Sunday, July 15, 2012

దేవర్షి నారదుడిగా మూడవ అవతారం

ఆయన ఎత్తిన మూడవ అవతారం, "దేవర్షిత్వమ్ ఉపేత్య" దేవర్షి అయిన నారదుడు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క కుమారుడిగా తానే అవతరించాడు. ఇది మూడవ అవతారం. నారదుడు అనే జీవ విశేషానికి అతని సుకృతాన్ని బట్టి అతనికో దేహాన్ని ఏర్పాటుచేసి, అతనిలో తనే ఉండి లోకానికి కావల్సిన భగవత్ ఆరాధనా విధానాన్ని లోకానికంతటికీ ప్రవర్తింపజేసాడు. "తంత్రమ్ సాత్వతమ్" లోకంలో భగవత్ భక్తులంతా ఆరాధన చేసుకోవడానికి కావల్సిన పాంచరాత్ర మొదలైన ఆగమాలని ఆయన అందించారు.

మనిషి బాగుపడాలి అంటే సరియైన ఉపదేశం చేసే సదాచార్యుడు కావాలి. శరీరం ఎంత గొప్పదైనా, బుద్ధి ఎంత చురుకైనదైనా దాన్ని సవ్యంగా ఎట్లా వాడుకోవాలో చెప్పే మార్గ దర్శకుడు లేకపోతే మానవుడు అనిపించుకోవడం అనేది ఉండనే ఉండదు. నారదుల వారు సాంగముగా వేదాధ్యయనం చేసారు. వేదాలు వేదార్థాలు వచ్చును అతనికి, కానీ "మంత్రవివేదాస్మి న అహమ్ ఆత్మ విత్", వాటి సారమైన ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి అని, ఎవడి వల్ల అయితే ఇంత ప్రపంచం ఏర్పడిందో అలాంటి పరమాత్మని దర్శించటానికి ఏం చేయాలో అని తాను ఒక గురువుని ఆశ్రయించి ఆ తత్త్వ జ్ఞానాన్ని తాను ఆర్జించి భూమ విద్యగా దాన్ని లోకానికి ప్రవర్తింపజేసాడు. తనకి ఎంత తెలిసిననూ విద్యార్జనలో ఎలాంటి నిరాశ, ఉదాసీనత లేని ఆచార్యుడు నారదులవారు.

ఆ ఆర్జించిన విద్యని తాను అనుభవించి ఇతరులు వినియోగించుకొనేలా చేయగలిగిన మహనీయులు నారదుల వారు. తనకి తెలిసిన భగవత్ విజ్ఞానాన్ని తాను నిరంతరం సాక్షాత్కరించుకుంటూ పాడుకుంటూ భగవంతుడికి ఆనందాన్ని కలిగించేట్టు తన జీవితాన్ని మలచుకున్న వాడు. గానాత్మకత అనేది భగవంతునికి ఇష్టం, అట్లా భగవంతుని ప్రీతిని పొందిన వాడు. భగవంతుణ్ణి ఎప్పుడూ దర్శించుకొనే వాడు. జ్ఞానం పక్వం చెంది, అది పండి "ఉపాసనా సిద్ధి" కలిగిన వ్యక్తి. తాను జ్ఞానంతో నిండిన వాడు, ఇతరుల అజ్ఞానాన్ని దూరం చేయగలుగుతాడు కనుక ఆయన పేరు నారద అయ్యింది. అట్లా తనకి తెలిసిన జ్ఞానాన్ని లోకానికి ఇవ్వకుండా ఉండలేడు కనుక అట్లా ఆయన తన జ్ఞానాన్ని నింపుకోగలిగే పాత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లా అన్వేశించి లోకానికి మానవత్వపు జ్ఞానాన్ని ఇవ్వడానికి వాల్మీకిని ఎంచుకొని ఆయన ద్వారా రామాయణాన్ని ఉపదేశించి తద్వారా లోకానికి అందించాడు.

భాగవతాన్ని ఈ లోకంలో ప్రవర్తింపజేసిన మహనీయులు నారదుల వారే. వేదవ్యాసుడు వేదాలని సాక్షాత్కరించుకొని వేదాలను విభజించారు, అన్ని పురాణాలను రచించారు. సర్వ వేద సారం అంటూ నిర్ణయిస్తూ బ్రహ్మ సూక్తాలను రచించారు. ఇన్ని చేసినా ఆయనకు తృప్తికాక చింత చేసాడట. అప్పుడు నారదుడు వచ్చి నీవు చాలా వాఙ్మయాలని తయారుచేసావు, కాని వేద వాఙ్మయపు తత్త్వాన్ని నీవు కీర్తించలేదు, ఎప్పుడు ఏది అవసరం అనిపిస్తే అది చేసావు కానీ సారభూతమైన తత్త్వాన్ని స్పష్టంగా చేప్పక పోవటంచే నీకు ఈ చింత తీరలేదయా.  ఇప్పుడైనా ఆ తత్త్వ సారం ఏమిటో దాన్ని శ్రీమద్భాగవతంగా రచన చెయ్యి అని నారదుడు ఆదేశించాడు. మిగతా పురాణాల తర్వాత శ్రీమద్భాగవతాన్ని రచించాడు. అందుకే పురాణాల సారం అంటారు. అయితే శ్రీమద్భాగవతానికి విరుద్దంగా లేని పురాణాలని ప్రమాణంగా తీసుకుంటాం. ఎక్కడైన శ్రీమద్భాగవతానికి విరుద్దంగా ఏదైనా పురాణంలో ప్రస్తావన వస్తే ప్రమాణం కాదు అని నిర్ణయం దీని నుండే చేస్తారు. అట్లా పురాణాల సారాన్ని శ్రీమద్భాగవతంగా ఇహ లోకానికి అందింపజేసాడు.

No comments:

Post a Comment