Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 3


జరిగిన దానికి చింతిస్తూ రాముడు, ‘‘సుగ్రీవుడా, నా మీద ఆగ్రహించకు. మీరిద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. మీ కంఠస్వరాలు కూడా ఒకటిగానే ఉన్నాయి. ఎవరు ఎవరో తెలియక నేను బాణం వెయ్య లేదు. నా అజ్ఞానం చేత నీకు అపాయం కలిగింది. మన్నించు. నువ్వు ఏదైనా గుర్తు ధరించి మళ్ళీ వాలితో యుద్ధం చేసినట్టయితే ఒక్క బాణంతో అతన్ని పడగొట్టుతాను, నా మాట నమ్ము,'' అన్నాడు.
 
కొండచరియ పైన గజపుష్పి అనే లత పూలతో సహా పెరుగుతున్నది. లక్ష్మణుడు దాన్ని పెరికి తెచ్చి సుగ్రీవుడి మెడకు చుట్టాడు. అందరూ మరొకసారి కిష్కింధకు బయలుదేరి వెళ్ళారు. గజపుష్పి మెడకు చుట్టుకున్న సుగ్రీవుడి వెంట నళుడూ, నీలుడూ, తారుడూ కూడా ఉన్నారు. కిష్కింధకు వెళ్ళే దారిలో రాముడికి చెట్లతో దట్టంగా ఉన్న ఒక వనం కనిపించింది.
 
రాముడు దాన్ని గురించి సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడు. అది ఒక ఋష్యాశ్రమం. సప్త జనులనే పేరు గల ఏడుగురు ఋషులు ఆ ఆశ్రమంలో తీవ్రమైన తపస్సు చేశారు; నీటిలో తల్లకిందులుగా నిలబడి, వాయుభక్షణ చేస్తూ తపస్సు చేసి, శరీరాలతో స్వర్గానికి వెళ్ళిపోయూరు. ఆ ఆశ్రమంలోకి మనుషులు కారు గదా, పశుపక్ష్యాదులు కూడా ప్రవేశించ లేవు; తెలియక లోపలికి వెళితే తిరిగి బయటికి రావటమంటూ ఉండదు.

రామలక్ష్మణులిద్దరూ సప్తజన మహర్షులను తలుచుకుని ఆ ఆశ్రమానికి నమస్కరించి ముందుకు పోయూరు. చాలాదూరం వెళ్ళాక వారు కిష్కింధ చేరుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, ‘‘వాలిని చంపుతానని మాట ఇచ్చావు. ఆ పని శీఘ్రంగా చెయ్యూలి,'' అన్నాడు. ‘‘ఈసారి వాలిని ఒక్క బాణంతో నిశ్చయంగా పడగొట్టుతాను. ఒకే రూపు గల మీ ఇద్దరిలో తారతమ్యం తెలియటానికి ఈసారి నీ మెడలో గజపుష్పీలత ఉన్నది కద. అందుచేత నీకేమీ జంకు వద్దు. వాలిని యుద్ధానికి పిలువు,'' అని రాముడు చెప్పాడు. చుట్టూ ఉండే దట్టమైన అరణ్యంలో అందరూ దాగారు.
 
సుగ్రీవుడు ఆ అరణ్యాన్ని ఒక్కసారి కలయ జూసి భయంకరంగా గర్జించి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఈ గర్జన వింటూనే వాలికి పట్టరాని ఆగ్రహావేశం వచ్చేసింది. అతను యుద్ధానికి బయలుదేరాడు. ఇది చూసి తార చప్పున లేచి వాలిని పట్టుకుని, ఇలా అన్నది: ‘‘ఈ రాత్రివేళ నువ్వు వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చెయ్యవద్దు. కావలిస్తే రేపు ఉదయం వెళుదువుగాని. ఈలోపుగా నీ బలం తరిగి పోదు, సుగ్రీవుడి బలం హెచ్చిపోదు. ఇంతలో వచ్చిన తొందర ఏమిటి? కొంచెం ఆలోచించు!
 
నేను అకారణంగా నిన్ను అడ్డగించటం లేదు. ఒకసారి నీ చేత చావు దెబ్బలు తిని దిక్కు తెలియకుండా పారిపోయిన సుగ్రీవుడు ఇప్పుడు ఏ ధైర్యంతో నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు? ఎవరి అండో చూసుకునే అతను నిన్ను కవ్విస్తున్నాడు. వారెవరో కూడా నాకు తెలుసు. అయోధ్య రాజైన దశరధుడి కొడుకులు రామలక్ష్మణులు సుగ్రీవుడుండే ఋశ్యమూకానికి వచ్చి అతనితో సఖ్యం చేశారట. వారు ఇదివరకే విరాధుణ్ణీ, ఖర దూషణులనూ, కబంధుణ్ణీ చంపారట. చాలా పరాక్రమవంతులు.
 
వారిని గురించి మన అంగదుడికి చారులు చెప్పారు. సుగ్రీవుడు చాలా గడుసువాడు. ఒకంతట ఇతరులను నమ్మడు. రాముడి అండ చూసుకునే అతను ఇప్పుడు వచ్చాడు; అందుకేమీ సందేహం లేదు. నీ మేలుకోరి ఇంకొక మాటకూడా చెబుతాను. ఇప్పుడు సుగ్రీవుడు నీ కన్న బలవంతుడని తెలుసుకో. అతన్ని పిలిచి యువరాజుగా అభిషేకించు. నీ తమ్ముడే కదా, కిష్కింధలోనే ఉండనీ.

నీకు రాముడి స్నహం కూడా కలిసి వస్తుంది. సుగ్రీవుడితో యుద్ధమంటే రాముడితో యుద్ధమే. రాముడితో యుద్ధం నీకు క్షేమకరం కాదు.'' తార చెప్పిన ఈ మాటలు వాలికి కొంచెంకూడా రుచించలేదు. అతను ఆమెతో, ‘‘తారా, నువ్వు నా మేలు కోరే ఈ మాటలన్నావు, కాని పిరికిదానివైన నీ మాటలు విని సుగ్రీవుడి ధూర్తత్వాన్ని సహిస్తానా? మహామహా వాళ్ళకే నేను భయపడలేదు, సుగ్రీవుడికి భయపడతానా? రాముడు నన్నెందుకు చంపుతాడు? అతనికి నేనేమీ ద్రోహం చెయ్యలేదు గద.
 
సుగ్రీవుణ్ణి నేను చూస్తూ చూస్తూ చంపుతానా? శరీరమంతా నజ్జుగా కొట్టి బుద్ధి చెప్పి పంపేసి వస్తాను. నువ్వూ, మిగిలిన స్ర్తీలూ నా వెంట పడి రాకండి; వెనక్కు వెళ్ళి పొండి,'' అన్నాడు. స్ర్తీలు వెళ్ళిపోయూరు. వారు భయపడతారని అంతదాకా తన ఆగ్రహాన్ని అణచుకుని ఉన్న వాలి భయంకరాకారం ధరించి, కిష్కింధా నగరద్వారం దాటి వచ్చి-నడుము బిగించి తనకోసం ఎదురు చూస్తున్న సుగ్రీవుణ్ణి చూశాడు.
 
వెంటనే తాను కూడా నడుము బిగించి, ‘‘నీ ప్రాణాలు తీస్తాను,'' అంటూ వాలి సుగ్రీవుణ్ణి తన పిడికిలితో కొట్టాడు. ఇద్దరూ చెట్లు పీకి, వాటితో ఒకరినొకరు చావగొట్టుకున్నారు. వాలి అలిసిపోయూడు గాని, సుగ్రీవుడు మరింత హెచ్చు అలిశాడు. భయంతో నలు దిక్కులు చూడసాగాడు. సుగ్రీవుడి క్షీణస్థితి గమనించి రాముడు కాలసర్పంలాటి బాణాన్ని ఏరి, ఎక్కుపెట్టి చెవిదాకా లాగి, వాలి ఎదురు రొమ్ముకు గురి చేసి విడిచాడు.

వాలి దాని దెబ్బకు కింద పడిపోయూడు. అనేక సువర్ణాభరణాలూ, ఇంద్రుడిచ్చిన కాంచనమాలికా ధరించి నేలపై పడి ఉన్న వాలి వద్దకు రామలక్ష్మణులు వెళ్ళారు. వాలి మెల్లగా కళ్ళు తెరిచి రామలక్ష్మణులను చూసి రాముడితో, ‘‘నువ్వు మహారాజు కొడుకువు, గొప్ప వంశంలో పుట్టిన వాడవు, ధర్మాచరణ చేసేవాడివి, నేను మరొకరితో యుద్ధం చేస్తూండగా నన్ను బాణం వేసి కొట్టటం నీకేమంతా ఖ్యాతికరం? తార నన్ను యుద్ధానికి వెళ్ళవద్దని చెబితే నీ వంశాన్నీ, గుణాలనూ నమ్మి, నన్నేమీ చేయవనుకుని వచ్చాను.
 
నేను నీ దేశానికి రాలేదు. నీకేమీ అపకారం చెయ్యలేదు. నిన్ను యుద్ధానికి పిలవలేదు. వానర మాత్రుణ్ణి, అందులోనూ మరొకరితో పోరుతున్నవాణ్ణి. నన్ను నీ వెందుకు హత్య చేస్తున్నావు? నువ్వు దుర్బుద్ధివి. విల్లు పట్టుకు తిరిగే నీచ హంతకుడివి. నీకు ధర్మమన్నది లేదు. నన్ను జంతువులాగా వేటాడావనుకుందామన్నా, నా చర్మం ధరించటానికి పనికిరాదు. నా రోమాలూ, ఎముకలూ ఉపయోగపడవు.
 
నా మాంసం తినటానికి పనికిరాదు. నువ్వు నిజంగా పరాక్రమం కలవాడవయితే రావణుడు మొదలైన వారిని చంపరాదా? నా ఎదుటికి వచ్చి యుద్ధం చేస్తే ఈపాటికి యముడి వద్ద ఉండేవాడవు. సీతను వెతకమని నన్నే కోరి ఉంటే ఒక్క రోజులో నీ భార్యను తెచ్చి నీకిచ్చి ఉందును. అందుకేగదా నువ్వు సుగ్రీవుడికి ఉపకారం చెయ్యబోయి నన్ను చంపావు?'' అన్నాడు.
 
వాలి చేసిన ఈ ఆక్షేపణకు రాముడీ విధంగా జవాబు చెప్పాడు: ‘‘నీకు ధర్మార్థ కామాలకు సంబంధించిన ఆచారాలు తెలియవు. సమస్త భూమండలానికీ ఇక్ష్వాకులు రాజులు. భూమండలంలో అధర్మాన్ని శిక్షించే బాధ్యత ఇక్ష్వాకు రాజులది. ప్రస్తుతం భూమి కంతకూ భరతుడు రాజు. నా బోటి క్షత్రియులం అతని ఆజ్ఞకు బద్ధులమై అధర్మాన్ని శిక్షిస్తున్నాము.
 
వానరుడవు కావటంచేతనూ, వానరుల సాంగత్యం కలిగి ఉండటం చేతనూ నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. నువ్వు నీ తమ్ముడి భార్యను పరి గ్రహించావు.ఇది మహాపాపం. అందుకు మరణమే శిక్ష. నిన్ను శిక్షించక వదిలితే నేను ధర్మం తప్పిన వాణ్ణవుతాను. అదీ గాక నేను సుగ్రీవుడితో చేసిన మైత్రి, లక్ష్మణుడికీ నాకూ గల బాంధవ్యం లాటిది.

నేను భార్య నిమి త్తమూ, అతను రాజ్యం నిమిత్తమూ ఈ సఖ్యం చేసుకున్నాము. నిన్ను చంపుతానని వానరుల ముందు నేను ప్రతిజ్ఞ చేశాను. నేను చేసిన ప్రతిజ్ఞ తప్పటానికి వీలులేదు. అందుచేత నిన్ను వధించటంలో నేను అధర్మం అణుమాత్రం కూడా చెయ్యలేదు.
 
నువ్వు కొన్ని మానవ ధర్మాలు ఆచరించటం చేత పైవిధంగా చెప్పాను. కోతివిగా చూస్తే నిన్ను నేను ఏ సమయంలోనైనా వేటాడవచ్చు. అభక్ష్య మృగాలను కూడా వేటాడుతారు. అవి ఏమరుపాటున ఉన్నవా, పారిపోతున్నవా, నిర్భయంగా ఉన్నవా అని చూడరు. కోతివైన నిన్ను నేను నాతో యుద్ధం చేస్తేనే చంపాలన్న నియమం ఎక్కడా లేదు.''
 
రాముడు చెప్పినదంతా విని వాలి తాను రాముణ్ణి నిందించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. అతను రాముడితో, ‘‘నాకు చచ్చి పోతున్నానని దిగులు లేదు. నీ చేతిలో చావాలనే తార వద్దన్నా వినకుండా సుగ్రీవుడితో ద్వంద్వ యుద్ధానికి వచ్చాను. నాకు అంగదుడు ఒక్కడే కొడుకు. వాణ్ణి గురించే నాకు దిగులు. వాణ్ణి సుగ్రీవుడు సరిగా చూసేలాగు చూడు. సుగ్రీవుడికి నా భార్య అయిన తారపై కక్ష ఉండవచ్చు.
 
అతను ఆమెను అవమానించకుండా చూడు,'' అన్నాడు. కొంత సేపటికి అతనికి స్పృహ తప్పింది. రాముడి బాణంతో వాలి దెబ్బ తిన్న వార్త తారకు తెలిసింది. ఆమె దుర్భరమైన దుఃఖంతో తన కొడుకుతో సహా కిష్కింధ నుంచి వచ్చింది. రాముడి చేత దెబ్బతిన్న వాలిని చూసి భయపడి కొందరు వాలి అనుచరులు పారిపోయి వస్తూ, తారకు ఎదురయ్యూరు.
 
వారు తారతో, ‘‘అమ్మా, నీ కొడుకింకా బతికి ఉన్నాడు. వాణ్ణి కాపాడు కోవటానికి తిరిగి వెళ్ళిపో. మృత్యువు రాముడి రూపంలో వచ్చి వాలిని తీసుకుపోతున్నది. అంగదుడికి పట్టాభిషేకం చెయ్యూలి. కిష్కింధ ద్వారం మూసి జాగ్రత్తగా రక్షించాలి. అలా చేయని పక్షంలో నువ్వు కిష్కింధను శత్రువులకు విడిచి పారిపో,'' అన్నారు.
 
‘‘అంతటి భర్తే పోతుంటే ఇక నాకీ రాజ్యమూ, ఈ కొడుకూ, ఈ శరీరమూ పట్టుతాయూ? నేను నా భర్త పాదాల దగ్గిరికే పోతాను,'' అని వలవలా ఏడుస్తూ తార వాలి పడి ఉన్న చోటికి వెళ్ళింది. ఆమె రామలక్ష్మణులనూ, సుగ్రీవుణ్ణీ దాటి వెళ్ళి వాలిని చేరుకుని, అత నికి స్పృహ లేకపోవటం చూసి ప్రాణం పోయిందనుకుని మూర్ఛపోయింది.

తరవాత స్పృహ నుంచి తేరుకుని భర్తను కౌగలించుకుని పెద్దపెట్టున ఏడవసాగింది. వాలి సమీపంలోనే నిలబడి ఉన్న హనుమంతుడు తారను ఓదార్చ యత్నించాడు. అంతలో వాలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సుగ్రీవుణ్ణి చూసి , ‘‘సుగ్రీవా, మనం అన్నదమ్ములుగా సఖ్యం కలిగి, రాజ్య భోగాలను కలిసి అనుభవించటానికి నోచుకోలేదు. అందుచేతనే నిన్ను వెళ్ళగొట్టాను.
 
నీ భార్యను అపహరించానని నాపై కోపం ఉంచుకోకు. నా కొడుకు అంగదుణ్ణి నీకు అప్పగిస్తున్నాను. వాణ్ణి నేను చూసినట్టుగానే చూడు, నేను లేని లోటు రానియ్యకు. ఇక వానర రాజ్యం నువ్వే ఏలుకో. నా ప్రాణాలు పోయేలోపుగా ఈ కాంచనమాలికను తీసుకో,'' అన్నాడు. తరవాత అతను అంగదుడితో, ‘‘నాయనా, ఇక నుంచీ నువ్వు మీ పినతండ్రి చెప్పినట్టు నడుచుకో.
 
అతని శత్రువులతోగాని, వారి మిత్రులతోగాని చేరకు. నన్ను ఎలా చూసుకున్నావో అలాగే సుగ్రీవుణ్ణి చూసుకో,'' అని చెప్పి ప్రాణాలు వదిలాడు. వానరులందరూ ఒక్కసారి గొల్లున ఏడిచారు. తార తన భర్త కళేబరాన్ని కౌగలించుకుని అలాగే మూర్ఛపోయింది. తరవాత నీలుడు వాలి రొమ్మున నాటుకున్న రామబాణాన్ని లాగేశాడు.
 
అంగదుడు తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు. సుగ్రీవుడు కళ్ళ నీరు కార్చుతూ రాముణ్ణి సమీపించి, ‘‘రామా, నువ్వు అన్న ప్రకారం వాలిని వధించావుగాని నాకు భోగాల మీదా, జీవితం మీదా కూడా విరక్తి కలిగింది. ఈ తారా, కిష్కింధలోని వానరులూ, అంగదుడూ ఇలా దుఃఖ సముద్రంలో మునిగి ఉండగా నాకు రాజ్యమేమిటి?
 
వాలి నన్ను పెట్టిన కష్టాలు తలుచుకున్న కోపంతో అతని చావు కోరాను. ఇప్పుడు పశ్చాత్తాపం నన్ను దహించేస్తున్నది. వాలి దొడ్డబుద్ధి గలవాడు, నన్ను చంపటానికి ఎన్నడూ యత్నించలేదు. అతణ్ణి చంపాలన్న హీనమైన కోరిక మహా పాపినైన నాకే కలిగింది. నేనుకూడా వాలితోపాటు దహనమైపోతాను. వానరులు నీ కోసం సీతను అన్వేషిస్తారు,'' అన్నాడు.

No comments:

Post a Comment