Monday, July 16, 2012

భగవద్గీత-తాత్పర్యసహితం:ఐదవ అధ్యాయం



శ్రీమద్భగవద్గీత

ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం

అర్జున ఉవాచ:

సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ || 1

అర్జునుడు: కృష్ణా! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరోసారి కర్మయోగం ఆచరించమనీ ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు.

శ్రీ భగవానువాచ:

సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే || 2

శ్రీ భగవానుడు! కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు.

జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే || 3

అర్జునా ! దేనిమీదా ద్వేషం, కోరిక లేనివాడు నిత్యసన్యాసి. సుఖదుఃఖాది ద్వందాలు లేకుండా అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు.

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్ || 4

జ్ఞానం వేరూ, కర్మయోగం వేరూ అని అవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించినా మోక్షఫలం దక్కుతుంది.

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి || 5

జ్ఞానయోగులు పొందే ఫలమే కర్మయోగులూ పొందుతారు. జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని గ్రహించినవాడే నిజమైన జ్ఞాని.

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి || 6

అర్జునా ! కర్మయోగం అవలంబించకుండా సన్యాసం పొందడం సాధ్యపడేది కాదు. నిష్కామకర్మచేసే ముని అచిరకాలంలోనే బ్రహ్మసాక్షాత్కారం పొందుతాడు.

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే || 7

నిష్కామకర్మాచరణం, నిర్మలహృదయం, మనోజయం ఇంద్రియ నిగ్రహం కలిగి, సమస్త జీవులలో వుండే ఆత్మ, తన ఆత్మ ఒకటే అని తెలుసుకున్నవాడు కర్మలు చేసినా ఎలాంటి దోషమూ అంటదు.

నైవ కించిత్‌కరోమీతి
యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ || 8

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ || 9

పరమార్థతత్వం తెలిసిన కర్మయోగి తానేమీ చేయడం లేదనే తలుస్తాడు. చూడడంలో, వినడంలో, తాకడంలో, వాసన చూడడంలో, తినడంలో, నడవడంలో, నిద్రపోవడంలో, ఊపిరి పీల్చడంలో, మాట్లాడడంలో, గ్రహించడంలో, కళ్ళుతెరవడంలో, మూయడంలో ఆయా ఇంద్రియాలే వాటివాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అతను తెలుసుకోవడమే దీనికి కారణం.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || 10

నీరు తామరాకును అంటదు. అలాగే పరమేశ్వరార్పణబుద్ధితో ఫలాపేక్షలేకుండా కర్మలు చేసేవాడిని పాపాలు అంటవు.

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే || 11

కర్మయోగులు ఆసక్తి, అభిమానం విడిచిపెట్టి, తమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, వట్టి ఇంద్రియాలతో కర్మలు చిత్తశుద్ధి కోసమే చేస్తుంటారు.

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే || 12

నిష్కామకర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి, ఆత్మజ్ఞానంవల్ల కలిగే శాశ్వతమైన శాంతి పొందుతాడు. అలాకాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు.

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్ || 13

ఇంద్రియనిగ్రహం కలిగినవాడు మనస్సుతో కర్మలన్నిటినీ వదలిపెట్టి తాను ఏమీ చేయకుండా ఇతరులచేత చేయించకుండా, తొమ్మిది ద్వారాలుండే శరీరమనే పట్టణంలో హాయిగా వుంటాడు.

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే || 14

పరమేశ్వరుడు జీవులకు కర్తృత్వంకాని, కర్మలుకాని, కర్మఫలాపేక్ష కాని కలగజేయడం లేదు. ప్రకృతులూ, ప్రారబ్ధాలూ కర్తృత్వాదులకు కారణాలు.

నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః || 15

భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది.

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః |
తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ || 16

ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపుకున్నవాళ్ళు సూర్యుడికాంతి లాంటి తమ జ్ఞానంతో పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకుంటారు.

తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః || 17

ఆ పరమాత్మమీదే బుద్ధినీ, మనస్సునూ నిలిపినవాళ్ళూ, ఆ పరాత్పరుడిమీదే నిష్ఠ, ఆసక్తి కలిగినవాళ్ళూ జ్ఞానంతో పాపాలను పోగొట్టుకుని పునర్జన్మలేని మోక్షం పొందుతారు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః || 18

విద్యావినయాలు కలిగిన బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, చండాలుడిని ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తారు.

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్‌బ్రహ్మణి తే స్థితాః || 19

సర్వభూతాలనూ నిశ్చలమనస్సుతో, సమభావంతో సందర్శించినవాళ్ళు సంసారబంధాన్ని ఈ జన్మలోనే జయిస్తారు. ఫరబ్రహ్మం దోషం లేకుండా సర్వత్రా సమంగా ఉంటుంది కనుక అలాంటి సమదృష్టి కలిగినవాళ్ళు ముక్తి పొందుతారు.

న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసంమూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః || 20

మోహం లేకుండా నిశ్చలమైన బుద్ధివున్న బ్రహ్మవేత్త ఇష్టమైనది సంప్రాప్తించినపుడు సంతోషించడు; ఇష్టంలేనిది సంభవించినపుడు విచారించడు. బ్రహ్మంలోనే నిరంతరం లీనమై వుంటాడు.

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ |
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే || 21

ప్రపంచసుఖాలమీద ఆసక్తి లేనివాడు ఆత్మానందం అనుభవిస్తాడు. అలాంటి బ్రహ్మనిష్ఠ కలిగినవాడు శాశ్వతమైన ఆనందం పొందుతాడు.

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః || 22

కౌంతేయా ! ఇంద్రియలోలత్వం అనుభవించే బాహ్యసుఖాలు దుఃఖహేతువులు; క్షణికాలు. అందువల్ల నిర్మలబుద్ధి కలవాడు వాటిని ఆశించడు.

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః || 23

కామక్రోధాలవల్ల కలిగే ఉద్రేకాన్ని జీవితకాలంలో అణగద్రొక్కిన వాడే యోగి; సుఖవంతుడు.

యో௨0తఃసుఖో௨0తరారామః తథాంతర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో௨ధిగచ్ఛతి || 24

ఆత్మలోనే ఆనందిస్తూ, ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే ప్రకాశిస్తూ వుండే యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందం పొందుతాడు.

లభంతే బ్రహ్మనిర్వాణమ్ఋషయః క్షీణకల్మషాః |
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః || 25

సంశయాలను తొలగించుకుని, మనోనిగ్రహంతో సకల ప్రాణులకూ మేలుచేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నిటినీ పోగొట్టుకుని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు.

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ || 26

కామక్రోధాలను విడిచిపెట్టి, మనస్సును జయించి, ఆత్మజ్ఞాన సంపన్నులైన సన్యాసులకు సర్వత్రా మోక్షం కలుగుతుంది.

స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ || 27

యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః || 28

బాహ్యవిషయాలమీద ఆలోచనలు లేకుండా, దృష్టిని కనుబొమల మధ్య నిలిపి, ముక్కులోపల సంచరించే ప్రాణాపానవాయువులను సమానం చేసి, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్ధినీ వశపరచుకుని, మోక్షమే పరమలక్ష్యంగా ఆశ, క్రోధం, భయం విడిచిపెట్టిన ముని నిరంతరమూ ముక్తుడై వుంటాడు.

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి || 29

యజ్ఞాలకూ, తపస్సులకూ భోక్తననీ, సర్వలోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.



ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "కర్మసన్యాసయోగం" అనే ఐదవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment