Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 5


వీధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తుతున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కొందరు రథానికెదురుగా వచ్చి సుమంత్రుణ్ణి, ``మళ్ళీ ఎప్పటికి చూస్తామో, కాస్సేపు చూడనియ్యి. రథం మెల్లిగాతోలు, బాబూ!'' అని బతిమాలారు.
ఉన్నట్టుండి దశరథుడు, ``నేను రాముణ్ణి చూడాలి!'' అంటూ తన ఇంటి నుంచి బయటికి వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో బాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. ``సుమంత్రుడా, రథం కాస్త ఆపు!'' అని కేక పెట్టాడు దశరథుడు.
 
ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కు తిరిగి చూస్తున్న రాముడికీ దృశ్యం దుర్భరమయింది. అతను సుమంత్రుడితో, ``రథం వేగంగా తోలు. ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను? ఎలా చూడటం? అంతగా మహారాజు అడిగితే, జనం చేసే గోలలో ఆయన కేక వినిపించ లేదని చెప్పు,'' అన్నాడు.
 
రాముడు రథాన్ని వెన్నంటి వచ్చేవారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుర్రాలను వడిగా తోలాడు. దశరథుడితో మంత్రులు, ``మహారాజా, వాళు్ళ త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువ దూరం సాగనంప గూడదు,'' అని చెప్పారు. దశరథుడు శరీర మంతా చెమటలు దిగ గారుతూ, భార్యలతో సహా అక్కడే నిలబడి, క్రమంగా దూరమై పోతున్న రథాన్ని చూశాడు. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళి పోవటంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండి పోయింది.

దానితోబాటే అయోధ్యా నగరమంతా పాడు పడినట్టయి పోయింది. ఎక్కడి పనులక్కడ ఆగిపోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు. రాముడి వెనుక కొంతదూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్యా, కైకేయీ చెరొక చేయీపట్టుకుని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో, ``నన్నంటకు. నేను నీ భర్తను కాను. నిన్ను విడిచి పెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు,'' అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా విపరీతంగా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు.
 
ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్యా దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది. ఈ లోపల సీతా రామలక్ష్మణులెక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళవద్దని నిర్బంధం చెయ్యసాగారు. రాముడెన్ని చెప్పినా వారు ఏమాత్రం వినిపించుకోలేదు. సుమంత్రుడు గుర్రాలను విప్పి, కడిగి, నీరు తాగించి, నది ఒడ్డున తిరగనిచ్చి, తరవాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడూ, లక్ష్మణుడూ తయారుచేసిన ఆకుల పక్క మీద పడుకుని రాముడూ, సీతా నిద్రపోయారు.
 
సుమంత్రుడూ, లక్ష్మణుడూ రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపాయారు. తెల్లవారుతూండగా రాముడు లేచి, ఇళు్ళ వాకిళు్ళ విడిచిపెట్టి చెట్ల కింద నిద్ర పోతున్న పౌరులను చూసి, లక్ష్మణుడితో, ``వీరంతా లేవకముందే మనం రథ మెక్కి సాగిపోవటం మంచిది. లేకపోతే వీరు మనని వదలరు. మనతోపాటే వచ్చేస్తారు,'' అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధంచేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, ``రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా. అప్పుడు జనం మనం వెళ్ళిన జాడ తెలుసుకోలేక పోతారు,'' అన్నాడు. సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చినాక సీతా రామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూర్చుని ఉత్తరంగా బయలుదేరారు.

తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతా రామ లక్ష్మణులు లేరు. తమను వంచించిన నిద్రనూ, దైవాన్నీ తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. తెల్లవారే సరికే రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి, కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది. గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేతపెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు.
 
ఇంతలో గుహుడనే బోయరాజు, రాముడికి మంచి స్నేహితుడు, రాముడి రాక గురించి తెలిసి, తన మంత్రులతోనూ, కుల పెద్దలతోనూ చూడ వచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్ళి, గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, ``రామా, ఇదే అయోధ్య అనుకో! నీవు అతిథిగా రావటం నా అదృష్టం,'' అన్నాడు. తరవాత గుహుడు రాముడికీ, లక్ష్మణుడికీ, సీతకూ మంచి భోజనం సిద్ధంచేయించి, ``రామా, నీకు ఏ లోపమూ జరగదు. ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో,'' అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, ``గుహా, నా కోసం కాలి నడకన వచ్చావు.
 
అంతకన్న ఇంకేం కావాలి? నీ రాజ్యం నీవే ఏలుకో. నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు,'' అని నచ్చచెప్పాడు. ఆ రాత్రి రాముడూ, సీతా ఆ గారచెట్టు కిందనే పడుకుని నిద్రపోయారు. వారికి రక్షగా మేలుకుని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, ``నాయనా, నీవుకూడా పడుకుని విశ్రాంతి తీసుకో. తెల్లవార్లూ మీకు మేము కాపు ఉంటాంలే. అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే,'' అన్నాడు.
 
కాని లక్ష్మణుడు అలా చెయ్యక గుహుడితో తెల్లవార్లూ మేలుకుని కూచుని, జరిగినదాన్ని గురించీ, జరగబోయేదాన్ని గురించీ మాట్లాడాడు. అంతా విని గుహుడు చాలా దిగులుపడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడుదయం రాముడు కోయిల కూతలకూ, నెమళ్ళ కూతలకూ మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడితో, ``సూర్యోదయం అవుతున్నది. మనం గంగానది దాటి వెళ్ళిపోదాం,'' అన్నాడు.

లక్ష్మణుడు వెళ్ళి బోయ రాజైన గుహుణ్ణీ, సారథి అయిన సుమంత్రుణ్ణీ పిలుచుకు వచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటటానికి మంచి పడవనూ, నావికుణ్ణీ సిద్ధంచెయ్యమన్నాడు. రాముడు సుమంత్రుడితో, ``సారధీ, నీ విక నగరానికి తిరిగి వెళు్ళ. మా తండ్రిగారితోనూ, తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి, పధ్నాలుగేళూ్ళ తీరగానే తిరిగి వస్తామని చెప్పు. తరవాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుంచి తీసుకు వచ్చి రాజ్యాభిషేకం చేయించు,'' అన్నాడు.
 
సుమంత్రుడు, ``రామా, రణరంగంలో యోధుడు పడిపోగా సారధి ఉత్త రథాన్ని తీసుకుపోయినట్టుగా, మీరు ముగ్గురూ ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్త రథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించను? నేనుకూడా ఈ పధ్నాలుగేళూ్ళ మీ వెంటనే ఉండి మీకు అడవిలోని ఫలాలను తెచ్చి పెడుతూ ఉంటాను,'' అన్నాడు. ``అలా కాదు, సారధీ.
 
నీ విక్కడే ఉండి పోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు కైకేయికీ, తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రిగారికీ ఎలా తెలుస్తుంది? కనక, నీవు తిరిగి వెళ్ళి తీరాలి,'' అన్నాడు రాముడు. తరవాత రాముడి కోరికపై గుహుడు మర్రిపాలు తెచ్చాడు. దానితో రామలక్ష్మణులిద్దరూ మునులలాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరవాత తానుకూడా ఎక్కాడు.
 
రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కికూచున్నాడు. గుహుడి బంధువులు తెడ్లువేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, ``గంగాదేవీ, పధ్నాలుగేళ్ళ అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు లక్ష గోవులూ, వస్త్రాలూ దానం చేస్తాను, అన్నదానం చేస్తాను. నీకు నైవేద్యం పెడతాను. నీ గట్టున ఉండే అన్ని దేవాలయాలకూ మొక్కుతాను. మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు,'' అని భక్తితో మొక్కు కున్నది. త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది.
 
సీతారామలక్ష్మణులు వత్సదేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముందు లక్ష్మణుడూ, అతని వెనక సీతా, సీత వెనకగా రాముడూ-ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా వెళ్ళిన దాకా చూసి కంటతడి పెట్టుకున్నాడు. రామలక్ష్మణులు ఆ రోజు చుట్టుపక్కల చెట్లకు కాచిన సుమధుర ఫలాలను తిని ఆకలి తీర్చుకుని, ఆ రాత్రికి ఒక చెట్టు కింద చేరారు.
 
తన స్థితి తలుచుకుని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు. ఇదే అరణ్యవాసానికి మొదటిరాత్రి. ఇకనుంచీ సుమంత్రుడు కూడా తోడుండడు. నిద్రపోకుండా మేలుకుని ఉండి తానూ, లక్ష్మణుడూ సీతను జాగ్రత్తగా కాపాడు కోవాలి. ఇప్పుడు తండ్రి దశరథుడు పుట్టెడు దిగులుతో పడుకుని ఉంటాడు. ఆయనకు తీరని క్షోభకలిగించిన కైకేయికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. భరతుడు హాయిగా, సుఖంగా రాజ్యమేలు తాడుగద! అసలు ఈ కైకేయి దాపరించింది దశరథుడి కీడుకూ తనను అడివికి పంపటానికీనూ! సుకుమారి అయిన సీత తన కారణంగా ఇడుమల పాలు కావలసివచ్చింది.
 
అమ్మ ఏ జన్మ లోనో తల్లీ కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలుచుకుంటే, ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించ గలడు! తండ్రి మాటకు లోబడి, ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు గాని! అయినా, తానొకటి తలిస్తే విధి ఒకటి తలిచింది. ఇందులో ఎవరిని నిందించీ ప్రయో జనంలేదు. అంతా విధిప్రకారమే జరుగుతుంది.

ఎంతటి వారైనా విధికి తలవొగ్గక తప్పదు! రాముడికి నిద్ర రాలేదు. అతను కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకు పోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఊరడించాడు. ఆ మాటలతో రాముడి మనసు కాస్త స్థిమితపడి, వనవాస దీక్ష అతనిలో దృఢపడింది. పక్కనే ఒక మర్రిచెట్టు కింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు.
 
సీతారాములు ఆ రాత్రికి ఆ పక్కపైన పడుకున్నారు. తెల్లవారుతూనే ముగ్గురూ లేచి గంగా యమునా సంగమమైన ప్రయాగ కేసి నడిచారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. ``అవును, నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకు పంపాడని విన్నాను. నీ విక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకుని పధ్నాలుగేళూ్ళ ఇక్కడే ఉండిపోవచ్చు.
 
ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది,'' అన్నాడు భరద్వాజుడు. దానికి రాముడు, ``మునీంద్రా, మేమీ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసి పోవటానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా, మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది. ఆమెకు చూడ ముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే, అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండి పోతాము,'' అన్నాడు. ``ఇక్కడ ఉండటం ఇష్టంలేక పోతే ఇక్కడికి పదికోసుల దూరాన చిత్రకూట మనే కొండ ఉన్నది. అది చాలా రమ్యమైన ప్రదేశం.
 
ఆ పర్వతంమీద కొండ ముచ్చులూ, కోతులూ, ఎలుగుబంట్లూ ఉంటాయి. కొన్ని వేల ఏళు్ళగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అది మీకు అనువైన ప్రదేశం. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు,'' అన్నాడు భరద్వాజుడు.
 

No comments:

Post a Comment