Sunday, July 15, 2012

కపిల మహర్షిగా ఐదవ అవతారం


ఆయన కపిల స్వరూపంలో ఐదవ అవతారాన్ని ధరించాడు. ఇది ఒక జీవాదిష్టమైన అవతారం. కపిలుడనే జీవున్ని అదిష్టించి ఉండి తద్వారా లోకానికి కావల్సిన తత్త్వాన్ని, సాంఖ్యము అనే శాస్త్రాన్ని తాను ఉపదేశం చేసాడు. అసురి అనే ఋషికి మొదట ఉపదేశం చేసాడు తద్వారా లోకానికి సాంఖ్య శాస్త్రం అందింది. ఇది తత్త్వ నిర్ణయాని కోసం ఎత్తిన అవతారం.


కపిలుడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. కపిలుడు సాంఖ్య దర్శనాన్ని అందించాడు. ఆయన చెప్పినదే సాంఖ్య శాస్త్రం అయ్యింది. వారు ప్రకృతి గురించి మాత్రమే చెబుతారు.  సత్త్వ, రజస్ మరియూ తమస్సులనే గుణములతో ప్రకృతి ఉంటుంది. సాంఖ్యం అనే శాస్త్రం ప్రకృతిలో ఉన్న వస్తువులను 24 భాగాలుగా చేసిచూపిస్తుంది.  మన శరీరాన్ని తీసుకుంటే ఆ ఇరవైనాలుగు తత్వాలు ఉండి తీరుతాయి. శరీరంలో మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే ఈ ఐదు పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతములకు ఐదు ధర్మాలు ఉన్నాయి మట్టికి వాసన ధర్మం, నీటికి రుచి ధర్మం, నిప్పుకి రూపం ధర్మం, గాలికి స్పర్శ ధర్మం, ఆకాశానికి శబ్దం ధర్మం. ఇవి ఒక ఐదు మొత్తం పది. ఈ ఐదు ధర్మాలని గుర్తించడానికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. వాసనను గుర్తించడానికి ముక్కు, రుచిని గుర్తించడానికి నాలుక, రూపాన్ని గుర్తించడానికి కళ్ళు, స్పర్శని గుర్తించడానికి చర్మం, శబ్దాన్ని గుర్తించడానికి చెవులు. ఈ ఐదు జ్ఞానేద్రియాలు అని అంటారు. శరీరం తయారు అయ్యాక పని చేయడానికి కర్మేంద్రియాలు ఉన్నాయి. చేతులు, కాల్లు, మల మూత్ర ద్వారాలు, మాటలాడేందుకు వాక్శక్తి. ఇవి ఒక ఐదు. ఇంద్రియాలకు నేత మనస్సు ఒకటి. ఇంద్రియాలకు ముందు ఒక పూర్వదశ ఉంది, దానికి అహంకారం అని పేరు. అహంకారం అంటే అహం తత్వం అని పేరు. దానికి వెనకాతల ఉండేది మహత్ తత్వం, దీనికే బుద్ది అని పేరు. ఇన్నింటిని తనలో పెట్టుకున్న మూల ప్రకృతి ఒకటి. మొత్తం ఇరవై నాలుగు.  ఈ ఇరవై నాలుగు ఉన్నా శరీరం అనేది పనిచెయ్యదు. ఈ ఇరవై నాలుగులో దేనిలోనూ చైతన్యం లేదు. ఈ ఇరవై నాలుగింటికి వెనకాతల ఆత్మ ఉంటేనే అది పనిచేస్తుంది.  ఆత్మ ఉంటుంది కానీ దాన్ని అప్రయోజకారి అని గుర్తిస్తారు. ప్రకృతి గురించి చెప్పిన అన్ని విషయాలను వేదాంతులు కూడా అంగీకరించారు.

సాంఖ్య శాస్త్రం సంఖ్యలు ఎలా ఏర్పడ్డాయో వివరిస్తుంది. సంఖ్యలకు మూలము పూర్ణము.పూర్ణం అంటే ఎలా ఉంటుందో వేదం వివరించింది. పూర్ణం అనేది అంతటా ఉంది, ఆ పూర్ణం నుండి ఏర్పడేది కూడా పూర్ణమే. ఆ పూర్ణం లోంచి పూర్ణాన్ని తీసివేసినా పూర్ణమే మిగులుతుంది. '0' అంటే  సున్నాన్ని పూర్ణం అని చెబుతారు.
ఓం పూర్ణమిదం పూర్ణమదః మూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఆ పూర్ణంలోంచే సంఖ్యలన్నీ ఏర్పడ్డవి. సృష్టికి పూర్వం ఇప్పుడు మనం చూస్తున్నదంతా కారణ దషలో ఉండి పరదేవతలో చేరియుంటాయి. అన్నింటితో నిండినది కాబట్టి పరదేవతని పూర్ణం అంటారు. తమస్ అనేది  పరదేవత లోంచి విడి పడింది. ఆ తమస్ అక్షరమైంది. అక్షరం అవ్యక్తం అయ్యింది.  అవ్యక్తాన్ని '1'గా సూచిస్తారు. ఆ అవ్యక్తం నుండి మూలప్రకృతి ఏర్పడింది. మూల ప్రకృతిని '2'గా సూచిస్తారు. మూల ప్రకృతిలోంచి మహత్ ఏర్పడింది. మహత్ అనేది '3'గా సూచించబడుతుంది. ఇలా మహత్ నుండిఅహంత్ ఏర్పడ్డాయి.  అహంత్ అనేది '4'గా సూచించబడుతుంది.  ఈ అహంత్ అనేది మూడు రకాల అహంతత్త్వాలుగా ఉంటుంది, తామస అహంకారం, సాత్త్విక అహంకారం మరియూ రాజసిక అహంకారం. ఈ మూడింటితో కూడి ఉన్న స్థితి. అప్పుడు తామస అహంకారంలోంచి పంచభూతాలు ఏర్పడుతాయి. పంచభూతాలతో ఆకాశం మొదటికి ఇది '5'గా సూచించబడుతుంది. ఆపై వాయు ఇది '6', ఆపై అగ్ని ఇది '7', ఆపై జలం ఇది '8', ఆపై మట్టి ఇది '9'గా సూచించబడుతాయి. సాత్త్విక అహంకారంలోంచి మనస్సు , ఆపై ఇంద్రియాలు వచ్చాయి, రాజసాహంకారంలోంచి వచ్చేవి ఇటూ అటూ కలుస్తుంటాయి.  అప్పుడు వీటన్నింటిలోంచి బ్రహ్మాండాలన్నీ ఏర్పడ్డాయి.  బ్రహ్మాండాలలో ఎన్నో అండాలు ఇలా సృష్టి జరుగుతున్న క్రమాన్ని బట్టి సంఖ్యలు ఏర్పడ్డాయి. ఇలా సంఖ్యల క్రమం పెరుగుతూ వస్తుంది.
0 - పరదేవత
1 - తమస్సు, అక్షరం లేక అవ్యక్తం
2 - మూల ప్రకృతి
3 - మహత్
4 - అహంత్
5 - ఆకాశం
6 - వాయు
7 - అగ్ని
8 - జలం
9 - మట్టి
......


No comments:

Post a Comment