Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 10


భరతుడు రాముడి ఆజ్ఞానుసారం లేచి జలం స్పృశించి రాముణ్ణి తాకి అందరితోనూ ఈ విధంగా అన్నాడు : ``మీరంతా వినండి. నేను నా తండ్రిని రాజ్యం కోర లేదు, నా తల్లినీ కోరలేదు. రాముడడవికి వెళ్ళటం నాకు సమ్మతంకాదు. రాముడి బదులు నేను పధ్నాలుగేళూ్ళ వనవాసం చేస్తాను; నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి.
 
తండ్రి ఆజ్ఞ పాలించినట్టవుతుంది.'' ఈ మాటలు విని రాముడు నిర్ఘాంత పోయి, ``ఇలా రాజ్యాన్ని, వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది? నేను వనవాసం చెయ్యటం మాని రాజ్యం ఏలటం కన్న ఘోరమైన తప్పు ఉండదు. ఈ పధ్నాలుగేళూ్ళ పూర్తికాగానే నేనూ, భరతుడూ కలిసి రాజ్యంచేస్తాం,'' అన్నాడు. చుట్టూ చేరిన వారు రాముడి మాటలకూ, భరతుడి మాటలకూ కూడా సంతోషించారు.
 
వారు భరతుడితో, ``నాయనా, రాముడు చెప్పినట్టు చెయ్యి, అతన్ని తండ్రి రుణం తీర్చుకోనీ!'' అన్నారు. రాముడు సంతోషించాడు గాని భరతుడి గుండెలో రాయిపడింది. చివర కతను రాముణ్ణి పాదుకలిమ్మని అడిగాడు. రాముడు ఆ పాదుకలను కాళ్ళకు వేసుకుని భరతుడికి ఇచ్చాడు.
 
భరతుడు రాముడితో, ``నువు్వ కాకపోతే నీ పాదుకలే లోకాన్ని రక్షిస్తాయి. నేను మునివేషంతో, ఫల మూలాలు తింటూ, రాజ్యభారం ఈ పాదుకలకు అప్పగించి, ఊరి బయట ఉండి నీ రాక కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాను.

పధ్నాలుగేళూ్ళ దాటిన మర్నాడు నువు్వ రాకపోయావో, మరుక్షణమే తప్పక అగ్నిప్రవేశం చేస్తాను,'' అన్నాడు వినయంగా. రాముడిందుకు సరేనని, భరతుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ``నీ తల్లిని రక్షించు. ఆమె మీద ఆగ్రహించావో నా మీదా, సీత మీదా ఒట్టు! ఇక వెళ్ళి రా,'' అంటూ కన్నీరు కార్చాడు. భరతుడు బంగారు అలంకారాలు గల రామపాదుకలను పూజించి, రాముడికి భక్తితో ప్రదక్షణం చేశాడు.
 
తరవాత రాముడు తన తల్లులనూ, ఇతరులనూ అక్కడి నుంచి సాగనంపి పర్ణశాలకు తిరిగివచ్చాడు. భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని, శత్రుఘు్నడితో సహా రథ మెక్కాడు. వసిష్ఠ నామదేవ జాబాలి మొదలైన వారు ముందు సాగారు. భరతుడు సపరివారంగా తిరుగుప్రయాణంలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనతో జరిగినదంతా చెప్పి, ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. శృంగిబేరపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు.
 
అయోధ్య వీధుల గుండా రథ మెక్కి వస్తూంటే అతనికి నగరం నిర్జీవంగా కనబడింది. అతను శత్రుఘు్నడితో, ``అయోధ్య కళ అంతా రాముడితోనే పోయింది,'' అన్నాడు. భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వసిష్ఠుడు మొదలైన వారితో, ``రాముడు లేని అయోధ్యలో ఉండలేను, నందిగ్రామానికి పోయి, అక్కడినుంచే రాజ్యం చేస్తూ రాముడి రాకకు ఎదురుచూస్తూ ఉంటాను,'' అన్నాడు.
 
ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు. భరతుడు తల్లుల దగ్గిర సెలవు పుచ్చుకుని, శత్రుఘు్నడితో బాటు రథమెక్కి, మంత్రులనూ, వసిష్ఠుణ్ణీ వెంటబెట్టుకుని నందిగ్రామానికి బయలుదేరాడు. తన వెంట రమ్మని అతను ఆజ్ఞాపించక పోయినప్పటికీ సేనకూడా అతని వెంట నందిగ్రామానికి కదిలింది. నందిగ్రామంలో పాదుకలకు శ్వేతచ్ఛత్రమూ ఇతర రాజమర్యాదలూ జరగాలని భరతుడు ఉత్తరు విచ్చాడు.

తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టుకోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి, నారబట్టలు కట్టి, మునివేషం వేసుకుని నందిగ్రామంలో ఉండి కోసలదేశాన్ని పరిపాలించాడు. రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకలకు చెప్పుకునేవాడు. సామంతులు తెచ్చిన కానుకలను పాదుకలకు భక్తితో నైవేద్యం పెట్టేవాడు. రాముడికి జరగవలిసిన పట్టాభిషేకం ఈ విధంగా రామ పాదుకలకు జరిగింది.
 
భరతుడు వెళ్ళినాక రాముడు కొంత కాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసివచ్చింది: ఆ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు వారంతా తమ ఆశ్రమాలు విడిచి వెళ్ళిపోబోతున్నారని కూడా తెలిసింది. ఇదంతా ఏమిటో తేల్చుకోవాలనుకుని రాముడు మునులకు కులపతి అయిన వృద్ధ ముని వద్దకు వెళ్ళి, ``మీరంతా ఆశ్రమాలు విడిచిపోతున్నారట.
 
నేనుగాని, నా తము్మడుగాని, నా భార్యగాని తెలియక చేయగూడని పని ఏదైనా చేయలేదు గద?'' అని అడిగాడు. దానికి కులపతి, ``మీరేమీ చెయ్యలేదు గాని, నీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు. రావణుడి తము్మడు ఖరుడనే వాడు జనస్థానంలో చేరి అక్కడి మునులను పారదోలాడు. ఎప్పుడో మాకూ పీడ చుట్టుకుంటుంది. అందుచేత ఈ ప్రాంతం వదిలి పోవాలనుకుంటున్నాం. యోధుడివి, అందులోనూ భార్యతో ఉంటున్నవాడివి; నీకైనా ఈ చోటు వదలటమే మంచిది,'' అన్నాడు.
 
తరవాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోయారు. రాముడు మాత్రం మరి కొంతకాలం అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం విడిచిపెడితే మంచిదని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారమే అతడు సీతాలక్ష్మణులతో బయలుదేరి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వారిని తన బిడ్డలలాగా ఆదరించి, తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు. తరవాత అత్రిమహాముని కుటీరం లోపల ఉన్న జగద్విఖ్యాతురాలైన తన భార్య అనసూయను పిలిచి, ఆమెకు రామలక్ష్మణులనూ, సీతనూ పరిచయం చేశాడు. అనసూయ ఇప్పుడు చాలా వృద్ధురాలు. జుట్టంతా బాగా తెల్లబడిపోయింది.

అవయవాలు సడలి పోయాయి. కాని ఆమె తపశ్శక్తి మాత్రం సాటిలేనిది. అత్రిమహాముని రాముడితో, ``అనసూయ తన తపశ్శక్తితో ఎన్నెన్నో మహిమలను చేసి చూపింది.ఒకప్పుడు వర్షంలేక పదేళ్ళపాటు కరువువస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింప జేసి మునులకు ఫల మూలాలు ఉత్పత్తి అయేటట్టు చేసింది. పది రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగ మరొక సందర్భంలో చేసింది.
 
సీతను ఈమెకు నమస్కారం చెయ్యమను,'' అన్నాడు. రాముడు సీతతో, ``ఈ మహాత్ముడి మాట విన్నావు కదా. మహా తపస్సంపన్నురాలు అయిన అనసూయాదేవికి నమస్కరించు. అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది,'' అన్నాడు. సీత అనసూయకు తన పేరు చెప్పుకుని అమిత గౌరవంతో నమస్కారం చేసి ఆమెను కుశల మడిగింది.
 
అనసూయ సీతను చూసి ఎంతో ముచ్చటపడి మందహాసం చేస్తూ, ``తల్లీ, నువు్వ బంధువులనూ, ఐశ్వర్యాన్నీ, అహంకారాన్నీ, సమస్తాన్నీ విడిచి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే, నీ భాగ్యమే భాగ్యం! అమ్మా, నేను ఎంతగానో ఆలోచించి చూశాను, స్త్రీని సమస్తవేళలా భర్తలాగా రక్షించేవారు మరెవరూలేరు. నువ్విలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు,'' అని చెప్పింది.


``నా భర్త గుణవంతుడు, దయామయుడు, ధర్మాత్ముడు, నా మీద అచంచలమైన ప్రేమగలవాడు, నాకు తల్లి వంటి వాడు, తండ్రి వంటివాడు, మోహనాకారుడు; అటువంటి భర్తను సేవించటానికేం? నేను చిన్నతనం నుంచీ పతివ్రతా ధర్మాలు తెలుసుకున్నాను. అడవికి వచ్చేటప్పుడు నా అత్త కౌసల్య కూడా నాకా ధర్మం బోధించింది. ఇప్పుడు మీ నోట కూడా అవే వింటున్నాను,'' అన్నది సీత ఎంతో వినయంగా.
 
సీత తియ్యగా మాట్లాడుతూంటే అనసూయకు ఎంతో ముచ్చట అయింది. ఆమె సీతతో, ``అమ్మా, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీర్చుతాను,'' అన్నది. సీత ఈ మాట విని ఆశ్చర్యపడి, ``మీరా మాట అనటమే నాకు పదివేలు,'' అని సమాధాన మిచ్చింది. ``అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది నువు్వ తీసుకోవాలి,'' అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాలా, ఒక చీరా, కొన్ని అందమైన ఆభరణాలూ, శరీరానికి పూసుకునే పూతా, మంచి పరిమళగంధమూ ఇచ్చింది.
 
తరవాత అనసూయ సీతతో, ``నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్ళాడాడని విన్నాను. ఆ కథంతా చెబుతావా, అమ్మా?'' అని అడిగింది. సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది: ``మా తండ్రి జనకమహారాజు మిథిలకు రాజు. ఆయన యాగం కోసం నాగలితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నే నాయనకు దొరికాను. ఆయన కప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెగా భావించి, పెంచమని తన పెద్ద భార్య కిచ్చాడు.

నాకు పెళ్ళియీడు వచ్చాక ఆయ నకు పెద్ద విచారం పట్టుకున్నది. ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు. అప్పుడాయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి, తన ఇంటనున్న గొప్ప విల్లును ఎక్కుపెట్టిన వాడికి నన్నిచ్చి పెళ్ళిచేయ నిర్ణయించాడు. ఎందుకంటే, దైవాంశ ఉన్నవారు తప్ప మామూలు మనుషులు దానిని ఎత్తనైనా శక్తిలేని వారవుతారు.
 
ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి, ధనుస్సును ఎత్తలేక దణ్ణంపెట్టి వెళ్ళిపోయారు. అంతలో విశ్వామిత్రమహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడవచ్చాడు. విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించి వారికి చూపాడు. రాముడా ధనువును అవలీలగా ఎత్తి, తాడు తగిలించి లాగేసరికి ధనుస్సు పెళపెళా నడిమికి విరిగిపోయింది.
 
వెంటనే నా తండ్రి కన్యాదానం చెయ్యటానికి జలకలశం తెప్పించాడు. కాని రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడనన్నాడు. తరవాత మా తండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించిన తరవాత మాకిద్దరికీ పెళ్ళి జరిగింది.'' ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది. ఆమె సీతను తన ఎదుటనే అలంకరించుకోమని చెప్పి, తరవాత ఆమెను రాముడి వద్దకు పంపింది. రాముడు అందమైన ఆమె అలంకరణలన్నీ చూసి, ``ఇవన్నీ ఎక్కడివి?'' అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది. రామలక్ష్మణులు పరమానందం పొందారు.
 
సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అత్రి మహాముని ఆశ్రమంలో గడిపి, మర్నాడు సూర్యోదయం వేళ అత్రిమహాముని వద్ద సెలవు తీసుకున్నారు. ``నాయనా, ఈ అరణ్యంలో కొందరు నరభక్షకులైన రాక్షసులు కూడా ఉన్నారు. మునులు ఫలాల కోసం అడవికి వెళ్ళి వచ్చేదారి చూపుతాను, ఆ దారినే వెళ్ళండి,'' అని అత్రి చెప్పాడు. ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామలక్ష్మణులు భయంకరమైన దండ కారణ్యం ప్రవేశించారు.

                                   [అయోధ్యాకాండ సమాప్తం]

No comments:

Post a Comment