Friday, September 7, 2012

రామాయణం - బాలకాండ 2


విశ్వామిత్రుడూ, ఆయన వెనకగా రామలక్ష్మణులూ ఒక కోసు దూరం నడచి వెళ్ళి నిండుగా ప్రవహిస్తూన్న సరయూనది దక్షిణపు గట్టు చేరుకున్నారు."నాయనా, రామా! నీవు వెంటనే ఆచమనంచేసి రా. నీకు బల, అతిబల అనే రెండు విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసటా, జబ్బూ, రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలమూ నిన్ను మించిన అందగాడూ, తెలివిగలవాడూ, నేర్పరీ, వాదనలో నిన్ను మించగలవాడూ ప్రపంచంలో ఉండరు. ఆకలిదప్పు లుండవు. గొప్ప కీర్తి కలుగు తుంది," అన్నాడు విశ్వామిత్రుడు.

రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బల, అతిబలలను గ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూనది తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి, సరయూనదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్ఠానాలు పూర్తిచేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్ళీ బయలుదేరి, సరయూనది గంగలో కలిసే చోటికి వచ్చారు.

అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సుకు భంగం కలిగించటానికి వచ్చి, శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అదిమొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులుంటున్నారు. మన్మధుడు తన అంగాన్ని-అంటే శరీరాన్ని-అక్కడ పోగొట్టుకున్నాడు గనక, ఆ ప్రాంతానికి అంగదేశమనే పేరు వచ్చింది.

రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని, ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి, మర్నాడు ఒకపడవలో గంగను దాటారు. ఆ తరవాత వారు కాలినడకను ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జనసంచారం లేచు. విడవకండా కీచురాళ్ళ అరుపులూ, సింహగర్జనలూ, పులుల గాండ్రింపులూ, అడవి పందుల గురగురలూ,ఏనుగుల ఘింకారాలూ వినవస్తున్నాయి. చండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొర రాకుండా ఉన్నది ఆ అరణ్యం.

రాముడా అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి, "మహామునీ, అతి భయంకరంగా కనిపిస్తున్న ఈ అరణ్యం పేరేమిటి?" అని అడిగాడు.

విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు:

ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదమూ, కరూశమూ అని రెండు గొప్ప దేశాలుండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షినీ, దాని కొడుకు మారీచుడనేవాడూ చేరి రెండు దేశాలనూ నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరూ అటుకేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు, వెయ్యి ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలనూ మహారణ్యంగా మార్చగలిగింది.

ఈ మాట విని రాముడు, "స్వామీ, యక్షులు అల్పశక్తి గలవారంటారు గదా, ఈ తాటక అనే యక్షిణికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?" అని విశ్వామిత్రుణ్ణీ అడిగాడు.

"నాయనా, తాటకవృత్తాంతం కూడా చెబుతాను, విను. సుకేతుడనే గొప్ప యక్షుడుండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సుచేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి, ఆయనకు కొడుకును ఇవ్వక, వెయ్యి ఏనుగుల బలంగల కూతురు కలిగే లాగుమటుకు వరమిచ్చాడు. బ్రహ్మవర ప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్తవయస్సు వచ్చి మంచి అందగత్తెగా తయారయింది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్షకుమారుడి కిచ్చి పెళ్ళి చేశాడు. వారిద్దరికీ కొన్నాళ్ళకు మారీచుడునే కొడుకు కలిగాడు.
వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పొలినవాడు, మితిమించిన గర్వం గలవాడు.

ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకని తాటకా, మారీచుడూ అగస్త్యుడిపై ఆగ్రహించి, గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్టుగా మీదికి వచ్చారు. ఆప్పుడగస్త్యుడు వారిద్దరినీ రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి, నరభక్షిణిగా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక ఆయన సంచరించిన ఈ పుణ్య భూమిని పాడు పెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత, ఓ రామా, నీవా తాటకను వధించు. ఆడదని సంకోచించకు. ఆమే చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఆమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు," అని విశ్వామిత్రుడు చెప్పాడు.

రాముడు చేతులు జోడించి, "మహామునీ, మాతండ్రి మీరు చెప్పినదెల్లా చెయ్యమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకను చంపుతాను," అన్నాడు.

ఆ తరవాత రాముడు బాణంచేత పట్టిదాని తాడును బలంగాలాడి ఖంగు ఖంగుమని మోగించాడు. ఈ చప్పుడు వినపడే సరికి తాటకా వనంలో ఉండేవారంతా ఉలిక్కి పడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వేపు అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. తమకేసివచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో, "చూశావా, లక్ష్మణా, ఈమె ఎంత వికారాకారం కలిగి, ధైర్యవంతులకు కూడా భితి కలిగించేదిగా ఉన్నదో! అయినా, ఈ ఆడదాన్ని చంపడానికి నాకు చేతులు రావటంలేదు. దగ్గిరికి రానీ, ముక్కూ, చెవులూ కోసి, పొగరు అణచి తరిమేద్దాం!" అన్నాడు.

తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడు మీదికి వచ్చి, దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి, వారిపై రాళ్ళవాన కురిపించ సాగింది. రాముడు దాని చేతులు రెండు చేతులు రెండూ తన బాణాలతో తెగగొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కూ, చెవులూ కోసేశాడు. కాని మాయావి అయిన తాటక వాళ్ళపై మళ్ళీ రాళ్ళవాన కురిపీంచసాగింది.


అప్పుడు విశ్వామిత్రుడు, "రామా, ఈ పాపాత్మురాలిని దయతలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చెయ్యగలదు. సంధ్యాకాలం లోపల దీన్ని చంపెయ్యి. ఉదయవేళా, సాయం సమయానా రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించటం కష్టం," అని హెచ్చరించాడు.

ఈమాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేలమీద పడి, గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది.

విశ్వామిత్రుడు పరమానందభరితుడై రాముణ్ణి దగ్గరికి తీసుకుని, తల వాసన చూసి, "నాయనా, ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి, తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం," అన్నాడు.
మర్నాడు వేకువజామునే ఆయన రాముణ్ణిలేపి, తాను శుచి అయి, తూర్పు ముఖంగా కూచుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి, జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదట తమ రూపాలతొ నిలబడి, చేతులు జోడించి, "మేము నీ భృత్యులం. ఏ పని చెబితే అది చేస్తాం," అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, "ఇప్పటికి మీరంతా నా మనసులోచేరి ఉండండి," అని చెప్పాడు.


తరవాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరవాత వారు ముగ్గురూ ప్రయాణం సాగించారు.

వారు కొంతదూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడది చూసి, "స్వామీ, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమమనికూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి?" అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు:

"నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహా బలపరాక్రమశాలి అయి, మూడులోకాలనూ జయించి స్వర్గలోకం ఆక్రమించే సరికి, మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి, బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు మూడడుగులూ కొలిచి మూడు లోకాలూ పుచ్చుకుని బలిని అధో లోకానికి పంపేశాడు. ఆ వామనుడూ, ఆయన తండ్రి కశ్యపుడూ కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘతపస్సు చేశారు. అందుచేత నేను కూడైక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటి మాటికీ వచ్చి నన్ను చాలా క్షోభపెడుతున్నారు. వరందరినీ నీవు చంపాలి."

విశ్వామిత్రుడుంటున్న ఆశ్రమం పేరు సిద్దాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి, రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రమించిప్రయాణపు బడలిక తీర్చుకుని, విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, "మహామునీ, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము," అని చెప్పారు.


విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు, కాని యజ్ఞవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణిలతో, "నాయనలారా, విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండటంచేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు ఆరు రోజులదాకా ఎలాంటి విఘ్నాలూ రాకుండా మీరు మమ్మల్ని కాపాడాలి," అని చెప్పారు.

రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి, ఎంతో జాగ్రత్త వహించి రాత్రివేళ నిద్రకూడా మాని అయిదు పగళ్ళూ, అయిదు రాత్రులూ ఆశ్రమాన్ని కాపాడారు. ఆరో రోజు వచ్చింది.

యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమనంగా వెలుగుతున్నది. విధియుక్తంగా, మంత్రోక్తంగా యాగం నుడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు మారీచులూ, వారి బలగానికి చెందిన రాక్షసులూ కారుమేఘాల లాగా ఆకశం ఆవరించి యజ్ఞ వేదికపై రక్తవర్షం కురిపించసాగారు.

రాముడు రాక్షసుల ఆర్బాటాలు విని, తల ఎత్తి ఆకశంలోని రాక్షసమూకను చూశాడు. అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణీకొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. తరవాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణీ, వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులనూ చంపేశాడు. విశ్వమిత్రుడి యాగంపూర్తి అయింది. ఆయన రాముడితో, "నాయనా, నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు," అంటూ అతన్ని ప్రశంసించాడు.




No comments:

Post a Comment