Monday, July 16, 2012

విగ్రహాలలో భగవద్భావన


మన సంసృతిలో విగ్రహారధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సమస్తంలో ఆ సర్వాంతర్యామిని విగ్రహంలో చూసుకుంటూ మోక్షసాధనకు ప్రయత్నించడం తరతరాలుగా మన పుణ్యభూమిలో కొనసాకుతున్న సంప్రదాయం.
విగ్రహం. భగవంతుడు.పూజ.భక్తి అనే విషయాలను గురించి తెలుసుకునే ముందు భగవత్తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. అనంతరం భగవంతుని మూర్తి, మూర్తితత్వాన్ని నిర్ణయించిన పిదప పూజ అంటే ఏమిటి? భక్తి రహస్యమంటె ఏమిటన్న విషయాలను తెలుసుకోవచ్చు. బ్రహ్మసూత్ర భాష్యకారులు ‘ సత్యం జ్ఞాన మానంతం బ్రహ్మ ‘ అనే వాక్యాన్ని కూడ చేర్చారు. అప్పుడే వేదాంతసారం బ్రహ్మ అఖండం సచ్చి దానంద మవాజ్మనస గోచరమని చెప్పింది.


వీటిని అర్థం చేసుకున్నట్లయితే, సజాతీయం, విజాతీయం, స్వగత భేదంతో శూన్యం, శాశ్వతం, స్వప్రకాశం, చైతన్యమైన పరమానంద స్వరూపమే భగవంతుడని తేలుతోంది. శ్రీమద్రామా నుజాచార్యులు తమ శ్రీభాష్యంలో  శ్రీశంకర భగవత్పాదులు చెప్పిన సత్యం జ్ఞానమనంతబ్రహ్మ అనే శ్రుతివాక్యాని సద్రూప చిద్రూప దేశకాల వస్తు పరిఛ్ఛేద శూన్యమే బ్రహ్మమని చెప్పారు.
శ్రీమన్నారాయణుని నామాలు అనంతములైనట్లే, ఆయన గుణాలు కూడ అనంతములే. ఆయన స్వరూపంలో కూడ అనంతుడే. ఆయనలో సర్వజ్ఞత్వముంది. భగవంతుడు మహాజ్ఞాని. బ్రహ్మం నిర్గుణమైనప్పటికీ, నామరుపాల్లో  ఉండే గుణాల వలన సగుణంవుతోంది. ఉపాసనలకై సగుణ బ్రహ్మమునే ఉపదేసిశ్తున్నారని బ్రహ్మసూత్రాలలో శంకరులు సెలవిచ్చారు. భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ, ఒక చోటనే ఉంటాడు.
బ్రహ్మం నిస్సందేహంగా సర్వవ్యాపకమే. అలాగైనప్పటికీ దానిని పొందడానికి స్థాన విశేషంగా కావాలని ఉంది. ఈ రెండింటికీ విరోధం ఎప్పటికీ లేదు. విష్ణుభగవానుని చూపేందుకు సాలగ్రామాన్ని దృష్టంతంగా చెబుతుంటారు. సాలగ్రమంలో విష్ణువు ఉన్నట్లే, సూర్యమండలంలో పరబ్రహ్మముంది. సాలగ్రమం విష్ణుసన్నిధి అయితే, ఆదిత్య మండలం ప్రమాత్మ సన్నిధి అవుతుంది. సాలగ్రామం సూర్యమండలానికి సంపూర్ణమైన ఉపమానం. సూర్యమండలం తేజోమయం. తేజస్సుకు కడపటి రూపం కృష్ణత్పరమైన నీలం. సాలగ్రామంలో కూడ కృష్ణాత్పరనీలమే. సూర్య మండలం సాలగ్రామాలు రెండు వ్యాపక బ్రహ్మయందు ఉండేవే. బ్రహ్మ వ్యాపకత్వాన్ని చూపేందుకే బ్రహ్మను ఉదహరిస్తున్నారు. ఉపాసకులు సాలగ్రామంలో, సూర్యమండలంలో భగవానుని దర్శిస్తుంటారు.


కానీ, ఉపాసన అనేది శాస్త్ర ప్రకారంగా జరగాలి. హృదయకమలం, ఆదిత్య మండలం, కళ్ళు భగవంతుండుండే చోట్లని వేదం చెబుతోంది. కాబట్టి ఈ ప్రదేశాలలో ఉపాసకులు భగవత్ సాన్నిధ్యాన్ని కల్పించుకోవాలని పండితులన్నారు. సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడు ఉపాసన కొరకు ఆయా చోట్లలో వచ్చి చేరుతున్నాడని తెలుస్తోంది. అలాగే నామ రూపాన్ని గ్రహిస్తున్నాడు. సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడైనప్పటికీ, నామ రూపాలుగలవానిగా మనముందుకు ఎలా వస్తున్నాడన్న ప్రశ్న ఉదయించడం సహజం. అయితే తన అసాధారణ మహిమతో ఉపాసకుల కోరికలను నెరవేర్చేందుకు నేత్రాలలో, సూర్యమండలంలో దృగ్గోచరమవుతున్నాడని శ్రీభాష్యం చెబుతోంది. భక్తుడు, తన భావనాబలంతో ఇక్కడ, ఏ రూపంలో స్వామిని చూడదలిచినా, అక్కడ, ఆ రూపంలో కనబడుతుంటాదని ఆనందభాష్యం చెప్పింది.


శ్రీ శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రభ్యాష్యంలో, పరమేశ్వరుడు సాధకులను అనుగ్రహించడానికి, తన సంకల్పంతో మాయమయ స్వరూపాన్ని ధరిస్తున్నాడని స్పష్టంగా చెప్పాడు. భగవంతుడు తన సంకల్పంతో భక్తులను సంతోషపెట్టేందుకు లోకోపకారములైన రూపాలను ధరిస్తున్నాడు. ఆ రూపం దివ్యమే. ఆభరణాదులు దివ్యములే. వీనికి మూలం భగవంతుని సంకల్పమే అంటుంది. వేదం. ఈలోకం శ్రీవైష్ణవులకు వైకుంఠం, నింబార్కా అనుయాయులకు బృందావనం, వల్లభ అనుయాయులకు గోకులం, రామనందమతానికి అయోధ్య, శైవులకు కైలాసమవుతోంది. ఇతరులు కూడ తమ తమ అభిరుచులకు అనుగుణంగా పరమేశ్వరుని లోకాలను దర్శిస్తుంటారు. అమేఎకాదు ఆ లోకాలను పొందుతుంటారు.


ఈ లోకాలలో నిరంతరం ఉండే సర్వేశ్వరుడు ‘ పర ‘ అనబడతాడు. సృష్టి చేసే సమయంలో వ్యూహ  రూపంలో భగవంతుడు కనబడతాడు. వాసుదేవ, సంకర్షణ, అని రుద్ధ, ప్రద్యుమ్నులనేవి నాలుగు వ్యుహమూర్తులు. వీటిలో పరతత్వానికి వాసుదేవునికీ మధ్య ఎలాంటి బేధం లేదు. మిగిలిన మూడు వ్యూహములుగానే ఉంటాయి. వీనిలో జీవునికి అధిపతి సంకర్షణుడు. మనస్సుకు ప్రద్యుమ్నుడు, అహంకారానికి అనిరుద్ధుడు అధిపతులు.ఈ మూడు భగవంతుని స్వేచ్ఛామూర్తులు. పరమపథాన్ని పొందిన తరువాతే వైకుంఠవాసియైన భగవంతుడు లభిస్తున్నాడు. దివ్యశక్తిని పొందిన తరువాతే క్షీరసాగరంలో నివసించే పరమాత్మ దర్శనమవుతోంది. ఆయనను చేరుకునేందుకు ఎంతో పుణ్యం అవసరం.


అంతర్యామిని పొందేందుకు జ్ఞానయోగసిద్ధి అవసరం. దీనిని పొందడం అత్యంత కష్టతరం. అందువల్లనే భగవంతుడు అవతారాలు ఎత్తుతున్నాడు. భక్తులను దయతో కరుణిస్తున్నాడు. శ్రీరామచంద్రప్రభువు భక్తులపై నిరంతరం కరుణామృతాన్ని కురిపిస్తుంటాడు. ఆ స్వామి సంపూర్ణ వాత్సల్య సౌజన్య సౌశీల్య కారుణ్యపూర్ణుడు. ఆయన, తన అనన్యోపాసకునికి తమ దివ్యమైన అయోధ్యలో నివాసం ఏర్పరచి, నిరంతరంగా అక్కడే ఉండే ఏర్పాట్లను చేస్తాడు. ఇవేగాక, రామరహస్య రామతాపినీ, కృష్ణతాపినీ, వరాహ, హయగ్రీవ, దత్తత్రేయ, నృసింహతాపినీ  మొదలైన ఉపనిషత్తులలో ఎన్నో అవతార గాథలున్నాయి. వేదాలలో కూడ అవతార విషయాలు కనిపిస్తున్నాయి. ధర్మం అడుగంటినపుడు, అహంకారతత్వం ప్రబలినపుడు, భక్తులను రక్షించేందుకు,భూభారాన్ని తగ్గించేందుకు భగవంతుడు అనేక అవతారాలను ఎత్తుతుంటాడు. అంత కష్టపడుతున్నప్పటికీ, ఆయనను అందరూ సర్వేశ్వరునిగా గుర్తించలేరు. కృష్ణుని విషయంలో అదే జరిగింది. ‘నేను విభావతార మెత్తినా పూర్తిగా పనులను నెరవేర్చ లేకపోయానే. ఇంకా ఏం చేయాలి?’ అని భగవంతుడు ఆలోచించాడు. పర, వ్యూహ, విభవ రూపాలలో చేయలేని దానిని అంతర్యామియైన  నేను అర్చావతారంలో నెరవేరుస్తానన్నాడు. అర్చ అనే పదానికి పూజ, ఉపాసన అని అర్థం. దీనికి తగిన అవతారనామం అర్చావతారం. మూర్తి స్వరూపాన్నే అర్చావతారమంటారు.


గండకీనదిలో భగవంతుడు సాలగ్రామరూపంలో అవతరించాడు. శ్రీరంగం, తిరుపతి మొదలైన క్షేత్రాలలో శ్రీరంగనాథ, శ్రీవేంకతేశ్వర రూపాలలో అర్చావతార దృశ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ దివ్యప్రదేశాలేగాక వ్రజగోకులంలో ఎన్నో ప్రదేశాలునాయి. అక్కడ తమ ఉపాసనాబలంతో భగవంతుని అవతరింపజేసుకున్నారు. స్వయంభువులైన ప్రతిమలు భగవంతుని స్వయం అర్చావతారాలు. వాటిని ఏ శిల్పీ తయారు చేయలేదు. సమయం సందర్భం వచ్చినపుదు తన భక్తులకు కలలో కనిపించి, తాను ఎక్కడున్నాన్న విషయాన్ని తెలియజేస్తుంటాడు. ఆ చోటుకు వెళ్ళిన భక్తుడు ఆశ్చర్యపోవడమే తరువాయి.


ఉపాసకుడు విగ్రహాలలో భగవద్భావాన్ని పొందనంతవరకు సర్వలక్షణ సంపన్నమైన రమణీయమైన విగ్రహం కూడ విగ్రహం లానే కనబడుతుంది. ఈ సమయంలో విగ్రహంలో భగవద్భావం ఆరోపించబడుతుంది. పూజ జరుపబడుతుంది. భగవత్పరి పూర్ణత ఏర్పడిన తరువాత, విగ్రహం చెక్కదా? రాతిదా? అన్న భావన లేదు అది ఉపాసకుని దృష్టిలో భగవంతుడే. భక్తుడు ఆ విగ్రహాన్ని భగవంతునిగానే చూస్తాడు. ఉపాసకుల కోసమే స్వామి స్వయంభువుగా ఆవిర్భవిస్తుంటాడు. ఈ రూపంలో స్వామిని ఉపాసించడం వల్ల అత్యంత శ్రీఘ్రంగానే సిద్ధి కలుగుతుంది. కాబట్టి, వీటిని ప్రథమశ్రేణికి చెందిన అర్చావతారాలుగా భావించవచ్చు. ఉదాహరణకు మహా భక్తురాలు మీరా దృష్టిలో రణచోడ రాయ్ జీ  (కృష్ణుడు) ఒక పాషాణ జడమూర్తి (రాతిబొమ్మ) కాదు. చిన్మయమూర్తి. అందరూ చూస్తుండగానే మీరాను తనలో లీనంచేసుకున్నాడు. భగవంతుడు మీరాను తనలో లీనం చేసుకోడానికి కారణం సంకల్ప బలమే. పూరీ జగన్నాథునిలో శ్రీకృష్ణ చైతన్యమహాప్రభువు లీనమైయ్యాడు. ఇలా ఎన్నో నిదర్శనాలున్నాయి.


సిద్ధులు ప్రతిష్టించిన మూర్తులు రెండవ కోవకు చెందుతాయి. వీటిలో కూడా ఎన్నో విశేషాలు కనిపిస్తుంటాయి. ఆలయాలలో మానవులు ప్రతిష్టించిన మూర్తులు మూడవ శ్రేణికి చెందుతాయి. వీటిలో కూడ ఎన్నో విశేషాలుండవచ్చు.


ఇవన్నీ భగవంతుని లీలావిలాసాలే. శిలతో చేయబడినవి. కొయ్యతో చేయబడినవి, రంగులతో దిద్దబడినవి, వ్రాయబడినవి, ఇసుకతో చేయబడినవి. మనసులో భావింపబడినవి, మణితో చేయబడినవి అంటూ విగ్రహాలు విభజింపబడుతున్నాయి. ఎక్కడికైనా తీసుకుని వెళ్ళబడేవి, ఉత్సవాలకు కదలించబడేవి చలప్రతిమలు. వీటికి ఆవాహన, విసర్జనలు చేసి, చేయకుండా పూజలు చేస్తుంటారు. సమంత్రకంగా ప్రాణప్రతిష్ట జరిపి, ఆలయంలో స్థాపించబడేవి అచలప్రతిమలు. వీటికి ఆవాహన విసర్జనలుండవు. వీటిని చేయవలసిన అవసరం కూడ లేదు.
విగ్రహాలలో భగవద్భావంగల భక్తుల సమక్షంలో భగవంతుడు ఎలా ఆవిర్భవిస్తాడో తెలీయజేసే కొన్ని నిదర్శనాలు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.


పూర్వం ఒక భక్తుడు ఎంతో భక్తితో సాలగ్రామ శిలను పూజిస్తుండేవాడు. ఇదంతా ఆయన చిన్నారి కూతురుకి విచిత్రంగా అనిపిస్తుండేది. ఉండబట్టలేక ఒకసారి తండ్రిని ఏమిటి ఇదంతా? అని నిలదీసింది. అప్పుడాయన చిర్నగవుతో తాను రాతి దేవుడిని పూజిస్తున్నట్లు, ఆస్వామి అడిగినవన్నీ నెరవేరుస్తాడని చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి తనకొక రాతి దేవుడు కావాలని అడగడంతో, ఆమెకు ఆ సాలగ్రామ శిలను అందించాడాయన. అప్పట్నుంచి ఆ చిన్నారి ఎంతో భక్తి ప్రపత్తులతో సాలగ్రామ శిలను పూజించసాగింది. కాలక్రమంలో ఆమె యుక్త వయస్కురాలై ఆమెకు పెళ్ళీ కూడ జరిగింది.
దురదృష్టవశాత్తు ఆమె భర్త దైవభక్తి లేని మూఢుఢు. ఒకసారి ఆమె సాలగ్రామ శిలను పూజిస్తుండడాన్ని చూసి, రాయిని పూజిస్తున్నావేమిటని ఛిత్కరించుకుని, ఆశిలను నదిలోకి విసిరేసాడు. ఆ డృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోయిన ఆమె స్వామిని, మరలా తనకు దర్శనమివ్వమని రోదించింది.అయినప్పటికీ ప్రయోజనం లేదు.


తనను స్వామి కరుణించలేదన్న వేదనతో ఆమె నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన స్వామి, ఆమెను తన రథంలో ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెళ్ళాడు.


అలా రాతిలో దేవుని చూసి మోక్షాన్ని పొందిన బాలిక కథ ఇది!
ఇలా మన సంస్కృతిలో విగ్రహారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సమస్తంలోనున్న ఆ సర్వాంతర్యామిని విగ్రహంలో చూస్తుకుంటూ మోక్షసాధానకు ప్రయత్నించడం తరతరాలుగా మన పుణ్యభూమిలో కొనసాగుతున్న సంప్రదాయం.


సర్వాంతర్యామియైన ఆ ప్రమాత్మ సమస్తంలో ఉన్నాడన్న విషయాన్ని భక్త ప్రహ్లాదుడు ఎంతో గొప్పగా చెప్పాడు!?


ఇందు గలడందు లేదు సందేహము వలదు;
చక్రి సర్వోపగతుం
దేందెందు వెదకి చూచిన నందందే కలడు….

No comments:

Post a Comment