Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 7


కొంతసేపు భరతుడు తండ్రి కోసం శోకించి, ``అయితే, అమ్మా, ఆయన ఆఖరు క్షణంలో నాకేమన్నా చెప్పాడా? ఆయన ఆఖరు మాటలేమిటి?'' అని అడిగాడు. `` `ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ సీతా,' అంటూ ప్రాణాలు వదిలారు, నాయనా,'' అన్నది కైకేయి. భరతుడు అమిత ఆశ్చర్యంతో, ``అదేమిటి? రాముడూ, సీతా, లక్ష్మణుడూ దగ్గిర లేరా?'' అని అడిగాడు.
 
``అరణ్య వాసానికి వెళ్ళారుగా, నాయనా? రాముడు నారబట్టలూ, జడలూ ధరించి అరణ్యానికి వెళుతుంటే, సీతా, లక్ష్మణుడూ కూడా వెళ్ళారు,'' అన్నది కైకేయి. భరతుడు మరింత ఆశ్చర్యపడి, ``ఏం? రాముడు ఏం పాపం చేశాడు? తను పాడుపనులేవీ చేయడే! భ్రూణహత్య చేసిన వాడికి విధించినట్టు అతనికి అరణ్యవాసశిక్ష ఎందుకు వేశారూ?'' అన్నాడు. ``అదేం కాదులే! మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసే యత్నంలో ఉన్నట్టు విని, నేనాయనను రెండు వరాలు కోరాను: ఈ పట్టాభిషేకం నీకు చేసి, రాముణ్ణి పధ్నాలుగేళు్ళ అరణ్యవాసానికి పంపమన్నాను. మహారాజు సరే నన్నారు.
 
కనక వసిష్ఠుడు మొదలైన వారంతా చెయ్యవలిసిందంతా చేస్తారు. నీవు చక్కగా పట్టాభిషేకం చేసుకో!'' అన్నది కైకేయి. కైకేయి చెప్పిన ఈ మాటలు విని భరతుడు మండిపడి పెట్టవలసిన నాలుగు మాటలూ పెట్టాడు. ``నీవు భర్తను చంపావు, రాముణ్ణి అడవికి పంపావు, నీ ముఖం చూస్తే పాపం!'' అన్నాడు.

``జ్యేష్ఠుడికి రాజ్యాభిషేకం జరగటం క్షత్రియ వంశ ధర్మమని నీకు తెలి యదా? రామ లక్ష్మణులు లేకుండా నేనీ రాజ్యభారం ఎలా మోయగలననుకున్నావు?'' అని అడిగాడు. ``నే నిప్పుడే వెళ్ళి ఆ రాముణ్ణి పిలుచుకు వచ్చి రాజ్యాభిషేకం చేసి అతనికి దాస్యం చేస్తాను,'' అని తల్లితో చెప్పాడు. ఇంత పని చేసినందుకు కైకేయిని నిప్పుల్లో పడమన్నాడు, లేదా అరణ్యానికి వెళ్ళమన్నాడు, అదీ కాకపోతే గొంతుకు ఉరిపోసుకు చావమన్నాడు. ఇంతలో మంత్రులు వారున్న చోటికి వచ్చారు.
 
భరతుడు వారితో తనకు రాజ్యకాంక్ష ఏమీ లేదనీ, రాజ్యం కావాలని తాను తన తల్లితో చెప్పి ఉండలేదనీ, కైకేయి తన తండ్రిని వరాలు కోరటంగాని సీతా రామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళిపోవటంగాని, దూరదేశంలో ఉన్న తనకూ, శత్రుఘు్నడికీ తెలియనే తెలియవనీ స్పష్టంగా చెప్పేశాడు. తరవాత భరత శత్రుఘు్నలు కౌసల్య వద్దకు వెళ్ళారు. ఆమెను ఆలింగనం చేసుకుని ఆమెతోబాటు తాముకూడా ఏడ్చారు. ఆమె భరతుడితో కైకేయి తనకు చేసిన ద్రోహం గురించి చెబుతూంటే, భరతుడికి తననుకూడా తన తల్లితో జతచేసినట్టు అనిపించింది.
 
రాముడి అరణ్యవాసానికి తాను సమ్మతించలేదని అతను ఘోరమైన ఒట్లు పెట్టుకుని వేదన పడ్డాడు. కౌసల్య అతన్ని ఊరడించింది. దుఃఖ సముద్రంలో ఉన్న భరతుడితో వసిష్ఠుడు, ``నాయనా, ఈ విచారం కట్టిపెట్టి దశరథ మహారాజుకు ఉత్తర క్రియలు చెయ్యి,'' అని హెచ్చరించాడు. తైల భాండం నుంచి పైకి తీసిన తండ్రి శవాన్ని చూసి భరతుడు, ``నాయనా, నీవు పోయావు. రాముడడవిలో ఉన్నాడు. ఈ రాజ్యభారం ఎవరు మోస్తారు?'' అంటూ కడుదీనంగా దుఃఖించాడు.
 
దశరథుణ్ణి పల్లకీలో ఎక్కించి నగరం బయటకి తీసుకుపోయారు. శవానికి ముందుగా పురజనులు, వెండి బంగారు నాణాలు వెదజల్లుతూ; చందనమూ, అగరూ, గుగ్గిలమూ, మొదలైన ధూపాలు వేస్తూ నడిచారు. దశరథుడి భార్యలు పల్లకీలలో వెళ్ళారు. శవాన్ని చితిపై పెట్టాక దశరథుడి భార్యలు భరతుడితో బాటు చితి చుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు. భరతుడు తండ్రికి నిప్పు పెట్టాక అందరూ నగరానికి తిరిగి వచ్చారు. భరతుడు తండ్రికి పది దినాలు మైలపట్టి తరవాత రెండు రోజులపాటు శ్రాద్ధాలు చేశాడు.

బ్రాహ్మణులకు అన్న దానమూ, వస్త్ర దానమూ, ఇతర దానాలూ చేశాడు. పదమూడో రోజు అస్థిసంచయనం చేసేటప్పుడు భరతుడూ, అతనితోపాటు శత్రుఘు్నడూ తండ్రిని తలుచుకుని వివశులై విలపించారు. తరవాత ఒక చోట భరత శత్రుఘు్నలు జరిగినదాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు; తన అన్న అయిన లక్ష్మణుడు తన తండ్రికి ఎందుకు అడ్డుపడలేదా అని శత్రుఘు్నడు ఆశ్చర్యం వెలిబుచ్చుతూండగా, మంధర మహారాణీలాగా అలంకరించుకుని ఆట కోతిలాగా తయారై అటుగా వచ్చింది.
 
ద్వారపాలకులు దాన్ని పట్టుకుని శత్రుఘు్నడి దగ్గిరికి తెచ్చి, ``ఇదుగో! అన్ని పాపాలకూ మూలమైన మంధర!'' అన్నారు. శత్రుఘు్నడు కోపావేశంతో మంధరను పట్టుకుని దాన్ని హతమార్చే ఉద్దేశంతో జరజరా ఈడ్చుకు పోసాగాడు. మంధర వెంట ఉండే దాసీలు బెదిరిపోయి కౌసల్య దగ్గిరికి పరిగెత్తారు. మంధర కప్పు ఎగిరిపోయేటట్టు కేకలు పెట్టసాగింది. కైకేయి మంధరను విడిపించటానికి వస్తే శత్రుఘు్నడామెను నోటికి వచ్చినట్టు తిట్టాడు. అప్పుడు కైకేయి పరిగెత్తి వెళ్ళి భరతుణ్ణి పిలుచుకువచ్చింది.
 
భరతుడు శత్రుఘు్నడితో, ``ఆడదాన్ని చంపుతావా? ఈ మాట తెలిస్తే రాముడు మన ముఖం చూస్తాడా? రాముడి ఆగ్రహానికి గురికావలిసి వస్తుందని ఆగాను కాని, నేను కైకేయిని ఎప్పుడో చంపకపోయానా? ఆ గూనిదాన్ని వదిలిపెట్టు,'' అన్నాడు. దశరథుడు పోయిన పధ్నాలుగో రోజు ఉదయం పెద్దలందరూ భరతుడి వద్దకు వచ్చి, ``రాజపుత్రా, రాజ్యానికి నాయకుడు లేడు. అదృష్టవశాత్తూ జనంలో అరాజకం సాగలేదు.
 
ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకోవటం మంచిది,'' అన్నారు. భరతుడు వారితో, ``జ్యేష్ఠుడే రాజు కావటం మా వంశాచారం. అందుచేత నన్ను రాజు కమ్మని మీరు కోరటం ఉచితం కాదు. నా తల్లి కోరిందిగదా అని పట్టం కట్టుకోను. నేను అరణ్యానికి వెళ్ళి జ్యేష్ఠుడైన రాముణ్ణి రాజును చేసి తీసుకువచ్చి, అతనికి బదులుగా నేనే అరణ్యవాసం చేస్తాను.

రాజ్యాభిషేకం అరణ్యంలోనే జరుగుతుంది గనక, అభిషేక సంబారాలన్నీ నా వెంట తీసుకు పోవటానికీ, నాతోబాటు చతురంగబలాలతో కూడిన సేనను వెంట  బెట్టుకు వెళ్ళటానికీ అవసరమైన ఏర్పాట్లు చేయండి,'' అన్నాడు. భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదును చేసి దారులు వేశారు. నదులపై వంతెనలు కట్టారు.
 
దారిలో అడ్డు వచ్చిన గోతులూ, చెరువులూ పూడ్చారు. దారి పొడుగునా అక్కడక్కడా బావులు తవ్వారు. విడిదికి తగిన స్థలాలు చూసి అక్కడ వీధులూ, ఇళూ్ళ గలిగిన శిబిరాలు నిర్మించారు. ఇలాటి శిబిరాలు సరయూనదీ తీరం నుంచి గంగాతీరం వరకూ ఏర్పాటు చేశారు. ఆ రాత్రి శంఖాలు మోగటమూ, భేరి వాయింపూ, వందిమాగధుల స్తోత్రాలూ విని భరతుడు నిద్ర లేచి, కంట నీరు పెట్టుకుని, ``నేను రాజునుగాను. నాకు స్తోత్ర పాఠాలూ, మంగళ వాద్యాలూ వద్దు,'' అని వాటిని నిలిపించాడు.
 
వసిష్ఠుడు తన పరివారంతో రాజసభకు వచ్చి, భరతుడి పట్టాభిషేకం జరిపించే ఉద్దేశంతో పురప్రముఖులనూ, మంత్రులనూ, గణనాయకులనూ, భరతుణ్ణీ, శత్రుఘు్నణ్ణీ, ఇతర ముఖ్యులనూ వెంటనే పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. త్వరలోనే అందరూ వచ్చి సభను అలంకరించారు. దశరథుడు జీవించి ఉన్నప్పటిలాగే సభ కళకళలాడింది.
 
అప్పుడు అందరి సమక్షంలోనూ వసిష్ఠుడు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకోవలిసిందిగా కోరాడు. భరతుడు పెద్దలతో చెప్పిన మాటలే పేరోలగంలో మళ్ళీ చెప్పి, ``నేను మీ అందరి సమక్షంలోకి రాముణ్ణి తీసుకురావటానికి శాయశక్తులా యత్నిస్తాను. అతను రాకపోతే లక్ష్మణుడిలాగే నేను కూడా రాముడితోపాటు వనవాసం ఉండి పోతాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు ఇది వరకే ఆరంభమయ్యాయి.
 
మార్గం వేసేవారూ, మార్గరక్షకులూ మొదలైనవారు ముందే వెళ్ళిపోయారు. ఇంక నేను బయలుదేరటమే తరువాయి,'' అన్నాడు. ఈ మాటలకు అందరూ సంతోషించారు. ప్రయాణానికి సేనలను ఆయత్తం చేయవల సిందిగా సుమంత్రుడు సేనాధ్యక్షులకు చెప్పాడు. అయోధ్యా నగరానికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది. మర్నాడు భరతుడు పెందలాడే లేచి ప్రయాణమయ్యాడు.

అతని వెంట తొమ్మిది వేల ఏనుగులూ, అరవైవేల రథాలూ, లక్ష గుర్రాలూ యోధులతో సహా కదిలాయి. కౌసల్యా, సుమిత్రా, కైకేయీ వాహనాలలో బయలుదేరారు. కైకేయికి పట్టిన దయ్యం దిగిపోయింది. తాను చేసినదానికి పశ్చాత్తాపపడుతూ ఆమె మిగిలినవారి కంటె ముందు కదిలింది. పౌరులు గుంపులు గుంపులుగా భరతుణ్ణి వెంబడించారు.
 
రాముడికి ఇష్టులైనవారూ, వర్తకులూ, ఇతరులూ రాముణ్ణి చూడటానికి తాము కూడా ప్రయాణం కట్టారు. అనేక వేలమంది బ్రాహ్మణులు ఎడ్లబళ్ళెక్కి భరతుడి వెంట ప్రయాణమయ్యారు. ఇంత పెద్ద బలగాన్నీ వెంటబెట్టుకుని భరతుడు గంగాతీరాన్ని శృంగిబేరపురం వద్ద చేరుకుని, తన సైన్యాన్ని నది వెంబడి అక్కడక్కడా విడియమని ఉత్తరు విచ్చాడు.
 
అతను మంత్రులతో, ``మనం ఈ రాత్రికి ఈ తీరాన విశ్రమించి రేపు ఉదయానే గంగ దాటుదాం. నే నిప్పుడు నదిలో దిగి మా తండ్రికి తర్పణాలు వదులుతాను,'' అన్నాడు. మహా సముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథంయొక్క టెక్కెం గమ నించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు.

అతను తన ఆప్తులను చేరబిలిచి, ``భరతుడు ఇంత సేనతో ఎందుకు బయలుదేరి వచ్చి వుంటాడంటారు? రాముడు వనవాసం పూర్తిచేసి వచ్చి రాజ్యం అడుగుతాడేమో, అతన్ని అరణ్యం లోనే చంపేద్దామని వచ్చివుంటాడు. మనం రాముణ్ణి ఎలాగైనా రక్షించాలి. అతను నా మిత్రుడు. అందుచేత మన వాళ్ళను అయిదు వందల పడవలు సిద్ధం చెయ్యమనండి.
 
ఒక్కొక్క పడవలోనూ నూరేసిమంది యువకులను ఏర్పాటు చేసి, పడవలు గంగకు అడ్డంగా ఉంచి, అందులోనే మీకు అవసరమైన మాంసమూ, ఇతర ఆహారాలూ, ఉంచుకుని జాగ్రత్తగా ఉండండి. భరతుడికి రాముడి పట్ల ద్రోహబుద్ధి లేకపోతే అతన్నీ, అతని సైన్యాన్నీ నిరాటంకంగా నది దాటనిద్దాం, లేకపోతే మన పడవలతో అటకాయింతాం,'' అన్నాడు. గుహుడు ఈ కట్టుదిట్టాలు చేసిన అనంతరం రకరకాల ఫలాలూ, తేనే కానుకగా తీసుకుని భరతుడి వద్దకు వెళ్ళాడు.
 
గుహుడు వస్తూండటం ముందుగానే తెలుసుకుని సుమంత్రుడు భరతుడితో, ``నిన్ను చూడటానికి బోయ రాజైన గుహుడు వస్తున్నాడు. ఇతను బలవంతుడు, సమర్థుడు, రాముడికి మంచి స్నేహితుడు. అతన్ని తగిన విధంగా గౌరవించి నట్టయితే రామలక్ష్మణులు అరణ్యంలో ఎటు వెళ్ళారో వారి జాడకూడా తెలుస్తుంది,'' అన్నాడు. ``అయితే ఆ గుహుణ్ణి వెంటనే నా దగ్గిరికి తీసుకురా,'' అని భరతుడు సుమంత్రుణ్ణి పంపాడు. గుహుడు భరతుడి సమక్షానికి వచ్చి, తాను తెచ్చిన కానుకలు ఇచ్చి, ``తమరు వస్తారని ముందుగా తెలిసివుంటే మంచి ఆతిథ్యమూ, స్వాగతమూ ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి రేపు ముందుకు సాగిపోదురు గాని,'' అన్నాడు.
 
భరతుడు గుహుడికి సంతోషం కలిగేటట్టుగా, ``రాజా, ఇంత సేనకు నీవు ఒక్కడివే ఆతిథ్యం ఇస్తానన్నావు. ఆ మాటకన్న మాకు నీ నుంచి హెచ్చు గౌరవం ఇంకేం కావాలి? మేము భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాలి, దారి చెప్పగలవా? ఇక్కడి నుంచి దారి చాలా కష్టమని విన్నాను,'' అన్నాడు. ``బాణాలు ధరించి మా బోయలు మీ వెంట వస్తారు లెండి. నేను కూడా వెంట ఉంటాను. అందుచేత మీకు దారి వెతుక్కునేపని ఉండదు,'' అన్నాడు గుహుడు. 

No comments:

Post a Comment