Sunday, July 15, 2012

భగవదనుగ్రహమే శ్రీశుకమహర్షిని ఉపదేశించేట్టు చేసింది

శ్రీశుకుడు పరిక్షిన్నరేంద్రునికి శ్రీమన్ భాగవతాన్ని ఉపదేశం చేసే సమయంలో సూతులవారు సాక్షాత్తుగా శ్రవణం చేసి దాన్ని తాను అనుభవించిన రీతిలో శౌనకాది ఋషులకి నైమిశారణ్యంలో ఉపదేశం చేసారు. శౌనకాదులకి కలి యొక్క మలినాన్ని అంటించుకోకుండా ఉండటం కోసం అది అంటని సుక్షేత్రమైన నైమిశారణ్యం చేరి దీర్ఘసత్రయాగాన్ని నిత్య కర్మలతో పాటు హరికథా శ్రవణాన్ని అనుష్టించారు. వారు వేసిన ప్రశ్నలకి సమాధానంగా శ్రీమన్ భాగవతాన్ని ఆవిష్కరించబోతూ ముందుగా శ్రీశుకుని ద్యానాన్ని చేస్తూ వారి యోగ్యతలని స్మరించారు ఈ శ్లోకంలో. పురాణాలని రచించి, వేదాలని విభజించిన వేద వ్యాసుని కంటే కూడా దేహం మీద ఏమాత్రం అభిమానం లేకుండా, దేహసంబంధం కల వస్తువుల మీదా అభిమానం లేకుండా ఏ ప్రాపంచిక పట్టూ లేకుండా సర్వత్ర వ్యాపించి ఉన్న భగవంతున్ని స్మరించుకోవడమే పరమార్థంగా శ్రీశుకుడు పరమాత్మని ఎప్పుడూ దర్శించుకుంటుండేవాడు.  వారు చేసిన ఉపకారాన్ని ఈ శ్లోకంలో స్మరించుకుంటున్నారు సూతుల వారు.

యః స్వానుభావమ్ అఖిలశృతి సారమేకమ్
అధ్యాత్మ దీపమ్ అతితీర్శతామ్ తమోంధమ్ |
సంసారిణామ్ కరుణయాః పురాణ గుహ్యమ్
తన్ వ్యాససూనుమ్ ఉపయామి గురుమ్ మునీనామ్ ||

లోకంలో మనన శీలులైన మునులు ఎందరో ఉన్నారు. ఎక్కడెక్కడ భగవంతుణ్ణి సతతం మననం చేసుకునే మునులు ఎందరున్నా వారికి "గురుమ్ మునీనామ్" ఆచార్య స్థానం కల యోగ్యుడు. పరిక్షిత్తు వేంచేసి ఉన్న గంగా తీరానికి శ్రీశుకులవారు చేరినప్పుడు అక్కడి పెద్ద పెద్ద మహనీయులంతా లేచి స్వాగతించి అతడి ద్వారానే వినాలని ఉపదేశం చేయిస్తారు. అంటే భగవంతుని గురించి తెలియడం ఒకటి, ఆ తెలిసిన దాన్ని అనుభవించడం ఒకటి. శ్రీశుకుడు తెలిసిన దాన్ని పరిపూర్ణంగా అనుభవించగల యోగ్యత కలవాడు కనుక "గురుమ్ మునీనామ్" మనన శీలులైన వారందరికి గురువు.

అంతే కాదు "తన్ వ్యాససూనుమ్" వేద వ్యాసుల వారి కొడుకు. తండ్రిని మించిన పుత్రుడు. తండ్రిని మించిన తనయులు కావాలనే ఎవడైనా కోరేది, ఆ యోగ్యత వ్యాసుల వారికి లభించింది. అట్లాంటి వేద వ్యాసుని పుత్రుడు కావటం శ్రీశుకుడి అదృష్టం.

ఏమిటాయన చేసినది ? "పురాణ గుహ్యమ్" చాలా తెలుసుకుంటే తప్ప తెలియనటువంటి రహస్య విషయాలను పురాణ తత్వాన్ని ఉపదేశం చేసాడు. పురాణం అంటే వాస్తవాన్ని ఏది మనం తెలుసుకోవాల్సి ఉన్నదో దాన్ని స్పష్టం చేస్తూ మన మనస్సుకి పట్టించడం కోసం కొంత చేర్చి అందిస్తారు. కానీ అందులో ప్రతిపాదించబడిన వాస్తవం మాత్రం ఎప్పటికీ మారకుండా నిత్య నూతనంగా ఉంటుంది. పురా అపి నవం, పురాణం అయ్యింది. ఎప్పటికీ నూతనమే. అలాంటి పురాణములలో కెల్ల ఉత్తమమైన దాన్ని శ్రీశుక మహర్షి ఉపదేశం చేసాడు. 

ఏమిటి కోరి ? మనం ఎదైనా సన్మానం చేస్తామనా, లేదా కిరీటం పెడతాం అనా. కాదు "కరుణయా ఆహ" కేవలం కారుణ్యం. ఆయనలో దయ తప్ప వేరొకటి లేదు. ఎవరో కోరితే రాలేదు ఆయన అక్కడికి. కోరితే వచ్చే వాడు కూడా కాదు ఆయన. నీళ్ళు లేవండీ మేం నానా భాధల్ని పడుతున్నాం అని మేఘాన్ని కోరితే వస్తుందా ? దెబ్బలాడినా ప్రార్థించినా రాదు. దానికి ఎప్పుడు రావాలని అనిపిస్తుందో అప్పుడు వస్తుంది. అలానే శ్రీశుక మహర్షి ఎవరో పరిక్షిత్తు కోరితే వెళ్ళలే. ఋషులు ప్రార్థిస్తే వెళ్ళలే. కేవలం భగవత్ అనుగ్రహం పరిక్షిత్తుకి ఉందేమో అక్కడికి వచ్చేట్టు శ్రీశుకుడిని నడిపించింది. ఆ కారుణ్యమే పరమాత్మ. 

No comments:

Post a Comment