Sunday, July 15, 2012

అవతార క్రమంలో మొదటిదిగా 'చతుర్ముఖ బ్రహ్మా'


సూతులవారు భగవంతుడి అవతారాలను గురించి చెబుతున్నారు. ఒక ఇరవై రెండు అవతరాలను చెబుతారు. దశావతారాలు అని అంటుంటారు, అవి వీటిల్లో కొన్ని ఎంపిక చేసి చెప్పేవి మాత్రమే. భాగవతంలో కొంత లోనికి వెళ్తే ఇరవై నాలుగు అవతారాలని ప్రస్తావించారు. మరింత లోనికి వెళ్తే  పది, ఇరవై రెండు, ఇరవై నాలుగు అని ప్రశ్నే కాదు అసలు అవతారాలకి లెక్కే లేదు అని చెబుతారు. కొన్ని ప్రధానమైన వాటిని తెలుసుకుంటే అవేమిటో కొంతనైనా తెలుస్తుందని కొన్నింటిని వివరించారు. కొందరు ఈ అవతారాలను చెప్పేప్పుడు మొదట జలంలో తిరిగేది, ఆపై జలంలో, నేలపై తిరిగేది, నేలపై తిరిగేది, మానవుడిగా చిన్న పరిణామం, ఆపై మనిషి అందులో ఒక ఉగ్ర రూపం, ఆపై శాంత రూపం  ఇలా ఒక పరిణామాన్ని చెబుతారు, కానీ అది సరికాదు. ఈ క్రమంలో అవతారాలు రాలేదు. అవతారాల క్రమమేమిటో చెబుతారు సూతులవారు.

స ఏవ ప్రథమమ్ దేవః కౌమారమ్ సర్గమ్ ఆశ్రితః |
చచార దుశ్చరమ్ బ్రహ్మా బ్రహ్మచర్యమ్ అఖండితమ్ ||

పాలకడలిలో ఉన్న పురుష స్వరూపంలోంచి మొట్ట మొదటగా వచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ. కనుక ఆ బ్రహ్మని మొట్ట మొదటి అవతారంగా చెబుతారు. పరమాత్మ యొక్క ఆది రూపం లేదా కారణ  రూపం అనేది ఆయన సాక్షాత్తు ధరించినది. అదీ మొట్ట మొదటిది అని కూడా చెప్పుకోవచ్చు, కానీ అందులోంచే అన్నీ వస్తున్నాయి కనుక అది అవతారము అని చెప్పనక్కరలేదు. అది అవతారాల మూలం అని చెప్పవచ్చు. అందులోంచి చతుర్ముఖుడు మొదటగా వచ్చాడు, ఒక జీవాదిష్టమైన రూపంలో వచ్చాడు. కనుక చతుర్ముఖ బ్రహ్మ మొదటగా వచ్చిన అవతారం. ఒక పుణ్య విశేషం చేత ఒక జీవుణ్ణి తీసి నాలుగు ముఖాలుకల రూపాన్ని ఇచ్చి, నీ పేరు బ్రహ్మా, నీ కార్యం సృష్టి నీవుండే చోటు ఇది అని కర్తవ్యాన్ని అప్పగిస్తాడు.

జీవాదిష్టానమైన అవతారం చతుర్ముఖ బ్రహ్మది. అందులోంచి శనక సనందాది కుమారులు అనే ఒక నలుగురిని బయటికి తీసుకు వచ్చాడు. తాను బ్రహ్మగా పరమాత్మ యొక్క నాభీకమలంలోంచి బయటికి వచ్చి "బ్రహ్మచర్యమ్ అఖండితమ్ చచార దుశ్చరమ్ ", ఆయన కేవలం బ్రహ్మ చర్యాన్ని పాటించాడు. "అఖండితమ్", అంటే ఏదో కొంతకాలం అని కాదు ఎంతకాలమో చేసాడు. బ్రహ్మ చర్యం అంటే వేదాధ్యయనం. చాలా తీవ్రమైన తపస్సు. ఆ తపస్సుకు పరమాత్మ అనుగ్రహించి ఆయన ద్వారా సృష్టి కార్యాన్ని సాగించాడు పరమాత్మ. ఇది ఒక అవతారం.



No comments:

Post a Comment