Sunday, July 15, 2012

దత్తాత్రేయుడిగా ఆరవ అవతారం


ఆరవ అవతారం అనసూయ అనే ఆవిడకి అత్రి ద్వారా వారి కుమారుడిగా అవతరించాడు. దత్తాత్రేయుడు అని ఆయన పేరు. ఈ వేళ లోక ప్రసిద్ధమైన, మనం వినే దత్తాత్రేయుడు వేరు. మరి ఈయన ఎప్పుడు వచ్చాడో మనకు తెలియదు. అసలు ఆరవ అవతారంగా తాను ధరించినది వేరు. అత్రి అనసూయలు చేసుకున్న తపో ఫలితంగా తనని వారికి ఇచ్చేసుకున్నాడు. అలా ఇచ్చుకోవడం చేత దత్తం అత్రికి కనుక ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది.

మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు తిదండి సన్యాసి అని తెలుస్తుంది. మూడు తత్త్వాలకు ప్రతీకగా మూడు దండాలు యతీశ్వరులు ధరించి ఉంటారు. ఒక్కో దండం ఒక్కోక్క తత్త్వానికి గుర్తు.  ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి. మనం చూసే ఈ ప్రపంచం అంతా ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది. వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్త్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు. అందులో మనం లెక్కకు అందనంత మంది జీవుల్లు. రెండోది రకరకాల చిత్రవిచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకంగా ఉండే ప్రకృతి. ప్రకృతి అచేతనం, జ్ఞానం ఉండదు. అందుకే అచిత్ అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వానికి పేరు పరమాత్మ. ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు. పరమాత్మ జీవ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు.  వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తుంది.

ఆయన ప్రస్తావన మన రామానుజుల వారి చరిత్రలో ఉంది. మేలుకోట అనే స్థానం కర్ణాటకలో ఉంది. రామానుజుల వారు అక్కడ తిరునారాయణుడి ఆలయాన్ని పునరుద్ధరణ చేసినటువంటి స్థానం అది. శ్రీరంగ క్షేత్రంలో రామానుజుల వారు ఉంటుండేవారు, అక్కడ అందరినీ భగవత్ భక్తుల క్రింద మార్చేస్తున్నారు అని ఆనాటి కేరళ రాజుకి నచ్చలేదు. రామానుజుల వారిని బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపితే రామానుజుల వారికి బదులుగా ఆయన శిష్యులైన కూరేశులు రామానుజుల వారి దండాన్ని చేత పట్టుకొని వారి వేశం వేసుకొని బంధీయై వెళ్తారు. ఇక్కడుండే ఉపద్రవం తప్పదని వారి పరివారం అంతా కలిసి రామానుజులవారిని కర్ణాటక క్షేత్రానికి చేరుస్తారు. అప్పుడు వీరిని గుర్తు పట్టకుండా ఉండటానికి ఆపద్ధర్మంగా తెల్ల వస్త్రాలని ధరింపజేసి తీసుకువెళ్తారు. అక్కడికి చేరాక దండ కాశాయాల్ని తిరిగి తీసుకోవాలి, మొదట పెరుమాళ్ళ వద్ద తీసుకున్నారు. మరి ఇప్పుడేం చేయాలి ? మేలుకోటలో దత్తాత్రేయ పుష్కరిణి ఉంది అక్కడ ఉండి దత్తాత్రేయుడు తపస్సు చేసుకొనే వాడు అని అక్కడ వారికి పాదాలు ఉంటాయి. దండ కాశాయాలని వారి పాదాలను స్పృశింపజేసి పొందినట్లు తెలుస్తుంది. వేద రక్షణ కోసం దత్తాత్రేయుడు త్రిదండి సన్యాసిగా ఉండేవారు అని తెలుస్తుంది.

మూడు ముఖాలతో నాలుగు కుక్కలని పెట్టుకొని ఇప్పుడు మనకు కనిపించే దత్తాత్రేయుడు ఎవరు అనేది మనకు ప్రామాణికంగా తెలియటం లేదు. మనకు తెలిసిన ప్రమాణాల ప్రకారం దత్తాత్రేయుడు అత్రి అనసూయల వల్ల ఏర్పడ్డ అవతారం. ఇది భగవంతుడి ఆరవ అవతారం. ఆయన అలర్క, ప్రహ్లాద మొదలైన వారికి అధ్యాత్మ శాస్త్రాన్ని ఉపదేశించాడు.
భాగవత 11వ స్కందంలో దత్తాత్రేయుడి వివరణ ఉంది. జ్ఞానాన్ని అనేక చోట్ల నుండి గ్రహించే వారిని బహుశృతులు అంటారు. ఆయనకు ఇరవైనాలుగు మంది గురువులట. "వహ వహ పర్యు పాసితాః", తాను గొప్ప గొప్ప మహానుభావుల నుండి ఉపదేశాలని పొందాడు. పృథ్వి ఒక గురువు. అంటే సహనం, క్షమా ఓర్పు అనేవి మనం కలిగి ఉండాలి అనే విషయంలో అతను పృథ్విని గురువుగా భావించాడు. చంద్రుడు ఒక గురువు. ఒక్కోసారి క్షయం ఒక్కో సారి వృద్ధి, మన జీవనంలో ఒక్కో సారి తగ్గిపోతుండవచ్చు, ఒక్కో సారి పెరిగిపోతుండవచ్చు. చంద్రుడు ఒక పక్షంలో పెరుగుతూ మరో పక్షంలో తరుగుతూ ఉంటాడు కానీ కలత చెందడు. అలా జీవితంలో ఏర్పడే వైశమ్యానికి స్వాగతం పలకాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి చంద్రుణ్ణి గురువుగా భావించాడు. అలా చెబుతూ "కుమార్యా ఇవ కంకణః", ఒక కన్య ధాన్యాన్ని దంపుతోంది ఆవిడ చేతిలోని గాజులు చప్పుడు చేస్తున్నాయి. అయితే కొన్నింటిని తీసివేసి రెంటిని మాత్రమే ధరించింది. అప్పుడూ చప్పుడు అవుతూనే ఉంది. ఇలా కాదు అని ఒక్కో చేతికి ఒక్కో గాజు మాత్రమే ధరించినప్పుడు ఎక్కడా శబ్దం రాలేదు. దీని నుండి ఆయన నేర్చుకున్నది "వాసే బహూనాం కలహః", ఎక్కువ మంది ఒక చోట చేరియుంటే గొడవలు ఏర్పడుతాయి. ఇద్దరు మాత్రమే ఉంటే "భవేత్ వార్త ద్వయోరపి", మాటలు వస్తాయి. భగవత్ గుణానుసంధానం చేయాలి అంటే "ఏకైవ చరే తీర్థ్యం", ఒక్కడే కూర్చోవాలి. ఏకాగ్రత కావాలంటే ఒక్కడే కూర్చోవాలి. స్వాధ్యాయం చేయాలంటే ఒక్కడే కూర్చోవాలి. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తను ఆ కన్య యొక్క గాజులను గురువుగా భావించాడు. నదీతీరాల్లో చేపలు పట్టేవాడు ఎలాగైతే గంభీరమైన దృష్టితో ఉంటాడో అట్లానే ఒక విషయాన్ని గ్రహించాలి అంటే అలాంటి ఏకాగ్రమైన చిత్తము కావాలి, దానికి చేపలుపట్టేవాడే గురువుగా భావించాడు.ఇలా చేతనాలే కాదు అచేతనాల నుండి కూడా జ్ఞానాన్ని ఆర్జించాడు. ఇలా ఇరవైనాలుగు మంది గురువుల వద్ద నేర్చుకున్నాడు. ఆయనకి అవధూతుడు అని పేరు. మంచిని మనం ఎక్కడనుండైనా ఆర్జించవచ్చు అనేది చెబుతాడు.




No comments:

Post a Comment