానే రావణుడు అంతులేని దుఃఖసముద్రంలో మునిగిపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు తన తండ్రిని చూసి, ‘‘ఇంద్రజిత్తు బతికి ఉండగానే ఈ విచారం దేనికి? నేనిప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులను యుద్ధంలో చంపి తిరిగి వస్తాను,’’ అన్నాడు. రావణుడు సరేనన్నాడు. ఇంద్రజిత్తు ఉత్తమమైన గాడిదలు కట్టిన రథం పైన ఎక్కి, రాక్షసులతో యుద్ధభూమికి బయలు దేరాడు.

యుద్ధభూమిలో, తన రథం చుట్టూ రాక్షసులను కాపలా ఉంచి, ఇంద్రజిత్తు హవిస్సులను హోమం చేసి, నల్లమేకను బలి ఇచ్చాడు. అగ్ని పొగ లేకుండా మండి అతనికి విజయాన్ని సూచించింది. తరవాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం జపించి, దానితో తన ధనుస్సునూ, రథాన్నీ అభిమంత్రించాడు. ఇదంతా పూర్తి అయ్యూక ఇంద్రజిత్తు తన రథంతోనూ, సారథితో సహా ఆకాశంలోకి వెళ్ళి అంతర్థానమైపోయాడు. రాక్షససేన అమితోత్సాహంతో యుద్ధానికి కదిలింది. వానరసేనపై దారుణమైన హత్యాకాండ సాగింది. ప్రముఖ వానరవీరులైన గంధమాదనుడూ, నలుడూ, మైందుడూ, గజుడూ, జాంబవంతుడూ, సుగ్రీవుడూ, ఋషభుడూ, అంగదుడూ, ద్వివిదుడూ ఇంద్రజిత్తు ప్రయోగించిన తీవ్రమైన బాణాలతో గాయపడ్డారు; కొందరు మూర్ఛపోయారు. ఇంక చచ్చిన వానరులకు లెక్కే లేదు. ఇంద్రజిత్తు ఆకాశంలో ఎక్కడ ఉన్నదీ వానరులకు కనిపించనైనా లేదు.


 ఇంద్రజిత్తు కురిపించే బాణవర్షం రామలక్ష్మణులపైన కూడా పడింది. రాముడు లక్ష్మణుడితో, ‘‘కంటికైనా కనిపించని ఈ ఇంద్రజిత్తుతో యుద్ధం చెయ్యటం మనకు సాధ్యమయ్యే పని కాదు. అతని అస్త్రాల ఫలితంగా వానరసేన అంతా మూర్ఛపడి ఉన్నది. మనం కూడా మూర్ఛ వచ్చినట్టు పడిపోతే ఇంద్రజిత్తు  వెళ్ళిపోతాడు,’’ అన్నాడు. రామలక్ష్మణులు కూడా మూర్ఛితులై పడినట్టు కనిపించగానే ఇంద్రజిత్తు పరమ సంతోషంతో లంకకు తిరిగి వెళ్ళాడు. రామలక్ష్మణులు మూర్ఛలో ఉండటం చూసి వానరసేన కలవరం చెందింది.

రామలక్ష్మణులను చూసి కంగారు పడే వానరులతో విభీషణుడు, ‘‘మీరు కంగారు పడకండి. రామలక్ష్మణులు మూర్ఛ నటిస్తున్నారు, అంతే!’’ అన్నాడు.
రాత్రి, చీకటి. మూర్ఛపడి ఉన్న వానరులలో ప్రాణాలతో ఉన్న వారెవరో, చచ్చిన వారెవరో తెలియటం లేదు. అందుచేత హనుమంతుడూ, విభీషణుడూ చెరొక కొరవీ తీసుకుని వెదక నారంభించారు. ఇంద్రజిత్తు ఆ సాయంకాలం అయిదు గడియల కాలంలో అరవై ఏడు కోట్ల వానరులను పడగొట్టాడు. పడిపోయిన వారిలో సుగ్రీవుడూ, అంగదుడూ, నీలుడూ, శరభుడూ మొదలైన వారెందరో వారికి కనిపించారు. వారు జాంబవంతుడి కోసం వెతికారు. మహా వృద్ధుడైన జాంబవంతుడు స్పృహతోనే కనిపించాడు. విభీషణుడు జాంబవంతుణ్ణి సమీపించి, ‘‘తాతా, ప్రాణాలతో ఉన్నావు గద!’’ అన్నాడు. ఎంతో ఆత్రుతగా.

జాంబవంతుడు హీనస్వరంతో, ‘‘ఆ మాట్లాడేది విభీషణుడా, నాయనా? నాకు కళ్ళు కనిపించటం లేదు. హనుమంతుడు బాగా ఉన్నాడా?’’ అని అడిగాడు. ‘‘తాతా, సుగ్రీవుణ్ణీ, అంగదుణ్ణీ, రామలక్ష్మణులనూ గురించి అడగకుండా హనుమంతుడి మాట అడుగుతున్నావేం?’’ అని విభీషణుడన్నాడు. ‘‘హనుమంతుడి మాట ఎందుకడిగానంటావా? చెబుతా విను. హనుమంతుడొక్కడే ఉండి ఈ వానరసేన అంతా చచ్చినా అది బతికి ఉన్నట్టే. అలా కాక హనుమంతుడు పోయి వానరసేన అంతా బతికి ఉన్నప్పటికీ అది చచ్చిన దానితో సమానమే. నాయనా, ఆ హనుమంతుడు బతికి ఉన్నంతకాలమే మాకు జీవితం పైన ఆశ!’’ అన్నాడు జాంబవంతుడు.


ఈ మాటలు వింటున్న హనుమంతుడు గౌరవభావంతో జాంబవంతుణ్ణి సమీపించి, అతని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు. హనుమంతుడి కంఠం వినిపించగానే వంతుడికి ప్రాణం లేచి వచ్చింది. ‘‘నాయనా, హనుమంతుడా! ఇలారా! ఈ వానరులను కాపాడే భారం ఇప్పుడు నీదే. ఈ పని నీవల్ల తప్ప మరొకరి వల్ల కాదు. నువ్వు సముద్రం దాటి హిమవత్పర్వతానికి వెళ్ళాలి. అక్కడ అన్నిటికన్న ఎత్తుగా కనిపించే శిఖరాలు ఋషభమూ, కైలాసమూనూ.

ఆ రెంటికీ నడుమగా ఓషధీ పర్వతం ఉన్నది. దాని శిఖరం మీద కాంతివంతమైన దివ్య ఓషధులు నాలుగున్నాయి. వాటిపేరు విశల్యకరణీ, మృతసంజీవినీ, సౌవర్ణకరణీ, సంధానకరణీ. ఆ నాలుగు ఓషధులనూ తీసుకుని శీఘ్రంగా తిరిగిరా!’’ అని జాంబవంతుడు హనుమంతుణ్ణి హెచ్చరించాడు. వాటితో వానరులను బతికించవచ్చునని ఆయన అన్నాడు.వెంటనే హనుమంతుడా రాత్రివేళ ఒక్క దూకున పర్వత శిఖరం మీదికి ఎక్కి శరీరం పెంచి, రాక్షసులు హడలుకునేటట్టుగా పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి లేచాడు.






No comments:

Post a Comment