Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 13


రాముడు హనుమంతుణ్ణి పిలిచి, ‘‘హనుమంతుడా, నువ్వు రావణుడి ఇంట్లో ఉన్న సీత వద్దకు వెళ్ళి, నేను సుగ్రీవ లక్ష్మణులతో సుఖంగా ఉన్నాననీ, నా చేత రావణుడు చచ్చాడనీ చెప్పి, ఆమె ఏం చెబుతుందో తెలుసుకుని రా!’’ అన్నాడు.హనుమంతుడు రావణుడి ఇంటికి వెళ్ళి, అక్కడ ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య దుఃఖదేవత లాగా కూర్చుని ఉన్న సీతను సమీపించి, తన పేరు చెప్పుకుని, వినమ్రుడై నిలబడ్డాడు. ఆమె తనను గుర్తించి సౌమ్యురాలు కాగానే హనుమంతుడు ఇలా అన్నాడు:

‘‘వైదేహీ! సుగ్రీవ లక్ష్మణ సమేతుడైన రాముడు కుశలంగా ఉన్నాడు. విభీషణుడి సహాయంతోనూ, వానరబలాలతోనూ ఆయన శత్రువును చంపేశాడు. ఆయన కార్యం సిద్ధించింది. రావణుడు మరణించాడు. లంక వశమయింది.’’ ఈ మాటలు విని సీత పరమానందం చెంది, ‘‘ఈ సంతోష వార్త విని నా నోట మాట రావటం లేదు. నిన్నెలా ప్రశంసించాలో నాకు తెలియటం లేదు. నీ కివ్వదగిన కానుక కూడా ముల్లోకాలలోనూ కనబడదు,’’ అన్నది.

‘‘అమ్మా, నిన్ను నానా దుర్భాషలూ ఆడిన ఈ రాక్షస స్త్రీలను చిత్రహింస చేసి, చీల్చి చెండాడాలని ఉన్నది. అందుకు అనుమతి ఇవ్వు,’’ అన్నాడు హనుమంతుడు.

‘‘నాయనా, వీళ్ళు రావణుడి దాసీలు. యజమాని చెప్పినట్టు చెయ్యకపోతే శిక్ష పొందుతారు. ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి ఫలితంగా ఈ కష్టాలన్నీ పడ్డాను. ఈ రాక్షస స్త్రీలు ఏ తప్పూ చేయలేదు. ఒక వేళ చేసినా ఉదారులు క్షమించవచ్చు. తప్పులు చెయ్యని వారెవరుంటారు?’’ అన్నది సీత.


‘‘అమ్మా, నువ్వు అన్ని విధాలా రాముడికి తగిన భార్యవు. రాముడి వద్దకు వెళ్ళి ఏం చెప్పమంటావు?’’ అన్నాడు హనుమంతుడు. ‘‘నాకు నా భర్తను చూడాలని ఉన్నది,’’ అన్నది సీత. ‘‘రాముణ్ణి తప్పక చూస్తావులే,’’ అని చెప్పి హనుమంతుడు రాముడి వద్దకు తిరిగి వెళ్ళాడు. అతను రాముడితో, ‘‘ఎంతో దుఃఖితురాలై ఉన్న సీతను వెళ్ళి చూడు. నీకు విజయం లభించిందని విని ఎంతో సంతోషించి, ఆమె నిన్ను చూడగోరుతున్నది,’’ అన్నాడు.

రాముడి కంట నీరు వచ్చింది. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు; సీత చాలా కాలంగా రావణుడింట ఉన్నది. ఆమెను స్వీకరిస్తే అపకీర్తి; అయినా నిర్దోషిని నిరాకరించటం తప్పవుతుంది. అతను విభీషణుడి కేసి తిరిగి, ‘‘నువ్వు సీతను చక్కగా స్నానం చేయించి, శరీరానికి గంధపు పూతలు పూయించి, నగలతో అలంకరించి త్వరగా ఇక్కడికి తీసుకురా,’’ అన్నాడు.

విభీషణుడు వెళ్ళి తన స్త్రీల ద్వారా సీతకు ఈ మాట చెప్పించాడు. సీత స్నానం చెయ్యకుండానే తన భర్తను చూస్తానన్నది, కాని విభీషణుడు, రాముడు చెయ్యమన్నట్టే చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆడవాళ్ళు సీతకు తలంటి స్నానం చేయించి, శరీరానికి పూయవలసిన పూతలన్నీ పూసి, మంచి నగలు పెట్టి, మంచి బట్టలు కట్టి, మంచి బట్ట పైన కప్పారు. చక్కని పల్లకీలో ఆమె నెక్కించి, అనేక మంది రాక్షసులను పరివారంగా పెట్టి విభీషణుడామెను రాముడున్న చోటికి తీసుకుపోయాడు.

సీతను ఎలా పరిగ్రహించటం, ఎలా త్యజించటం అని కొట్టుకుంటున్న రాముడికి, విభీషణుడు వచ్చి సీతను తెచ్చానని చెప్పగానే సీత మళ్ళీ తన కంట పడుతుందన్న సంతోషం కూడా కలిగింది. అతను విభీషణుడితో, ‘‘సీతను నా ముందుకు తీసుకురా!’’ అన్నాడు.


 విభీషణుడు వెళ్ళి సీతను రాముడి ఎదుటికి తీసుకువచ్చాడు. సీత సిగ్గు చేత ముడుచుకుపోతూ రాముడి ఎదుటికి వచ్చింది. ఆమె వెనకగా విభీషణుడు వచ్చాడు. అంత మంది ఎదట తన ముఖం చూపలేక సీత చీరతో ముఖం కప్పుకుని, రాముడి కేసి చూస్తూ అతని కెదురుగా నిలబడింది. రాముడు సీతను చూసి చాలా పరుషంగా ఇలా అన్నాడు:

‘‘సీతా, పౌరుషవంతుడు చేయగల పని చేశాను; శత్రువును చంపి, నిన్ను తిరిగి సంపాదించాను. శత్రువు నాకు చేసిన అవమానాన్ని కడిగేసుకున్నాను. నా శ్రమ ఫలించింది.

నా ప్రతిజ్ఞ నెరవేరింది. సుగ్రీవుడి ప్రయత్నమూ, విభీషణుడి ప్రయత్నమూ సఫలమయ్యాయి. అయితే నే నిదంతా నీ కోసం చెయ్యలేదు; నా వంశానికి కలిగిన కళంకం పోగొట్టుకోవటానికి చేశాను. నాకు నీతో పని లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. నేనీ మాట బాగా ఆలోచించే చెబుతున్నాను. చాలా కాలంగా పరాయి వాడి దగ్గిర ఉన్న దాన్ని అభిమానవంతుడెవడూ తిరిగి గ్రహించడు. నిన్ను ఎవరు పోషిస్తే వారి వద్ద ఉండు; లక్ష్మణుడు గాని, భరతుడు గాని, వానర రాజైన సుగ్రీవుడు గాని, రాక్షస రాజైన విభీషణుడు గాని నిన్ను పోషించవచ్చు. నీ కెక్కడ సుఖంగా ఉంటుందని తోస్తే అక్కడనే ఉండవచ్చు.’’

ఇంత కాలంగా పతి వియోగంతో కుమిలిపోయి, చివరకు అతని నోట అమృతవాక్కులు వినవలిసిన సీత, ఇలాంటి మాటలు విని నిలువునా కంపించిపోతూ కన్నీరు కార్చసాగింది. అతని నోట అలాంటి మాటలెన్నడూ విన్నది కాదు. అందుచేత అవమానంతో ఆమె తల మరింత వాలిపోయింది. ఆమె గద్గద కంఠంతో ఇలా అన్నది: ‘‘వీరుడా, అజ్ఞాని తెలియని మాటలన్న విధంగా ఈ కర్ణ కఠోరమైన మాటలెందుకంటున్నావు? నువ్వనుకున్నట్టుగా నేను ఏ దోషమూ చెయ్యలేదు. దుష్ట స్త్రీలను బట్టి స్త్రీ జాతి నంతటినీ శంకిస్తున్నావు. నీకు నా స్వభావం తెలుసు. అందుచేత అలాంటి శంక విడిచిపెట్టు. నేను ఆధీనురాలినై ఉండగా రావణుడు నా శరీరాన్ని తాకితే ఆ తప్పు నాది కాదు. నా ఆధీనంలో ఉన్న మనస్సు మాత్రం నీ పైనే ఉన్నది. ఇంత కాలం కలిసి ఉన్న తరవాత కూడా నా స్వభావం నీకు తెలియకపోతే ఇక తెలిసే మార్గమే లేదు.


హనుమంతుడు నన్ను వెతుకుతూ వచ్చినప్పుడే నన్ను విడిచిపెట్టినట్టు కబురు చేసి ఉంటే అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉందును; నీకూ నీ మిత్రులకూ, ఇంత శ్రమ లేకపోయి ఉండును. నన్ను అగ్ని సాక్షిగా పెళ్ళాడటం గాని, చాలా కాలంగా నన్నెరిగి ఉండటం గాని, నీకిప్పుడు ప్రమాణం కాలేదు.’’ సీత రాముడితో ఈ మాట అని లక్ష్మణుడితో, ‘‘లక్ష్మణా, ఇంత మాటపడిన తరవాత నాకు జీవించాలని లేదు. చితి పేర్పించు, నేనందులో ప్రవేశించి ప్రాణ త్యాగం చేస్తాను. పది మంది మధ్య భర్త చేత విడవబడిన భార్యకు మరో గతి లేదు,’’ అన్నది. లక్ష్మణుడు దీనంగా రాముడి ముఖం కేసి చూసి, సీత అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోవటాని కతను సుముఖుడే నని గ్రహించి, చితి పేర్చాడు.

తల వంచుకుని ఉన్న రాముడికి సీత మెల్లిగా ప్రదక్షిణం చేసి, మండుతున్న చితి వద్దకు వచ్చి, దేవ బ్రాహ్మణులకు నమస్కారం చేసుకుని, చేతులు మోడ్చి, ‘‘నేను రాముణ్ణి తప్ప మరొకరిని తలవకపోయినట్టయితే, నన్ను గురించి రాముడికి కలిగిన శంక అబద్ధమైతే, నేను మనోవాక్కాయకర్మల రాముణ్ణి అతిచరించక పోయినట్టయితే సర్వసాక్షి అయిన అగ్నిహోత్రుడు నన్ను సర్వ విధాలా కాపాడుతాడు గాక!’’ అని చెప్పి, అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో ప్రవేశించింది.

అది చూసి వానరులూ, రాక్షసులూ కూడా హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విని రాముడు బాధతో అశ్రువులు రాల్చాడు. అప్పుడు కుబేరుడూ, యముడూ, దేవేంద్రుడూ, వరుణుడూ, శివుడూ, బ్రహ్మా కాంతివంతమైన విమానాలలో లంకకు చేరి రాముడి వద్దకు వచ్చారు. వాళ్ళు చేతులెత్తి రాముడితో, ‘‘లోక కర్తవు, జ్ఞానావతారుడివి, సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు?’’ అన్నారు.

‘‘నేను దశరథుడి కొడుకు ననే అనుకుంటున్నాను. నేను పరమార్థంలో ఎవణ్ణో ఎందుకు పుట్టానో బ్రహ్మ చెప్పాలి,’’ అన్నాడు రాముడు. ‘‘నువ్వు సాక్షాత్తూ నారాయణుడివి, సీత లక్ష్మీదేవి. రావణసంహారం కోసం ఈ భూలోకంలో మానవ జన్మ ఎత్తావు! రావణవధ చేశావు! ఇక వైకుంఠానికి రా!’’ అన్నాడు బ్రహ్మ.


 బ్రహ్మ ఇలా అనగానే అగ్నిహోత్రుడు సీత నెత్తుకుని చితి నుంచి దివ్యతేజస్సుతో లేచి వచ్చాడు. అగ్ని హోత్రుడు మానవాకారం ధరించి పైకి లేవగానే చితి చెల్లాచెదరైపోయింది. అగ్ని సీతను తెచ్చి రాముడి కిస్తూ, ‘‘ఇదుగో నీ సీత. ఈవిడ ఏ పాపమూ ఎరగదు. ఈమె మనస్సు ఒక్క క్షణమైనా నీ పై నుంచి మరొకరి పైకి మరల లేదు. ఆమె మనస్సు తన కేసి తిప్పాలని రావణుడు విశ్వప్రయత్నాలు చేశాడు. కాని అవేవీ ఫలించ లేదు. కనక ఈమెను పరిగ్రహించు. ఇది నా ఆజ్ఞ,’’ అన్నాడు.

‘‘సీత ఏ పాపమూ ఎరగదని నాకు తెలుసును. కాని సదాచారాన్ని గౌరవించి, ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. లేకపోతే లోకులు నన్ను మోహాంధుడి కింద కట్టేస్తారు. అగ్ని కంటే కూడా పవిత్రమైన సీతను రావణుడేం చెయ్యగలడు? ఇప్పుడు సీత పాపరహిత అని మూడు లోకాలకూ వెల్లడయింది. నే నామెను తప్పక పరిగ్రహిస్తాను,’’ అని రాముడన్నాడు.

అప్పుడు శివుడు రాముడితో, ‘‘రామా, స్వర్గం నుంచి నీ తండ్రి దశరథుడు విమానంలో వచ్చాడు చూడు. ఆయన మాట నిజం చేసినందువల్ల ఆయనకు ఇంద్రలోకం లభించింది,’’ అన్నాడు. రామలక్ష్మణులు విమానంలో వచ్చిన దశరథుణ్ణి చూసి ఆయనకు నమస్కారం చేశారు. దశరథుడు రాముణ్ణి దగ్గిరికి తీసుకుని కౌగిలించుకుని, ‘‘నాయనా, నిన్ను ఎడబాసిన నాకు స్వర్గ సుఖాలు కూడా తృప్తికరంగా లేవురా.

నిన్ను అరణ్యానికి పంపానన్న మాటా, కైకేయి అన్న మాటలూ నన్నింకా బాధిస్తూనే ఉన్నాయి. అయితే, నీ పట్టాభిషేకానికి విఘ్నం కలిగించింది దేవతలేననీ, రావణ సంహారం కోరి వారు ఆ పని చేశారనీ నాకు తెలియవచ్చింది. నీ వనవాసం పధ్నాలుగేళ్ళూ తీరిపోయింది. ఇక నువ్వు అయోధ్యకు వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకో. నిన్ను చూసి కౌసల్య చాలా సంతోషిస్తుంది,’’ అన్నాడు. ఆయన లక్ష్మణుడికీ, సీతకూ కూడా కొన్ని హితవాక్యాలు చెప్పాడు.


దశరథుడు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాక ఇంద్రుడు రాముణ్ణి శ్లాఘించి, ఏదైనా వరం కోరుకో మన్నాడు. తన కోసం యుద్ధంలో చనిపోయిన వానర భల్లూకాలందరినీ తిరిగి బతికించమని రాముడు కోరాడు. ఇంద్రుడలాగే చేశాడు. చావగా మిగిలిన వానరులు, చచ్చిన వానరులు తిరిగి బతకటం చూసి అత్యాశ్చర్యం చెందారు. తరవాత దేవతలంతా వెళ్ళిపోయారు.

రాముడా రాత్రి సుఖంగా నిద్రపోయాడు. మర్నాడు విభీషణుడు వచ్చి రాముణ్ణి స్నానం చేయిస్తాననీ, నగలూ, బట్టలూ ధరింపజేస్తాననీ చెప్పి ఆహ్వానించాడు.
‘‘పధ్నాలుగేళ్ళు పూర్తి అయిన మర్నాడు నేను తిరిగి రాకపోతే ప్రాణం వదులుతానని నా తమ్ముడు శపథం చేశాడు. వాడన్నంత పనీ చేస్తాడు. నేను వెంటనే అయోధ్యకు వెళ్ళాలి,’’ అని రాముడన్నాడు.

‘‘ఒక్క రోజులో నేను నిన్ను పుష్పక విమానం మీద అయోధ్యకు చేర్చగలను. నేను నీకూ, నీ తమ్ముడికీ, నీ భార్యకూ ఇచ్చే ఆతిథ్యం తీసుకుని మరీ వెళ్ళాలని నా ప్రార్థన,’’ అన్నాడు విభీషణుడు. ‘‘నీ భక్తే నాకు చాలు. నా మనస్సు భరతుణ్ణీ, నా తల్లులనూ చూడాలని తహతహ లాడుతున్నది. నా వనవాసం పూర్తి అయింది. భరతుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. నే నిక్కడ ఎలా ఉండను? ఈ పుష్పక విమానం ఇచ్చినదే నాకు పదివేలు,’’ అన్నాడు రాముడు.






No comments:

Post a Comment