Sunday, July 15, 2012

వరాహ స్వామిగా రెండవ అవతారం


ఆయన రెండవ అవతారంగా ఎత్తినది వరాహ స్వామి అవతారం. ఇది జీవాదిష్టానం కాకుండా తానే స్వయంగా ధరించినది, సాక్షాదవతారమే. ఏం చేసాడాయన ? ఒక నాడు భూమి తన స్థానం నుండి ప్రక్కకి తొలగించబడి రసాతలానికి చేరింది. "ఉద్ధరిష్యన్న్ ఉపాదత్త" , దాన్ని పైకి ఎత్తాలని ఆయన "యజ్ఞేషః సౌకరమ్ వపుః", యజ్ఞ స్వరూపుడిగా ఆరాధింపబడే వరాహ రూపాన్ని తాను ధరించాడు. ఇది భగవంతుడి రెండవ అవతారం.

వరాహ అవతారంలో స్వామి చేసిన పెద్ద ఉపకారం మరొకటుంది. శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు ఏమితలచుకుంటాడో వాడు అదే అయిపోతాడు అని ఉపనిషత్తులు చెప్పాయి, అయితే ఆ సమయంలో మనకు దేవుడు జ్ఞాపకం వస్తాయా ? అంతిమ స్మృతి అంటారు. ఉపనిషత్తులు చెప్పాయి, దీన్నే తత్ క్రతునీతి అంటారు. అంతిమ స్మరణ మన చేతిలో లేనిదే అయితే మనకు మోక్షం కలగడం అనేది లేదా అని భగవద్రామానుజులవారు కాంచీపూర్ణులవారిని కంచి వరదరాజ స్వామిని అడగమని విన్నపించారు. కంచి వరదరాజ స్వామి అంతిమస్మృతి అవసరం లేదు అని చెప్పారు. సూక్ష్మమేమిటంటే ఉపనిషత్తులు అంతిమ స్మృతి అవసరం అని చెప్పాయి తప్ప ఎవరు చేయాలి అనేది చెప్పలేదు. మరొకరు మన తరపున సద్గతిని కోరవచ్చు కానీ వారికి మన చివరి క్షణం తెలియడం సాధ్యం కాదు. కనుక అంతిమ స్మృతి చేయాల్సిన భాధ్యత భగవంతుడిపై పెడితే వాడు చేసి మనల్ని సద్గతి ఇస్తాడు. మన ఆస్థి పోతుందేమో అని ఒక న్యాయవాదిపై భారం ఉంచితే ఎట్లా అయితే మన తరపున వాధించి మన ఆస్థిని కాపాడుతాడో, నీ అంతిమ క్షాణాలలో తలచాల్సిన దాన్ని ఈ నాడే భగవంతుడి భుజాన పెడితే ఆయన మన తరపున చేస్తాడు. 
మరి మనం భాధ్యత పెడితే ఆయన స్వీకరిస్తాడా ? వరాహ అవతారంలో స్వామి మనకు ఒక పెద్ద ఉపకారం చేసాడు. వరాహ అవతారంలో భాధ్యత స్వీకరిస్తాను అన్నాడు. "అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం". నీ శరీరం నీవు చెప్పినట్లుగా వినేప్పుడు, నీ ఇంద్రియాలు నీవు చెప్పినట్లుగా వినేప్పుడు ఒక్కసారి నామీద భారం పెడితే వాడిని నేనే తలుస్తా వాడికి పరమాగతి నేనే పొందిస్తా. ఎందుకు అంత జాలి వాడిపై ? వాడు నావాడే అని. శరీరంలో శక్తిలేనప్పుడు తలచుకోమని నిర్బంధించే కృరుడిని కాదు నేను. ఇంద్రియ పాటవం లేని నాడు పనిచేస్తే తప్ప తిండి పెట్టనని చెప్పే నిర్దయుడిని కాదు నేను. చికాకు పడేప్పుడు ధ్యానం చేయమని చెప్పే మనస్సులేని వాడిని కాదు నేను. లోకంలో ఉద్యోగాలు ఇచ్చే పోషకులు మనం ఏదో పని చేస్తే తప్ప పోషించరు, ఎందుకంటే వారు చేసేది వ్యాపారం. వారు కర్మ వల్ల ఏర్పడ్డ వాళ్ళు. నేను అట్లాంటి వాడిని కాదు, కృపతో చేస్తున్నాను. కనుక "స్థితే స్మరే సుస్వస్తే శరీరే సతి" శరీరం హాయిగా ఉన్నప్పుడే, "ధాతుసామ్యే స్థితే" శరీరంలో ధాతువులు మంచిగా ఉన్నప్పుడే. అట్లాంటి సమయంలో "స్మర్తా భవ తవాస్మి" నన్ను తలచుకో చాలు, నీకు ఇక భాధ్యత లేదు, నేను చూసుకుంటా. "తతస్తం మ్రియమానంతు కాష్టపాశాణ సన్నిభం" ప్రాణం పోయే సమయంలో శరీరం, మనస్సు కర్రభారిపోతాయి, అట్లాంటి సమయంలో "అహం స్మరామి మద్భక్తం" నేను తలచుకుంటా. "నయామి పరమాంగతిం" నీకు సద్గతి కలిగేట్టు చేస్తా.




No comments:

Post a Comment