Friday, September 7, 2012

రామాయణం - బాలకాండ 1


ఒకనాడు నారదమహాముని తమసా నదీతీరాన గల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, "మహాత్మా, ఈ యుగంలో ఈ లోకంలోసకల సద్గణ సంపన్నుడూ, మహాపరాక్రముడూ అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా?" అని అడిగాడు.

అప్పుడు వాల్మీకికి నారద మహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు. నారదమహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయే సరికి మధ్యాహ్న స్నానానికి వేళ అయింది. వాల్మీకి, శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక క్రౌంచపక్షుల జంట కనిపించింది. నారబట్ట కట్టుకుని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బొయవాడు బాణంతో మగపక్షిని కొట్టాడు. అది కిందపడి గిలగిలా తన్నుకున్నాది. ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది. వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలీ, కిరాతుడిపైన ఆగ్రహామూ తన్నుకునివచ్చాయి. "ఓరి కటిక వాడా, ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు," అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది.

తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు.


అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడ వచ్చాడు. వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి, అర్ఘ్యపాద్యాలిచ్చి, స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ, "వాల్మీకీ, నాఅనుగ్రహంచేతనే నీకు కవిత్వం అబ్బింది. నీవు ఇంతకు ముందే రాముడి కథ విన్నావు గదా. ఆ కథను మహాకావ్యంగా రచించు. అది భూమి ఉన్నంత కాలమూ నిలిచి ఉంటుంది. అది ఉన్నంతకాలమూ నీవు ఉతమ లోకాలలో సంచరించగలిగి ఉంటావు," అని చెప్పి అంతర్థానమయ్యడు. ఈ విధంగా బ్రహ్మయొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు. వైవస్వతుడు సూర్యుడి కొడుకు. ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు. వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు. ఆయన ఆనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులనీ, సూర్యవంశం వారనీ పిలవబడి ప్రసిద్ధికెక్కారు. వీరిలో సగరుడు కూడా ఒకడు. ఈ సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనమడే.

సూర్యవంశపు రాజులు అయోధ్యా నగరం రాజధానిగా కోసలదేశాన్నిపాలించారు. అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు. శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరధుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరధుడు ఐశ్వర్యంలోఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు,మహాపరాక్రమ సంపన్నుడు.

దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్దార్ధుడు, అర్ధసాదకుడు, అశోకుడు, మంత్ర పాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమందీ దశరధుడి మంత్రులు. వసిష్ట మహాముని ఆయనకు కులగురువు. వసిష్ఠుడూ, వామదేవుడూ ఆయన పురోహితులు. వేగులవాళ్ళ ద్వారా దేశంలో ఏమూల ఏమి జరుగుతున్నదీ తెలుసుకుంటూ, తన మంత్రుల సహాయంతో దశరధుడు న్యాయంగా రాజ్య పాలన చేస్తూ వచ్చాడు.

దశరధుడికి ఏలోటు లేదుగాని సంతానం లేని లోటు ఉండి, ఆయనను బాధించేది. ఒకనాడాయన అశ్వమేధయాగం చేసి దేవతలను మెప్పించి, వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి, తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వసిష్ఠ వామదేవులనూ, సుయజ్ఞుడు, జాబాలి మొదలైన గురువులనూ, ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులనూ పిలిపించి, వారి సలహా అడిగాడు. అశ్వమేదాయాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు. వారందరూ వెళ్ళాక, దశరథుడితో సుమంత్రుడు, "మహారాజా, మీరు తలపెట్టిన అశ్వమేధయాగాన్ని జరిపించటా నికి ఋశ్యశృంగుణ్ణి మించినవాడు లేడు. అతని వృత్తాంతం చెబుతాను వినండి," అంటూ ఈ కథ చెప్పాడు:

అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రులలో ఒకడు. అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది. రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది, బ్రాహ్మణులను పిలిపించి, కరువు తొలిగిపోయే ఉపాయం చెప్పమన్నాడు. "మహరాజా, విభండకమునికి ఋశ్యశృంగుడనే కుమారుడున్నాడు. అతను ఉండే చోట కరువు ఉండదు. అతనిని అంగదేశానికి రప్పించి, తమ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్ళిచేసి, అంగదేశంలోనే ఉంచుకున్నట్లయితే, కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది," అని బ్రాహ్మణులు చెప్పారు. అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి, మంత్రులనూ పిలిచి, "మీరు వెళ్ళి ఋశ్యశృంగ మహాము నిని ఇక్కడికి తీసుకు రండి," అని ఆజ్ఞాపించాడు.

ఈ మాట విని పురోహితిడూ, మంత్రులూ భయపడ్డారు. ఎందుకంటే ఋశ్య శృంగుడు సులువుగా అరంణ్యాలనూ, తన తపస్సునూ మాని, ఎవరో పిలవ గానే వచ్చే మనిషికాడు. ఆగ్రహించి శపించినా శపించగలుడు. అతన్ని రప్పిం చాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి. ఆ ఉపాయాన్ని రోమపాదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు:

"మహారాజా, ఋశ్యశృంగుడు పసితనం నుంచి అరణ్యంలోనే ఉండి వేదాధ్యయనం లోనూ, తపశ్చర్యలోనూ జీవితం గడిపిన వాడు. అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది నాట్య కత్తెలను పంపినట్లయితే వారు అతన్ని ఆకర్షించి తమ వెంట తీసుకురా గలుగుతారు."

రోమపాదుడిందుకు సమ్మతించి కొందరు నాట్యకత్తెలను చక్కగా అలంకరింపజే సి ఋశ్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు. ఆ ఋశ్యశృంగుడు ఎప్పుడూ తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాడు. అలాటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటివచ్చాడు.


వెంటనే నాట్యకత్తెలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు. వారి అందమైన ఆకారాలూ, అలంకరణలూ, పాటలు, శ్రావ్యమైన గొంతులూ విని ఋశ్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షిం చబడ్డాడు. నాట్యకత్తెలు అతన్ని సమీపించి, "నీవెవరు? ఎందుకీ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు?" అని అడిగారు "నేను విభండక మహాముని కొడుకును. మీరు ఆశ్రమానికి వచ్చినట్లయితే మీకు విధ్యుక్తంగా పూజ చేస్తాను, "అన్నాడు. వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి, అతనిచ్చిన కందమూలాలూ, ఫలాలూ తిన్నారు. అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలిచ్చి, "ఇవి మా పళ్ళు. వీటిని రుచిచూడు! ఇకమేము వెళ్ళి తపస్సుచేసుకోవాలి, "అంటూ వెళ్ళిపోయారు. ఋశ్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవీ పళ్ళే అనుకున్నడు. అయితే అవి తాను తినే పళ్ళుకంటే చాలా రుచిగా ఉన్నాయి. మర్నాడు, వారు కనిపించవచ్చునన్న ఆశతో, ఆశ్రమం వదిలి కిందటరోజు వారు కనిపించిన చోటికే వెళ్ళాడు.

అతన్ని చూడగానే, "అయ్యా, నీవు కూడా మా ఆశ్రమానికి రా. అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము," అన్నారు. ఋశ్యశృంగుడు అందుకు పరమా నందంతో సమ్మతించి, వారి వెంట బయలుదేరాడు. ఋశ్యశృంగుడి వెంటనే అంగదేశానికి వర్షంకూడా వచ్చింది. రోమపాదుడు ఋశ్యశృంగుడికి ఎదురు వచ్చి, సాష్టాంగపడి మొక్కి, తాము అతనిని ఈవిధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకుని, తన కూతురైన శాంత నిచ్చి శాస్త్రోక్తంగా పెళ్ళి చేసాడు. ఋశ్యశృంగుడు శాంతతో కూడా అంగదేశంలోనే ఉండిపోయాడు.

సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరధుడు ఎంతో  సంతోషించి, వసిష్ఠ మహాముని అనుమతి పొంది, తన భార్యలనూ, మంత్రులనూ వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు. రోమపాదుడు దశరధుడికి గొప్పగా ఆతిధ్యంఇచ్చి తన ఇంట వారం రోజులుంచుకుని, ఆయన వచ్చిన పని తెలుసుకుని, తన అల్లుడైన ఋశ్యశృంగిణ్ణీ, తన కుమార్తె అయిన శాంతనూ దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకున్నాడు. ఋశ్యశృంగుడు అయోధ్యకు వచ్చి కొద్దిరోజులు గడిచాయి. వసంతరుతువు ప్రవేశించింది.


దశరథుడు ఋశ్యశృంగుడితో, "ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి," అన్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద యెత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసే వారూ, వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడూ, వామ దేవుడూ, జాబాలీ, కాశ్యపుడూ మొదలైన మునులూ, బ్రాహ్మణ శ్రేష్ఠులూ పిలిపించబడ్డారు. సరయూనది ఉత్తరపుగట్టున యజ్ఞ శాల నిర్మించారు.

మంచిరోజూ, మంచి ముహూర్తమూ చూసుకుని దశరథుడు యజ్ఞశాలకు బయలు దేరివచ్చాడు. యజ్ఞకర్మ ఆరంభమయింది. మొదటి హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హొమం సాగించారు.
అశ్వమేధం మూడురోజుల యాగం. అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమి యవత్తూ, దానం చేశాడు. వారు రాజుతో, "మహరాజా, భూమిని పాలించటం మావల్ల అయ్యేపనికాదు. అందుచేత మాకు భూమి బదులు మణులో, బంగారమో, గోవులో, మరొకటో, ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు," అన్నారు.

దశరథుడు వారికి పదిలక్షల గోవులూ, నూరుకోట్ల బంగారమూ, నాలుగు వందల కోట్ల వెండీ దానం చేశాడు.
తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋశ్యశృంగుడికీ, వసిష్ఠుడికీ సమర్పించాడు. వసిష్ఠుడు మొదలైనవాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు.

ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యిచాచాడు. దశరథుడు వెంటనె తన చేతి కడియం తీసి ఆబ్రాహ్మడికిచ్చేశాడు. బ్రాహ్మణులందరూ దశరథుణ్ణి దీవించారు.

అశ్వమేధం పూర్తికాగానే ఋశ్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించాడు. ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చు కోవటానికి సమస్త దేవతలూ అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాలలో కూచున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాల వివరించి చెప్పుకున్నారు.

దానికి బ్రహ్మ, "దుర్మార్గుడైన రావణుడు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచేత చావు లేకుండా వరం అడిగాడుగాని, మనుషుల మీదితేలిక భావంకొద్దీ వారి వల్ల చావులేకుండా వరం కోరలేదు. ఇడుగో మహావుష్ణువు, దసరధుడి

భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి నరరూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు," అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమా నందం చెందారు. ఇంతలో హొమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక దివ్యస్వరూ పుడు పైకి వచ్చాడు. ఆ దివ్యస్వరూపుడు తన చేతులలో కలశాన్నిపట్టుకుని ఉన్నాడు. కలశం మేలిమి బంగారుతో చేసినది, దాని పై మూత వెండిది. ఆ దివ్యస్వరూపుడు దశరధుడితో, "ఓ రాజా, దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యలకిచ్చినట్లయితే వారికి గర్భోత్పతి అయి, కొడుకులు కలుగుతారు," అన్నాడు. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్నిఅందుకుని, దివ్య స్వరూపుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. మరుక్షణమే ఆ దివ్యస్వరూపుడు అదృశ్యమై పోయాడు.

దశరథుడు ఆ కలశంలోని పాయసంలో సగం కౌసల్య కిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్ర కిచ్చాడు. సుమిత్ర కివ్వగా మిగిలిన దానిలో సగం కైకేయి కిచ్చి, ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్యా, సుమిత్రా, కైకేయీ గర్బవతు లయ్యారు.

ఒక వంక మహావిష్ణువు మానవుడుగా అవతరించటానికి ప్రయత్నాలు సాగుతూంటే, ఇంకోవంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు. దేవేంద్రుడికి వాలీ, సూర్యుడికి సుగ్రీవుడూ, బృహస్పతికి తారుడూ, కుబేరుడికి గందమాదనుడూ, విశ్వకర్మకు నలుడూ, అగ్నికి నీలుడు, అశ్వనీదేవతలకు మైందద్వివిదులూ, వరుణుడికి సుషేణుడూ, పర్జన్యుడికి శరభుడూ, వాయుదేవుడికి హానుమంతుడూ పుట్టారు. వీరందరు మహా బలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానరమూక పుట్టింది. ఈవానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గిర స్థిరపడి, వాలి సుగ్రీవులను రాజులుగా పెట్టుకుని, నలుడూ, నీలుడూ, హనుమంతుడూ మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు.

పుత్రకామేష్ఠి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు.

అశ్లేషా నక్షత్రంలో మిట్టమధ్యాహ్నంవేళ సుమి త్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు.  అయోధ్యానగరంలో పౌరులు ఉత్సవా లు చేసుకున్నారు. వీధులు జనంతోనూ, నాట్యం చేసేవాళ్లతోనూ, గాయకులతోనూ కిటకిట లాడిపోయాయి. దశరథుడు అంతులేని గోదానాలూ, అన్నప్రదానాలూ చేయించాడు.

 నలుగురు పిల్లలూ క్రమంగా ఎదిగి పెద్ద వారవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా, రామలక్ష్మణులు ఎప్పుడూ కలసి ఉండేవారు. అదేవిధంగా భరతశత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు. వారు నలుగురూ వేదశాస్త్రలు అధ్యయనం చేసి, విలువిద్యలో ఆరితేరి,తండ్రికి శుశ్రూషలుచేస్తూయౌవనంతులయ్యారు. దశరథుడు వారివివాహాలను గురించి మంత్రులతోనూ, పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు.

రాజూ, మంత్రులూ ఈ ఆలోచనలో ఉన్నసమయంలో ద్వారపాలకులు వచ్చి, "మహారాజా, కుశికవంశం వాడూ, గాధిరాజు కుమారుడూ అయిన, విశ్వామిత్ర మహాముని తమ దర్శనంకోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు,"అనిచెప్పారు. వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని, విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళి ఆర్ఘ్యపాద్యాలతో పూజించాడు.

విశ్వామిత్రుడు, "రాజా, నీవూ, నీ ప్రజలూ క్షేమంగా ఉంటున్నరా? శత్రు భయమేమీ లేదుగదా!" అని కుశల ప్రశ్నలు చేసి, వసిష్ఠాది మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనంమీద కూర్చున్నాడు. "మహామునీ, మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావలిసినదేమిటి?" అని దశరథుడు అన్నాడు.
విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, "రాజా, నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో. నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు, బలపరాక్రమవంతులు, నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి, నా వ్రతసంకల్పం పాడుచేశారు. నా వెంట నీ పెద్దకొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ సుబాహూలనే ఆ రాక్షసులు భగ్నం చెయ్యకుండా అతడు రక్షిస్తాడు,"  అన్నాడు.
ఈ మాటలు వినగానే దశరథుడి గుండెబద్దలయినట్టయింది, భయమూ దు:ఖమూ ముంచుకొచ్చాయి.

ఆయన సింహాసనం మీది నుంచి లేచి వణుకుతూ," మహామునీ, రాముడు పసివాడు. వాడికింకా పదహారేళ్ళయినా నిండలేదు. వాడికి విలువిద్య కూడా సరిగా రాదు. రాక్షసులతో ఎక్కడయుద్ధం చేస్తాడు. నా దగ్గిర ఒక అక్షౌహిణి సేన ఉన్నది. నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను. ఇంతకూ ఆ రాక్షసు లెవరు?" అన్నాడు.

దానికి విశ్వామిత్రుడిలా చెప్పాడు: "రావణుడనే రాక్షసరాజును నీ వెరుగు దువు కదా! అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులుపొందాడు. ఇంతకూ ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తూ తమ్ముడు. అతను స్వయంగా యజ్ఞభంగం చెయ్యలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహు లను పంపుతూ ఉంటాడు."

"హతవిదీ! రావణుడే? అతడి ముందునేనే నిలువలేను గదా. పసివాడు రాముడెలానిలుస్తాడు? ఆ మహా శక్తివంతుడి పైకి రాముణ్ణి పంపించటం ఎంత మాత్రమూ పొసగదు," అన్నాడు దశరథుడు.

కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. "మహారాజా, ఆడినమాట తప్పే వాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు!" అంటూ ఆయన చివాలున లేచాడు.

అప్పుడు వసిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ, "రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడినమాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తెస్తున్నావు. విశ్వామిత్రునికి తెలియని అస్త్రం లేదు, కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా? నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదమూ రాదు," అని బోధిం చాడు. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామ లక్ష్మణులను పిలిపించి, వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామ లక్ష్మణులు ఒకరి వెనుక ఒకరుగా ఆయనను అనుసరించారు. వారిద్దరి వద్దా విళ్ళున్నాయి. వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడి వెనకగా నడవసాగారు .




No comments:

Post a Comment