Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 1


భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుపోయాడు. శత్రుఘ్నుడు వెంట లేనిదే ఎన్నిభోగాలు తనకు రుచించవు గనక, భరతుడు శత్రుఘ్నుణ్ణీ తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ లేకుండానే జరుగుతున్నది. అయితే, ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడూ వారిని బాదించేది.

అయోధ్యలో దశరథ మహారాజుకూడా తన కొడుకులలో ఇద్దరు దూరమై పోయారే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలూ రాముడే. అతనిలోలేని సద్గణం లేదు. ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం. "నేను ముసలివాణ్ణి అయిపోయినాను. త్వరలో రాముణ్ణి రాజును చేసి అతడు చక్కగా రాజ్యాపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది," అనుకున్నాడు దశరథుడు.

మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను అమోదించారు. ఇందుకు ప్రజలూ, ఇతరరాజులూ ఏమంటారో తెలుసుకోవలిసి ఉన్నది . అందుచేత దశరథుడు రాజులందరికి ఆహ్వానాలు పంపాడు. చాలాదూరాన ఉన్న కారణంచేత కైకేయి తండ్రి అయిన కేకయ మహారాజుకూ, సీత తండ్రి అయిన జనక మహారాజుకూ ఆహ్వానాలు పంపక, ఈ శుభవార్త వాడికి పట్టాభిషేకం అయిన తరవాత తెలుపుదామనుకున్నడు.


ఆహ్యానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కోలువు కూటంలో ఉచితాసనాలపై కూచున్నారు. నగరం లోని పౌరులూ, పల్లెటూ ళ్ళవాళ్ళూ కూడా సభకు వచ్చారు. దశరథుడు వారితో తాను ఎంత శ్రద్దగా రాజ్యం చేసినదీ వివరించి, "ఇప్పుడు నేను ముసలివాణ్ణీ అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను. మీ అందరూ సమ్మతిస్తే నాపెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది.

రాముడు పరాక్రమశాలి; ఎందులోనూ నాకు తీసిపోడు. అతను మూడు లోకాలూ ఏలదగినవాడు. అతనికి పట్టం గట్టటం రాజ్యానికి గొప్ప మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి," అన్నాడు. ఈ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది, రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. "మాహారాజా, ఆ రామపట్టాభిషేక మహొత్సవం ఊరేగింపు త్వరగా జరిపించండి,"అన్నారు.

వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ, "నేనింకా రామపట్టభిషేకం అనీ అనకూండానే మీరంతా సమ్మతిస్తూన్నారే ? ఏమిటి కారణం ? నాపరిపాలన మీకు నచ్చలేదా ? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీరు రాముణ్ణీ రాజుగా కోరటానికి కారణమేమిటి ? మరేమీ లేదు, తెలుసుకోగోరి. అడుగుతున్నాను!" అన్నాడు.

ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలిసినది జరిగింది; సభికులు రాముణ్ణి తెగ పొగడేశారు. సుగుణ సంపన్నుడైన ఆయన్ను రాజుగా చేస్తే ఇక అంత కంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, "మీరుకూడా నాలాగే భావిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది," అంటూ అప్పుడే తన పురోహితులైన వసిష్ఠ వామదేవాదులను పిలిపించి, "మహామునులారా, ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది. అందుచేత రామపట్టాభిషేక యత్నాలు ఇప్పుడే సాగించండి. అందుకు కావలసిన సామగ్రి అంతా తెప్పించండి, " అని అందరూ వింటూండగా అన్నాడు. వసిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్ళతో ఏయో సామగ్రి సిద్దం చేయాలో చెప్పేశాడు. పట్టాభిషేక మహొత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్దమయింది.


 దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళీ రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో " నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగినవిధంగా నీవు రాజ్యం ఏలుకో," అని చెప్పి అతన్ని పంపేశాడు. తరవాత, దూరదేశాల నుంచి వచ్చిన రాజులూ, ప్రజలూ ఎవరి దారిన వారు వెళ్ళిపో యారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారమూ, ఆవులూ, రత్నాలూ బహూకరించింది.

అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, "రేపు పుష్యమీ నక్షత్రం. పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది. అందు చేత రేపే జరుపుదాం," అని నిశ్చయించి, రాముణ్ణి తీసుకురుమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పాగానే రాముడు , "నే నిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మళ్ళి ఎందుకు రమ్మన్నారు?" అని అడిగాడు. "నిజమే. అయినా మహారాజుగారు తమరిని చూడాలన్నారు. వెంటనే తీసుకురమ్మ న్నారు," అన్నాడు సారథి.

రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవరూ లేరుగనక దశరథుడు ఈసారి తన కాళ్ళకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి, ఆలింగనం చేసుకుని, ఉన్నతాసనంపై కూచోబెట్టి, "నాయనా, రామా!నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి, నా జన్మనక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి. కనక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పుష్యమి. రేపు పునర్వసు. శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవూ, నీ భార్యా దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగిరాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగల వాడే; ఈ పట్టభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవస్వభావం అమిత చంచలమైనది," అని చెప్పాడు.


రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపీంచింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్రా లక్షణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, "అమ్మా, రెపటి పట్టాభిషేకానికి నేనూ, సీతా ఏమేమి అలంకారాలు చేసులోవాలో అవన్నీ చేయించు," అని కోరాడు.

రాముడు లక్ష్మణుడితో, "లక్ష్మణా, నాతో బాటు నీవుకూడా ఈ భూమినంతా పాలింతువుగాని. మనిద్దరమూ ఒకటేగదా. నేను రాజయితే నీవూ రాజువే. మనిద్దరమూ సమస్త సుఖాలూ ఒక్కటిగా అనుభవించుదాం," అన్నాడు. తరవాత అతను తల్లుల అనుమతి పొంది సీతతోసహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడిచేతనూ, సీతచేతనూ ఉపవాసవ్రతం సక్రమంగా చేయించ టానికి దశరథుడి కోరికపై వసిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరుకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తెరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనంతండోపతండా లుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోష ధ్వానాలు చేస్తున్నారు వీధులలో నీళ్ళు చల్లి, పూలదండలు కట్టారు. ప్రతి ఇంటిమీదా జెండా ఎగురుతున్నది. స్త్రీలూ, పిల్లలూ, వృద్దులూ ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురుచూస్తునారు.

వసిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి, సీతతో కూడా హొమం చేసి, హొమశేషం తిని, నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్వానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాముసేపు నిద్రపోయి, వందిమాగధుల మేల్కొలుపులకు లేచాడు. ఆయన ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తిచేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మాణులు వచ్చి పుణ్యాహావాచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమోగిపోయింది.


తెల్లవారుతూనే మళ్ళీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు. ఇళ్ళ ముందు నీళ్ళు చల్లి ముగ్గులు వేసి, పువ్వులు చిమ్మారు. సుగంధ ధూపాలు వేశారు. వీధుల వెంబడి జనం గుంపులు గుంపులుగా కూడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇళ్ళముందు ఉత్సాహంగా ఆడు కుంటూ, "ఇవాళ పట్టాభిషేకం చూడటానికి నేను కూడా మా అమ్మా, నాన్న వెంట పోతాను," అని చెప్పుకుంటున్నారు. ఆడేవాళ్ళూ అనందంగా ఆడుతు న్నారు, పాడేవాళ్ళు హాయిగా పాడుతున్నారు.

కాని ఆ రాత్రే మరొకరకం నాటకం ఆరంభమయింది. కైకేయి వెంట మంధర అనే ఒకగూని దాసి ఆమెకు అరణంగా వచ్చింది. ఆ మంధర ఆ రాత్రి కైకేయి ఉండే మేడ పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి అయోద్యలో జరిగే సందడి అంతా చూసి ఆశ్చర్యపడింది. తన పక్కనే తెల్ల పట్టుచీర గట్టినిలబడి ఉన్న ఒక దాదితో మంధర, "ఈ ఆర్భాటమంతా ఏమిటే ? కౌసల్య ఏదన్నా వ్రతంపట్టి జనానికి దాన ధర్మాలు చేస్తున్నదా? లేక దశరథుడు ఏదన్నా ఉత్సవం తల పెట్టాడా?" అన్నది. ఆ దాది పొట్ట చెక్కలయ్యే లాగనవ్వి, "తెల్లవారగానే రాజు గారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు," అని చెప్పింది.

గూని మంధరకు ఈ వార్త కర్ణకఠోరమయింది. ఆమె గబగబా మేడ దిగి, కైకేయి పడుకుని ఉన్న చోటికి వెళ్ళి, "లే,లే! ఏం పడుకున్నావు? నీ కొంప నిలువునా కూలబోతున్నది. ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరి మీదా లేదని మాహా మురిశావు! ఇక మురుద్దువుగాని!" అన్నది. "నీ వాలకం చూస్తే ఏదో జరిగినట్టుందే! అందరూ క్షేమంగానే ఉన్నారుగద!" అన్నది కైకేయి.

"రేపు దశరథమహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడు. ఇంకేం జరగాలి. ఈ మాట వినగానే నా గుండే జారిపోయింది. నీ మంచి కోరినదాన్ని గనక ఈ మాట వింటూనే నీ దగ్గిరికి పరిగెత్తు కొచ్చాను, " అన్నది మంధర.


"నిజంగానా, మంధరా? ఎంత మంచి వార్త తెచ్చావు!" అంటూ కైకేయి ఆనందంతో వికసించిన ముఖంతో పక్కమీద లేచి కూచుని, మెడలోని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ, "ఇంకేం కావాలన్నా ఇస్తాను, అడుగు!" అన్నది. కైకేయి ధోరణి మంధరకేమీ నచ్చలేదు. ఆమె తన యజమానురాలితో, "మూఢురాలా, రాబోయే విపత్తు అర్థం చేసులోలేకుండా ఉన్నావు. లేకపోతే దుఃఖించటానికి బదులు ఆనందిస్తావా? నీకు బదులు కూడా నేనే ఎడుస్తున్నాను. ఎందుకంటావా? రేపు పట్టాభిషేకం జరగగానే కౌసల్య రాజమాత అవుతుంది.

నీవు ఆమెకు పరిచారికవవుతావు. రాముడి అంతఃపుర స్త్రీలకు నీ కోడళ్ళు దాసీలవుతారు. భరతుడూ, అతని సంతతీ రూపుమాసి పోవలిసిందే. నాకు బహుమానం ఇస్తానంటివే? నీకేమి ఒరిగిందని బహుమానం ఇస్తావు? రాజ్యాభిషెకం భరతుడికి జరిగినప్పుడుగదా నేను నీ బహుమానాలు పొందవలిసింది? భరతుడు దూరాన మామగారింట ఉండబట్టీ గాని, దశరథుడు నీపై ప్రేమకొద్దీ అతనికే ఈ పట్టభిషేకం చేసి ఉండడా? రాముడు రాజయ్యాక భరతుడిక ఇక్కడికి రానవసరం లేదు. అటునుంచి అటే అడవికి పోవటం మేలు.

ఎందుకంటే రాముడు అతణ్ణి బతకనివ్వడు. నీ భర్త నీ మీద ఎక్కువ ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంత వరకూ నీవు కౌసల్యను చాలా లోకువగా చూశావు. ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా? నీకు నిజంగా సమర్థతే ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టించు! భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకి తోయించు! ఇంత రాజ్యానికీ భరతుడు రాజవుతాడు, నీవు రాజమతవై గౌరవం పొందుతావు. రాముడు రాజైతే నీ పతనంతప్పదు. నీ ముఖం చూసెవారుండరు," అని ఎడా పెడా అనేసింది. ఈ మాటలు కైకేయి తలకెక్కయి. ఆమె ముఖం జేవురించింది. క్రోధావేశంతో ఆమె మంధరను చూసి, "ఆవును, నువ్వన్నది జరగాలి. భరతుడు రాజు కావలిసిందే, రాముడడవి పాలు కావలిసిందే! కాని అది ఎలా సాధ్యపడు తుంది?" అన్నది.






No comments:

Post a Comment