Sunday, July 15, 2012

మత్స్య కూర్మ ధన్వంతరి మోహినీ అవతారాలు


రూపమ్ సజగృహే మాత్స్యమ్ చాక్షుశాంతర సంప్లవే |
నావ్యారోప్య మహీమయ్యామ్ అపాద్ వైవస్వతమ్ మనుః ||

పదవ అవతారం మత్స్యావతారం. ఇప్పుడు మనం ఉండే వైవస్వత మన్వంతరానికి ముందుండే మన్వంతరానికి చాక్షుశ మన్వంతరం అని పేరు. ఇది ఆరవ మన్వంతరం. ఆరవ మన్వంతర ఆరంభంలో ఏడవ మన్వంతరం కోసం వైవస్వతుడు అనే మనువుని ఒక పడవలో పెట్టుకొని తరువాతి మన్వంతరం ఆరంభం చేయటానికి కాపాడిన అవతారం, ఇది మత్స్యావతారం. అంటే ఇంత వరకు చెప్పిన అవతారాలన్నీ వైవస్వత మన్వంతరానికి పూర్వంలో ఆరు మన్వంతరాల్లో జరిగిన అవతారాలే. కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు. కలియుగానికి రెట్టింపు ద్వాపర యుగం, కలియుగానికి మూడురెట్లు త్రేతాయుగం, కలియుగానికి నాలుగు రెట్లు కృత యుగం. ఈ నాలుగు యుగాలని కలిపి చతుర్యుగం అంటారు. యుగ యుగానికి మధ్య సంధి కాలం ఉంటుంది. ఇలాంటి చతుర్యుగాలు సుమారు 71 సాగితే అది ఒక్క మన్వంతరం. అలాంటి మన్వంతరాలు ఆరు గడిచి, ఇప్పుడు ఏడవ మనువు కాలంలో ఉన్నాం. అట్లా ఏడవ మనువుని ప్రారంభింపజేయడానికి ముడి వస్తువులు ప్రళయార్ణవంలో కొట్టుకు పోకుండా ఉండటానికి సూర్యుని కుమారుడైన వైవస్వత మనువుని కాపాడిన అవతారం.

కూర్మావతారం:

సురాసురాణామ్ ఉదధీమ్ మథ్నతామ్ మందరాచలమ్ |
దధ్రే కమఠ రూపేణ పృష్టేకాదశే విభుః ||

పదకొండవ అవతారం కూర్మావతారం. దేవతలచేతా అసురుల చేత అమృతానికై సాగరాన్ని చిలికిస్తూ వారందరిచేతా కవ్వ రూపంలో ఉండే మందర పర్వతాన్ని ధరించడం కోసం తానే కూర్మ రూపాన్ని ధరించి తన పుష్టం పై ధరించాడు. అక్కడ కనిపించే అవతారం ఒక్కటే కానీ స్వామి ఎన్నో అవతారాలు ధరించాడట. చిలికే అసురుల్లో ఒక రూపం, దేవతల్లో ఒక రూపం, దానికి చుట్టే పాము తలలో, మధ్య భాగంలో, తోకలో ఒక్కో రూపం పర్వతం పైన, పర్వతం లోన ఇలా ఏడేసి కనిపించని రూపాలు ధరించాడట పరమాత్మ. లెక్కించటానికి ఆ కనిపించే ఒక్క కూర్మ అవతారాన్ని 11వ అవతారంగా చెబుతాం.

ధన్వంతరి, మోహినీ అవతారాలు:

ధాన్వంథరమ్ ద్వాదశమమ్ త్రయోదశమమ్ ఏవచ |
అపాయయత్ సురాన్ అన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రియా ||

ఆతరువాత పన్నేడవ, పద మూడవ అవతారాలు ఒకే సారి వచ్చాయి. సముద్రాన్ని చిలికినప్పుడు ఓషదుల సార భూతంగా అమృతాన్ని బయటికి తెచ్చిన ధన్వంతరిగా పన్నెండవ అవతారం ధరించాడు. ఆ వచ్చిన అమృతానికోసం సుర అసురులంతా కొట్టుకుంటుంటే లోక హితానికి అది దేవతలకి చెందేలా తాను ధరించిన రూపం మోహిని స్వరూపం. అసురులు త్రాగితే అది లోకానికి మరింత హానికరం కనుక వారందరినీ మోహ పరుస్తూ త్రాగాల్సిన వారికి పంచి ఇచ్చే స్వరూపం ఇది మోహినీ స్వరూపం. ఇది పద మూడవ అవతారం.



No comments:

Post a Comment