Friday, September 7, 2012

రామాయణం - ఉత్తరకాండ 1

శ్రీరామపట్టాభిషేకం చాలా రోజుల పాటు అందరికీ సుఖంగా గడిచింది. అనంతరం ఒకరొకరే వెళ్లి పోసాగారు. రాముడు అందరికీ తన కృతజ్ఞత తెలుపుకుని, తగిన విధంగా సత్కరించి సాగనంపాడు.
భరతుడు వెంట రాగా జనక మహారాజూ, లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని కేకయమహారాజూ  వెళ్లిపోయారు. భరతుడి ఆహ్వానం పైన వచ్చిన కాశిరాజు ప్రరత్థనుడూ ఇతర రాజులూ కూడా తమ తమ దేశాలకు తిరిగి వెళ్లారు.

రాముడి  వెంట వచ్చిన వానరులూ, రాక్షసులూ రెండునెలల పాటు అయోధ్యలో సుఖంగా గడిపి వారు కూడా బయలు దేరారు. తనకు యుద్ధంలో తోడ్పడిన సుగ్రీవాంగద హనుమంతాదులను రాముడు సత్కరించాడు.
వానరుల్లో చివరి వంతు హనుమంతుడిది. వెళ్ళిపోతున్న సందర్భంగా రాముడిని హనుమంతుడు ఇలా కోరాడు, ‘‘ప్రభూ! నా వినతి మన్నించు. నిత్యమూ నీ భక్తుడిగా ఉంటూ నిన్ను కొలుచుకునేలా నన్ను ఆశీర్వదించు. ఇలపై రామకథా పారాయణం కొనసాగుతున్నంత వరకు నేను జీవించి ఉండేలా నన్ను కరుణించు.’

 హనుమంతుడు ఇలా కోరగానే రాముడు అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ‘‘హనుమా! ప్రజలు మా గాధ పారాయణం చేస్తున్నంత కాలం నీ కీర్తి దశదిశలా వ్యాపిస్తూనే ఉండుగాక. ఈ సృష్టి, ప్రపంచం ఉనికిలో ఉన్నంత వరకు నీవు చిరంజీవిగా వర్ధిల్లుదువుగాక.’’ అని రాముడు ఆశీర్వదించాడు.
తర్వాత విభీషణుడికీ, అతని రాక్షసులకూ సన్మానాలు చేశాడు. వారందరూ బయలుదేరి కిష్కింధకూ, లంకకూ వెళ్లి పోయారు.

అయోధ్యలో, అంతటా సుఖసంతోషాలు వెల్లివిరిశాయి.  అలా రెండేళ్ళు గడిచాయి.

రాముడు సీతతో వనవిహారాలు చేస్తూ, మిత్రులతో గోష్టి జరుపుతూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. సీతలో గర్భచిహ్నాలు కనిపించాయి. రాముడామెతో, ‘‘సీతా, నీవు తల్లివి కాబోతున్నావు గదా, నీకేమైనా కోరికలుంటే చెప్పు, తీరుస్తాను,’’ అని ఒకనాడన్నాడు.

సీత చిరునవ్వుతో ముఖం వంచుకుని, ‘‘నాకు గంగాతీరాన ఋషుల ఆశ్రమాలు చూసి, వారి కందమూల, ఫలాలు తిని, అక్కడి చెట్లకింద విహరించాలని ఉన్నది’’ అన్నది.

రాముడు ‘‘అలాగే చేతువుగానీ, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో. రేపే నిన్ను అక్కడికి పంపుతాను,’’ అన్నాడు.
సీతతో ఈ మాట అని, రాముడు సభా మంటపానికి వెళ్ళాడు. అక్కడ విజయుడు, మధుమత్తుడు, కౌశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు మొదలగువారు హాస్యకథలు చెప్పి రాముడిని సంతోషపెట్టారు. రాముడు ప్రసన్నుడై భద్రుడనే వాణ్ణి చూసి, ‘‘అయితే భద్రా, నా గురించీ, సీత గురించీ, నా తల్లులను గురించీ, తమ్ములను గురించీ ప్రజలు ఏమనుకుంటుంటారు?’’ నా పరిపాలనలో, ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేవుగదా? నిజం చెప్పు.’’ అని అడిగాడు.

భద్రుడు చేతులు జోడించి, ‘‘ప్రజలు అనేక రకాలుగా చెప్పుకుంటారు. వాళ్లు జాస్తిగా మాట్లాడుకునేది రావణసంహారం గురించి,’’ అన్నాడు.

భద్రుడేదో దాస్తున్నాడని రాముడికి అనుమానం వేసింది. ‘‘భద్రా, ఉన్నమాట చెప్పు, మంచిదయినా, చెడ్డదయినా దాచకు,’’ అన్నాడతను.

సముద్రానికి సేతువు కట్టావనీ, రావణుణ్ణి సమూలంగా నాశనం చేశావనీ ప్రజలు నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. నిన్ను చూసి గర్వపడతారు కూడా.

కాని, రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని లంకకు తీసుకుపోయి, అంతకాలం తన అధీనంలో ఉంచుకున్న సీతను మళ్లీ తెచ్చుకున్న నీకు మంచి చెడ్డలు తెలియవంటున్నారు.

‘‘రేపు తమ భార్యలకేమైనా జరిగినా తాము చచ్చినట్లు భరించవలసిందే గదా అంటున్నారు. యథారాజా తథాప్రజా అన్నారు గద. ఎక్కడికి పోయినా జనం గుంపులు గుంపులుగా కూడి ఈ మాటలే చెప్పుకుంటున్నారు,’’ అన్నాడు భద్రుడు.

రాముడు లోపల తీవ్రంగా బాధపడుతూ మిగిలిన మిత్రులతో, ‘‘ఈ మాట నిజమేనా?’’ అన్నాడు.
అందరూ తలలు వంచుకుని, నిజమేనని చెప్పారు.

రాముడు వారందరినీ పంపేసి, దీర్ఘాలోచనలో పడ్డాడు. తర్వాత సమీపంలో ఉన్న ద్వారపాలకుణ్ణి పిలిచి, ‘‘లక్ష్మణుణ్ణీ, భరత శత్రుఘ్నులనూ పిలుచుకురా,’’ అన్నాడు. త్వరలోనే వారు ముగ్గురూ రాముడి వద్దకు వచ్చారు. వారు రాముడి వదనం చూసి నిశ్చేష్టులయ్యారు.

కాంతి లేని ముఖంతో, కన్నులనీరు కారుస్తూ, రాముడు తన తమ్ములను ఆలింగనం చేసుకుని, ఆసనాల మీద కూర్చోబెట్టి, వారికి సీత గురించి తాను పొందిన జనాపవాదం గురించి తెలిపాడు.

‘‘సీత నిర్దోషురాలని సూర్యచంద్రులు, అగ్ని, ఇంద్రాది దేవతలూ చెప్పారు. నా అంతరాత్మలో కూడా అలాగే అనిపించింది. లక్ష్మణా, ఇది నీ ఎదటే గదా జరిగింది? అందుచేతనే సీతను అయోధ్యకు తెచ్చాను. కానీ, సీతను ఈనాటికీ ప్రజలు ఆమోదించడం లేదు. ఆమెను శీలరహితురాలిగానే వారు భావిస్తున్నారు. ఈ అపవాదు భరించడం చాలా బాధగా ఉంది. రాజుగా దేనినైనా భరిస్తాను గాని, ప్రజలు సీతపై చేస్తున్న వ్యాఖ్యలు దుర్భరంగా ఉన్నాయి.ప్రాణాలనూ మిమ్మల్నీ అయినా వదులుతాను గానీ అపకీర్తిని సహించలేను. సీతను విడవటమనగా ఎంత? ఈ అపవాదును మించిన దుఃఖం నాకు ఉండబోదు.

అందుచేత, లక్ష్మణా, రేపు తెల్లవారుజామున సీతను రథం మీద తమసానదీ తీరాన, వాల్మీకి ఆశ్రమప్రాంతంలో అరణ్యంలో వదిలిపెట్టిరా.

నా మాటకు ఎదురు చెప్పకు, సీతను గురించి ఏమీ అనకు. అంటే నాపైన ఒట్టే! సీత ఋషుల ఆశ్రమాలను చూడాలని కోరింది. ఆ కోరిక తీరుతుంది,’’ అన్నాడు. రాముడు.

ఈ మాటలు చెప్పి అతను బాధగా నిట్టూర్పులు విడుస్తూ అంతఃపురంలోకి వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా రాముడు అంతఃపురంలో నిద్రలేని రాత్రి గడిపాడు.

మర్నాడు తెల్లవారుతూనే లక్ష్మణుడు సుమంత్రుడి వద్దకు వెళ్లాడు. అతని వాలకం దీనంగా ఉన్నది. నోరెండిపోతున్నది. అతను సుమంత్రుడితో, ‘‘సీతను మునుల ఆశ్రమాలకు తీసుకుపొమ్మని రాముడి ఆజ్ఞ అయింది. నేనూ, సీతా ఇప్పుడే బయలుదేరుతున్నాం. వెంటనే రథం సిద్ధం చెయ్యి. సీత కోసం రాజభవనం నుంచి మెత్తని ఆసనం తెచ్చి రథంలో అమర్చు,’’ అన్నాడు.

సుమంత్రుడు రథాన్ని ఆయత్తం చేసి తేగానే లక్ష్మణుడు సీత  వద్దకు వెళ్లి, ‘‘అమ్మా, ఆశ్రమాలు చూడాలని ఉన్నట్లు రాజుగారితో అన్నావుట. రాజుగారి ఆజ్ఞ అయింది. గంగాతీరాన గల ఆశ్రమాలకు పోదాం. బయలుదేరు. మా అన్న ఆజ్ఞప్రకారం నేను కూడా నీవెంట వస్తున్నాను,’’ అన్నాడు.

సీత ఈ మాటలకు పరమానందం చెంది, వెలగల బట్టలూ, రత్నాలూ, ఆభరణాలూ మునిపత్నుల కోసం తీసుకుని లక్ష్మణుడి వెంట రథం మీద బయలుదేరింది. రథం వేగంగా పోతుంటే సీతకు దుశ్శకునాలు కనిపించాయి.
ఆ సంగతి లక్ష్మణుడితో చెప్పి, ‘‘అత్తలూ వాళ్లూ క్షేమంగా ఉన్నారు కద!’’ అన్నది. లోపల గుండె గుబగుబ  లాడుతున్నప్పటికీ, లక్ష్మణుడు పైకి నవ్వుతూ, ‘‘వారంతా క్షేమంగానే ఉన్నారు,’’ అన్నాడు.

రాత్రి అయేసరికి రథం గోమతీ తీర్థం చేరింది. ఆ  రాత్రి అక్కడ గడిపి, తెల్లవారి బయలుదేరి, మధ్యాహ్నానికల్లా గంగాతీరానికి చేరుకున్నారు.

 గంగను చూడగానే లక్ష్మణుడికి దుఃఖం ఆగలేదు. అది చూసి, ‘‘ఇదేమిటి లక్ష్మణా? ఎందుకేడుస్తున్నావు? ఎంతోకాలంగా కోరుకున్న నా కోరిక తీరిందని నేను సంతోషిస్తుంటే, నీ దుఃఖంతో నా ఆనందాన్ని పాడు చేస్తున్నావెందుకు?

నన్ను వేగంగా గంగ దాటించి మునుల ఆశ్రమాలకు తీసుకుపో, మునుల భార్యలకు ఈ కానుకలన్నీ ఇస్తాను. అక్కడ ఈ రాత్రి గడిపి, రేపుదయం అయోధ్యకు తిరిగి పోదాం. రాముణ్ణి ఎప్పుడు మళ్లీ చూస్తానా అని నాకూ తహతహగానే ఉన్నది,’’ అని సీత అన్నది.

లక్ష్మణుడు కళ్లు తుడుచుకుని దగ్గిరలో ఉన్న పడవ వాళ్లను పిలిచి, పడవ ఏర్పాటు చేసి, దాని మీద సీతతో సహా గంగ దాటాడు. రథంతో సహా సుమంత్రుడు అవతలి ఒడ్డునే ఉండిపోయూడు.

అవతలి ఒడ్డుచేరాక లక్ష్మణుడు సీతకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ, ‘‘సీతా మా అన్న నా గుండెలో శూలం గుచ్చేశాడు. ఇంత పాపిష్టి పనిచేసే కన్న నేను చచ్చిపోయినా బాగుండిపోను,’’ అంటూ దుఃఖ వివశుడై కూలబడిపోయాడు.

సీత అతని స్థితి చూసి కంగారు పడి ‘‘లక్ష్మణా, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేదో ఉద్రేకంలో ఉన్నట్లున్నావు. నీ బాధకు కారణమేమిటో కాస్త స్పష్టంగా చెప్పు. లేకపోతే మీ అన్న మీద ఒట్టే!’’ అన్నది.
అప్పుడు లక్ష్మణుడు సీతతో, ‘‘అమ్మా, మా అన్న స్నేహితులతో కబుర్లు చెబుతూ నిన్ను గురించి భయంకరమైన లోకాపవాదులను విన్నాడు. ఆ అపవాదు నీ చెవుల పడరానిది. దానితో మా అన్న కుమిలిపోయి నిన్ను వదిలిపెట్టేశాడు. నీ వల్ల ఏ దోషమూ లేదని మా అన్నకు తెలుసు, నాకూ తెలుసు. అయినా అపవాదుకు వెరచి ఇలా చేశాడు.

తల్లీ! నా పాపాన్ని క్షమించు. నిన్నిక్కడే విడిచిపెట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్లాలి. ఇది రాజాజ్ఞ. నువు మనస్సును అధికంగా కష్టపెట్టుకోక, పుణ్యప్రదమైన ఈ ముని ఆశ్రమంలో ఉండు. వాల్మీకి మహాముని మా తండ్రికి ఆప్తస్నేహితుడు. ఆయనను ఆశ్ర యించి సుఖంగా ఉండు.’’ అన్నాడు.

ఈ మాటలు వినినంతనే సీత ఒక్క క్షణంపాటు మూర్ఛపోయినట్లైంది. తరవాత ఆమె తెప్పరిల్లి, దీనంగా ఏడుస్తూ, ‘‘లక్ష్మణా, నేను కష్టాలు పడటానికే పుట్టాను. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను, ఏ దంపతులకో ఎడబాటు కలిగించి ఉంటాను.
అరణ్యవాసమప్పుడు రాముడు దగ్గిర ఉండి నన్ను ఓదార్చుతున్నా, నేను దుఃఖిస్తూనే ఉండేదాన్ని, అలాంటిది రాముడు వెంటలేని ఈ అరణ్యవాసం ఎలా ఉంటుందో ఆలోచించు. నా దుఃఖం ఎవరితో చెప్పుకునేది?

నిన్ను నీ భర్త ఎందుకు వదిలేశాడని మునులు అడిగితే ఏం చెప్పను? ఈ గంగానదిలో పడి చావవచ్చు. కాని అందువల్ల మీ వంశం అపహాస్యం పాలు కావచ్చు. మీ అన్నగారి ఆజ్ఞ నిర్వర్తించావు.

ఇక నువు వెళ్లు, నాయనా, అత్తలందరికీ నా నమస్కారాలు చెప్పు, రాజుగారి క్షేమమడిగాననీ, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశాననీ చెప్పు.

ఆయనకు వచ్చిన అపవాదును పోగొట్టడం నా విధి. నేను పవిత్రురాలిని అని రాముడికి తెలుసు. తనకు తప్ప నా మనసులో మరెవ్వరికీ చోటు లేదన్న విషయం కూడా తెలుసు. కానీ రాజుగా తనమీదకు వచ్చి పడిన ఈ అపవాదును తొలగించడానికి నేను ఏ విధమైన త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని నా మాటగా రాముడికి చెప్పు.
ధర్మంగా రాజ్యపాలన చేస్తూ, తమ్ముళ్ళనూ, ప్రజలనూ ఒకే విధంగా చూస్తూ, లోకంలో సాటిలేని కీర్తి సంపాదించమని కోరానని, ఆయన మాటను గౌరవిస్తానని చెప్పు,’’ అన్నది.

‘‘లక్ష్మణా నీవు, నా భర్త రాముడి కన్నా ప్రియమైన వారు నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. ఒక్కసారి నన్ను చివరిసారి చూసి, తిరిగి వెళ్ళు.’’ అన్నది సీత.

1 comment: