Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 12


రాముడి దెబ్బకు తట్టుకోలేక రావణుడు పారిపోయాడు. తరవాత రాముడు లక్ష్మణుడు పడిఉన్న చోటికి వచ్చి, ఊపిరి బరువుగా తీస్తూ కొస ప్రాణంతో ఉన్న లక్ష్మణుణ్ణి చూసి అధైర్యపడిపోయాడు. లక్ష్మణుడికి ప్రాణభయం ఉండదని సుషేణుడు రాముడికి ధైర్యం చెప్పి, హనుమంతుడితో, ‘‘జాంబవంతుడు చెప్పిన ఓషధి పర్వతానికి వెళ్ళి, దాని దక్షిణ శిఖరం పైన ఉండే నాలుగు రకాల ఓషధులూ తీసుకురా,’’ అన్నాడు.

హనుమంతుడు ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. కాని ఆ ఓషధులేవో అతనికి తెలియలేదు. అందుచేత అతను మొత్తంగా శిఖరాన్నే తీసుకు పోదామనీ, లక్ష్మణుడికి కావలిసిన ఓషధి ఆ శిఖరం మీద ఎక్కడో ఉండకపోదనీ అనుకున్నాడు. అతడాపర్వత శిఖరాన్ని మూడు సార్లు అటూ ఇటూ కుదిలించి, పెకలించి తీసుకుపోయి యుద్ధభూమిలో వాలి, ‘‘నువ్వు చెప్పిన మూలికలు గుర్తు తెలియక శిఖరాన్ని మొత్తంగా పెరికి తెచ్చాను,’’ అని సుషేణుడితో చెప్పాడు.

సుషేణుడు తనకు కావలిసిన ఓషధిని పెల్లగించి, నలిపి, దాని రసాన్ని లక్ష్మణుడి ముక్కులో పిండాడు. దాని వాసన తగలగానే లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. రాముడు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని ఆనందబాష్పాలు రాలుస్తూ, ‘‘లక్ష్మణా, నా అదృష్టం కొద్దీ నువ్వు వచ్చి మళ్ళీ బతికావు. నువ్వే పోయివుంటే నాకు సీత దేనికి! యుద్ధంలో విజయం దేనికి?’’ అన్నాడు.


అది విని లక్ష్మణుడు, ‘‘బలహీనుడి లాగా ఎందుకిలా మాట్లాడతావు? రావణుణ్ణి చంపి విభీషణుడికి పట్టం కడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దా? నా కోసం దిగులుపడి నిరాశ చెందక, రావణుణ్ణి యుద్ధంలో చంపెయ్యి,’’ అన్నాడు. లక్ష్మణుడిలా అనగానే రాముడు స్థిరచిత్తుడై విల్లు చేతబట్టాడు. రావణుడు కూడా మరొక రథమెక్కి యుద్ధసన్నద్ధుడై వచ్చాడు. రాముడు నేలపైనా, రావణుడు రథం లోనూ ఉండి యుద్ధం ప్రారంభించారు.

అంతలో ఇంద్రుడి సారథి అయిన మాతలి దేవలోకం నుంచి ఒక దివ్యమైన రథాన్నీ, కవచాన్నీ, విల్లునూ, బాణాలనూ, శక్తినీ తీసుకుని రాముడున్న చోటికి వచ్చి, ‘‘రామా, దేవేంద్రుడు నీకోసం వీటినన్నిటినీ పంపాడు. ఈ రథంలో ఎక్కి నువ్వు రావణుణ్ణి వధించు,’’ అని చెప్పాడు. రాముడా రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అందులో ఎక్కాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఒకరి అస్త్రాలను మరొకరి అస్త్రాలు నిర్వీర్య పరచాయి. కొంతసేపు రావణుడు అతి భయంకరంగా యుద్ధం చేసి, రాముడికి చెయ్యీ కాలూ ఆడకుండా చేశాడు. అతడు వజ్రాయుధంతో సమానమైన ఒక శూలాన్ని రాముడిపై ప్రయోగించే సరికి, రాముడు దాన్ని తన బాణాలతో నిరోధించలేక, ఇంద్రుడు పంపిన శక్తిని ప్రయోగించి ఆ శూలాన్ని ధ్వంసం చేశాడు.

ఆ తరవాత రాముడు విజృంభించి యుద్ధం చేస్తూంటే రావణుడు ఉక్కిరి బిక్కిరి అయి ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితిలో పడ్డాడు. అది చూసి రావణుడి సారథి తమ రథాన్ని యుద్ధరంగం నుంచి అవతలికి తోలుకు పోసాగాడు. రావణుడికి తన సారథిపైన ఆగ్రహం వచ్చింది. ‘‘ఓరీ దుర్బుద్ధీ, నేను పిరికివాణ్ణా, అసమర్థుణ్ణా, అస్త్రాలు లేనివాణ్ణా, యుక్తిలేనివాణ్ణా? ఏమనుకుని నీ ఇష్టం వచ్చినట్టు రథాన్ని యుద్ధరంగం నుంచి తోలుకు పోతున్నావు? నా కీర్తి కాస్తా ధ్వంసం చేశావే! వెంటనే రథాన్ని వెనక్కు తోలు,’’ అన్నాడతను తన సారథితో.


 ‘‘మహారాజా, నీ మేలు కోరి, నా విధిని పాటించి రథాన్ని పక్కకు తెచ్చాను. రాముడు చేసే యుద్ధానికి నువ్వు ప్రతియుద్ధం చెయ్యటం లేదు. బ్రహ్మాండమైన యుద్ధం చేసి అలసిపోయి ఉన్నావు. గుర్రాలు కూడా డస్సి ఉన్నాయి. నీకూ, వాటికీ కాస్త విశ్రాంతి లభించగలందులకాపని చేశాను. రథం ఎప్పుడెలా నడపాలో తెలీకపోతే నేను సారథినే కాను. ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పు, అలాగే చేస్తాను,’’ అన్నాడు రావణుడి సారథి.

రావణుడు మెత్తబడి, తన సారథిని కాస్త పొగడి, ‘‘రాముడికెదురుగా రథాన్ని తీసుకుపో!’’ అని చెప్పాడు. రావణుడి రథం తిరిగి రాముడి ఎదుటికి వచ్చి నిలబడింది.
ఆ సమయంలో రాముడు కూడా అమితంగా అలిసిపోయి, రావణుడితో యుద్ధం చేసే శక్తి లేని స్థితిలో ఉన్నాడు. అది కనిపెట్టి, యుద్ధం చూడవచ్చిన అగస్త్యుడు రాముణ్ణి సమీపించి, ‘‘రామా, నీకు ఆదిత్య హృదయం చెబుతాను. అది జపించి, శక్తివంతుడవై రావణుడితో యుద్ధం చెయ్యి,’’ అని రాముడికి ఆదిత్యహృదయం చెప్పాడు. రాముడు దాన్ని మూడుసార్లు పఠించి, రెట్టింపైన బలం పొంది బాణం తీసుకుని రావణుడితో యుద్ధం సాగించటానికి ముందుకు వచ్చాడు. అతను మాతలితో, ‘‘ఈసారి రావణుణ్ణి నిశ్చయంగా చంపబోతున్నాను. నువ్వు రథాన్ని చాకచక్యంగా నడుపు. దేవేంద్రుడి రథ సారథివైన నీకు విశేషం చెప్పనవసరం లేదు. ఏమాత్రం కూడా ఏమరుపాటు చెందవద్దని జ్ఞాపకం చేస్తున్నానంతే!’’ అన్నాడు.

తన రథం మూలాన రేగిన దుమ్ము రావణుణ్ణి చుట్టుముట్టే లాగా మాతలి రథాన్ని రావణుడికేసి తోలాడు. రావణుడు మండిపడి రాముడిపైన బాణాలు వేశాడు. రాముడు ఇంద్రుడు పంపిన విల్లూ, బాణాలూ తీసుకుని రావణుడితో యుద్ధం ఆరంభించాడు.


రామరావణ యుద్ధం ఎంత తీవ్రంగా సాగిందంటే ఉభయ పక్షాల వీరులూ యుద్ధం మానేసి ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూడసాగారు. ఇద్దరూ తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, అదే తమ తుది పోరాటమన్నట్టుగా యుద్ధం చేశారు. ఇలా రామ రావణులు మహా భయంకరమైన యుద్ధం చేస్తుండగా, రాముడు ప్రయోగించిన అతి తీక్షణమైన బాణానికి రావణుడి శిరస్సు తెగి నేలపైన పడిపోయింది. కాని, ఆ క్షణంలోనే రావణుడికి మరొక శిరస్సు పుట్టుకొచ్చింది. రాముడు దాన్ని కూడా ఖండించాడు. అది కిందపడే లోపుగా రావణుడికి మరొక శిరస్సు కనబడింది. ఈ విధంగా రాముడు రావణుడి తలను నూటఒక్కసారి ఖండించి కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. తన వద్ద ఉన్న అమోఘమైన బాణాలన్నీ రావణుడిపై ఎందుకు వ్యర్థమయ్యాయో రాముడికి అర్థంకాలేదు.

ఆ రామరావణులు ఆ విధంగా, క్షణం విశ్రాంతి లేకుండా, ఏడు రాత్రులూ, ఏడు పగళ్ళూ పోరాటం సాగించారు. చూసి చూసి  మాతలి రాముడితో, ‘‘వీణ్ణి చంపెయ్యక ఎందుకిలా తాత్సారం చేస్తున్నావు? వీడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించు,’’ అన్నాడు.మాతలి ఆ మాట అనగానే రాముడొక మహాసర్పం లాంటి బాణాన్ని పైకి తీశాడు. దేదీప్యమానంగా వెలిగే ఆ బాణాన్ని బ్రహ్మ ఒకప్పుడు ఇంద్రుడి కోసం తయారు చేశాడు. అది చాలా బరువైనది, ఈకలు గలది, వజ్రం లాగా అతి కఠినమై ఇతర ఆయుధాలను ఛేదించగలది. రాముడా బాణాన్ని ఎక్కుపెట్టి మంత్రించి రావణుడి పైన వేశాడు. అది రావణుడి రొమ్మును ఛేదించి, అతని వీపులో నుంచి దూసుకుని బయటికి వచ్చేసింది. రావణుడు తన చేతిలో ఉండే ధనుర్బాణాలను వదిలేసి, ప్రాణాలుపోయి, రథంపై నుంచి నేలపైకి పడిపోయాడు.

అది చూసి హతశేషులైన రాక్షసులు పారిపోసాగారు. వానరులు చేతుల్లో చెట్లు పట్టుకుని, సింహనాదాలు చేస్తూ ఆ రాక్షసులను తరిమారు. రావణుడు చావగానే దేవదుందుభులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. రాముణ్ణి భూమిపైన వానరులతో బాటు, ఆకాశంలోని దేవతలు కూడా పొగిడారు. రాముడూ, సుగ్రీవుడూ, అంగదుడూ, కృతకృత్యులై చాలా సంతృప్తి చెందారు. వానర ప్రముఖులూ, విభీషణుడూ రామలక్ష్మణుల చుట్టూ మూగి వారిని ప్రశంసించారు.


 తన అన్న పోయినందుకు విభీషణుడు బాధపడ్డాడు. ఒక్క సీతాపహరణ కారణంగా రావణుడు నాశనమయ్యాడే గాని, అతను అనేక విధాల మహాపురుషుడనదగినవాడు; గొప్ప పండితుడు: నిష్ఠాపరుడు; అసమాన శౌర్య పరాక్రమాలు గలవాడు. అన్న పోయాడని బాధపడుతున్న విభీషణుణ్ణి ఓదార్చుతూ రాముడు, ‘‘రావణుడు పిరికిచావు చావలేదు, వీరుడి లాగా పోరాడుతూ పోయాడు. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. ఎంతటి మహావీరుడైనప్పటికీ శత్రువు చేతిలో మరణం పొందవచ్చు. వీరమరణం పొంది వీర స్వర్గం అందుకున్న వాడి కోసం శోకించరాదు,’’ అన్నాడు.

రాముడి అనుమతిపై విభీషణుడు తన అన్నకు శాస్త్రోక్తంగా దహనక్రియలు చేయబూనుకున్నాడు. రావణుడు చచ్చాడని తెలియగానే అతడి భార్యలు పెద్దపెట్టున ఏడుస్తూ, ఉత్తర ద్వారంగుండా వెలువడి, రావణుడి శవాన్ని వెతుక్కుంటూ వచ్చారు. చివరకు వారతని శవాన్ని చూసి, దానిపైన పడి, గుండెలు అవిసేలాగా ఏడ్చారు; విభీషణుడు చెప్పినట్టు సీతను రాముడి కిచ్చినట్టయితే ఇంత దురన్యాయం జరిగేది కాదని ఆక్రోశించారు. ‘‘త్రిలోకాలనూ జయించి, దేవతలందరినీ హడలగొట్టి, చివరికొక మానవమాత్రుడి చేతిలో ప్రాణాలు వదిలావా?’’ అని మందోదరి విలపించింది.

‘‘ఈ ఆడవాళ్ళనందరినీ ఇళ్ళకు పంపి నీ అన్నకు ఉత్తరక్రియలు చెయ్యి,’’ అని రాముడు విభీషణుడితో అన్నాడు. దుర్మార్గుడూ, అవినీతిపరుడూ అయిన తన అన్నకు తాను సంస్కారం చెయ్యటం యుక్తంగా ఉంటుందో ఉండదోనని విభీషణుడు ధర్మసందేహం లేవదీశాడు. యుక్తంగానే ఉంటుందని రాముడు చెప్పిన మీదట అతను అందుకు పూనుకున్నాడు. బ్రాహ్మణులు చందనపు చెక్కలతో చితిపేర్చి, దానిపైన ఒక గొంగళి పరిచారు. రావణుడి శవాన్ని అలంకరించి చితిపైన పడుకోబెట్టారు. విభీషణుడు చితికి చిచ్చుపెట్టాడు. తరవాత అతను తడిబట్టలతో నీళ్ళువదిలి, స్ర్తీ జనాన్ని లంకకు పంపించి, రాముడి వద్దకు వచ్చాడు.


యుద్ధం చూడవచ్చిన దేవదానవ గంధర్వాదులు రామ పరాక్రమం గురించీ, వానరులు చేసిన యుద్ధం గురించీ మాట్లాడుకుంటూ తమతమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాముడు మాతలిని గౌరవించి, అతణ్ణి రథంతో సహా స్వర్గానికి పంపేశాడు. తరవాత రాముడు కృతజ్ఞతతో సుగ్రీవుణ్ణి కౌగలించుకుని, లక్ష్మణుడితో సహా శిబిరానికి వెళ్ళాడు. అతను లక్ష్మణుడితో, ‘‘ఇప్పుడు వెంటనే జరగవలిసిన ముఖ్యమైన పని విభీషణుణ్ణి లంకారాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యటం. ఆ పని వెంటనే జరిపించు,’’ అని చెప్పాడు.

లక్ష్మణుడు వానరులకు సువర్ణకలశాలిచ్చి సముద్ర జలం తెప్పించాడు. అతడు విభీషణుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ జలంతో అభిషేకించాడు. విభీషణుడి మంత్రులూ, అతడి పట్ల భక్తిగల రాక్షసులూ సంతోషించారు. విభీషణుడు తన ప్రజలకు నచ్చే మాటలు చెప్పాడు. రాక్షస పౌరులు అతనికి రకరకాల వస్తువులు కానుకలుగా అర్పించారు. విభీషణుడు కూడా రామలక్ష్మణులకు దివ్యమైన వస్తువులను కానుకలుగా ఇచ్చాడు.






No comments:

Post a Comment