Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 2


సుగ్రీవుడి మాటలు విని రాముడు, ‘‘మీ ఇద్దరిమధ్యా గల వైరకారణమేమిటో తెలుసుకోవాలని ఉన్నది. ఆ కారణమూ, మీ బలాబలాలూ తెలుసుకున్న మీదట నీకు సుఖం కలిగే మార్గం ఆలోచించ గలుగుతాను,'' అన్నాడు.
ఆ మాటవిని కొంతసేపు మౌనం వహించిన సుగ్రీవుడు ఇలా చెప్పాడు:
 
‘‘మా అన్న అయిన వాలిని నా తండ్రీ, నేనూ ఎంతో గౌరవంతో చూసే వాళ్ళం. మా తండ్రి పోయూక, పెద్దవాడు గనక వాలి రాజ్యానికి వచ్చాడు. నేను వాలికి సేవకుడి లాగా ఎంతో వినయ విధేయతలు చూపే వాణ్ణి. దుందుభి అనేవాడి పెద్ద కొడుకు మాయూవి అనే రాక్షసుడు చాలా గొప్ప పరాక్రమశాలి. ఒక స్ర్తీ విషయంలో మాయూవికీ, వాలికీ తగాదా వచ్చింది. ఒకనాటి అర్ధరాత్రివేళ ఆ మాయూవి కిష్కింధా ద్వారం వద్దకు వచ్చి, పెద్ద పెట్టున గర్జిస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి నిద్ర మేలుకొని మాయూవి మదం అణచటానికి బయలుదేరాడు. నేనూ, ఆడ వాళ్ళూ ఎంత ఆపినా వాలి ఆగలేదు. అతను ఒంటరిగా పోతున్నాడే అని నేను కూడా వెంట వెళ్ళాను.
 
‘‘మాయూవి మా అన్నను చూస్తూనే భయపడి పారిపోసాగాడు. మేమతని వెంటపడ్డాం. ఇంతలో చంద్రోదయం కూడా అయింది. మాకూ తనకూ ఉండే దూరం క్రమంగా తగ్గుతూండటం చూసి మాయూవి ఒక బిలంలో దూరాడు.

‘‘వాలి బిలంలోకి వెళ్ళి మాయూవిని చంపివస్తాననీ, తాను వచ్చేదాకా నన్ను బిలం వెలుపల ఉండమనీ చెప్పాడు. నేను కూడా వస్తానంటే వినక, తన పాదాలమీద ప్రమాణం చేయించుకుని వాలి అమితావేశంతో ఆ బిలం ప్రవేశించాడు. ‘‘మా అన్న కోసం ఆ బిల ద్వారం వద్ద పూర్తిగా ఒక సంవత్సరం కాచుకుని ఉన్నాను. వాలి జాడలేదు. వాలి చనిపోయి ఉంటాడేమోనని నాకు భయమూ, అనుమానమూ కలిగాయి. నా భయూనికి తగ్గట్టుగా బిలం నుంచి నురుగుతో కూడిన ఎరన్రి రక్తం రాసాగింది. లోపల నుంచి గర్జనలూ, ఆక్రందనలూ వినిపించాయి. ఆక్రందన ధ్వని వాలిదిలాగా నాకు తోచింది. ఈ లక్షణాలన్నీ గమనించి వాలి చనిపోయూడనుకుని నాకు భయమూ, దుఃఖమూ కలిగాయి. నేను ఆ బిల ద్వారాన్ని పెద్ద కొండరాయితో మూసి, వాలికి జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాను.
 
‘‘వాలి మరణవార్త నేనై చెప్పకపోయినప్పటికీ మంత్రులు నా నుంచి రాబట్టి, తమలోతాము ఆలోచించుకుని నాకు పట్టాభిషేకం చేశారు. నేను రాజ్యపాలన చేస్తూండగా వాలి మాయూవిని చంపేసి తిరిగి వచ్చాడు. ‘‘నేను రాజు నయ్యూనని తెలిసి వాలి మండిపడ్డాడు. మంత్రులను బంధించాడు. నన్ను నానా మాటలూ అన్నాడు.
 
నేను గౌరవంగా వాలికి నమస్కారం చేశాను. అతడు నన్ను ఆశీర్వదించ లేదు. నా కిరీటం తీసి అతని పాదాల దగ్గిర పెట్టాను. కాని అతని కోపం చల్లారలేదు. అతన్ని రాజ్యం చెయ్యమని వేడుకున్నాను. బిలం దగ్గర నేను చూసినదీ, విన్నదీ చెప్పాను. బిలానికి రాయి ఎందుకు అడ్డంగా పెట్టానో చెప్పాను. నేను రాజ్యాభిషేకం కోరలేదనీ, రాజ్య క్షేమం కోరి మంత్రులే నాకు పట్టం గట్టారనీ అన్నాను. నువ్వు లేనప్పుడు రాజుగా పనిచేశాను గాని, ఇప్పుడు నీకు యువరాజు నేనని కూడా చెప్పాను.
 
‘‘వాలి ఇదేదీ లక్ష్యపెట్టాడు కాడు. తన కిష్టులైన మంత్రుల ముందు నన్ను నానా దుర్భాషలూ ఆడాడు. అతను బిలంలో ప్రవేశించాక ఒక ఏడాదిపాటు మాయూవి కనిపించనే లేదట. తరవాత వాణ్ణీ, వాడి బంధువుల నందరినీ చంపాడట. రక్తం ప్రవహించ నారంభించగానే దుర్గంధం భరించలేక బిల ద్వారం వద్దకు వచ్చి నన్ను పిలిచాడట. నేను తన కోసం వేచి ఉండక పోగా, తనను బిలంలో బంధించటానికి రాయి అడ్డు పెట్టానని వాలి తన మంత్రులతో అన్నాడు.

ఇలా నాపై నింద మోపిన అనంతరం అతను నన్ను కట్టుబట్టతో కిష్కింధ నుంచివెళ్ళగొట్టేశాడు. నా భార్యను కాజేశాడు. ‘‘ఈ విధంగా అన్న చేత వెళ్ళగొట్టబడి నేను ప్రపంచమంతా తిరిగాను. చిట్టచివరకు నాకీ ఋశ్యమూకం మీద నిలువ నీడ దొరికింది. ఎందుకంటే ఒకానొక కారణం చేత వాలి ఈ పర్వతం పైన అడుగు పెట్టలేడు. నావల్ల ఏ తప్పూ లేకపోయినప్పటికీ నేనిలా కష్టాల పాలయ్యూను.
 
‘‘ఇక వాలియొక్క శక్తి సామర్థ్యాలు చెబుతాను. అతను సూర్యోదయూనికి పూర్వమే నాలుగు దిక్కుల సముద్రాలూ సునాయూసంగా చుట్టివస్తాడు. పర్వత శిఖరాలపైకెక్కి కొండరాళ్ళను బంతుల్లాగా ఎగరేసి పట్టుకుంటాడు. పెద్ద పెద్ద అడవి మానులను అవలీలగా విరిచెయ్యగలడు.
 
‘‘ఇంకొక కథ చెబుతాను. దున్నపోతు రూపంలో దుందుభి అనే మహా బలాశాలి అయిన బలశాలి మహా రాక్షసుడు ఉండేవాడు. వాడిది వెయ్యి ఏనుగుల బలం. వాడు బలగర్వితుడై సముద్రుడి వద్దకు వెళ్ళి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. సముద్రుడు మానవరూపంలో పైకి వచ్చి దుందుభితో, ‘‘నీ బోటి యుద్ధ విశారదుడితో యుద్ధం చేసే శక్తి నాకైతే లేదుగాని, అలాటి శక్తి గల వాడెవడైనా ఉంటే అది హిమవంతుడు. నువ్వు అతనితో యుద్ధం చేస్తే బాగుంటుంది,'' అని చెప్పాడు.
 
‘‘దుందుభి శరవేగంతో హిమాలయూనికి వెళ్ళి, తన కొమ్ములతో గుండురాళ్ళను విరజిమ్ముతూ, రంకెలు పెట్టి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుభితో, ‘నాయనా, నేను నీతో యుద్ధం చెయ్యలేను, నన్నెందుకు బాధిస్తావు? అదీ గాక ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్న కారణం చేత యుద్ధానికి వీలుపడదు. కిష్కింధలో వాలి అనే వానర శ్రేష్ఠుడున్నాడు. యుద్ధంలో అతను నీ తీట తీర్చగలడు,' అని చెప్పాడు. ‘‘దుందుభి కిష్కింధకు వచ్చి ద్వారం వద్ద నేలను గిట్టలతో గీరుతూ ఆర్భాటం చేశాడు. వాడు చేసే ఆగడం సహించలేక వాలి అంతః పుర కాంతలతో సహా బయలుదేరి వచ్చాడు.

అతను దుందుభితో, ‘ఓరీ, నేను నిన్నెరుగుదును. ఎందుకు రంకెలు పెడుతున్నావు? ప్రాణాల మీద ఆశ లేదా?' అన్నాడు. దుందుభి మండిపడి, ‘స్ర్తీల ఎదట బీరాలు పలకటం కాదు, నాతో యుద్ధం చెయ్యి. ఇప్పుడు కాకపోతే, ఈ రాత్రి అంతా సుఖంగా గడిపి, నీ వానరుల కందరికీ అప్పగింతలు చెప్పి, నీ స్థానంలో మరొక రాజును ఏర్పాటు చేసుకుని, ఆఖరుసారి కిష్కింధ అంతా చూసుకుని రేపు ఉదయం యుద్ధానికి రా! అంతదాకా నీకు గడువిస్తాను,' అన్నాడు.
 
‘‘వాలి దుందుభిని చూసి హేళనగా నవ్వి, తార మొదలైన అంతఃపుర స్ర్తీలను పంపేసి, తనకు ఇంద్రుడిచ్చిన కాంచన మాలను మెడలో వేసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది. వస్తూనే వాలి దుందుభి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరి నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు దుందుభి చెవుల నుంచి రక్తం కారింది. క్రమంగా వాలి బలం హెచ్చింది, దుందుభి బలం క్షీణించింది. చివరకు వాలి ఆ రాక్షసుణ్ణి ఎత్తి నేలకు వేసి కొట్టి చంపాడు. అలా చచ్చిన దుందుభి కళేబరాన్ని వాలి ఎత్తి ఆమడ దూరాన వెళ్ళి పడేలాగా విసిరి వేశాడు. ఆ కళేబరం నోట కారే రక్తపు చుక్కలు ఋశ్య మూకం మీది మతంగ మహాముని ఆశ్రమంలో పడ్డాయి. ఆ నెత్తురు చుక్కలు చూసి మతంగుడు మండిపడి ఆశ్రమం దాటి వచ్చి దుందుభి కళేబరాన్ని చూసి, ‘‘ఈ రాక్షస కళేబరాన్ని ఇక్కడికి విసిరినవాడు గాని, వాడి అనుచరులు గాని ఈ వనంలోకి వస్తే చస్తారు!'' అని శపించాడు.
 
‘‘మతంగ మహాముని శాపం విని ఆ ప్రాంతాల ఉండే వాలి అనుచరులు భయపడి వెళ్ళిపోయి వాలితో ఈ సంగతి చెప్పారు. శాప విమోచనం చెయ్యమని వాలి వేడుకున్నప్పటికీ మతంగుడు అనుగ్రహించలేదు. అది మొదలు వాలి ఈ ఋశ్యమూకం చాయలకు రాడు. ఆ సంగతి తెలిసి, నేను నా మంత్రులతో ఇక్కడ తల దాచుకున్నాను. అదుగో, గుట్టలాగా కనిపించే దుందుభి కళేబరం! ‘‘వాలి బలానికి మరొక ఉదాహరణ కూడా చెబుతాను. ఆ కనిపించే ఏడు సాల వృక్షా లున్నాయే, వాటిలో దేని కాండంలో నుంచి అయినా దూసుకుపోయేలాగా వాలి బాణం వేయగలడు.

ఇంత శక్తిమంతుణ్ణి నువ్వు ఏ విధంగా వధిస్తావో!'' సుగ్రీవుడు చెప్పినదంతా విని లక్ష్మణుడు నవ్వుతూ, ‘‘రాముడు ఏం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది?'' అని అడిగాడు. సుగ్రీవుడు లక్ష్మణుడితో, ‘‘నాకు వాలి బల పరాక్రమాలు తెలుసును. అతను ఎన్నడూ ఓటమి ఎరిగినవాడు కాడు. అందుచేతనే అతనికి వెరిచి ఇక్కడ ఉన్నాను. నాకు రాముడి పరాక్రమం తెలియదు గద!'' అన్నాడు.
 
రాముడు దుందుభి కళేబరాన్ని సమీపించి కాలి బొటన వేలితో ఎత్తి, పైకీ కిందికీ ఆడించి విసిరే సరికి అది పది ఆమడల దూరాన వెళ్ళి పడింది. అది చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపడటానికి మారుగా, ‘‘రామా, దీన్ని ఆమడ దూరం విసిరి వేసినప్పుడు వాలి యుద్ధం చేసి బాగా అలిసి ఉన్నాడు. అదీగాక అప్పుడది కొత్త కళేబరం, ఇప్పుడది బాగా ఎండిపోయి తేలిక అయింది. అందుచేత నీకూ వాలికీ గల తారతమ్యం నాకు స్పష్టంగా తెలియలేదు. ఈ సాలవృక్షాలలో దేన్ని గాని దూసుకు పోయేలాగా నువ్వు బాణం వేసినట్టయితే మీ ఇద్దరి బలా బలాలు తెలుసుకోగలుగుతాను,'' అన్నాడు.
 
రాముడు సరేనని ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టే సరికి అది ఏడు సాలవృక్షాల కాండాలలో నుంచీ దూసుకు పోయి, కొండ లోకి చొచ్చుకు పోయి, భూమిని పగల గొట్టు కుని మళ్ళీ పైకి వచ్చి రాముడి అంబుల పొదిలో ప్రవేశించింది.

ఇది చూసి సుగ్రీవుడు నిర్ఘాంత పోయి, ‘‘రామా, వాలి మాట దేనికి, దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చినా నీ ఎదుట నిలవలేడు. నీ మైత్రి కలగటం నా అదృష్టం! ఇంక నా శత్రువైన వాలిని ఇప్పుడే వధించు,'' అంటూ రాముడి ముందు సాష్టాంగ పడి నమస్కరించాడు. రాముడు సుగ్రీవుణ్ణి కౌగలించుకుని, ‘‘ఇప్పుడే కిష్కింధకు పోదాం పద. నువ్వు మా కన్న ముందు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలువు,'' అన్నాడు. రామ లక్ష్మణులు, సుగ్రీవుడు మొదలైన వారందరూ కిష్కింధకు వెళ్ళారు. మిగిలిన వారంతా దట్టమైన చెట్ల చాటున దాక్కున్నారు. సుగ్రీవుడు మటుకు దట్టీ బిగించి, వాలికి వినపడేలాగా భయంకరమైన గర్జనలు చేశాడు. తమ్ముడి గర్జనలు విని మండిపడుతూ వాలి వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ ఘోరంగా తన్నుకున్నారు.
 
రాముడు విల్లూ, బాణమూ పట్టుకుని కూడా, వారిద్దరిలో ఎవరు వాలి అయినదీ, ఎవరు సుగ్రీవుడైనదీ తెలుసుకోలేక చూస్తూ ఉండిపోయూడు. ఈలోపల సుగ్రీవుడు వాలి చేత చావు దెబ్బలు తిని, ఒళ్ళంతా నెత్తురు కారుతూ ఆయూసంతో అటూ ఇటూ చూసి, రాముడు కనబడకపోయేసరికి పారిపోసాగాడు. వాలి అతని వెంట పడ్డాడు. సుగ్రీవుడు వాలికి చిక్కకుండా పారిపోయి ఋశ్యమూకం చేరుకున్నాడు.
 
‘‘బతికిపోయూవు పో!'' అని వాలి వెనక్కు తిరిగి వచ్చేశాడు. తరవాత రామ లక్ష్మణులూ, హనుమంతుడూ కూడా ఋశ్యమూకానికి తిరిగి వెళ్ళారు. సుగ్రీవుడు రాముణ్ణి చూసి అవమానంతో తల వంచుకుని, ‘‘ఇదేంపని? నన్ను తన్నించటానికా వాలిని యుద్ధానికి పిలవమన్నావు? వాలిని చంపటం చేతకాదని చెప్పి ఉంటే, నేను ఇక్కడి నుంచి కదలనే కదలను గద!'' అన్నాడు.

No comments:

Post a Comment