Friday, September 7, 2012

రామాయణం - అరణ్యకాండ 6


తరవాత రావణుడు అంతఃపురం నుంచి బయటికి వచ్చి జట్టీలలాటి ఎనిమిదిమంది రాక్షసులను పిలిచి, ‘‘మీరు అన్ని రకాల ఆయుధాలూ పట్టుకుని జనస్థానానికి వెళ్ళాలి. ఒకప్పుడక్కడ ఖరుడుండేవాడు. అక్కడి రాక్షసులంతా చావటం చేత ఇప్పుడెవరూ లేరు. ఖర దూషణులనూ, రాక్షస సేననూ రాముడు దుర్మార్గంగా చంపేశాడు.
 
ఆ రాముడికీ మనకూ మధ్య ఇప్పుడు గొప్ప వైరం ఏర్పడింది. అందుచేత ఆ రాముణ్ణి చంపేదాకా నేను నిద్రపోను.ఈ లోపుగా మీరేం చెయ్యూలంటే, ఆ జనస్థానంలో ఉండి, రాముడు ఎప్పుడేం చేసేదీ నాకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి. మీరు ఒక్క క్షణం కూడా ఏమరుపాటన్నది లేకుండా, రాముణ్ణి చంపే ప్రయత్నంలోనే ఉండాలి.
 
అద్భుతమైన మీ బలపరాక్రమాలు నేను అనేక పర్యాయూలు ప్రత్యక్షంగా చూశాను గనక, మీకీ పని అప్పగిస్తున్నాను,'' అని చెప్పాడు. రాక్షసులు వెళ్ళిపోయూరు. తరవాత రావణుడి బుద్ధి సీత మీదికి వెళ్ళింది. అతను త్వరగా తన అంతఃపురానికి తిరిగి వచ్చి, రాక్షసస్ర్తీల మధ్య కూచుని దుఃఖ సముద్రంలో ముణిగి ఉన్న సీతను చూశాడు. సీత వద్దు మొర్రో అంటున్నా వినకుండా అతను సీతను బలవంతంగా తీసుకుపోయి తన భవనమంతా చూపించాడు. అది అత్యంత సుందరమైన దేవతాగృహాలలాటిది. అందులో అనేకవేల మంది స్ర్తీలున్నారు. రకరకాల పక్షులున్నాయి.

ఎక్కడ చూసినా రత్నాలూ, మణులూ మాణిక్యాలూ, దంతంతో చేసిన భాగాలూ, స్ఫటికశిలలూ, వెండితో చేసినవీ, వజ్రవైడూర్యాలు తాపడం చేసిన అందమైన స్తంభాలూ ఉన్నాయి. బంగారు ద్వారం గల అద్భుతమైన మెట్ల వరస మీదుగా ఇద్దరూ ఎక్కారు. మెట్ల పక్కన వెండి కిటికీలూ, దంతపు కిటికీలూ ఉన్నాయి. మేడ మీద బంగారు కిటికీలున్నాయి.
 
కొన్నిచోట్ల గోడలో రత్నాలు పొదిగారు. తులలేని తన ఐశ్వర్యంతో సీతను భ్రమింప జెయ్యటానికిగాను రావణుడు ఇవన్నీ సీతకు చూపాడు. అతను సీతతో, ‘‘నువ్వు నాకు ప్రాణంకన్న ఎక్కువైన దానివి. నా భార్యవయ్యూవో నా మిగతా భార్యలందరికీ రాణిని చేస్తాను. ఈ మహానగరం దేవతలకు కూడా గెలవరానిది. నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోగలవాడు మూడు లోకాలలోనూ లేడు.
 
నన్ను కూడా దాసుడుగా చేసుకుని ఈ లంకా రాజ్యాన్ని నువ్వే ఏలు. ఎప్పుడో ఏదో పాపం చేసి ఇంత వరకు వనవాసం అనుభవించావు. ఇక నీ పుణ్యం అనుభవించు. విమానంలో మనం ఇష్టం వచ్చినట్టు విహరింతాం. దుఃఖిస్తుంటే నీ అందమైన ముఖం కళారహితంగా ఉన్నది. అందుచేత విచారం మాను!'' అన్నాడు. ఇంత చెప్పినా సీత చలించలేదు. ఆమె తనకూ రావణుడికీ మధ్య ఒక గడ్డిపోచ అడ్డంగా పట్టుకుని, అతని కేసి చూస్తూ, ‘‘నాకు ఒకడే దేవుడు. అతడు నా భర్త అయిన రాముడు.
 
అతని చేతిలో నీకు చావు రాసిపెట్టి ఉన్నది. ఈ లంకకు వైధవ్యప్రాప్తి తప్పదు. నా శరీరాన్ని బంధించు, కోసుకుతిను గాక, నేను పాతివ్రత్య భంగం సహించను,'' అని జవాబిచ్చింది. రావణుడు మండిపడి, ‘‘అయితే నా మాట విను. నీకు పన్నెండు మాసాలు గడు విచ్చాను. ఈ లోపుగా నువ్వు నా కోరికను ఆమోదించకపోతే నా వంటవాళ్ళచేత నిన్ను ముక్కలు ముక్కలుగా కోయించి ఫలహారం వండిస్తాను!'' అన్నాడు.
 
తరవాత అతను రాక్షసస్ర్తీలను పిలిచి, ‘‘ఈమెను అశోకవనానికి తీసుకుపోయి మీరంతా చుట్టూ ఉండి జాగ్రత్తగా రక్షించండి. నయూనో భయూనో ఈమెను దారికి తీసుకు రండి,'' అని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే రాక్షసస్ర్తీలు సీతను అశోకవనానికి తీసుకువెళ్ళారు.

ఆ వనంలోని చెట్లు ఎల్లప్పుడూ పూలతోనూ, పళ్ళతోనూ నిండి ఉంటాయి. వనం నిండా పక్షులున్నాయి. రాక్షసస్ర్తీలు సీతను అక్కడికి చేర్చి చుట్టూ కూచున్నారు. ఆమెకు దుఃఖమూ, భయమూ పట్టుకున్నాయి. ఆమె రాముణ్ణి తలుచుకుని దుఃఖం పట్టలేక మూర్ఛపోయింది. అక్కడ రాముడు మాయలేడి రూపంలో వచ్చిన మారీచుణ్ణి చంపి ఆశ్రమానికి తిరిగి వస్తూండగా వెనక నుంచి నక్క ఒకటి కూసింది.
 
ఈ దుశ్శకునంతో కలవరపడి రాముడు, ‘‘సీతను ఏ రాక్షసులో తిని ఉండరు గద!'' అని భయపడ్డాడు. లేడి రూపంలో ఒక రాక్షసుడు వచ్చి తనను ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవటమూ, చూస్తూ కూడా వాడు తన గొంతుతో ఆర్తనాదం చెయ్యటమూ చూస్తే తన కేదో ద్రోహం తలపెట్టి రాక్షసులు పన్నాగం చేశారని అతనికి నమ్మకం కలిగింది.
 
సీతకు లక్ష్మణుడు రక్షగా ఉన్నాడన్న ధైర్యం అవలంబించేటందుకు కూడా అవకాశం లేకుండా ఆ లక్ష్మణుడే తనకు ఎదురువస్తూ కనిపించాడు! రాముడి ఆందోళన రెట్టింపయింది. అతను లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని, ‘‘ఇదేమిటి, లక్ష్మణా! సీతను ఆశ్రమంలో ఒంటిగా విడిచి వచ్చావా? సీతను మళ్ళీ మనం ప్రాణాలతో చూస్తామా? సీతకు ఏమన్నా జరిగిందో నా ప్రాణాలు నిలవవు! నేనుపోయూక నువ్వు అయోధ్యకు తిరిగిపోతే, కైకేయి తన కోరిక పూర్తిగా ఫలించినందుకు సంతోషిస్తుంది కాబోలు!
 
ఆ రాక్షసుడి కేకకు శూరుడవైన నువ్వు కూడా భయపడ్డావా? నేను ఖరదూషణాది రాక్షసులను చంపానేమో, వారు పగపట్టి ఉన్నారు; సీతను తప్పక చంపేస్తారు. లక్ష్మణా, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి. దుఃఖంలో ముణిగి ఏమీ చేయలేని స్థితిలో పడ్డాను,'' అన్నాడు. లక్ష్మణుడు సీత అన్న కఠోరవచనాలు వివరించి చెప్పి, ఆ పరుషాలు సహించలేక బయలుదేరి వచ్చానన్నాడు.
 
‘‘సీత అజ్ఞానం చేత ఏవేవో అన్నదని ఆగ్రహించి నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించటం చాలా తప్పు! నాకే ప్రమాదమూ రాదని తెలిసిన వాడవు సీత వెంటనే ఉండవలిసింది,'' అన్నాడు రాముడు. రాముడు భయపడ్డంతా అయింది. సీత పర్ణశాలలో లేదు.

ఆమె మామూలుగా తిరిగే చోట్లలో కూడా లేదు. ఆశ్రమం బావురుమంటున్నది. అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. అతను సీత కోసం వెతుకుతూ అడవిన పడ్డాడు. ‘‘సీత ఎక్కడ ఉన్నది?'' అని అరణ్యవృక్షాలను పేరుపేరునా అడిగాడు. దుఃఖాతిశయంతో అతనికి మతి పోయింది. అంత దూరాన సీత కనిపించినట్టూ, తనకు అందకుండా పారిపోతున్నట్టూ, భ్రమ కలిగింది; సీతను కేకపెట్టి పిలిచాడు.
 
ఉన్నట్టుండి అతనికి సీత ఎక్కడో దాక్కుని తనను ఏడిపిస్తున్నదన్న అనుమానం వచ్చింది; కనిపించమని ఆమెను వేడుకున్నాడు. లక్ష్మణుడు రాముడి దీనస్థితి గమనించి, ‘‘అన్నా, దుఃఖించి లాభంలేదు. చుట్టు పక్కల అరణ్యమంతా వెతుకుదాం. సీత ఎంతోదూరం వెళ్ళి ఉండకపోవచ్చు,'' అని ధైర్యం చెప్పాడు. పరిసరారణ్యమంతా ఎంత వెతికినా వారికి సీత జాడ తెలియలేదు.
 
రాముడికి మళ్ళీ అధైర్యం పట్టుకున్నది; అతని దేహంలో శక్తి లేకుండా పోయింది. అతను నిస్త్రాణగా ఒక చోట కూలబడిపోయూడు. అన్న సీతను తలుచుకుని పెద్దపెట్టున శోకాలు పెట్టుతూండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఓదార్చటానికి ఎంతగానో ప్రయత్నించాడు. కాని ఆ మాట లేవీ రాముడి చెవి కెక్కలేదు.
 
అతను లక్ష్మణుడితో, ‘‘సీతను రాక్షసుల పాలుకానిచ్చిన నన్ను లోకం నిర్వీర్యుడి కింద జమ కడుతుంది. సీత లేకుండా నేను అయోధ్యకెలా వెళతాను, సీత లేని శూన్యాంతఃపురంలో ఎలా ప్రవేశిస్తాను? నేను వచ్చానని తెలిసి జనక మహారాజు వస్తే ఆయనకు నా ముఖం ఎలా చూపిస్తాను? సీత లేక నేను బతికే మాట అబద్ధం.

అందుచేత నన్నిక్కడే వదిలి నువ్వు అయోధ్యకు వెళ్ళు. భరతుణ్ణే రాజ్యం పాలించమన్నానని చెప్పు. నేనూ సీతా ఎలా నాశనమయ్యూమో మా తల్లికి చెప్పు,'' అన్నాడు. రాముడి స్థితి చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. చివరకు లక్ష్మణుడి ప్రోత్సాహంతో రాముడు సీతను మరింత ఓపికగా వెతకటానికి నిశ్చయించాడు.
 
పరిసర ప్రాంతాలలో వెతుకుతూండగా ఒకచోట వారికి సీత ధరించిన పూలు నేలపై కనిపించాయి; వాటిని రాముడు గుర్తించాడు. మరికొంత దూరాన రాక్షసుడి అడుగులూ; సీత అడుగులూ కనిపించాయి; అక్కడనే సీత రావణుడికి అందకుండా పారిపోవ యత్నించింది. ఆ ప్రాంతంలోనే రక్తపు మరకలూ, విరిగిపోయిన రథమూ, గొడుగూ, గాడిదలూ, సారథి కళేబరమూ, బంగారు విల్లూ మొదలైనవి కనిపించాయి.
 
ఆ రక్తం సీతదేననుకున్నాడు రాముడు. అప్పటివరకూ రాముడికి రాక్షసులపైన ప్రత్యేకించి పగ లేదు; కాని ఆ క్షణంలో రాక్షసనిర్మూలనం చెయ్యూలనే నిశ్చయం అతనిలో ఏర్పడింది. ‘‘నా సీతను నాకు వెంటనే ఇవ్వకపోతే మూడు లోకాలనూ ఒక్కబాణంతో భస్మీపటలం చేస్తాను,'' అని రౌద్రంగా అన్నాడు. లక్ష్మణుడు రాముణ్ణి వారిస్తూ, ‘‘ఈ యుద్ధం జరిగినచోట ఒక్క మనిషి అడుగు జాడలే ఉన్నాయి. ఒక్కడు చేసిన తప్పుకు మూడు లోకాలను శిక్షించటం అన్యాయం.

సీతను కాపాడడం ప్రధానం. ఎవడు సీతను అపహరించాడో వాడి కోసం అన్నిచోట్లా వెతుకుదాం,'' అన్నాడు. ఇంతలోనే వారికి చావ సిద్ధంగా ఉన్న జటాయువు శరీరం ఎత్తుగా కనిపించింది. ‘‘ఇదుగో, వీడే సీతను తినేసి హాయిగా కూచున్నాడు! వీడి ప్రాణాలు తీసేస్తాను,'' అంటూ రాముడు జటాయువుపై బాణం ఎక్కు పెట్టాడు. ‘‘నాయనా, నన్ను రావణుడు చంపనే చంపాడు.
 
నువ్వు మళ్ళీ ఎందుకు చంపుతావు? వాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడి వాడి వింటినీ, రథాన్నీ, గాడిదలనూ, సారథినీ ధ్వంసం చేశాను. వాడు కత్తితో నా రెక్కలు నరికేశాడు. తరవాత సీతను తీసుకుని ఆకాశమార్గాన వెళ్ళిపోయూడు,'' అని జటాయువు చెప్పాడు. ఈ మాటలు రాముడి చెవులకు శుభ వార్తలాగా వినిపించాయి. ఎందుకంటే సీతను రాక్షసులు చంపి తినలేదు; ఆమెను ఎత్తుకుపోయిన వాడెవడో కూడా తెలిసింది.
 
రాముడు తన విల్లును వదిలిపెట్టి జటాయువును కౌగలించుకుని దుఃఖించాడు. అతను జటాయువును, ‘‘రావణుడికి నేనేమి అపకారం చేశాను? సీత నెందుకు అపహరించాడు? అతనుండే చోటేది? అతను ఎలా ఉంటాడు? ఎలాటి పరాక్రమం కలవాడు? వాడు తీసుకుపోతూ ఉంటే సీత ఏ స్థితిలో ఉన్నది? నాతో ఏమి చెప్పమన్నది? నీకు శక్తి ఉన్నట్టయితే నాకు సమస్తమూ సవిస్తరంగా చెప్పు,'' అని అడిగాడు ఆతృతగా.
 
కొనప్రాణాలతో ఉన్న జటాయువు, ‘‘ఆ రావణుడు ఇలా దక్షిణంగా వెళ్ళాడు. వాడు కుబేరుడి తమ్ముడు,'' ఆ మాత్రం చెప్పి ప్రాణాలు వదిలాడు. ఎంతో కాలం గొప్పగా జీవించి తన కోసం ప్రాణాలర్పించిన జటాయువుకు రాముడు శాస్ర్తోక్తంగా అంత్యక్రియలు జరిపాడు. పిండ ప్రదానానికి కేసరీ మృగమాంసం సంపాదించాడు. అనంతరం రామ లక్ష్మణులు గోదావరిలో స్నానాలు చేసి జటాయువుకు జలతర్పణాలు వదిలారు. తరవాత వారిద్దరూ జటాయువు చెప్పిన ప్రకారం సీతను వెతుకుతూ దక్షిణ దిశగా బయలుదేరారు.

No comments:

Post a Comment