Monday, July 16, 2012

భగవద్గీత-తాత్పర్యసహితం:ఎనిమిదవ అధ్యాయం



శ్రీమద్భగవద్గీత

ఎనిమిదవ అధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం

అర్జున ఉవాచ:

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 1

అర్జునుడు: పురుషోత్తమా ! బ్రహ్మమంటే ఏమిటి? అధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి?

అధియజ్ఞః కథం కో௨త్ర దేహే௨స్మిన్ మధుసూదన |
ప్రయాణకాలే చ కథం జ్ఞేయో௨సి నియతాత్మభిః || 2

మధుసూదనా ! ఈ శరీరంలో అధియజ్ఞుడెవడు; ఎలావుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణసమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు?

శ్రీ భగవానువాచ:

అక్షరం బ్రహ్మ పరమం స్వభావో௨ధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః || 3

శ్రీ భగవానుడు: సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మమనీ, ఆత్మ పరమాత్మతత్వాన్ని అధ్యాత్మమనీ చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికీ, ఉనికికీ కారనమైన త్యాగపూర్వం, యజ్ఞరూపం అయిన కార్యమే కర్మ.

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియజ్ఞో௨హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4

అర్జునా ! శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతమంటారు. పురుషుడే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో వుండే అధియజ్ఞాన్ని నేనే.

అంతకాలే చ మామేవ స్మరన్‌ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5

మరణసమయంలో నన్నే స్మరణచేస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6

కౌంతేయా ! అంత్యకాలంలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో, ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు.

తస్మాత్‌సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ || 7

అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సునూ, బుద్ధినీ నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు.

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ || 8

పార్థా ! మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు.

కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9

ప్రయాణకాలే మనసా௨చలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్ || 10

సర్వమూ తెలిసినవాడు, సనాతనుడు, సకలలోకాలనూ శాసించేవాడు, సూక్ష్మాతిసూక్ష్మమైనవాడు, సూర్యుడులాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకూ ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యంకాని రూపంకలిగినవాడు అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా వుంచుకొని భక్తిభావంతో, యోగబలంతో కనుబొమల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు.

యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11

వేదార్థం తెలిసినవాళ్ళు శాశ్వతమని చెప్పేదీ, కామక్రోధాలను జయించిన యోగులు చేరేదీ, బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు చేరకోరేదీ అయిన పరమపదాన్ని గురించి నీకు క్లుప్తంగా చెబుతాను విను.

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యా ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ || 12

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజన్‌దేహం స యాతి పరమాం గతిమ్ || 13

ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణం శిరస్సులోవుంచి, ఆత్మయోగం అభ్యసిస్తూ బ్రహ్మను ప్రతిపాదించే ఓంకారమనే ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ, నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవాడు మోక్షం పొందుతాడు.

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || 14

పార్థా ! ఏకాగ్రచిత్తంతో ఎల్లప్పుడూ నన్నే స్మరించే ధ్యానయోగికి నేను అతి సులభంగా లభిస్తాను.

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మానః సంసిద్దిం పరమాం గతాః || 15

మోక్షపదాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి, దుఃఖపూరితం, అశాశ్వతమూ అయిన పునర్జన్మ పొందరు.

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో௨ర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 16

కౌంతేయా ! బ్రహ్మలోకంవరకూ వుండే సకలలోకాలూ పునర్జన్మ కలగజేసేవే. నన్ను పొందినవాళ్ళకు మాత్రం మరోజన్మ లేదు.

సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తే௨హోరాత్రవిదో జనాః || 17

బ్రహ్మదేవుడికి వేయియుగాలు పగలనీ, ఇంకో వేయియుగాల కాలం రాత్రి అనీ తెలుసుకున్నవాళ్ళే రాత్రింబవళ్ళ తత్వాన్ని గ్రహిస్తారు.

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే || 18

బ్రహ్మదేవుడి పగటిసమయంలో చరాచర వస్తువులన్నీ అవ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రికావడంతోనే అవ్యక్తం అనబడే ఆ ప్రకృతి లోనే కలసిపోతాయి.

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే௨వశః పార్థ ప్రభవత్యహరాగమే || 19

పార్థా ! ఈ జీవకోటి పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది.

పరస్తస్మాత్తు భావో௨న్యో௨వ్యక్తో௨వ్యక్తాత్ సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 20

ఈ అవ్యక్తప్రకృతికి అతీతమై, అగోచరం, శాశ్వతమూ అయిన పరబ్రహ్మతత్వం సమస్తభూతాలూ నశించినా నశించదు.

అవ్యక్తో௨క్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || 21

అగోచరుడనీ, శాశ్వతుడనీ చెప్పే ఆ పరమాత్మనే పరమగతిగా భావిస్తారు. నాకు నిలయమైన పరమపదాన్ని పొందినవాళ్ళకు మళ్ళీ జన్మలేదు.

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ || 22

అర్జునా ! సమస్తభూతాలనూ తనలో ఇముడ్చుకుని, సకలలోకాలలో వ్యాపించి వున్న పరమాత్మను అచంచలమైన భక్తివల్లనే పొందవచ్చు.

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ || 23

భరతవీరా ! యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను.

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24

అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఆరుమాసాల ఉత్తరాయణం—వీటిలో మరణించే బ్రహ్మోపాసకులకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది.

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || 25

పొగ, రాత్రి, కృష్ణపక్షం, ఆరుమాసాల దక్షిణాయనంలో గతించిన యోగి చంద్రజ్యోతిని పొంది, మళ్ళీ మానవలోకంలోకి వస్తాడు.

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః || 26

శుక్ల, కృష్ణ అనే రెండింటినీ జగత్తులో శాశ్వతమార్గాలుగా భావిస్తున్నారు. శుక్లమార్గంలో పయనించినవాడికి జన్మరాహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి.

నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27

పార్థా ! ఈ రెండుమార్గాలూ తెలిసిన యోగి ఎవడూ మోహంలో పడడు. అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో వుండు.

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ || 28

దీనినంతా గ్రహించిన యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలకు చెప్పబడ్డ పుణ్యఫలాలను అధిగమించి, అనాది అయిన పరమపదం పొందుతాడు.



ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "అక్షరపరబ్రహ్మయోగం" అనే ఎనిమిదవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment